Share News

Sidhu Jonnalagaḍḍa : ప్రతి సినిమా... ఒక పాఠమే!

ABN , Publish Date - Mar 31 , 2024 | 05:36 AM

ప్రస్తుతం యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న యువనటుల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. సిద్ధు నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ తాజాగా విడుదలయి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో- సిద్ధు తన సినీ ప్రస్థానం గురించి ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూ...

Sidhu Jonnalagaḍḍa : ప్రతి సినిమా... ఒక పాఠమే!

ప్రస్తుతం యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న యువనటుల్లో

సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. సిద్ధు నటించిన ‘టిల్లు స్క్వేర్‌’ తాజాగా

విడుదలయి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో- సిద్ధు

తన సినీ ప్రస్థానం గురించి ‘నవ్య’కు ఇచ్చిన ఇంటర్వ్యూ...

‘డీజే టిల్లు’ ఎలా పుట్టాడు?

టిల్లు నా ఆలోచనలలో నుంచి పుట్టిన ఒక విభిన్నమైన పాత్ర. నా జీవితంలో నేను ఎప్పుడూ అతనిలాంటి వ్యక్తిని చూడలేదు. ‘డీజే టిల్లు’ను ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దాలనుకున్నాం. మేము ఊహించిన దాని కన్నా ఆ పాత్ర పెరిగింది. ఒక సంఘటనకు ఊహించని విధంగా రియాక్ట్‌ అవుతూ ఉంటాడు. ‘డీజే టిల్లు’ విజయంతో ‘టిల్లు స్క్వేర్‌’పై అంచనాలు మరింతగా పెరిగాయి.

మీరు నటుడే కాదు... రచయిత కూడా. మీరు సినిమాను ఎలా నిర్వచిస్తారు?

సినిమా అనేది ఒక ప్రక్రియ. అమీబాలా దాని షేపు మారిపోతూ ఉంటుంది. మొదటి పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఒక పరిణామక్రమం అనుకుంటే- మూల సూత్రం మాత్రమే మిగులుతుంది. కథలో మార్పులు వస్తాయి. స్ర్కీన్‌ప్లే మారుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెబుతాను. సినిమాతో పాటుగా మనం కూడా మారాలి. మన అభిప్రాయాలు మార్చుకోవాలి. అప్పుడే సినిమా విజయవంతమవుతుంది. కొన్నిసార్లు మనం ఊహించిన ఫలితాలు రావు. అప్పుడు ఎక్కువ నిరాశ చెందకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే- తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి.

మాట నెగ్గాలనే పట్టుదల ఎప్పుడూ ఉండదా?

నా కథ పట్ల నేను చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటా. దాని కోసం పోరాటం చేస్తాను. కానీ అదే సమయంలో అవతల వ్యక్తి వాదన నిజమనిపిస్తే - దాని వెనక పడను. నాకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఎడిటర్స్‌తో కూడా గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు నా వాదన నిజమయింది. కొన్నిసార్లు ఇతరుల వాదన నిజమయింది. ఇతరుల వాదన నిజమయినప్పుడు- దాన్ని అంగీకరించాలి.

సిద్ధు బాగా ఈజీ గోయింగా?

అందరితో బావుంటా. కానీ మూడ్‌ ప్రభావం ఉంటుంది. నేను చాలా ఎమోషనల్‌ వ్యక్తిని. సినిమా రంగానికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నా. ప్రతి సినిమా ఒక పాఠమే! దీన్ని చదివి అర్థం చేసుకుంటే జర్నీ సులభమవుతుంది. లేకపోతే ఇబ్బంది అవుతుంది.

‘డీజే టిల్లు’ ఈ తరం యువతకు ప్రాతినిధ్యం వహిస్తాడా?

టిల్లు స్ట్రీట్‌ స్మార్ట్‌. ఇప్పటి తరం వారందరూ అలా ఉంటారని కూడా అనలేం. నా ఉద్దేశంలో తరాలు మారుతున్నప్పుడు ఒరవడి కూడా మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు- మా అమ్మ స్మార్ట్‌ ఫోన్‌ వాడటం రాదంటే - ‘స్మార్ట్‌ ఫోన్‌ వాడటం ఎందుకు రాదు?’ అనిపించేది. ప్రస్తుతం తరం వాళ్లు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ) గురించి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి తెలుసుకోవటం ఎంత కష్టమో అర్థమవుతోంది. వాళ్లు ఎంత ఫాస్ట్‌గా ఉన్నారా? అనిపిస్తోంది.

ఈ మధ్యకాలంలో వస్తున్న హీరో పాత్రలు- పురుషాధిక్యతను ప్రదర్శిస్తున్నాయనే విమర్శ బాగా వినిపిస్తోంది.. ‘యానిమల్‌’ తర్వాత ఈ విమర్శలు మరింత పెరిగాయి.. మీరేమంటారు?

టిల్లు అలాంటి పాత్ర కాదు. కానీ మీరు ‘యానిమల్‌’ ప్రస్తావన తీసుకువచ్చారు కాబట్టి చెబుతున్నా. నాకు ‘యానిమల్‌’ బాగా నచ్చింది. దానిలో హీరో పాత్రను- అతని చిన్నతనంలో పడిన వేదన కోణం నుంచి చూడాలి. నా ఉద్దేశంలో సినిమా నైతిక బాధ్యతలను పెంపొందించే ఒక సాధనం కాదు. సొసైటీని సరిదిద్దాల్సిన బాధ్యత దానికి లేదు. సినిమా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే! సినిమాలో హీరో పాత్ర నచ్చకపోతే వాడిని హీరో అనుకోవద్దు. నచ్చిన విధంగా నిర్వచించుకొనే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. బందిపోటు సినిమా చూసి నేను బందిపోటు అయిపోలేదు. గ్యాంగస్టర్‌ సినిమా చూసి గ్యాంగస్టర్‌ అయిపోలేదు. సినిమా చూశాను. ఎంటర్‌టైన్‌ అయ్యాను. ఇంటికి వచ్చేసి నా పని నేను చేసుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువగా నేను ఆలోచించను.

కానీ సినిమాల ప్రభావం ఉంటుంది కదా...

తప్పనిసరిగా ఉంటుంది. దాని కోసమే సెన్సార్‌ ఉంది. దానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. ఏ వయస్సు వారు ఎలాంటి సినిమాలు చూడాలో ఆ విధివిధానాలు చెబుతాయి.. కానీ ఆ విధివిధానాలను ఎవరు పాటించరు కదా... చట్టం ఉంది. నేరాలు జరగకూడదఅనుకుంటే కుదరదు. ప్రపంచంలో ఆ విధంగా పనులు జరగవు.

సినిమాల విజయం సాధించటం మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది?

మార్పు తప్పనిసరిగా ఉంటుంది. ఆర్థికంగా బలపడతాం. గతంలో కొనలేనివి కొంటాం. కొత్త మనుషులను కలుస్తాం. వాళ్ల వల్ల కొత్త కోణాలు తెలుస్తాయి. కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మనం పైకి వెళ్లాలంటే ఏం చేయాలో అర్థమవుతుంది. నా ఉద్దేశంలో గొప్పవారిగా ఎదగటానికీ, డబ్బుకూ సంబంధం లేదు. గొప్పతనమనేది మైండ్‌సెట్‌కు సంబంధించిన విషయం. దానికి డబ్బులకు మధ్య ఎటువంటి సంబంధం లేదు.

మీకు స్నేహితులు ఎక్కువేనా? పార్టీలకు వెళ్తూ ఉంటారా?

పార్టీలకు వెళ్తా. ఈ మధ్యకాలంలో తగ్గించా. బయటకు వెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల స్నేహితులను ఇంటికే పిలుస్తున్నా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సహజంగా నాకు బయటకు వెళ్లటం అంత ఇష్టం ఉండదు. ఇంట్లో వంద మంది ఉన్నా- బానే ఉంటుంది. కానీ బయటకు వెళ్లినప్పుడు- ఇంటికి వెళ్లిపోవాలనిపిస్తుంది. నన్ను కలవటం, మాట్లాడటం చాలా ఈజీ! కానీ నేను కొద్దిమందితోనే కనెక్ట్‌ అవుతా!

బెస్ట్‌ కాంప్లిమెంట్‌...

తారక్‌ అన్న ఒక ఇంటర్వ్యూలో - ‘‘డీజే టిల్లూలో సిద్ధు జొన్నలగడ్డ ఇంటెన్సిటీ, ఫెరాఫార్మెన్స్‌ చాలా బావుంది. టీవీలో నుంచి బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది..’’ అన్నారు. ఇప్పటివరకూ నాకు వచ్చిన వాటిలో ఇది గొప్ప కాంప్లిమెంట్‌.


చిరంజీవి సూపర్‌ హ్యుమన్‌...

నాకు వెంకటే్‌షగారు ఆల్‌టైఫ్‌ ఫేవరెట్‌. నాపై ఆయన ప్రభావం చాలా ఉంది. నాకు అమితాబ్‌గారు, చిరంజీవిగారు, రజనీకాంత్‌గారు, బాలకృష్ణగారు- ఇలా అందరితోనూ కలిసి పని చేయాలని ఉంది. నేను చిరంజీవిగారు కలిసి ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. మేము ఎప్పుడైనా కలిస్తే ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవిగారు ఒక సూపర్‌ హ్యుమన్‌. తెలుగు ఇండస్ట్రీ అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఆయన పేరే! మా చిన్నప్పడు- చిరంజీవిగారు, బాలకృష్ణ గారు ఆకాశంలో తారల్లా కనిపించేవారు. అలాంటి తారతో కలిసి నటించే అవకాశం వస్తే - అది బెస్ట్‌ ప్రాజెక్ట్‌ అవ్వాలి. అవుటాఫ్‌ వరల్డ్‌ ఉండాలి. నా పిల్లలకు- ‘‘నేను చిరంజీవిగారితో పనిచేశాను’’ అని గర్వంగా చెప్పుకోవాలి. అది నా జీవితంలో ఒక మైల్‌స్టోన్‌గా మిగిలిపోతుంది. దేవుడి దయ ఉంటే ఏదో ఒక రోజు నాకు ఆ అవకాశం వస్తుంది. ఎవరో ఒక డైరక్టర్‌ ఒక కథ చెప్పి, అది ఆయనకు నచ్చి, ఆయన అంగీకరించే రోజు వస్తుంది. ఆయన స్టార్‌డమ్‌కి తగినట్లు తీయటం అంత సులభమైన విషయం కాదు. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా!

సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Mar 31 , 2024 | 11:01 AM