Share News

Navya : ఉక్కు మహిళ

ABN , Publish Date - May 26 , 2024 | 11:48 PM

మేఘాలయలోనే కాదు... ఈశాన్య రాష్ట్రాల చరిత్రలోనే మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి ఒక గిరిజన మహిళ పోలీసు శాఖలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించింది. ఇదాశిషా నోంగ్రాంగ్‌... ఇటీవలే మేఘాలయ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆమె మూడు దశాబ్దాల కెరీర్‌లో... క్లిష్ట పరిస్థితులను ఎదిరించి... సవాళ్లను అధిగమించి... సాధించిన విజయాలు ఎన్నో.

Navya : ఉక్కు మహిళ

మేఘాలయలోనే కాదు... ఈశాన్య రాష్ట్రాల చరిత్రలోనే మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి ఒక గిరిజన మహిళ పోలీసు శాఖలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించింది. ఇదాశిషా నోంగ్రాంగ్‌... ఇటీవలే మేఘాలయ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆమె మూడు దశాబ్దాల కెరీర్‌లో... క్లిష్ట పరిస్థితులను ఎదిరించి... సవాళ్లను అధిగమించి... సాధించిన విజయాలు ఎన్నో.

‘యూపీపీఎ్‌ససీ లేదా మరెవరైనా... నేను అమ్మాయినని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నాలోని ప్రతిభ చూసి నన్ను ఎంపిక చేశారు. అందరితో పోటీపడి సివిల్స్‌ సాధించాను. నేడు మా రాష్ట్ర పోలీ్‌సకు చీఫ్‌ను అయ్యాను. ఒక మహిళగా, గిరిజన బిడ్డగా ఈ స్థాయికి వచ్చినందుకు గర్వంగా ఉంది’ అంటారు ఇదాశిషా నోంగ్రాంగ్‌.

ఇటీవలే ఆమె మేఘాలయ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా నియమితులయ్యారు. రాష్ట్రంలో ఈ పదవిని అలంకరించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి గిరిజన మహిళగానూ రికార్డులకు ఎక్కారు.

ఇవేకాదు... 32 ఏళ్ల ఆమె కెరీర్‌లో ఇలాంటి ‘మొదటి’ మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి. దేశంలోనే పోలీస్‌ శాఖ అత్యున్నత పదవి చేపట్టిన అయిదో ఐపీఎస్‌ అధికారిగా నిలిచారు. కాగా దేశంలో డీజీపీ స్థాయికి వెళ్లిన మొట్టమొదటి ఐపీఎస్‌ అధికారి కిరణ్‌బేడీ.

  • అవి అర్హతలు కాదు...

‘ఐపీఎస్‌ అధికారిగా చాలా సంవత్సరాలుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. నా దృష్టిలో మహిళగా పుట్టడం అనేది ఒక అర్హత కాదు. అది మన చేతుల్లో లేనిది. అలాగే గిరిజనురాలిని కావడం కూడా. వీటిని చూసి యూపీపీఎ్‌ససీ నన్ను ఎంపిక చేసిందనుకోను’ అంటారు ఇదాశిషా.

ఇది విమర్శకులకు ఆమె ఇచ్చిన సమాధానం. ప్రతిభాపాటవాలకు మించిన అర్హత మరొకటి లేదనేది ఆమె అభిప్రాయం. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఇదాశిషా... అస్సాం మేఘాలయ కేడర్‌లో కెరీర్‌ మొదలుపెట్టారు.

ఆమె అక్క విదేశాల్లో స్థిరపడడంతో తల్లితండ్రులు, కుటుంబ బాధ్యతలను తానే తీసుకున్నారు. సొంత రాష్ట్రంలోనే వివిధ హోదాల్లో పని చేస్తూ వస్తున్న ఆమె వృత్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు... అడుగడుగునా సవాళ్లు. కానీ ఏ రోజూ వెనకడుగు వేయలేదు.


  • నిజాయతీ... నిర్భయం...

ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదాశిషా సాహసంతో దూసుకుపోతున్నారు. బలగాలను నడిపించడంలో ఎప్పుడూ ముందుంటారు. తనతో కలిసి పని చేసేవారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తారు. వృత్తిపట్ల అంకితభావం, పనిలో నిజాయతీ, ఎంతటివారినైనా ఎదిరించి నిలవగల తెగువ... ఇవే ఇదాశిషాను ప్రత్యేకంగా నిలిపాయి. ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా... నిర్భయంగా వ్యవహరించడం ఆమె నైజం.

డీజీపీగా బాధ్యతలు చేపట్టే నాటికి ఇదాశిషా సివిల్‌ డిఫెన్స్‌, హోమ్‌గార్డ్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ఆమె ఐపీఎస్‌ బ్యాచ్‌లో నలుగురే మహిళలు. మేఘాలయ నుంచి ఐపీఎస్‌ అధికారి అయిన తొలి మహిళగా కూడా ఇదాశిషా నాడు చరిత్ర సృష్టించారు. ‘ముక్కుసూటి తత్వం, నిజాయితీని నరనరానా జీర్ణించుకున్న కఠినమైన అధికారి ఇదాశిషా.

డీజీపీ కుర్చీలో కూర్చోవడానికి తను అన్ని విధాలా అర్హురాలు. సరైన వ్యక్తికి సరైన స్థానం దక్కింది’ అని ఆమె సహచరులు గొప్పగా చెబుతారు.

  • ఎందరికో ఆదర్శం...

మేఘాలయలోనే కాదు... పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇదాశిషాను ఆదర్శంగా తీసుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. ఆమె అడుగుజాడల్లో నడిచి, చాలామంది ఉన్నత పదవుల్లో కొలువు తీరారు. మేఘాలయ జైళ్ల శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌, రాజకీయ నాయకుడు మరియోమ్‌ ఖర్క్రంగ్‌ తన పదవీ కాలంలో చూసిన అరుదైన మహిళా అధికారిగా, ధీశాలిగా ఇదాశిషాను అభివర్ణించారు.

‘ఇప్పుడైతే సివిల్‌ సర్వీసె్‌సలో ర్యాంకులు సాధించిన అమ్మాయిలు ఐపీఎ్‌సను ఎంచుకొంటున్నారు. కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. పోలీస్‌ ఉద్యోగం మహిళలకు తగినది కాదని భావించేవారు. ముఖ్యంగా ఇదాశిషా కమ్యూనిటీలో.

ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకొంటూ... పోలీసింగ్‌ లాంటి కఠినమైన ఉద్యోగం చేయడం అంత సులువు కాదనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉండేది. అలాంటి వాతావరణంలో పెరిగిన ఇదాశిషా ప్రతికూల పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా మలుచుకుని, అనుకున్నది సాధించారు. అందుకే ఆమె అందరికంటే ప్రత్యేకం’ అంటారు మరియోమ్‌.


  • విమర్శలు పక్కనపెట్టి...

‘మహిళ కనుకనే ఇదాశిషాకు డీజీపీ పీఠం దక్కింది’ అనేది ఆమెతో పాటు ఆ పదవికి పోటీపడిన ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల అక్కసు. ‘మహిళ అనేది అర్హత కాద’ని ఆమె ఆ ఆరోపణలను సున్నితంగా తిప్పికొట్టారు. ఇదాశిషా వృత్తిగత జీవితాన్ని దగ్గరగా చూసిన ఎవరికైనా ఆమె గొప్పదనం తెలుస్తుంది. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో... దాని కోసం ఎన్ని త్యాగాలు చేశారో అర్థమవుతుంది. 2000 ప్రాంతం... మేఘాలయలో తీవ్రవాదం పతాక స్థాయిలో ఉన్న సమయం... ఆమె పలు తీవ్రవాద వ్యతిరేక దాడులకు నాయకత్వం వహించారు.

పదేళ్లకు పైగా ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పని చేశారు. ఆమె నేతృత్వంలో ఎన్ని విజయాలు సాధించినా... తన ఘనతగా చెప్పుకోలేదు. వాటన్నిటినీ తనతో కలిసి పని చేసిన బృందం ఖాతాలో వేశారు. అయితే స్థానిక రాజకీయ పార్టీలైన ‘యునైటెడ్‌ డెమక్రటిక్‌ పార్టీ, వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్స్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ’లు... ఇదాశిషా డీజీపీ కావడంలో తమ పాత్ర ఉందని చెప్పుకొనే పనిలో నిమగ్నమయ్యాయి.


  • వాటిపైనే దృష్టి...

క్రైమ్‌ రేట్‌, ముఖ్యంగా మహిళలపట్ల అఘాయిత్యాలు అధికంగా ఉన్న నేపథ్యంలో మేఘాలయ ప్రజలు డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఇదాశిషాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మితిమీరిన పోలీసుల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తారని భావిస్తున్నారు. ‘‘ఇన్నేళ్లూ ఎంత నిబద్ధత, నిజాయతీతో నా కర్తవ్యాన్ని నిర్వర్తించానో... ఇకపై కూడా అదేవిధంగా శక్తివంచన లేకుండా పని చేస్తాను. మొదటగా పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తాను.

నేరస్తులపై ఉక్కుపాదం మోపి... నేరాలను అరికట్టడానికి శ్రమిస్తాను. ఏదిఏమైనా ప్రజలకు ‘అండగా మేమున్నాం’ అనే భరోసా కల్పిస్తాం’’ అంటున్న ఇదాశిషా బాధ్యతలు చేపట్టి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కార్యరంగంలోకి దిగారు.

‘ముక్కుసూటి తత్వం, నిజాయితీని నరనరానా జీర్ణించుకున్న కఠినమైన అధికారి ఇదాశిషా. డీజీపీ కుర్చీలో కూర్చోవడానికి తను అన్ని విధాలా అర్హురాలు.

మేఘాలయ నుంచి ఐపీఎస్‌ అధికారి అయిన తొలి మహిళగా కూడా ఇదాశిషా నాడు చరిత్ర సృష్టించారు.

2000 ప్రాంతం... మేఘాలయలో తీవ్రవాదం పతాక స్థాయిలో ఉన్న సమయం... ఆమె పలు తీవ్రవాద వ్యతిరేక దాడులకు నాయకత్వం వహించారు. పదేళ్లకు పైగా ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పని చేశారు. ఆమె నేతృత్వంలో ఎన్ని విజయాలు సాధించినా... తన ఘనతగా చెప్పుకోలేదు. వాటన్నిటినీ తనతో కలిసి పని చేసిన బృందం ఖాతాలో వేశారు.

Updated Date - May 26 , 2024 | 11:48 PM