Share News

Real Spirituality : తిరిగి ఇవ్వడమే అసలైన ఆధ్యాత్మికత

ABN , Publish Date - May 24 , 2024 | 05:21 AM

నా దృష్టిలో మతం అనేది కేవలం వ్యక్తిగతమైన విషయం. సామూహికంగా పూజాది కార్యక్రమాల్లో, భజనల్లో పాల్గొనవచ్చు. కానీ సృష్టికర్తతో మనసువిప్పి సంభాషించడం అనేది ఆంతరంగిక వ్యవహారం. ఇక, పూజ ఫలానా విధంగానే చేసి తీరాలని నిబంధనలు విధించడం, దేవుడి పేరు చెప్పి భయపెట్టాలని చూడడం సరికాదు. ‘‘చిత్తశుద్ధి లేని శివపూజలేల?’’ అన్నాడు వేమన. కర్మల ఫలం అనుభవించక తప్పదని మత

Real Spirituality : తిరిగి ఇవ్వడమే అసలైన ఆధ్యాత్మికత

నా దృష్టిలో మతం అనేది కేవలం వ్యక్తిగతమైన విషయం. సామూహికంగా పూజాది కార్యక్రమాల్లో, భజనల్లో పాల్గొనవచ్చు. కానీ సృష్టికర్తతో మనసువిప్పి సంభాషించడం అనేది ఆంతరంగిక వ్యవహారం. ఇక, పూజ ఫలానా విధంగానే చేసి తీరాలని నిబంధనలు విధించడం, దేవుడి పేరు చెప్పి భయపెట్టాలని చూడడం సరికాదు. ‘‘చిత్తశుద్ధి లేని శివపూజలేల?’’ అన్నాడు వేమన. కర్మల ఫలం అనుభవించక తప్పదని మత గ్రంథాలు బోధిస్తున్నా... అడ్డదారులు చూపిస్తామనే స్వామీజీలను ఆశ్రయించడంలోని విజ్ఞత నాకు అర్థం కాదు. దేవుడి ధ్యానం ద్వారా దైవ సంపర్కం పెంచుకోవడం కన్నా... ఆడంబరం ప్రదర్శిస్తూ, భౌతిక అవసరాల మీద ఆశలు కల్పిస్తున్న గురువుల వెంట పరుగులు పెట్టేవారిని చూస్తే... ‘అయ్యో పాపం! చిల్లర రాళ్ళకు మొక్కుతున్నారే?’ అనిపిస్తుంది. భారీస్థాయిలో పూజాది క్రతువులు చూసినప్పుడు... ‘పాపకర్మలు చేశామేమోనన్న అపరాధ భావనను తుడిచివేసుకోవడానికే అట్టహాసం చేస్తున్నారా?’ అనిపిస్తుంది.

‘‘నాకు ఈ జీవితమే దైవదత్తం. ఎందుకంటే... నేను మా అమ్మకు నెలలు నిండకుండానే... ఏడో నెలలో పుట్టాను. అది 1945. అప్పట్లో యాంటీ బయాటిక్స్‌ లేవు, ఇంక్యుబెటర్లూ లేవు. అలాంటి పరిస్థితుల్లో జననం, పుట్టిన తరువాత బతికి బైటపడడం కష్టమే. అయినా దేవుడు వైద్యుడి (మా మేనమామే) రూపంలో వచ్చి... అతి క్లిష్ట పరిస్థితుల్లో నన్ను బతికించాడు, నా ప్రాణం నిలబెట్టాడు. ఈ విషయం మా అమ్మ ద్వారా, బంధువుల ద్వారా నేను విన్నప్పుడు... అదంతా దేవుడి సంకల్పమే అనిపించింది. అటువంటి నేను.. యవ్వనంలో చాలామంది లాగానే ‘ఏగ్నస్టిక్‌’ (అజ్ఞేయతావాది)గా ఉండేవాణ్ణి. అంటే దేవుడు ఉన్నాడో లేదా తెలియనివాణ్ణి. నాస్తికుణ్ణి అన్నా పరవాలేదు.


కానీ దైవ శక్తి మీద విశ్వాసం బలపడే అనుభవం ఒకటి నేను బియస్సీ చదివేటప్పుడు ఎదురయింది. కెమిస్ట్రీలో చిన్న పొరపాటు జరగడంతో నాకు ఫస్ట్‌ క్లాస్‌ రాకుండా పోయింది. దెబ్బకు కళ్ళు తెరుచుకున్నాయి. తిరుపతి కొండకు నడిచి వస్తానని మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకున్నాను కూడా. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. ఎమ్మెస్సీలో యూనివర్సిటీ ఫస్ట్‌ వచ్చా. సివిల్స్‌లో మొదటి ప్రయత్నంలోనే ర్యాంక్‌ సాధించా. దేవుడి కరుణ నిరంతరంగా ప్రసరించడంతో... ఉద్యోగం, వివాహం, సంతానం, తల్లితండ్రులను, అత్తమామలను సేవించుకొనే భాగ్యం - అన్నీ కలిగాయి. దేవుడిపై బ్రహ్మాండమైన గురి కుదిరింది. ప్రతి ఏటా తిరుపతికి కాలినడకన వెళ్ళాను, అంగప్రదక్షిణలు చేశాను.

తిరుపతి వెంకన్ననే కాదు... యాదగిరి నరసింహుణ్ణి, విజయవాడ కనకదుర్గను, అన్నవరం సత్యనారాయణ స్వామినీ... అందరినీ శక్తి ఉన్నంతకాలం కాలినడకనే దర్శించుకున్నాను. ఈ తీర్థయాత్రలు చేసినంత మాత్రాన నాకు కష్టాలేవీ రాలేదని చెప్పను. అయితే, అవి తీరాలని నేను దేవుళ్ళతో ఎప్పుడూ బేరాలు ఆడలేదు. దేవుళ్ళు నా కష్టాలను తొలగించకపోయినా... వాటిని తట్టుకొనే శక్తిని ప్రసాదించారు. నిరుత్సాహం, నిస్పృహ కలిగినప్పుడు నా వెన్ను తట్టారు. ‘ప్రతిఫలం ఆశించకుండా నీ విధి నీవు చెయ్యి’ అని ప్రేరేపించారు. నా కర్తవ్య నిర్వహణ సజావుగా సాగడానికి ఒక్కోసారి మృత్యుముఖం నుంచి తప్పించారు కూడా. వృత్తిపరంగా ధైర్యంగా, నిజాయితీగా నిలబడడానికి, దుష్టశక్తుల ప్రయత్నాలను తట్టుకోవడానికి, ధర్మాన్ని తప్పకుండా ఉండడానికి తగిన స్థయిర్యాన్ని ప్రసాదించారు.


ఆధ్యాత్మికత అనగానే సర్వసంగ పరిత్యాగం, జన్మరాహిత్యం కోసం పరితపించడం అనుకుంటారు చాలామంది. నా దృష్టిలో.. ఆధ్యాత్మికత అంటే ప్రకృతి పట్ల, సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండడం. ‘‘మోక్షం కన్నా నేను పునర్జన్మనే కోరుకుంటాను’’ అన్నాడు రవీంద్ర కవీంద్రుడు. అద్భుతమైన భగవంతుడి సృష్టిని ఆస్వాదించాలంటే జన్మంటూ ఉండాలి కదా! దేవుడు ఇచ్చిన వరం... జీవితం. ప్రకృతి ద్వారా దేవుడు అందిస్తున్న కానుకలకు కృతజ్ఞులమై ఉంటూ, మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వడం అసలైన ఆధ్యాత్మికత! కార్ల్‌మార్క్స్‌ చెప్పినట్టు భక్తి ‘నల్లమందు’ కాదు... కష్టాలను భరించి, రేపటి రోజుపై నమ్మకాన్ని కలిగించే టానిక్‌. దేవుడు నేను పుట్టినప్పుడే పెద్ద గండం నుంచి తప్పించాడు. ఆ తరువాత నా జీవితంలో దక్కిన తక్కినవన్నీ బోనస్సే! ఇంగ్లీషులో ‘కౌంట్‌ యువర్‌ బ్లెస్సింగ్స్‌’ అంటారు. మనకు దక్కినవాటిని లెక్క వేసుకొని చూసుకుంటే... దేవుడిపై ఫిర్యాదు చేయడానికి మనకు అవకాశమే చిక్కదు. ఆ కృతజ్ఞతా భావమే అతి పెద్ద ఆధ్యాత్మిక భావన అని నా ఉద్దేశం.

ఇక... నేను చేసే పూజలన్నీ తగు మోతాదులోనే ఉంటాయి. అన్నహోమం చేయడం కన్నా అన్నదానం చేయడం మేలని నా ఉద్దేశం. ‘‘ఆకలితో ఉన్నవాడి ముందర భగవంతుడు కూడా ఒక ముద్ద అన్నం రూపంలో తప్ప... వేరే రూపంలో ప్రత్యక్షమవడానికి సందేహిస్తాడు’’ అన్నారు గాంధీ మహాత్ముడు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అన్నారు మన పూర్వులు. సమాజంలో ఆధ్యాత్మికత, భక్తిభావం పెంపొదించాలంటే... సామాన్యుడి కనీస అవసరాలు తీర్చడానికి కృషి చేయాలి. ఆత్మారాముడు సంతృప్తి పడందే... అసలు రాముడి గురించి జీవికి ఆలోచన రాదు.’’

- డాక్టర్‌ మోహన్‌ కందా, ఐఎఎస్‌

విశ్రాంత ముఖ్యకార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌

సంభాషణ: కృష్ణశర్మ

Updated Date - May 24 , 2024 | 05:55 AM