కపుల్స్ ప్రతీది షేర్ చేసుకోవాలి!
ABN , Publish Date - Oct 20 , 2024 | 05:59 AM
నలభై ఐదేళ్ల వయసులోనూ యంగ్‌హీరోయిన్లతో పోటీపడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు విద్యాబాలన్. ఎప్పుడూ చీరకట్టులో కనిపించే విద్యాబాలన్ వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపును సాధించారు.
నలభై ఐదేళ్ల వయసులోనూ యంగ్‌హీరోయిన్లతో పోటీపడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు విద్యాబాలన్. ఎప్పుడూ చీరకట్టులో కనిపించే విద్యాబాలన్ వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపును సాధించారు. వైవాహికజీవితం సంతోషంగా ఉందంటున్న విద్యాబాలన్ గురించి మరికొన్ని విశేషాలు ఇవి...
‘పరిణీత’ సినిమాతో 2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విద్యాబాలన్ ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘‘నా 24 ఏళ్ల వయసులో ‘పరిణీత’ అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఏదో సాధించాలనే బలమైన కోరిక ఉండేది. ఇప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నానో అనిపిస్తుంది. సినిమా రంగంతో సంబంధం లేకుండా వచ్చిన ఒక అమ్మాయి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. నేనేమీ సినిమాలు చూస్తూ పెరగలేదు. మాది మధ్యతరగతి సంప్రదాయ కుటుంబం’’ అని అంటారు విద్యాబాలన్. సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌ని పెళ్లి చేసుకున్న విద్యాబాలన్ అద్దె ఇంట్లో నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అయితే దీనికి ఒక కారణం ఉందంటారామె. ‘‘ఒక మంచి ఇల్లు చూసి తీసుకుందామని చాలా వెతికాం. దాదాపు 25 ఇళ్లు చూశాం. కానీ నచ్చలేదు. ఒకే ఒక్క ఇల్లు నచ్చింది.
అది అద్దెకు మాత్రమే ఇస్తామన్నారు. అన్ని రకాలుగా నచ్చడంతో అద్దె అయినా ఫర్వాలేదని దిగిపోయాం. అద్దె ఇళ్లలో ఉండను అని నేను చాలా సార్లు చెప్పాను. కానీ ఈ ఇల్లు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందుకే తప్పలేదు. గార్డెన్, సీ వ్యూ...వంటి నాకు నచ్చినవి ఎన్నో ఉన్నాయి’’ అని కారణాన్ని పంచుకుంటారు విద్యాబాలన్.
పని మాత్రమే సీరియస్
విద్యాబాలన్ చిత్రాలను చూసిన వారెవరైనా సీరియస్ నటి అనుకుంటారు. కానీ ఆమె చాలా సరదాగా ఉంటారు. వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాల ఎంపిక వల్ల ఆ ముద్ర పడిపోయింది. ‘‘నిజానికి నేను సీరియస్ పర్సన్‌ని కాను. నా పనిని మాత్రమే సీరియ్‌సగా చేస్తాను. వుమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో సీరియస్ టోన్ ఉంటుంది. నేను అలాంటి రోల్స్‌ని ఎక్కువ చేయడంతో సీరియస్ నటి అన్న ముద్ర పడిపోయింది’’ అని అంటారు విద్యాబాలన్.
చీర నా ఫేవరేట్
విద్యాబాలన్ ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తారు. చీరలను అమితంగా ఇష్టపడటం వెనక కారణం ఏమైనా ఉందా అంటే నా దృష్టిలో సెక్సీయెస్ట్ గార్మెంట్ శారీనే అంటారు. ‘‘మీరు గుడికి వెళుతున్నట్టయితే చీరను ఒక రకంగా ధరించవచ్చు. అదే పార్టీకి వెళుతున్నట్లయితే అదే చీరను ఇంకో స్టయిల్‌లో కట్టుకోవచ్చు. ఒకవేళ మీ వర్క్‌ప్లే్‌సకు వెళుతుంటే మరోరకంగా ధరించవచ్చు. నా దృష్టిలో వెర్సటైల్ గార్మెంట్ ఇది. అందుకే నాకు చీరలు ధరించడమంటే ఇష్టం’’ అని అంటారు విద్యాబాలన్.
వైవాహిక జీవితం..
సినిమా రంగానికే చెందిన సిద్ధార్థ్‌రాయ్ కపూర్‌ని వివాహం చేసుకున్నారు విద్యాబాలన్. పెళ్లయిన తరువాత కూడా సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారామె. ‘‘పెళ్లి అనేది ఇద్ధరి మధ్య ముడిపడిన బంధం. అందులో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదు. భార్యాభర్తల బంధం బాగుండాలంటే కమ్యునికేషన్, షేరింగ్ చాలా ముఖ్యం. భార్యాభర్తల మనసులో ఏముందో మూడో వ్యక్తి తెలుసుకోలేరు. ఒకరి గురించి మరొకరు ఏమనుకుంటున్నారో మూడో వ్యక్తి ఎలా కనుక్కుంటాడు. ప్రతీ జంట ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారన్నది నా నమ్మకం. అయితే నా దృష్టిలో ఇద్దరూ ఓపెన్‌గా మాట్లాడుకుంటే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నేను, సిద్ధార్థ్ ప్రతీదీ చర్చించుకుంటాం. ఒకవేళ ఒకరికి కోపం వచ్చినా, ప్రేమ కలిగినా నిజాయితీగా దాన్ని వ్యక్తపరుస్తాం. అది చాలా ముఖ్యం. ప్రతీదీ షేర్ చేసుకోవడం కపుల్స్‌కి చాలా అవసరం. ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ కలిసి కొంత టైం స్పెండ్ చేయడం కూడా ముఖ్యమే. సంతోషంగా ఎలా జీవించాలో సిద్ధార్థ్‌కు బాగా తెలుసు. నాకు అది తెలియదు. నేను చాలా డిసిప్లిన్‌గా ఉంటాను. జీవితాన్ని ఎలా చేయాలో, ఎలా రిలాక్స్ కావాలో తనే నేర్పించాడు. ఇద్దరం కలిసి ట్రావెల్ చేయడాన్ని ఇష్టపడతాం’’ అని అంటారు విద్యాబాలన్. ఆమె నటించిన రోమాంటిక్ కామెడీ చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయింది.
షూటింగ్ లేకపోతే వీలైనంత వరకు ఇంటికే పరిమితమవుతాను. కుటుంబసభ్యులతో గడపడానికి ఇష్టపడతాను. ఎక్కువగా నిద్రపోతాను. పుస్తకాలు చదువుతాను. సినిమాలు చూస్తాను. రిలాక్స్ అవుతాను. సోషల్ మీడియాలో వచ్చే అన్నిపోస్టులను చదవను. నేనేదైనా పోస్టు చేయాలనకుంటే నా సోషల్ మీడియా టీమ్ ఆ పనిచేసి పెడుతుంది. ఇన్‌స్టాలో ఫొటోలు చూస్తుంటాను. కామిక్ రీల్స్ అంటే ఇష్టం.