Share News

దైవ ప్రసన్నత కోసం...

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:47 AM

దైవ ప్రసన్నత పొందడం ఇస్లాంలో విశ్వాసుల అత్యున్నత లక్ష్యం. ఆ లక్ష్యసాధనకోసం క్రమబద్ధమైన జీవనాన్ని అలవరచుకోవాలి.

దైవ ప్రసన్నత కోసం...

దైవ ప్రసన్నతను పొందే ఎన్నో మార్గాలను విశ్వాసులకు మహా ప్రవక్త మహమ్మద్‌ బోధించారు. నిత్య జీవితాలలో మానవులు మంచి పనులు ఆచరించడం ద్వారా మాత్రమే అల్లా్‌హకు ప్రీతిపాత్రులవుతారని చెప్పేవారు.

ఒకరోజు ఆయనను ఒక వ్యక్తి కలిసి ‘‘మహా ప్రవక్తా! మనిషి ఆచరించే పనులన్నిటిలో దేవుడికి ఎక్కువ ఇష్టమైన ఆచరణ ఏది?’’ అని ప్రశ్నించాడు. దానికి మహా ప్రవక్త బదులిస్తూ ‘‘నమాజ్‌ చేయడం దైవానికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం’’ అని చెప్పారు.

‘‘నమాజ్‌ తరువాత దైవం ఎక్కువగా ఇష్టపడేది ఏమిటి?’’

‘‘తల్లితండ్రులకు సేవ చేయడం. వారికి ఏ కష్టం, బాధ కలుగకుండా చూసుకోవడం.’’

‘‘ఆ తరువాత... ఏ కార్యాచరణ దేవుడికి ప్రీతి కలిగిస్తుంది?’’ అని అడిగాడు ఆ వ్యక్తి.

‘‘దేవుని మార్గంలో పాటుపడడం’’ అని చెప్పారు మహా ప్రవక్త.

దైవ ప్రసన్నత పొందడం ఇస్లాంలో విశ్వాసుల అత్యున్నత లక్ష్యం. ఆ లక్ష్యసాధనకోసం క్రమబద్ధమైన జీవనాన్ని అలవరచుకోవాలి. నిత్యం క్రమం తప్పకుండా నిర్దేశిత సమయాల్లో నమాజ్‌ చేయాలి. జన్మను ఇచ్చిన తల్లితండ్రులు దైవసమానులు. వృద్ధాప్యంలో వారిని ఆప్యాయంగా చూసుకోవాలి. దైవం, ప్రవక్తలు చూపిన బాటలో పయనిస్తూ... తోటివారి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడాలి. ఇవన్నీ దేవునికి ఇష్టమైన విషయాలు. వీటిని ఆచరించేవారిపై అల్లాహ్‌ కారుణ్యాన్ని వర్షిస్తాడు.

Updated Date - Jan 05 , 2024 | 04:50 AM