బాలీవుడ్ టాక్... హీరోల ట్రాక్?
ABN , Publish Date - Mar 17 , 2024 | 06:01 AM
పరిశ్రమ ఏదైనా, అగ్రహీరోల సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తమ అభిమాన హీరో చేయబోయే కొత్త సినిమా విశేషాల కోసం ప్రేక్షకలోకం ఎదురుచూడడం సహజమే. ఇక బాలీవుడ్ హీరోల సినిమాలంటే ఆ క్రేజే వేరు.
పరిశ్రమ ఏదైనా, అగ్రహీరోల సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
తమ అభిమాన హీరో చేయబోయే కొత్త సినిమా విశేషాల కోసం ప్రేక్షకలోకం
ఎదురుచూడడం సహజమే. ఇక బాలీవుడ్ హీరోల సినిమాలంటే ఆ క్రేజే వేరు.
త్వరలోనే హిందీ హీరోలు కొత్త ప్రాజెక్ట్‌లతో అభిమానులను ఖుషీ
చేయబోతున్నారంటూ బాలీవుడ్ పరిశ్రమలో వినిపిస్తున్న సినిమాలు ఇవే.
అంతకు మించిన హిట్ కోసం గతేడాది మూడు చిత్రాలతో అభిమానుల ముందుకొచ్చారు షారూఖ్‌ఖాన్. ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో బాక్సాఫీసు దగ్గర సందడి చేశారాయన. ఆ రెండు చిత్రాలు రూ. వెయ్యికోట్ల పైబడి వసూళ్లను సాధించాయి. అలాగే షారూఖ్ ముఖ్య భూమిక పోషించిన ‘ఢంకీ’ చిత్రం కూడా ఫర్వాలేదనిపించుకుంది. అయితే ఆయన నటించబోయే కొత్త సినిమా ఇప్పటివరకూ ఖరారు కాలేదు. తర్వాత ప్రాజెక్ట్ కూడా గొప్ప స్థాయిలో ఉండాలనే ఆలోచనతో కథల ఎంపికలో షారూఖ్ జాగ్రత్తగా ఉన్నారట. ప్రస్తుతం రెండు మూడు స్ర్కిప్ట్‌లపైన ఆయన దృష్టి సారించారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వసూళ్లలో రికార్డులు సృష్టించిన ‘పఠాన్’ చిత్రానికి కొనసాగింపు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఆదిత్య చోప్రా ఇప్పటికే కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. స్పై యాక్షన్ జానర్‌లో ఈ చిత్రం రానుంది. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళే ్ల అవకాశముందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
అలాగే ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న యశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’లోనూ షారూఖ్ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం చిత్రబృందం షారూఖ్‌ను సంప్రదించారట. ఆయనకు కూడా కథ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు అంగీకరించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ‘ఇన్షా అల్లా’ చిత్రం కోసం షారూఖ్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి కదలికా రాలేదు.
కొత్త తరహా పాత్రలో రణ్‌బీర్..
దర్శకుడు నితీశ్ తివారి రామాయణం ఆధారంగా ఓ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తున్నారు. కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. శ్రీరామ నవమి సందర్భంగా వచ్చే నెల 17న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. అయితే ఈ చిత్రం తర్వాత రణ్‌బీర్‌కపూర్ ఓ క్రీడా నేపథ్య చిత్రం చేయబోతున్నట్లు టాక్.
కబడ్డీ ఆట నేపథ్యంలో సాగే కథతో కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఛత్రపతిగా షాహిద్?
ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు అమిత్‌రాయ్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్‌కపూర్ భాగమవనున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ‘దేవా’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు షాహిద్ కపూర్. శివాజీ మహారాజ్ పాత్రను పోషించేందుకు ఆయన ఉత్సాహం చూపుతున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
ఈసారి హీరోగా
కొన్నాళ్లుగా తన పంథా మార్చి విలన్ పాత్రలతో అలరిస్తున్నారు సైఫ్ అలీఖాన్. త్వరలోనే ఆయన హీరోగా ఓ చిత్రం తెరకెక్కునుందని బాలీవుడ్ సమాచారం. ఓ బిడ్డకు తండ్రి అయిన గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఉడ్తా పంజాబ్’ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన అభిషేక్ చౌబే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
గూఢచారిగా రణ్‌వీర్
ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్ ‘సింగమ్ ఎగైన్’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు రణ్‌వీర్‌సింగ్. ఆ తర్వాత ఆయన ‘డాన్ 3’, ‘శక్తిమాన్’ చిత్రాలను మొదలుపెట్టాల్సి ఉంది. వీటితో పాటు మరో కొత్త ప్రాజెక్ట్‌కు రణ్‌బీర్ ‘ఎస్’ చెప్పినట్లు తెలుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఆదిత్యాథార్ దర్శకత్వం వహించనున్నారు. ‘యురి’ లాంటి సూపర్‌హిట్ చిత్రం ఆయన ఖాతాలో ఉంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘బైజు బర్వా’ అనే చిత్రాన్ని రణ్‌వీర్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తుడు. ఇప్పుడాయన మరో ప్రణయగాథను వెండితెరపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్, విక్కీ కౌశల్‌ను హీరోలుగా అనుకుంటున్నారట. ఈ ముక్కోణపు ప్రేమకథలో అలియాభట్ హీరోయిన్ గా నటించనున్నారట. నవంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు భన్సాలీ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.
మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. అయితే ఇందులో గంగూలీ పాత్రను పోషించే హీరో ఎవరనేది ఇంకా ఖాయం కాలేదు. ఈ పాత్ర కోసం రణ్‌బీర్‌కపూర్, హృతిక్ రోషన్, ఆయుష్మాన్ ఖురానా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సాజిద్ ఇటీవలే రజనీకాంత్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన నటించబోయేది గంగూలీ బయోపిక్‌లోనే అనే టాక్ పరిశ్రమలో వినిపిస్తోంది. అదే నిజమైతే మరి రజనీకాంత్ ఈ బయోపిక్‌లో ఏ పాత్రలో కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. అలాగే గంగూలీ బయోపిక్‌కు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.