Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

అందం అంటే ఆత్మవిశ్వాసం

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:50 AM

అందం అంటే ఆత్మవిశ్వాసం. ఇదీ నా నమ్మకం’’ అంటున్న థెర్సియా అవరోధాలెన్నిటినో అధిగమించి..

అందం అంటే ఆత్మవిశ్వాసం

మోడల్‌ కావాలి, ర్యాంప్‌ మీద నడవాలి...

ఇది థ్రేసియా స్టెల్లా జీవితాశయం.

కానీ నల్లగా, సన్నగా ఉండే ఆమెకు వెక్కిరింతలు,

ఈసడింపులు, బాడీ షేమింగ్‌... నిత్యానుభవాలు.

‘‘అందం అంటే ఆత్మవిశ్వాసం. ఇదీ నా నమ్మకం’’ అంటున్న థెర్సియా అవరోధాలెన్నిటినో అధిగమించి... ఇటీవలి ‘గోల్డెన్‌ ఫేస్‌ ఆఫ్‌ సౌతిండియా’ పోటీలో రన్నర్‌పగా లిచారు. తన లక్ష్యం దిశగా బలమైన అడుగు వేసిన థ్రేసియా కథ ఆమె మాటల్లోనే...

‘‘అవి ‘గోల్డెన్‌ ఫేస్‌ ఆఫ్‌ సౌతిండియా - 2024 ఫైనల్స్‌. నాతో సహా 29 మంది పోటీ పడుతున్నాం. మొదటి రౌండ్‌లో... సంప్రదాయ దుస్తులతో స్వీయ పరిచయం చేసుకోవాలి. తరువాత ప్రశ్నోత్తరాల రౌండ్‌ ఉంటుంది. నన్ను ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్స్‌ గురించి ప్రశ్న అడిగారు. నేను సమాధానం ఇచ్చాక... కాసేపటి వరకూ చప్పట్లు ఆగలేదు. స్టేజ్‌ దిగి వస్తున్నాను. న్యాయనిర్ణేతలుగా ఉన్న అమీ జాక్సన్‌, శ్రియా శరణ్‌ పక్క నుంచి నేను వెళ్తూండగా... ‘‘షీ ఈజ్‌ అమేజింగ్‌’’ అని వారు అనడం వినిపించింది. నా ఒళ్ళు జలదరించింది. ‘ఈ పోటీలో గెలుస్తానో లేదో నాకు అనవసరం. ఈ సెలబ్రిటీలకు నేను నచ్చాను. ఇది చాలు’ అనుకున్నాను. కొంతసేపటికి విజేతలను ప్రకటిస్తూ... నేను రన్నరప్‌ అని చెప్పినప్పుడు... కన్నీరు ఆగలేదు. అంత భావోద్వేగాన్ని నా జీవితంలో ఎన్నడూ అనుభవించలేదు. నా మొత్తం జీవిత ప్రయాణం ఒక్కసారిగా ఆ క్షణంలో కళ్ళ ముందు మెదిలింది.

చదువు మానేద్దామనుకున్నాను...

నేను పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లాలోని పుల్లువిలా. మాది ఆర్థికంగానూ, సామాజికంగానూ వెనుకబడిన మత్స్యకార కుటుంబం. నాకు ఊహ తెలిసిన్పటి నుంచీ ఈసడింపులు, వెక్కిరింతలు ఎదురవని రోజు లేదు. కారణం... నేను బాగా నల్లగా, సన్నగా ఉండడం. తరగతి గదిలో, వీధిలో ఎవరూ నా పేరు పెట్టి పిలిచేవారు కాదు. నాతో కలిసేవాళ్ళు కాదు. హైస్కూల్లో, కాలేజీలో చదువుతున్నప్పుడు తీవ్రమైన బాడీషేమింగ్‌కు గురయ్యాను. అందరూ నన్ను వెలివేసినట్టు చూసేవారు. నేను ఏడ్చేదాన్ని. ఇంటికి వచ్చి అమ్మతో చెప్పేదాన్ని. చదువు మానేద్దామని ఎన్నో సార్లు అనుకున్నాను. ‘‘నువ్వు నీ గురించి, నీ జీవితం గురించి ఆలోచించు. ఎవరో ఏదో అన్నారని... ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటే... కుంగిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు’’ అని మా అమ్మ నచ్చజెప్పేది. ప్రతి ఒక్కరూ వెలి వేస్తున్న చోట నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి? కష్టపడి చదివేదాన్ని. స్కూల్లో, కాలేజీలో ఫస్ట్‌ ర్యాంకర్ని. మరోవైపు సాంస్కృతిక పోటీల్లో, ఆటల పోటీల్లో ప్రతిసారీ నాకు ప్రైజ్‌ రావాల్సిందే. అందరూ నాలో చూస్తున్న ‘రంగు’ అనే (వారి దృష్టిలో) లోపాన్ని నా ప్రతిభతో అధిగమించడానికి ప్రయత్నించేదాన్ని. అయితే నాకూ, మా అమ్మకూ మాత్రమే తెలిసిన సంగతి ఒకటుంది. నేను బాల్యం నుంచి కలలుగన్న ప్రొఫెషన్‌ మోడలింగ్‌. టీవీలో ఫ్యాషన్‌ షోలు చూస్తూ దాని మీద ఆసక్తి పెంచుకున్నాను. ర్యాంప్‌ మీద నడిచే మోడల్స్‌ ను చూసి... వారిని అనుకరించడానికి ప్రయత్నించేదాన్ని.

మన చిన్ననాటి అభిరుచులు పెరిగి పెద్దయ్యాక మారిపోతూ ఉంటాయి. కానీ నా విషయంలో అలా కాదు. మోడలింగ్‌ మీద నా ఇష్టం నానాటికీ బలపడుతూ వచ్చింది. అయితే మా ఇంట్లో నేను మోడల్‌ కావడం ఏమాత్రం ఇష్టం లేదు. మోడలింగ్‌ అంటే వాళ్ళ దృష్టిలో పొట్టిపొట్టి దుస్తులు వేసుకోవడం. ఆ భావన తప్పని ఎన్నిసార్లు వివరించినా వాళ్ళ ధోరణిలో మార్పు రాలేదు. అలాగే ఈ సమాజంలో తెల్లటి రంగు లేదా డబ్బు ఉన్నవాళ్ళకే మర్యాద అనేది నా అనుభవం. కాబట్టి నా దృష్టంతా చదువుమీదే కేంద్రీకరించాను. ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ఒక మెడికల్‌ కంపెనీలో చేరాను. కానీ నా ఆలోచనలన్నీ మోడలింగ్‌పైనే. చిన్న చిన్న మోడల్‌ ఏజెన్సీలను సంప్రతించేదాన్ని. ఫొటోషూట్స్‌ కోసం ప్రయత్నించేదాన్ని. ఉద్యోగం చేసే చోట... నా రంగు వల్ల చేదు అనుభవాలు ఎదురుకాలేదని చెప్పను కానీ... చాలా తక్కువ. ఆర్థిక స్థాయి, రంగు లాంటి వాటికన్నా సామర్థ్యానికి విలువ ఇచ్చేవారే నాకు ఎక్కువ తటస్థపడ్డారు. వారిలో చాలామంది స్నేహితులయ్యారు. మోడలింగ్‌ కోసం నేను చేస్తున్న ప్రయత్నాలు తెలిసి... వివిధ కేటగిరీల్లో జరిగే పోటీలకు హాజరయ్యేలా ప్రోత్సహించారు. నాకు చిన్నప్పటి నుంచీ స్టేజ్‌ ఫియర్‌ లేదు. రంగువల్ల నాకు కొత్తగా ఎదురయ్యే అవమానాలేవీ లేవు. కాబట్టి చిన్న చిన్న పోటీల్లో పాల్గొన్నాను. దీనికోసం నేను ఎక్కడా శిక్షణ పొందలేదు, ఎవరి సలహాలూ తీసుకోలేదు. నా ఆత్మవిశ్వాసంతోనే ప్రతి చోటా నిలబడ్డాను. సొంతంగా ఫొటోలు తీసుకొని, వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో ఉంచేదాన్ని. వాటివల్ల అనేక సర్కిల్స్‌ నన్ను గుర్తించడం ప్రారంభించాయి.

స్నేహితులే అండగా నిలిచారు..

ఈ క్రమంలోనే ‘గోల్డెన్‌ ఫేస్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’ పోటీకి ఆడిషన్‌ జరుగుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. అప్పటివరకూ నేను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకే హాజరయ్యాను. ఇది దక్షిణ భారతదేశ స్థాయిది కాబట్టి ఆసక్తిగా అనిపించి... అప్లై చేశాను. కొచ్చీలో ఆడిషన్స్‌కు వెళ్లి ఎంపికయ్యాను. కానీ పోటీలో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్‌ ఫీజుగా ముప్ఫైవేలు కట్టాలన్నారు. మాది పెద్ద కుటుంబం. ఇంటికి నా జీతమే ఆధారం. ఒకేసారి ముప్ఫై వేలు ఇచ్చే స్థోమత నాకు లేదు. ఆ సంగతే నిర్వాహకులకు చెప్పాను. ‘‘వారం రోజులు టైముంది. ఆలోచించుకోండి’’ అన్నారు. ఇక ఆ పోటీ సంగతి మరచిపోదామని నిర్ణయించుకున్నాను. ఆఫీసులో నా కొలీగ్‌ అశ్వని నా ఆడిషన్‌ గురించి అడిగింది. మహారాష్ట్రకు చెందిన ఆమె నాకు మంచి స్నేహితురాలు కూడా కావడంతో... వివరాలు చెప్పాను. ‘‘ఆ డబ్బు నేనిస్తాను. లెక్కలు తరువాత చూసుకుందాం. వద్దంటే ఊరుకోను’’ అంటూ... నాతో రిజిస్టర్‌ చేయించింది. ఆ తరువాత పోటీకి అవసరమైన దుస్తుల కోసం కాలేజీ ఫ్రెండ్‌ ఒకరు సాయం చేశారు. నేను బస చేయడానికి, వీడియోలు తీసే సామర్థ్యం ఉన్న ఫోన్‌ కొనుక్కోడానికి... ఇలా ప్రతిదానికీ నా స్నేహితుల ప్రోత్సాహం, సహకారం ఉన్నాయి. నా గెలుపులో వారికీ భాగం ఉంది.

చెన్నైలో పోటీ జరిగే చోటుకు చేరుకున్న తరువాత... వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలను చూడగానే... ‘ఈ పోటీలో నేను గెలవగలనా?’ అనే సందేహం వచ్చింది. కానీ వెంటనే నా సంకోచాలన్నీ పక్కకు నెట్టేశాను. పోటీలో ధైర్యంగా పాల్గొన్నాను. ఎర్నాకుళానికి చెందిన అమ్మాయి విన్నర్‌ అయితే... నేను ఫస్ట్‌ రన్నర్‌పగా... అంటే రెండో స్థానంలో నిలిచాను. సెలబ్రిటీల ప్రశంసలు అంతకుమించిన ఆనందాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ‘ఫెమీనా’ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాను. తెల్లటి మేని రంగే అందం అనేది సమాజంలో ఎక్కువశాతం మంది అభిప్రాయం. అయితే క్రమంగా మార్పు వస్తోందని గట్టిగా చెప్పగలను. నా లక్ష్య సాధన దిశలో ఈ విజయం తొలి అడుగు. నా అనుభవంతో నేను చెప్పేది ఒక్కటే... మీకు కల ఉంటే, దాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడండి. సంకల్పం ఉంటే... ఎలాంటి సంక్షోభం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు.’’

Updated Date - Mar 04 , 2024 | 03:52 AM