గృహ హింసపై నిరసన ధ్వని
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:41 AM
‘‘గృహ హింస మహిళల సమస్య మాత్రమే కాదు. దాని ప్రభావం సమాజంలోని అనేక స్థాయిల్లో ఉంటుంది. మహిళలు ధైర్యంగా ముందుకు వస్తేనే దీన్ని నిరోధించగలం’’ అంటారు డాక్టర్ ప్రసన్న గెట్టు. గృహ హింస నిరోధం కోసం,
‘‘గృహ హింస మహిళల సమస్య మాత్రమే కాదు. దాని ప్రభావం సమాజంలోని అనేక స్థాయిల్లో ఉంటుంది. మహిళలు ధైర్యంగా ముందుకు వస్తేనే దీన్ని నిరోధించగలం’’ అంటారు డాక్టర్ ప్రసన్న గెట్టు. గృహ హింస నిరోధం కోసం, బాధితుల రక్షణ కోసం 23 ఏళ్ళ కిందట ఆమె ఏర్పాటుచేసిన సంస్థ... వేలాది మంది కన్నీళ్ళు తుడుస్తోంది, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది.
‘‘అత్తింట్లో ఆరళ్ళతో, భర్తల వేధింపులతో సతమతమయ్యే ఎందరో మహిళలను నేను బాల్యం నుంచి చాలా దగ్గరగా చూశాను. కనీసం వారి వేదన వినేవారు కూడా లేని దుస్థితి నాకు బాధ కలిగించింది. అలాంటివారికి మేమున్నామని ధైర్యం చెప్పే ఒక వ్యవస్థ మన సమాజంలో అవసరం. నేను చేస్తున్నది అటువంటి ప్రయత్నమే’’ అని చెబుతారు డాక్టర్ ప్రసన్న గెట్టు. చెన్నైకి చెందిన ఆమె సారథ్యంలో ఏర్పాటైన ‘ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ విక్టిమ్ కేర్’ (పిసివిసి) ఎన్నో వేలమంది గృహ హింస బాధితులకు అండగా నిలుస్తోంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక ఎంతో ఆలోచన ఉందంటారు ప్రసన్న. ‘‘అది 1998-99 మధ్య కాలం. నేను మద్రాసు విశ్వవిద్యాయంలో క్రిమినాలజీ విభాగంలో పిహెచ్‌డి చేస్తున్నాను. ఒక రోజు మా విభాగం అధిపతి నన్ను పిలిచారు. జపాన్‌లోని ‘టోకివా యూనివర్సిటీ’లో... విక్టిమాలజీలో డిప్లమా చేయడానికి ఎంపిక చేసిన ముగ్గురిలో నా పేరు కూడా ఉందని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే జపాన్ ప్రయాణానికి సిద్ధమయ్యాను. అక్కడ ‘వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ’లో ఆ కోర్సును అప్పుడే ప్రవేశపెట్టారు. మాదే మొదటి బ్యాచ్. ఆ కోర్సు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే క్రిమినాలజీలో భాగంగా అప్పటివరకూ నేరస్తులు, వారి మనస్తత్వాల గురించి మాత్రమే మేము చదువుకున్నాం. కానీ విక్టిమాలజీలో బాధితులు, వాళ్ళ సమస్యలు, వాటికి పరిష్కారాలు లాంటి అంశాలను కూడా అధ్యయనం చేసే అవకాశం కలిగింది’’ అంటారు ప్రసన్న.
ఏ సమయంలోనైనా...
క్షేత్రస్థాయి పరిశీలన కోసం జపాన్‌లో బాధిత సహాయ కేంద్రాలను కూడా తన తోటి విద్యార్థులతో పాటు ప్రసన్న సందర్శించారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. ‘‘వారు తమ గురించి చెబుతున్నప్పుడు మాకు కన్నీరు ఆగలేదు. వారి కోసం ఒక స్థిరమైన వ్యవస్థ ఉన్న దేశంలోనే ఇలా ఉంటే... ఇక మన దేశంలో పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న మమ్మల్ని వెంటాడింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత... చెన్నైలో బాధిత సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నాం. అలా 2001లో ‘పిసివిసి’ ప్రారంభమయింది’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. మొదట్లో బాధితుల కథలను వినడం, వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, న్యాయసహాయం చెయ్యడం లాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ సమస్య లోతులకు వెళ్ళే కొద్దీ చెయ్యాల్సింది చాలా ఉందని గ్రహించారు. గృహ హింస భరించలేక ఇంటినుంచి బయటకు వచ్చిన మహిళలకు, ఆపదలో ఉన్న స్త్రీలకు ఆశ్రయాన్ని కల్పించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం అమెరికా వెళ్ళి, అక్కడ షెల్టర్ హోమ్స్, కమ్యూనిటీ షెల్టర్లను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. అలాగే బాధితుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటుకు అవసరమైన శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ తరువాత ‘ధ్వని’ అనే హాట్‌లైన్‌ను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. అది రోజంతా పని చేస్తుంది. బాధితులెవరైనా, ఏ సమయంలోనైనా కాల్ చేసి, తమ సమస్యను వివరించవచ్చు. వారికి అవసరమైన సలహాలు ఇవ్వడానికి, ఆశ్రయపరమైన, న్యాయపరమైన, ఉపాధిపరమైన సాయాన్ని సూచించడానికి సామాజిక కార్యకర్తలు, మానసికవేత్తలతో కూడిన ఒక బృందం ఉంటుంది.
సంరక్షణ... ఉపాధి కల్పన...
మరోవైపు గృహహింస బాధితులకు అందించే సేవలను కూడా ‘పిసివిసి’ విస్తృతం చేసింది. బాధితులకు అత్యవసర సాయం అందించడానికి, దీర్ఘకాలికంగా పునరావాసం కల్పించడానికి తమిళనాడులో 11 కేంద్రాలను నడుపుతోంది. ఎవరైనా హాట్‌లైన్‌కు ఫోన్ చేసిన వెంటనే వారి వివరాలను వాలంటీర్లు నమోదు చేసుకుంటారు. దగ్గరలో ఉన్న కేంద్రానికి వివరాలు పంపిస్తారు. ‘‘మాకు రోజూ వందల కాల్స్ వస్తూ ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో పలు సంస్థలు మాతో కలిసి పని చేస్తున్నాయి. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే కాల్స్‌ను వాటికి ఫార్వర్డ్ చేస్తాం. మా దగ్గర ఆశ్రయం కోరేవాళ్ళు కూడా ఎక్కువే. వారి సంరక్షణకు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇక గృహ హింస బాధితుల్ని సమాజం చూసే తీరులో కూడా మార్పు రావాలి. హింసను ఏ రూపంలోనూ సహించకూడదు. అందరూ హుందాగా, గౌరవంగా బతకాలన్నదే నా ఆకాంక్ష’’ అంటున్నారు ప్రసన్న.
ఈ ధోరణి మారాలి
‘‘ఇల్లు అనేది ప్రేమను, సంరక్షణను అందించే ప్రదేశం అని మనం నమ్ముతాం. కానీ యాభై శాతానికి పైగా ఏదో రూపంలో గృహహింస జరుగుతోం దని జాతీయ రికార్డులు చెబుతున్నాయి. ఇది మహిళలపైనే కాదు, ఈ హింసను చూస్తూ పెరిగే పిల్లల మనస్తత్వాల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. పక్కింట్లో ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసినా... ‘అది వాళ్ళ గొడవ, మనకెందుకు’ అని చాలామంది పట్టించుకోరు. అధికారులకు ఫిర్యాదు చేసినా సర్దుకుపోవాలని సలహాలు ఇస్తారు. ఈ ధోరణి మారాలి’’ అంటారు ప్రసన్న. ఆ దిశగా చైతన్యం తేవడానికి, అవగాహన పెంచడానికి ‘పిసివిసి’ కృషి చేస్తోంది.