Share News

హనుమ... శరణాగతికి ప్రతిరూపం

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:47 AM

‘విద్యావాన గుణీ అతి చాతుర ... రామకాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునీవేకో రసియా... రామలఖన సీతా మనబసియా’... అనే చరణంలో వర్ణించినట్టు హనుమంతుడు మిక్కిలి శక్తిమంతుడు, వివేకవంతుడు అయినప్పటికీ...

హనుమ...  శరణాగతికి ప్రతిరూపం

రామాయణంలోని ‘సుందరకాం డ’లో హనుమంతుడి విశిష్టత గురించి వాల్మీకి మనోహరంగా వర్ణించాడు. సీతాన్వేషణ, లంకాదహనం, సీతాదేవి జాడను శ్రీరాముడికి తెలియజేయడం లాంటి ఘట్టాలు అందులో ఉన్నాయి. హనుమంతుడి శక్తి, సామర్థ్యాలను తులసీదాస్‌ తన ‘హనుమాన్‌ చాలీసా’లో చాలా వివరంగా తెలియజేశాడు. ‘శ్రీగురుచరణ...’ అంటూ ముందుగా హనుమంతుణ్ణి గురురూపంలో కీర్తిస్తాం... ఎందుకంటే హనుమంతుడు తన భక్తులను ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళతాడు.

‘విద్యావాన గుణీ అతి చాతుర ... రామకాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునీవేకో రసియా... రామలఖన సీతా మనబసియా’... అనే చరణంలో వర్ణించినట్టు హనుమంతుడు మిక్కిలి శక్తిమంతుడు, వివేకవంతుడు అయినప్పటికీ, ఆయన అనన్యమైన భక్తి, సమర్పణ భావం కలిగినవాడు. తన ప్రభువైన శ్రీరాముడి ఆదేశపాలన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటాడు. శ్రీరాముడికి వ్యక్తిగత కార్యదర్శిలా సదా ఆయన వెంట ఉండడానికి ఒక వ్యక్తి అవసరం. ఆ కార్యం నిమిత్తమే హనుమంతుడి సృష్టి జరిగింది. హనుమంతుడు గరిమాది అష్టసిద్ధులు కలిగినవాడు. అణిమా సిద్ధిని ఉపయోగించి... ఆయన అణువులో, పరమాణువులో సైతం ప్రవేశించగలడు. ఆయన శరీరంలోని ప్రతి కణం శక్తితో, భక్తితో నిండి ఉంటుంది. భక్తి, శక్తి వేరు కాదు. మన అంతర్గత సూక్ష్మ శరీరంలోని కుడి పార్శ్వం శక్తికి మూలమనీ, ఎడమ పార్శ్వం భక్తికి మూలమనీ చెబుతారు. గణేశుడు మనకు వివేకాన్ని ప్రసాదిస్తే... హనుమంతుడు శక్తిని ప్రసాదిస్తాడు. గణేశుడు, జ్ఞానం, చిన్నపిల్లవాడిలా అభోదిత తత్త్వం కలిగిన అవతారం. ఆయన వివేకం, విచక్షణా జ్ఞానం కలిగినవాడైతే... హనుమంతుడు సమతుల్యత, ప్రేమతత్త్వం, ఆనందంతో నిండినవాడు. ఎవరైనా తమ భక్తులకు సమస్యలు సృష్టించినట్టయితే... వారిని రక్షించడానికి గణేశుడు, హనుమంతుడు సిద్ధంగా ఉంటారు. కానీ మనం వారి ప్రేమను, కటాక్షాన్ని పొందే అర్హతను కలిగి ఉండాలి.

హనుమంతుడు మనలోని అహంకారానికి, విపరీతమైన ఆలోచనలకు విరుగుడు మందు వేస్తాడు. లంకలో రావణుడు ‘‘నువ్వొక వానరానివి, నువ్వేమి చేయగలవు’’ అని పరిహసించిప్పుడు... రావణ సభలోను, అనంతరం లంకా నగరంలోనూ హనుమంతుడు భీభత్సం సృష్టించి, గుణపాఠం నేర్పిన సందర్భం దీనికి ఉదాహరణ. హనుమంతుడు ప్రేమమయుడు, కరుణామూర్తి. అయితే ఇతరులను బాధ పెట్టే, హింసించే వారిని ఏమాత్రం ఉపేక్షించడు. ఆయన తన శక్తితో లంకాదహనం చేశాడే కానీ... ఎవరినీ దహించలేదు. అయితే రావణుడు భీతిల్లేలా చేశాడు. అంతటి వివేకం, సమతుల్యతా కలిగినవాడు ఆంజనేయుడు. తలచుకుంటే సీతాదేవిని ఆయన అవలీలగా రాముని చెంతకు చేర్చగలడు. కానీ సీతామాత ఆజ్ఞను శిరసావహించాడు. రామరావణ యుద్ధం జరిగి, రావణుణ్ణి రాముడు వధించాల్సి ఉంది... కాబట్టే ఈ విధంగా జరిగింది.

హనుమంతుడిలోని శరణాగతి, సమర్పణభావం అపూర్వమైనవి. మనం గురువుకు, భగవంతుడికి శరణాగతి కావడానికి దోహదపడే శక్తి ఆయన నుంచే ప్రాప్తిస్తుంది. లంకలో సీతమ్మను హనుమంతుడు కలిసినప్పుడు... ఆమె గోళాలలాంటి బంగారు పూసలతో కూడిన ఒక కంఠాభరణాన్ని హనుమంతుడికి బహుమతిగా ఇస్తుంది. అప్పుడు అతను ఆ గోళాలన్నిటినీ ఒక్కొక్కటిగా తెరిచి చూస్తాడు. తన ఆరాధ్యదైవమైన రాముడు వాటిలో కనిపించలేదు. ‘‘నా శ్రీరామచంద్రుడు లేని ఈ గొలుసును నేనేం చేసుకోవాలి?’’ అని అంటాడు సీతమ్మతో. ‘‘రాముడు మరెక్కడో కాదు... నా హృదయంలోనే నెలవై ఉన్నాడ’’ని తన హృదయ కవాటాలను తెరిచి చూపిస్తాడు. హనుమంతుడి నుంచి నేర్చుకోవలసింది... భక్తిని. ఆయన పట్ల మన భక్తి స్వచ్ఛమైనది, వాస్తవమైనదీ అయితే... మనల్ని తాకడానికి కూడా ఎవరూ సాహసించరు. కేవలం హనుమంతుణ్ణి పదేపదే స్మరిస్తూ, పూజించినంతమాత్రాన సరిపోదు. ఆ ప్రార్థన అనన్యమైన భక్తిశ్రద్ధలతో, హృదయపూర్వకంగా ఉండాలి. మనిషి సాధారణంగా తన భవిష్యత్తు గురించి ఎక్కువగా ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. ఇది పింగళానాడి తాలూకు లక్షణం. మరికొందరు అతిగా, అది కూడా మన ఆధీనంలో లేని వాటి కోసం ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఇది మన కుడిపార్శ్వంలో అధిక వేడిమికి కారణం అవుతుంది. దానివల్ల పింగళానాడి సమతుల్యత కోల్పోయి, మనం అనారోగ్యం బారిన పడతాం.. అటువంటి సమయాల్లోనే హనుమంతుణ్ణి ఆశ్రయించాలి. మన పింగళానాడిని అధిష్టించి ఉన్న హనుమంతుణ్ణి జాగృతం చేసుకోవాలి. ఆయన లక్షణాలను మనలో స్థిరపరుచుకోవాలి. అప్పుడు ఆయన మన ప్రణాళికలను క్రమబద్ధీకరిస్తాడు, మనల్ని సమతుల్యతలో ఉంచుతాడు. సహజయోగ సాధన ద్వారా కుండలినీ జాగృతి జరిగి, మనం ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు... మనలో హనుమంతుడి లక్షణాలు సహజసిద్ధంగా స్థిరపడతాయని సహజయోగప్రదాత శ్రీమాతాజీ నిర్మలాదేవి తన ప్రవచనాల్లో వివరించారు.

కాబట్టి హనుమాన్‌ చాలీసా ఆఖరి దోహాలో తులసీదాస్‌ వర్ణించినట్టు... ‘‘ఓ పవన తనయా... సర్వ సంకట హారీ... సర్వ మంగళ రూపా... వీర హనుమా...

శ్రీ ఆంజనేయా... సీతారామ లక్ష్మణ సమేతుడవై నా హృదయ కమలంలో కొలువై ఉండు’’ అని ఆయనను శరణు వేడుదాం.

(23న హనుమద్విజయోత్సవం)

డాక్టర్‌ పి. రాకేష్‌ 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - Apr 19 , 2024 | 05:47 AM