విశాలంగా కనిపించాలంటే!
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:09 AM
ఇల్లు చిన్నదైనా వస్తువులను క్రమపద్ధతిలో అమర్చుకుంటే విశాలంగా కనిపిస్తుంది. అనవసరమైన వస్తువులకు చోటివ్వకుండా కాస్త ఓపికతో సర్దుకుంటే చాలు. గది చిన్నగా ఉన్నా
ఇల్లు చిన్నదైనా వస్తువులను క్రమపద్ధతిలో అమర్చుకుంటే విశాలంగా కనిపిస్తుంది. అనవసరమైన వస్తువులకు చోటివ్వకుండా కాస్త ఓపికతో సర్దుకుంటే చాలు. గది చిన్నగా ఉన్నా విశాలంగా కనిపించేలా చేసుకోవచ్చు. ఇల్లు విశాలంగా కనిపించాలంటే నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవి.
ఇంటి గోడలకు ముదురు రంగులు కాకుండా తెలుపు, బేబీ పింక్, కాపర్ పింక్ వంటి లేత రంగులు వేస్తే గదులు విశాలంగా కనిపిస్తాయి.
కర్టెన్స్ వాడడం వల్ల ఇల్లు చిన్నదిగా కనిపిస్తుంది. అవసరమైనంత వరకు లేత రంగులో ఉండే పలుచని కర్టెన్లను కిటికీలకు, గుమ్మం ముందు వేసుకోవచ్చు. ప్రతి గదికీ కర్టెన్ వేయకూడదు. వీలైనంత వరకు కిటికీలు తెరచి ఉంచాలి. సూర్యరశ్మి లోపల పడితే గది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇంట్లో అద్దాలు పెట్టడం వల్ల కూడా కాంతి పరావర్తనం చెంది ఇల్లు పెద్దగా కనిపిస్తుంది.
ఇంట్లో మనకి పనికిరాని వస్తువులు చాలా వచ్చి చేరుతుంటాయి. వాటన్నింటినీ అవసరమైనవారికి ఇచ్చేస్తే చాలా స్పేస్ కలసి వస్తుంది.
ఇంటి పరిమాణాన్ని అనుసరించి ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలి. వివిధ రకాలుగా ఉపయోగించుకొనే మల్టీపర్పస్ ఫర్నిచర్‌ను ఎంచుకోవాలి. హాల్ చిన్నగా ఉన్నప్పుడు పెద్ద సోఫాలకు బదులు ఫోల్డింగ్ బెడ్ కొనుక్కోవచ్చు. ఇది సోఫాలా, బెడ్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.
హాల్లో కానీ, బెడ్ రూమ్‌లో కానీ షెల్ఫ్‌లను సామాన్లతో నింపేయకూడదు. అవసరమైనవాటిని మాత్రమే అందంగా సర్దుకోవాలి. పిల్లలు ఆడుకొనే బొమ్మలు, ఫొటోఫ్రేమ్‌లు, టెడ్డీబేర్స్, గాజు సామాన్లు, పింగాణి వస్తువులను చక్కగా అమరిస్తే చూసేందుకు ఆకర్షణీయంగా, విశాలంగా కనిపిస్తుంది.