రోజుకో ప్రత్యేకత
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:02 AM
దీపావళిని అయిదు రోజుల పాటు జరుపుకొనే ఆనవాయితీ... ప్రధానం గా ఉత్తర భారతదేశంలో ఉంది. వీటిలో ప్రతి రోజూకూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాలు ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ఆరంభం అవుతాయి. ఆ రోజును ‘ధన త్రయోదశి’ అంటారు.

దీపావళిని అయిదు రోజుల పాటు జరుపుకొనే ఆనవాయితీ... ప్రధానం గా ఉత్తర భారతదేశంలో ఉంది. వీటిలో ప్రతి రోజూకూ ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాలు ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ఆరంభం అవుతాయి. ఆ రోజును ‘ధన త్రయోదశి’ అంటారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధించారు. ఆ సాగర మధనంలో... ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మీ దేవి ఉద్భవించింది. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆయుర్దాయాన్ని కోరుతూ యముణ్ణీ, ఆరోగ్యాన్ని కోరుకుంటూ ధన్వంతరిని పూజిస్తారు. రెండో రోజైన ఆశ్వయుజ బహుళ చతుతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటారు. లోక కంటకుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన రోజు ఇది. ఈ రోజున నరకాసురుడి బొమ్మలను దహనం చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. నరక చతుర్దశి రోజున వెలిగించే దీపాలు పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాయని పలు గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆ తదుపరి రోజు.. ఆశ్వయుజ అమావాస్యను ‘దీపావళి’గా ఆసేతు హిమాచలం ప్రజలు జరుపుకొంటారు. ఈ రోజున లక్ష్మీపూజ ప్రధానం. లక్ష్మీదేవి దీపం రూపంలో ఉంటుందనీ, కాబట్టి దీపావళి నాడు దీపాలతో అలంకరించిన ఇళ్ళలో లక్ష్మీదేవి కొలువుతీరుతుందనీ భక్తుల విశ్వాసం. లక్ష్మీదేవిని పూజించిన తరువాత... పెద్దలూ పిన్నలు బాణాసంచా కాలుస్తారు. నాలుగో రోజైన కార్తిక శుద్ధ పాడ్యమిని ‘బలి పాడ్యమి’ అంటారు.
బలి చక్రవర్తిని వామనావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు పాతాళంలోకి అణగదొక్కాడు. ప్రతి ఏడాది ఈ రోజున... తను పాలించిన భూలోకానికి వచ్చి, ప్రజల యోగక్షేమాలను పరిశీలించడానికి అనుమతించాలని బలి చక్రవర్తి కోరాడు. మహావిష్ణువు ఆ వరాన్ని అనుగ్రహించాడు. బలి భూలోకానికి తిరిగి వచ్చే రోజు కాబట్టి దీనికి ‘బలి పాడ్యమి’ అనే పేరు వచ్చింది. చిత్రగుప్తుడి జయంతితోపాటు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరి ఎత్తిన రోజు కూడా ఇదే. దానికి చిహ్నంగా కొన్ని ప్రాంతాల్లో గోవర్ధన పూజ జరుపుతారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గోవర్ధన గిరి పరిక్రమ నిర్వహిస్తారు. అయిదోరోజైన కార్తిక శుద్ధ విదియను ‘యమద్వితీయ’, ‘యమ విదియ’, ‘భాతృవిదియ’ అంటారు. యమ ధర్మరాజును ఆయ సోదరి యమున ఈ రోజున తన ఇంటికి ఆహ్వానించి, విందు భోజనం పెట్టిందనీ, సోదరీమణుల ఇంటిలో భోజనం చేసిన వారికి నరక బాధ ఉండదని, వారు అపమృత్యువు బారిన పడరనీ యముడు వరం ఇచ్చాడనీ పురాణ కథలు పేర్కొంటాయి. ‘భాయ్ దూజ్’గా ఉత్తరాదిన దీన్ని పిలుస్తారు. ‘భగీని హస్తభోజనం’గానూ వ్యవహరిస్తారు.