Share News

Hero Teja Sajja Interview : అమ్మా నాన్నా తర్వాత చిరంజీవిగారే

ABN , Publish Date - Jan 21 , 2024 | 05:20 AM

‘ఇంద్ర’ సినిమాలో ఓ సన్నివేశం.. తెలంగాణ శకుంతల. ఓ కుర్చీని చూపించి... ‘‘ఈ కుర్చీలో కూర్చునే మగాడు లేడా?...’’ అని అక్కడున్న కొమ్ములు తిరిగిన మగాళ్లందర్నీ ప్రశ్నిస్తుంది. అందరూ తలలు వంచుకుంటారు. కానీ అప్పుడే స్కూల్‌ నుంచొచ్చిన ఓ పిల్లాడు...

Hero Teja Sajja Interview : అమ్మా నాన్నా తర్వాత చిరంజీవిగారే

‘ఇంద్ర’ సినిమాలో ఓ సన్నివేశం.. తెలంగాణ శకుంతల. ఓ కుర్చీని చూపించి... ‘‘ఈ కుర్చీలో కూర్చునే మగాడు లేడా?...’’ అని అక్కడున్న కొమ్ములు తిరిగిన మగాళ్లందర్నీ ప్రశ్నిస్తుంది. అందరూ తలలు వంచుకుంటారు. కానీ అప్పుడే స్కూల్‌ నుంచొచ్చిన ఓ పిల్లాడు... ‘‘నేనున్నాను..’’ అంటూ స్కూల్‌ బ్యాగ్‌ విసిరేసి, చిరంజీవి స్టైల్‌లో వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు. అక్కడ పడుతుంది టైటిల్‌... ‘ఇంద్ర’ అని. బహుశా అప్పుడు తథాస్తు దేవతలు ‘తథాస్తూ...’ అనేశారేమో! అప్పటి ఆ పిల్లాడు ఇప్పుడు నిజంగానే చిరంజీవిలా స్టార్‌ అయిపోయాడు. అతనే తేజా సజ్జా . కొన్ని జీవితాలు ముందుగానే ఎవరో డిజైన్‌ చేసినట్టుగా ఉంటాయి. చిరంజీవి ‘చూడాలనివుంది’తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు, చిరంజీవి ‘ఇంద్ర’ తో బాలనటుడిగా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు అసలైన ‘చిరంజీవి’ హనుమంతుని నేపథ్య కథ ‘హను-మాన్‌’తో స్టార్‌ హీరో అయిపోయాడు. ఇది కదా డెస్టినీ అంటే! దేశవ్యాప్త సంచలనం ‘హను-మాన్‌’ కథానాయకుడు, ‘సూపర్‌ నాచురల్‌ స్టార్‌’ తేజా సజ్జాతో ‘నవ్య’ సంభాషణ.

గట్టి హిట్‌ కొట్టేశారు... ఎలా ఉంది అనుభవం?

పెద్దగా ఎగ్జైట్‌మెంటైతే ఏం లేదండీ. నేను కొత్తవాడ్ని. వెనుక ‘జాంబిరెడ్డి’ లాంటి హిట్‌ ఉంది. దాన్ని క్యాష్‌ చేసుకొని, ఈ రెండున్నరేళ్లలో రెండుమూడు సినిమాలు చేసుంటే డబ్బుతోపాటు అనుభవం కూడా పెరిగి ఉండేది. వాటన్నిటినీ పక్కనపెట్టి, ప్రాణం పెట్టి, రెండేళ్లు కష్టపడి... ‘హను-మాన్‌’ అనే సాహసం చేశాను. ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పుడు బరువు దింపుకొన్న ఫీలింగ్‌. ఇక విజయం అంటారా... ప్రీమియర్‌ చూసినప్పుడే పాస్‌ అయిపోయామని అర్థమైపోయింది. నంబర్లు కూడా పెద్దగానే వినిపిస్తున్నాయి. ఇతర భాషల్లోనూ ఈ సినిమా ఆదరణ పొందుతుండటం ఆనందంగా ఉంది. టీజర్‌, ట్రైలర్‌ చూడగానే ‘’వీడు గెలవాలి’’ అని అందరూ బలంగా అనుకున్నారు. ఓ విధంగా హిట్‌ అయి రిలీజైన సినిమా ఇది.

ఈ సినిమాకోసం కష్టపడి చేసిన సన్నివేశాలేమైనా ఉన్నాయా?

నటనపరంగా అయితే ఎదురుగా సూపర్‌స్టార్లు ఉన్నా భయపడను. చిన్నప్పటి నుంచీ వాళ్లతోనేగా చేసింది. అయితే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. సాధ్యమైనంతవరకూ డూప్‌ లేకుండా చేశాను. ఇప్పుడు అందరూ ఈ సినిమాలోని అండర్‌వాటర్‌ సీక్వెన్స్‌ని ‘అద్బుతం అమోఘం’ అంటున్నారు. ఆ ఫీట్‌ చేయడానికి నేను పడ్డ కష్టం మాటల్లో చెప్పలేను. పాతిక అడుగుల లోతున్న నీళ్లలో స్కూబా డైవింగ్‌ నేర్చుకొని ఆ సీన్‌ చేశాను. ఓ విధంగా అది సాహసమే. ఈ సినిమాకోసం నేను పడ్డంత కష్టం... ఏ సినిమాకోసమూ ఏ హీరో పడి ఉండడని గర్వంగా చెప్పగలను.

ఈ కథ అనుకున్న తర్వాత ప్రశాంత్‌వర్మకు హీరోగా మీరెలా గుర్తొచ్చారు?

ఒక బలహీనుడికి ఆంజనేయశక్తులు వస్తే వాడేం చేశాడనేది ఈ సినిమా కథ. మరి ఈ తరహా కథకు నాలాంటివాళ్లే కరెక్ట్‌. మేం అప్పటికే ‘జాంబిరెడ్డి’ చేసి ఉన్నాం. నటుడిగా నేనేంటో, నా కెపాసిటీ ఏంటో, కేపబులిటీ ఏంటో ప్రశాంత్‌వర్మకు తెలుసు. అందుకే నన్ను తీసుకున్నాడు.

ఇదే ప్రశ్న విషయంలో మీకు ఈమధ్య కోపం వచ్చినట్టుంది?

కోపం లేదు, బాధ లేదు. ఈ తరహా సినిమా నేనూ, ప్రశాంత్‌వర్మ చేయడం కొందరికి సర్‌ప్రైజ్‌. చాలామంది సెకండ్‌ జనరేషన్‌ హీరోలు తమ డెబ్యూగా ఇలాంటి సినిమాలు చేస్తే అప్పుడెవరూ మాట్లాడలేదు. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చి, నన్ను నేను ప్రూవ్‌ చేసుకొని, విజయాలు అందుకున్న తర్వాత... ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే, కొందరికి అది ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇలాంటివేం నేను పట్టించుకోను.

హీరోలు డైరెక్షన్లో వేళ్లూ, కాళ్లూ పెడతారని వింటున్నాం. మీరు కూడా అంతేనా?

ఇది మరీ దారుణం అండీ. కథ నచ్చితే చేస్తా. నచ్చకపోతే నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తా. అంతే తప్ప సలహాలు సూచలనలు ఇవ్వను. ఇక లొకేషన్లో అంటారా... అభిప్రాయాలు పంచుకోవడం తప్పుకాదు కదండీ. డౌట్‌ ఉంటే చెబుతాను. శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకుంటాను. మెజారిటీ ఓట్లు దర్శకుడికి పడితే ఆతను చెప్పినట్టు చేస్తా. నాకు పడితే ఒప్పించడానికి ప్రయత్నిస్తా. సినిమా అనేది సమష్టి కృషి. ఎవరైనా ప్రొడక్ట్‌ బాగా రావాలనేగా తపించేది. నాకంటూ కొందరు నమ్మకస్తులు ఉన్నారు. వాళ్లకు తప్పకుండా రషెస్‌ చూపిస్తా. అభిప్రాయాలు షేర్‌ చేసుకుంటా. అది నాకు అలవాటు. అయినా సినిమాపై దర్శకుడితోపాటు హీరోకి కూడా బాధ్యత ఉంటుంది. ఫలితాల ప్రభావం హీరోపై కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాధ్యతగా ఉండటం తప్పేం కాదు.

‘ఓ బేబీ’, ‘జాంబిరెడ్డి’, ‘హను-మాన్‌’... అన్నీ ఫాంటసీ కథలే చేస్తున్నారేంటి?

రీసెంట్‌గా నందినీరెడ్డిగారు కూడా ఇదే అన్నారు. నాకు ‘సూపర్‌ నాచురల్‌స్టార్‌’ అంటూ బిరుదు కూడా ఇచ్చేశారామె. సినిమా అనేది వినోదభరితంగా ఉండాలి. అందరికీ నచ్చాలి. అలాంటి కథలనే ఎంచుకుంటా. ముఖ్యంగా నా సినిమాలు పిల్లలకు నచ్చాలి. అందుకే ఎంచుకొని మరీ ఇలాంటి సినిమాలు చేస్తున్నా.

ఎలా ఎదగాలనుకుంటున్నారు? స్టార్‌గానా? నటుడిగానా?

జనం మెచ్చిందే మనం చేయాలి సార్‌. మనం మెచ్చింది జనం చూడరు. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. స్టార్‌ అనిపించుకుంటూనే, నటుడిగా ఎదుగాలని ఉంది. తారక్‌ అన్నయ్య నన్ను క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకోమని సలహా ఇచ్చారు. నాలుగేళ్లు కష్టపడి నేర్చుకున్నాను. ఆ విషయం తెలిసి చిరంజీవిగారు ‘‘ఎలాగూ డ్యాన్స్‌లో టైమింగ్‌ వచ్చేసింది కాబట్టి వెస్ట్రన్‌ కూడా నేర్చుకో’’ అన్నారు. ఆయన మాట ప్రకారం అది కూడా నేర్చుకున్నాను. మార్షల్‌ ఆర్ట్స్‌, హార్స్‌ రైడింగ్‌... ఇలా హీరోకి కావాల్సిన అన్నీ నేర్చుకున్నాను. వీటన్నింటికంటే ముఖ్యమైంది జడ్జిమెంట్‌. కథల ఎంపిక. దాన్ని తెలుసుకొనే పనిలో వున్నాను.

అమ్మా నాన్నా ఎలా ఫీలవుతున్నారు?

బాలనటుడిగా బాగానే ఎంకరైజ్‌ చేశారు. బీబీఏ పూర్తి చేశాను. ఇక ఉద్యోగం చూసుకోమన్నారు. నాకేమో సినిమా పిచ్చి. పాతికేళ్లు నిండినా బ్రేక్‌ రాలేదు. కాస్త కంగారు పడ్డారు. ‘ఓ బేబీ’ తర్వాత వాళ్లకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఫుల్‌ హ్యాపీ. ఏదేమైనా అమ్మానాన్నా నా సక్సె్‌సని ఎంజాయ్‌ చేయడం నాకు గొప్ప అనుభూతి.

చిరంజీవిగారిని కలిశారు కదా..?

ఆయన నా సొంతం అండీ. అమ్మా నాన్నా తర్వాత నాకు ఆయనే. నా కెరీర్‌ ఈ స్థాయిలో ఉందంటే కారణం చిరంజీవిగారు. నేను చిన్నప్పుడే సూపర్‌స్టార్‌డమ్‌ చూశా. అది చిరంజీవిగారి వల్లే. అప్పట్లో ఫ్యాన్స్‌ నాలో చిరంజీవిగార్ని చూసేవారు. అందుకే హీరో అయ్యాక ఈ ఆడంబరాలేం నాకు గొప్పగా అనిపించట్లేదు. నాకు హిట్‌ రాగానే అమ్మా నాన్నా తర్వాత అంత ఆనందపడిన వ్యక్తి చిరంజీవిగారు. ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు. నటుడిగా ఆయనే నాకు ప్రేరణ. అయితే ఇమిటేషన్‌ మాత్రం చేయను. కానీ కొన్ని సందర్భాల్లో తెలీకుండానే నాలోంచి ఆయన బయటకొస్తుంటారు. నేనే కాదు, నాలాంటి చాలామంది హీరోల్లో ఆయన ఉంటారు.

అయనతో మరిచిపోలేని అనుభవాలేమైనా ఉన్నాయా?

నాకైతే ఊహ లేదండీ.. అమ్మా నాన్నా చెబితే విని షాక్‌ అయ్యాను. ఫారె్‌స్టలో ఓ పెద్ద కొండపై ‘చూడాలనివుంది’ షూటింగ్‌. చిరంజీవిగారు కొండ ఎక్కుతుంటే... ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నన్ను ఎత్తుకొని ఆయన వెనకే కొండ ఎక్కుతున్నాడట. చిరంజీవిగారు వెనక్కి తిరిగి ‘‘నువ్వెక్కడికి?’’ అని అతడ్ని అడిగారట. ‘‘పిల్లాడు కూడా షాట్‌లో ఉన్నాడుసార్‌. అందుకే’’ అని అతనేదో చెప్పేలోపే ‘‘దానికి నువ్వెందుకు?’’ అంటూ నన్ను అతని దగ్గర నుంచి తీసుకొని, భుజాన వేసుకొని గబగబా కొండ ఎక్కేశారట చిరంజీవి. అది దాదాపు కిలోమీటర్‌ ఎత్తయిన కొండ అని నాన్న చెప్పారు. అలాగే చోటా కె.నాయుడు అంకుల్‌ ఆ సినిమాకు కెమెరా. అప్పుడు నాకు బాగా జలుబు చేసి, ముక్కు కారుతోందట. అందుకని చోటా అంకుల్‌ మేక్‌పమ్యాన్‌ని పైకి పంపబోతుంటే... చిరంజీవిగారు ‘‘మళ్లీ దీనికోసం అతనెందుకు?’’ అంటూ తన కర్చీ్‌ఫతో నా ముక్కు తుడిచారట. అంత పెద్ద సూపర్‌స్టార్‌ అయ్యుండి ఇలా ప్రవర్తించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన మెగాస్టార్‌ అయ్యారు.

ఫ్యూచర్‌ ప్రాజెక్టులేంటి?

‘హను-మాన్‌’ సీక్వెల్‌ ఉంది కదా! త్వరలోనే షూటింగ్‌ మొదలు కాబోతోంది. అలాగే ఇటీవల ఓ స్టార్‌ హీరోతో సినిమా చేసిన దర్శకుడితో ఓసినిమా చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.

నరసింహ బుర్రా

Updated Date - Jan 21 , 2024 | 05:20 AM