అమ్మ అభయం కోసం...
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:22 AM
ఘనమైన గ్రామీణ, సాంస్కృతిక వారసత్వం కలిగిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలూ ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొనే వేడుక బోనాల పండుగ. దీన్ని ‘ఆషాఢ జాతర’ అని కూడా అంటారు.

7 నుంచి బోనాల
ఉత్సవాలు
ఘనమైన గ్రామీణ, సాంస్కృతిక వారసత్వం కలిగిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలూ ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకొనే వేడుక బోనాల పండుగ. దీన్ని ‘ఆషాఢ జాతర’ అని కూడా అంటారు. ఆషాఢమాసంలోని మొదటి ఆదివారం లేదా గురువారం బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వర్షాలు మొదలై, పంటలు వేసే కాలంలో... ఎలాంటి విపత్తులూ ఎదురుకాకుండా చూడాలనీ, సమృద్ధిగా పాడి ఇంటికి చేరాలనీ అమ్మవార్లను రైతులు ప్రార్థిస్తారు. వర్షాకాలం కాబట్టి వ్యాధులు ప్రబలకుండా కాపాడాలని ప్రజలు గ్రామదేవతలకు మొక్కుకుంటారు. ఏటా ఆషాఢమాసంలో గ్రామదేవతలు తమ పుట్టిళ్ళకు వస్తారని ప్రజల విశ్వాసం. వారిని ఆహ్వానించి, నివేదనలు సమర్పించి, కోరికలు కోరుకొని, మొక్కులు చెల్లించుకొనే సందర్భమే... నెల రోజుల బోనాలు పండుగ. కాకతీయ రాజులు కాకతీమాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారనీ, అవే క్రమంగా బోనాలు వేడుకలుగా రూపుదిద్దుకున్నాయనీ అంటారు. నూట యాబై ఏళ్ళ కిందట ప్లేగు వ్యాధి హైదరాబాద్ నగరాన్ని కల్లోలపరచినప్పుడు... తమను ఆ మహమ్మారి బారి నుంచి కాపాడాలని వేడుకుంటూ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారని తెలుస్తోంది. నాటి నుంచీ బోనాల సంబరాలకు హైదరాబాద్ చిరునామాగా మారింది.
కుతుబ్‌షాహీ పాలకుడు తానీషాకు మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు గోల్కొండ కోటలో నిర్మించిన జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలకు ప్రతి సంవత్సరం అంకురార్పణ చేయడం ఆనవాయితీ. రథోత్సవంతో, తొట్టెల ఊరోగింపుతో అమ్మవారి విగ్రహాలను ఆలయానికి తీసుకువచ్చి, తొలి పూజ చేస్తారు. దీనితో ఉత్సవాలు మొదలవుతాయి. బోనాల సమర్పణ మరో ప్రధానమైన వేడుక. బోనం అంటే అమ్మవారికి నివేదించే అన్నం. చిత్రాన్నం, బెల్లం పొంగలి లాంటి రకరకాల వివిధ పదార్థాలను మహిళలు తయారు చేస్తారు. వాటిని పాత్రల్లో ఉంచి, చుట్టూ వేపమండలు కట్టి, ఆ పాత్రపైన మూతలో దీపం వెలిగిస్తారు. ఆ పాత్రలను తలపై ధరించి, ఆలయాలకు చేరుకుంటారు. అమ్మవారిని ప్రార్థించి, బోనాన్ని సమర్పించి, మొక్కులు తీర్చుకుంటారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నుంచి కాపాడాలంటూ అమ్మవారికి వేప కొమ్మలను సమర్పిస్తారు. అలాగే తమ ఇళ్ళ నుంచి తెచ్చిన పదార్థాలను భక్తులు బండిపై ఉంచి, ఆలయానికి తీసుకువస్తారు. దీన్ని ‘ఫలహారపు బండి’ అంటారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాక, ఆ పదార్థాలను అమ్మవారికి నిమేదిస్తారు. బోనాల ఉత్సవాల్లో మరో ఆకర్షణ పోతురాజు. పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. ఆలయ ఆవరణల్లో, వీధుల్లో పోతురాజు వేషధారులు చేతిలో కొరడాతో వీరంగం వేస్తారు. బోనాల సమర్పణ పూర్తయిన మరునాడు ఆలయం ఎదుట జరిగే రంగం సందర్భంగా... అవివాహిత అయిన మహిళ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. రాబోయే రోజుల్లో సంభవించే పరిణామాలను అమ్మవారే ఆ మహిళ ద్వారా ప్రకటిస్తారని భక్తులు నమ్ముతారు. రంగం ముగిసిన తరువాత బలిహరణం పేరిట అమ్మవారికి నివేదన ఉంటుంది. అనంతరం కలశాలనూ, అమ్మవారి చిత్రపటాలనూ అంబారీపై ఊరేగించి, ఘటాల నిమజ్జనతో అమ్మవారికి వీడ్కోలు చెప్పడంతో ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ ఏడాది జూలై ఏడవతేదీ ఆదివారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాలు ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. ఆ తరువాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు.
వేడుక ఎప్పుడంటే...
జూలై 7న: గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభం
జూలై 21న: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు
జూలై 22న: రంగం, భవిష్యవాణి
జూలై 28న: పాతబస్తీ (లాల్ దర్వాజా) బోనాలు
జూలై 29న: ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు