Share News

కేన్సర్‌ను జయించిన విజేతలు

ABN , Publish Date - Mar 27 , 2024 | 05:31 AM

మార్చి 22న కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌... కేట్‌ మిడిల్‌టన్‌ తనకు కేన్సర్‌ సోకినట్టు వీడియో పోస్ట్‌ చేయడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కేన్సర్‌ వ్యాధికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదని మరోసారి రుజువైంది.

కేన్సర్‌ను జయించిన విజేతలు

మార్చి 22న కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌... కేట్‌ మిడిల్‌టన్‌ తనకు కేన్సర్‌ సోకినట్టు వీడియో పోస్ట్‌ చేయడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కేన్సర్‌ వ్యాధికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదని మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా ఆ వ్యాధి మీద విజయం సాధించిన భారతీయ తారలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

‘‘గత రెండు నెలలుగా మా కుటుంబం మొత్తం గడ్డు రోజులను గడిపింది. అయితే అదృష్టవశాత్తూ, నా దగ్గరొక అద్భుతమైన వైద్య బృందం ఉంది. నా ఆరోగ్యం పట్ల కనబరిచిన శ్రద్ధకు వాళ్లకు నేనెంతో రుణపడి ఉంటాను. జనవరిలో లండన్‌లో నాకు పొత్తికడుపు ఆపరేషన్‌ జరిగింది. ఆ సమయంలో నాకున్న ఆరోగ్య సమస్యకూ కేన్సర్‌కూ సంబంధం లేదని వైద్యులు భావించారు. ఆ సర్జరీ విజయవంతమైంది. అయితే ఆపరేషన్‌ తర్వాత చేపట్టిన పరీక్షల్లో నాకు కేన్సర్‌ ఉందని తేలింది. దాంతో వైద్య బృందం నాకు ప్రివెంటివ్‌ కీమోథెరపీని సూచించింది. ప్రస్తుతం నేను చికిత్స ప్రథమ దశలో ఉన్నాను’’ అంటూ ఇన్‌స్టా వీడియోలో వివరరించింది కేట్‌ మిడిల్‌టన్‌. 2024లోకి అడుగుపెట్టిన మూడు నెలల్లోపే రాయల్‌ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సభ్యులు కేన్సర్‌ బారిన పడ్డారు. ఇంగ్లండ్‌ రాజు మూడవ ఛార్లె్‌సకు కేన్సర్‌ సోకినట్టు బకింగ్‌హ్యామ్‌ ప్యాలెస్‌ ఫిబ్రవరి ఐదున ప్రకటించింది. అంతకు ముందు డచెస్‌ ఆఫ్‌ యార్క్‌, శారా ఫెర్గుసన్‌కు చర్మ కేన్సర్‌ సోకింది. ఈ ఏడాదిలో ఆవిడకు సోకిన రెండవ కేన్సర్‌ ఇది.

సోనాలి బింద్రే

2018లో బాలీవుడ్‌ తార సోనాలి బింద్రేకు స్టేజ్‌4 మెటాస్టాటిక్‌ కేన్సర్‌ నిర్థారణ అయింది. ఆవిడ బ్రతికే అవకాశాలు కేవలం 30 శాతమే ఉన్నాయని కూడా వైద్యులు తేల్చేశారు. అయినా ఆ తార ఏమాత్రం కుంగిపోకుండా, థెరపీ సాగినంత కాలం తన ఫొటోలను షేర్‌ చేస్తూ ఉల్లాసంగా కనిపించింది. ప్రపంచ కేన్సర్‌ దినం సందర్భంగా మాట్లాడుతూ.... ‘‘కేన్సర్‌ ప్రయాణం కష్టతరమైనదే! అయితే ఆశావహ ధృక్పథంతో ఆ వ్యాధితో పోరాడి, విజయం సాధించాలి’’ అంటూ కేన్సర్‌ రోగులను ప్రేరేపించింది. కేన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్న సోనాలి, చికిత్స కొనసాగినంత కాలం అంతులేని మనోధైర్యాన్ని ప్రదర్శించడం విశేషం.

మనీషా కొయిరాలా

‘‘కేన్సర్‌ అనేది డెత్‌ సెంటెన్స్‌ కాదు’’. 2012లో నాల్గవ దశ ఒవేరియన్‌ కేన్సర్‌ నిర్థారణ అయిన భారతీయ అగ్ర సినీ తార మనీషా కొయిరాలా మాటలివి. వ్యాధి నిర్థారణ అయిన వెంటనే అమెరికాలోని న్యూయార్క్‌ హాస్పిటల్‌లో ఏడాది పాటు చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నప్పటికీ ఆరేళ్ల పాటు వెండి తెరకు దూరంగా ఉండిపోయింది మనీషా. ఆ తర్వాత ‘‘హీల్‌డ్‌: హౌ కేన్సర్‌ గేవ్‌ మి ఎ న్యూ లైఫ్‌’’ అనే ఆటొబయాగ్రఫీ పుస్తకాన్ని రాసి, దాన్లో తన కేన్సర్‌ ప్రయాణాన్ని వివరించిందామె. కేన్సర్‌ నుంచి పూర్తిగా బయటపడిన మనీషా, భారతదేశంలో స్థానికంగా తయారైన మొట్టమొదటి సర్వైకల్‌ వ్యాక్సీన్‌ను లాంచ్‌ చేసిన సందర్భంగా ప్రసంగిస్తూ ‘ఇదెంత క్లిష్టమైన ప్రయాణమో నాకు తెలుసు. కానీ మీరు అంతకు మించిన క్లిష్టమైన వ్యక్తులు’’ అని చెప్పి, కేన్సర్‌ రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది.

లీసా రే

బొంబే డైయింగ్‌ మోడల్‌ లీసా రేకు అరుదైన, ప్రాణాంతకమైన మల్టిపుల్‌ మైలోమా అనే రక్త కేన్సర్‌ సోకింది. నాలుగు నెలల పాటు కీమో థెరపీ తీసుకున్న తర్వాత, మూల కణ మార్పిడి కూడా చేయించుకుందామె. ‘క్లోజ్‌ టు బోన్‌’ అనే తన ఆటోగ్రఫీలో ఆ వ్యాధి మీద తాను సాగించిన విజయవంతమైన పోరాటం గురించి వివరించిందామె. ది ఎల్లో డైరీస్‌ అనే తన వ్యక్తిగత బ్లాగ్‌లో మల్టిపుల్‌ మైలోమా అనుభవాల్ని స్పష్టంగా వివరించిందామె. కేన్సర్‌ నుంచి తాను పూర్తిగా కోలుకోవడానికి పోషకాహారంతో పాటు, ఆయుర్వేదం, ధ్యానం, కౌన్సెలింగ్‌లు ఎలా తోడ్పడ్డాయో కూడా బ్లాగ్‌లో వివరించింది లీసా రే!

తాహిరా కాశ్య్‌ప

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా సతీమణి తాహిరా కాశ్యప్‌ రొమ్ము కేన్సర్‌తో పోరాడిందనే విషయం అందరికీ తెలిసిందే! ఆవిడెప్పుడూ తన వ్యాధి గురించి దాచలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రేరణ పొందేలా తన కేన్సర్‌ ప్రయాణాన్ని డాక్యుమెంట్‌ చేసింది. 2019 జనవరిలో కేన్సర్‌ చికిత్సను ముగించుకున్న తాహిరా ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందింది. కీమోథెరపీ చికిత్స ప్రభావంతో తల వెంట్రుకలు రాలిపోయినప్పటికీ, ఏమాత్రం వెరవకుండా ఫొటోలు షేర్‌ చేసిన తాహిరా, తనకు కేన్సర్‌ సోకినప్పటి నుంచి, ఎర్లీ డిటెక్షన్‌ గురించి మహిళల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Updated Date - Mar 27 , 2024 | 05:31 AM