Share News

సాధన ఫలించాలంటే..

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:19 AM

ఏదైనా సాధించాలంటే గట్టి ప్రయత్నం, ఏకాగ్రత, ఓర్పు అవసరం. ‘సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిః’ అంటాడు పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో. చేసే అభ్యాసం దీర్ఘకాలం, నిరంతరం కొనసాగాలి.

సాధన ఫలించాలంటే..

సాధన

ఫలించాలంటే..

ఏదైనా సాధించాలంటే గట్టి ప్రయత్నం, ఏకాగ్రత, ఓర్పు అవసరం. ‘సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమిః’ అంటాడు పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో. చేసే అభ్యాసం దీర్ఘకాలం, నిరంతరం కొనసాగాలి.

అలా శ్రద్ధతో చేసే కృషి మాత్రమే సత్ఫలితాలను ఇస్తుంది. చక్కగా, చాలాకాలం, విరామం లేకుండా ఆచరించే సాధన స్థిరంగా ఉంటుంది.

దానికోసం మొదట కావలసిన యోగ్యత... చాలాకాలం కొనసాగించడం.. దురదృష్టవశాత్తూ మనం అందరం సత్వర ఫలితాలు కలగాలని ఆశిస్తాం.

ఏదైనా మంత్రాన్ని జపించమని సలహా ఇస్తే... ఇంటికి వెళ్ళి, దాన్ని మూడు రోజులు జపించి, ఏ ఫలితాలూ రాలేదని చింతిస్తాం. ‘‘ఆ మంత్రం నాకు తగినది కాదేమో, మరొకటి ఉపదేశిస్తారా?’’ అని అడుగుతాం. పదేళ్ళుగా అప్పుడప్పుడు యోగాభ్యాసం చేస్తున్నా... ఏ ప్రయోజనం లభించలేదని చింతిస్తాం. ‘నిరంతరం’ అనే మాట మరచిపోయి, కావలసినన్ని విరామాలు తీసుకుంటాం.

మరో అతి ముఖ్యమైన అంశం సహనం. మనఃపూర్వకంగా, శ్రద్ధతో, ఏకాగ్రతతో, పట్టుదలతో సాధన కొనసాగించాలి. దాని కోసం చేసే కృషి పట్ల విశ్వాసం ఉండాలి. మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? నిద్రాహారాలు సైతం మానేసి, అహోరాత్రులూ దానికోసం శ్రమిస్తాం. ప్రాపంచికమైన వాటికోసమే ఇంత తపన పడితే... మరి ఆధ్యాత్మిక సాధన కోసం ఇంకెంత కష్టపడాలి?

దీనికి సంబంధించిన పూర్వకాలం కథ ఒకటి ఉంది. దేవర్షి అయిన నారదుడు ఒకనాడు అడవిలోంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ భూమి మీద జరిగే విశేషాలు గమనించాలనేది ఆయన ఉద్దేశం.

మార్గమధ్యంలో ఆయనకు తపస్సు చేసుకుంటున్న వ్యక్తి కనిపించాడు. అతని చుట్టూ చీమల పుట్టలు పెరిగాయి. ఆ యోగి నారదుణ్ణి గుర్తుపట్టి, నమస్కరించాడు. ‘‘స్వామీ! ఎక్కడికి మీ ప్రయాణం?’’ అని అడిగాడు.

‘‘వైకుంఠానికి. విష్ణు దర్శనానికి’’ అని బదులిచ్చాడు నారదుడు.

‘‘అయితే మీరు నాకొక ఉపకారం చేస్తారా?’’ అని అడిగాడు యోగి.

‘‘తప్పకుండా! నీకేం కావాలి?’’ అని ప్రశ్నించాడు నారదుడు.

‘‘నేను చాలాకాలంగా ఈ అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తున్నాను. నేను ఇంకా ఎన్నాళ్ళు ఇలా తపస్సు చెయ్యాలి? మహా విష్ణువును అడిగి... నాకు ఎప్పుడు ఆయన లోకంలో స్థానం లభిస్తుందో కనుక్కోగలరా?’’

‘‘అలాగే. తప్పకుండా కనుక్కుంటాను’’ అని నారదుడు భరోసా ఇచ్చి, ముందుకు సాగిపోయాడు.

కొన్ని యోజనాలు నడిచిన తరువాత... మరొక వ్యక్తి ఆయనకు కనిపించాడు. అతను ఎంతో పారవశ్యంతో విష్ణు సహస్రనామ సంకీర్తన చేస్తూ... తనలో తానే ఆనందిస్తున్నాడు. అతను నారదుణ్ణి చూసి ‘‘మహర్షీ! ఎక్కడిదాకా మీ పయనం?’’ అని అడిగాడు.

‘‘వైకుంఠానికి. శ్రీమహావిష్ణువు దర్శనం నిమిత్తం’’ అన్నాడు నారదుడు.

‘‘ఓహో! ప్రశస్తంగా ఉంది. నేనింకా ఎంతకాలం ఈ ధ్యానం కొనసాగించాలి? ఈ జనన మరణ చక్రం నుంచి నాకు విముక్తి ఎప్పుడో విష్ణులోకంలో అడుగుతారా? ఈ సహాయం చెయ్యగలరా?’’

‘‘సరే! తప్పకుండా అడుగుతాను. నా తిరుగు ప్రయాణంలో చెబుతాను’’ అని నారదుడు వెళ్ళిపోయాడు.

కొన్ని సంవత్సరాల తరువాత దేవర్షి అదే అరణ్యానికి మళ్ళీ వచ్చాడు. మొదటి వ్యక్తిని కలిశాడు. అతను నారదుడితో ‘‘మహాత్మా! పూర్వం నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కనుక్కున్నారా? పరమాత్మ ఏమన్నారు?’’ అని అడిగాడు.

‘‘ముక్తికోసం నీవు ఇంకా నాలుగు జన్మలు ఎత్తాలని మహా విష్ణువు చెప్పాడు’’ అన్నాడు నారదుడు.

‘‘ఇంకా నాలుగు జన్మలు ఎత్తాలా? నేను తగినంత కాలం ధ్యానం చేశాను కదా! ఇంకా నాలుగు జన్మలేమిటి?’’ అని అతను గట్టిగా రోదిస్తూ... తపస్సునూ, అడవినీ వదిలేసి... తన పూర్వ సంసార ప్రపంచానికి విసుగ్గా వెళ్ళిపోయాడు.

నారదుడు ముందుకు ప్రయాణించి... రెండో వ్యక్తిని కలిశాడు. అతను ఇంకా విష్ణు నామ సంకీర్తనలో మునిగి ఆనందిస్తూనే ఉన్నాడు. నారదుణ్ణి చూడగానే ‘‘దేవర్షీ! నా విషయం అడిగారా?’’ అని ప్రశ్నించాడు.

‘‘ఓ! అడగకేం? ఇక్కడ కనిపిస్తున్న చెట్టును చూడు. వాటికి ఆకులు ఎన్నున్నాయో లెక్కించగలవా?’’

‘‘తప్పకుండా. నాకు ఆ ఓపిక ఉంది. ఇప్పుడే లెక్కించమంటారా?’’

‘‘ఇప్పుడే అక్కర్లేదు. నింపాదిగా ప్రయత్నించు.’’

‘‘ఆ చెట్టు ఆకులకూ, నా ప్రశ్నకూ సంబంధం ఏమిటి?’’

‘‘ఉంది. నీవు వైకుంఠం చేరాలంటే... ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో... ఇంకా అన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందని విష్ణువు నాతో చెప్పాడు.’’

‘‘అంతేనా? ఆ చెట్టు ఆకులకు ఒక పరిమితి ఉంటుంది. నేను ఇంకా ఈ అడవిలో ఉన్న చెట్ల ఆకుల మొత్తం సంఖ్య ఎంతో అన్ని జన్మలని అనుకున్నాను. ఇప్పుడే ఈ చెట్టు ఆకులను లెక్కిస్తాను’’ అన్నాడు ఆ యోగి.

ఇంతలో... ఒక అందమైన పల్లకీ దివి నుంచి భువికి దిగింది. అందులో ఉన్న విష్ణుదూత ‘‘పరమాత్మ విష్ణువు మిమ్మల్ని ఈ పల్లకిలో వైకుంఠానికి తీసుకురమ్మన్నారు’’ అని ఆ యోగికి చెప్పాడు.

‘‘నేను ఇప్పుడే విష్ణులోకానికి వెళుతున్నానా?’’ అన్నాడు యోగి ఆశ్చర్యంగా.

‘‘అవును అన్నాడు విష్ణుదూత.

‘‘కానీ నేను ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాలని నారదులవారు ఇప్పుడే చెప్పారే?’’

‘‘ఇప్పుడు ఆ అవసరం లేదు. వచ్చి పల్లకి ఎక్కండి’’ అన్నాడు విష్ణుదూత.

‘‘మరి ఆ మొదటి వ్యక్తి సంగతో?’’ అని అడిగాడు నారదుడు.

‘‘అతనికి మరో నాలుగు జన్మలు ఎత్తే ఓపిక కూడా లేదు. అతను ఇంకా నిరీక్షిస్తూ, కృషి చేయవలసి ఉంటుంది’’ అని చెప్పాడు విష్ణుదూత.

కేవలం కథగా కాకుండా దీని వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి. నిశ్చలమైన మనస్సుతో, ఎంతో దీర్ఘకాలం, చాలా సహనంగా సాధన చేయాలనీ, సత్వర ఫలితాలను ఆశిస్తూ నిరీక్షించకూడదనీ, తొందరతో కలత పడకూడదనీ ఈ కథ బోధిస్తుంది.

అప్పరుసు విజయరామారావు

9177086363

Updated Date - Apr 26 , 2024 | 01:19 AM