మన దీపిక బంగారమే!
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:57 AM
ప్రపంచం మొత్తంలో పది మంది అత్యంత అందమైన అతివలను ప్రతి ఏటా ఎంపిక చేస్తూ ఉంటారు. ‘గోల్డెన్ రేషియో ఫార్ములా’ ఆధారంగా ఎంపిక చేసే
ప్రపంచం మొత్తంలో పది మంది అత్యంత అందమైన అతివలను
ప్రతి ఏటా ఎంపిక చేస్తూ ఉంటారు.
‘గోల్డెన్ రేషియో ఫార్ములా’ ఆధారంగా ఎంపిక చేసే
ఆ పది మంది అందగత్తెల్లో మన బాలీవుడ్
భామ దీపికా పదుకొనె కూడా ఉంది.
ఆ విశేషాలు తెలుసుకుందాం!
లండన్‌లో స్థిరపడిన ఫేసియల్ కాస్మొటిక్ సర్జన్, డాక్టర్ జులియన్ డి సిల్వ, ప్రతి ఏటా, ప్రపంచ వ్యాప్తంగా పది మంది అందమైన మహిళలను ఎంపిక చేసి, ర్యాంకుల వారీగా వాళ్ల పేర్లను ప్రకటిస్తూ ఉంటాడు. అందుకోసం అతను గోల్డెన్ రేషియో ఫార్ములాను అనుసరిస్తూ ఉంటాడు. శాస్త్రీయ కొలతలతో అందాన్ని కొలవడం ఈ గ్రీకు ఫార్ములా ప్రత్యేకత. ముఖం పొడవు, వెడల్పుల ఆధారంగా గోల్డెన్ రేషియోను లెక్కిస్తారు. 1.618 నిష్పత్తికి దగ్గరగా ఉన్న విలువలను ఆదర్శ సౌందర్యంగా లెక్కించండం ఆనవాయితీ! ఈ నిష్పత్తిని ప్రత్యేకమైన ముఖ లక్షణాలకు కూడా అన్వయిస్తూ ఉంటారు.
గోల్డెన్ రేషియో స్కోర్లు
డాక్టర్ డి సిల్వ, ఎంపిక చేసిన పది మంది అందగత్తెల్లో మొదటి స్థానాన్ని ఇంగ్లీషు నటి, జోడీ కోమర్ సొంతం చేసుకుంది. ఈమె గోల్డెన్ రేషియో, 94.52 శాతం. ఆమె పెదవులు, ముక్కు తీరు, 98.7 శాతం స్కోరును దక్కించుకున్నాయి. ముక్కు కొలత, పెదవుల ఆకారం, కళ్ల ప్రదేశాలు కూడా ఆమెకు మంచి మార్కులే తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే, డాక్టర్ డి సిల్వ ప్రపంచంలోని పది మంది అందగత్తెల్లో దీపికా పదుకొనెకు తొమ్మిదో స్థానాన్ని కల్పించాడు. ఈ పోటీలో దీపిక 91.22 స్కోరును పొందడం విశేషం. 2018లో కూడా దీపికాను, యుకెలోని వార్తాపత్రిక, ఈస్టర్న్ ఐ, సెక్సీయెస్ట్ ఇండియన్ విమెన్‌గా ప్రకటించింది. తాజాగా తల్లైన ఈ 38 ఏళ్ల బాలీవుడ్ భామ, నవంబరు ఒకటిన విడుదల కాబోతున్న సింఘం ఎగైన్ చిత్రంలో కనిపించబోతోంది. ఒక్కో సినిమాకు 15 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ, ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న తారగా కూడా దీపిక పేరు తెచ్చుకుంది.
వీళ్లే ఆ పది మంది
స్కోర్ ఆధారంగా ఎంపికైన పది మంది అందగత్తెల్లో ఇంగ్లీషు నటి జోడీ కోమర్ 94.52 శాతాన్ని సాధిస్తే, అమెరికన్ నటి, గాయన, జెండాయా 94.37 శాతాన్ని, అమెరికన్ మోడల్, బెల్లా హదీద్, 94.35 శాతాన్నీ, అమెరికన్ గాయని, బియాన్సే 92.44, మెరికన్ గాయని, నటి ఆరియానా గ్రాండె, 91.81, అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ 91.64, బ్రిటిష్ మోడల్ జోర్డాన్ డన్, 91.39, అమెరికన్ టివి పర్సనాలటీ, కిమ్ కర్దాషియాన్ 91.28, భారతీయ హిందీ నటి దీపిక పదుకొనె, 91.22 శాతం, దక్షిణ కొరియా మోడల్, హో యాన్ జుంగ్, 89.63 శాతం స్కోరునూ సొంతం చేసుకున్నారు.
గోల్డెన్ రేషియో అంటే?
మనం ముఖం పొడవు, వెడల్పులను కొలిచి, ఆ విలువలను పొడవు, వెడల్పులతో భాగిస్తే వచ్చే ఫలితమే గోల్డెన్ రేషియో. ఆ ఫలితం 1.62కు దగ్గరగా ఉండాలి. ఈ అంకెను ‘ఫై’ అంటారు. ఈ పేరు, గ్రీకు శిల్పి ఫైడియాస్ నుంచి వచ్చింది. ఇతను తాను చెక్కే విగ్రహాలకు ఇదే సూత్రాన్ని అన్వయిస్తూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్ ఆధారంగా ఒకరి ముఖాన్ని అంచనా వేసేటప్పుడు, ఆ ముఖంలో ఆకట్టుకునే లక్షణమేదో, గోల్డెన్ రేషియా సూత్రాల ఆధారంగా ఆ లక్షణానికి ఎంత స్కోరును కేటాయించవచ్చో లెక్కిస్తారు. ముఖంలో వేర్వేరు అవయవాల మధ్య ఉండే వ్యత్యాసం, దూరాలను కూడా కచ్చితంగా లెక్కిస్తారు. ఉదాహరణకు, వెంట్రుకలకూ కళ్లకూ మధ్య ఉండే దూరం, రెండు కళ్లకూ మధ్య ఉండే దూరం, ముక్కు దిగువ నుంచి చుబుకం వరకూ ఉన్న దూరాలను లెక్కించి, ఆదర్శవంతమైన నిష్పత్తితో సరిపోల్చుతారు. ఆ నిష్పత్తి 1.62 నిష్పత్తికి ఎంత దగ్గరగా ఉంటే, గోల్డెన్ రేషియో స్కోర్‌ను అంత ఎక్కువ ఉన్నట్టు లెక్క. సాధారణంగా ఈ కొలతలను, నిష్పత్తులనూ కాస్మొటిక్ సర్జరీలు, ఈస్థటిక్స్‌లో ముఖాన్ని అందంగా కనిపించేలా తీర్చిదిద్దే క్రమంలో ఉపయోగిస్తూ ఉంటారు. ప్రపంచంలోని పది మంది అందగత్తెలను ప్రకటించిన డాక్టర్ డి సిల్వ ఈ గోల్డెన్ రేషియో గురించి మాట్లాడుతూ... ‘‘కళ్లు, పెదవులు, ముక్కు మొదలైన, ముఖంలోని ఎలిమెంట్స్‌ను పరీక్షించడం కోసం మా క్లినిక్‌లో డిజిటల్ మ్యాపింగ్‌ను ఉపయోగిస్తాం. తర్వాత ఈ ఎలిమెంట్స్‌ను గోల్డెన్ రేషియోతో సరిపోల్చి, వాళ్ల ఆకర్షణను లెక్కిస్తాం. అలాగే ముక్కు, కళ్లు, పెదవుల మధ్య దూరాన్ని సాఫ్ట్‌వేర్ సహాయంతో విశ్లేషించి, వాటిని గోల్డెన్ రేషియోతో సరిపోల్చి, అలైన్‌మెంట్‌ను నిర్థారిస్తాం’’ అంటూ సౌందర్య స్కోర్‌ను లెక్కించే విధానాన్ని వివరిస్తున్నాడు.
మనం ముఖం పొడవు, వెడల్పులను కొలిచి, ఆ విలువలను పొడవు, వెడల్పులతో భాగిస్తే వచ్చే ఫలితమే గోల్డెన్ రేషియో. ఆ ఫలితం 1.62కు దగ్గరగా ఉండాలి. ఈ అంకెను ‘ఫై’ అంటారు. ఈ పేరు, గ్రీకు శిల్పి ఫైడియాస్ నుంచి వచ్చింది. ఇతను తాను చెక్కే విగ్రహాలకు ఇదే సూత్రాన్ని అన్వయిస్తూ ఉంటాడు.