Share News

Counselling : వాటిని వాడితే?

ABN , Publish Date - Feb 15 , 2024 | 04:33 AM

లైంగిక ఆరోగ్యం, చికిత్సల పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో రూపొందిన ఒక తాజా వాణిజ్య ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌, అశ్లీల నటుడు జానీ సిన్స్‌లతో ఒక సీరియస్‌ విషయాన్ని హాస్యచతురతతో వివరించడానికి చేసిన ఈ

Counselling : వాటిని వాడితే?

లైంగిక ఆరోగ్యం, చికిత్సల పట్ల అవగాహన పెంచాలనే ఉద్దేశంతో రూపొందిన ఒక తాజా వాణిజ్య ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌, అశ్లీల నటుడు జానీ సిన్స్‌లతో ఒక సీరియస్‌ విషయాన్ని హాస్యచతురతతో వివరించడానికి చేసిన ఈ ప్రయత్నం మిశ్రమ స్పందనలకు అందుకుంటోంది. అయితే ఇంతకూ ఈ వాణిజ్య ప్రకటన ద్వారా ప్రచారం కల్పిస్తున్న లైంగిక ఉత్పత్తుల ప్రామాణికత ఎంత? వీటిని ఎవరు, ఎలా, ఎప్పుడు, ఎందుకు వాడుకోవచ్చు? పురుష లైంగిక సమస్యలకు ఈ ఉత్పత్తులతో శాశ్వత పరిష్కారం దక్కుతుందా? వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం!

లైంగిక విషయాలు, సమస్యలు, లోపాల గురించి బహిరంగంగా చర్చించడానికీ, ఇతరులతో పంచుకోడానికీ అందరూ సుముఖంగా ఉండరు. అందుకు బిడియం కొంత కారణమైతే, ఇతరులు చిన్నచూపు చూస్తారేమోననే భయం మరొక కారణం. అలాగే చిన్నాచితకా లైంగిక సమస్యలను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవడం అత్యంత సహజం. అలాంటప్పుడు జ్వరం మాత్రల్లా, ఇలాంటి మందులు కూడా తేలికగా అందుబాటులో ఉంటే వాటిని వాడుకోవచ్చు కదా? అని అనిి భావించేవాళ్లు ఎక్కువ! ఈ కోవకు చెందిన వాళ్ల కోసం కొన్ని కంపెనీలు పలు రకాల లైంగిక ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్నాయి. తాజాగా సంచలనం సృష్టిస్తున్న వాణిజ్య ప్రకటన కూడా లైంగిక ఉత్పత్తులకు సంబంధించినదే! ఇలాంటి మందులతో ప్రయోజనాలూ ఉన్నాయి, అంతే సమానంగా దుష్ప్రయోజనాలూ ఉన్నాయి.

సురక్షితమైనవే.. అయినా

ఈ ఉత్పత్తులను సదరు వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు, ఉచిత వైద్యుల కన్సల్టేషన్‌ అనే ఒక క్లాజ్‌ స్పష్టంగా పేర్కొని ఉంటుంది. కంపెనీ ప్యానల్‌లో ఒకరిద్దరు ఎమ్‌బిబిఎస్‌ వైద్యులు ఉండి, ఉత్పత్తులను ఆర్డర్‌ చేసిన కొనుగోలుదారులను వాళ్లు ఫోన్‌లో సంప్రతించి, సమస్య గురించి తెలుసుకుని తగిన ఉత్పత్తులను సూచించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో ఆండ్రాలజిస్ట్‌లు శీఘ్రస్కలనాలకు సూచించే డెపాక్సిటీన్‌, టెడలాఫిల్‌ లాంటి ఔషథాలే ఉంటూ ఉంటాయి. వీటితో పాటు సహజసిద్ధంగా పురుష హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ను పెంచే మూలికా మందులు, న్యూట్రాస్యూటికల్స్‌ కూడా ఉంటూ ఉంటాయి. అమేజాన్‌లో కొనుగోలు చేసుకుని వాడుకుంటున్న అశ్వగంధ, శిలాజిత్తు మాదిరిగానే వీటిని కొనుగోలు చేసి వాడుకోవడం ప్రమాదకరం కాదు. లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన ఏర్పడడానికీ ఇలాంటి ప్రకటనలు తోడ్పడితే, లైంగిక సామర్థ్యం తగ్గినా వైద్యులను కలవడానికి ఇష్టపడని పురుషులకు ఇలాంటి ఉత్పత్తులు ఎంతో కొంత ఉపయోగపడతాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. వైద్యులను కలవడానికి వెనకాడే పురుషులు వీటిని వాడుకుని కొంత ఫలితాన్ని పొందే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అయితే ఇక్కడొక తిరకాసు ఉంది.

తప్పుదారి పట్టించవచ్చు

పురుష లైంగిక సమస్యలకు మూలకారణాలను కనిపెట్టకుండా ఇలాంటి ఉత్పత్తులను వాడుకుంటూ పోవడం ఎంతవరకూ సమంజసం? ఉదాహరణకు స్తంభన సమస్యకు ఎన్నో కారణాలుంటాయి. అలాంటి ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న స్తంభన సమస్యకు రక్తనాళాలు ఇరుకుగా మారడం కారణమైతే, ఇలాంటి మందులు వాడుకోవడం వల్ల ఆ సమస్యను ప్రారంభంలో సమర్థంగా, శాశ్వతంగా సరిదిద్దే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు, దీర్ఘకాలంలో ఆ సమస్య మరింత తీవ్రమై చికిత్సతో సరిదిద్దలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది. ఇలా కొందర్లో అంతర్లీన సమస్యను ఆలస్యంగా గుర్తించడం వల్ల, అది చికిత్సకు లొంగక, పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చు. ఇదొక కోణం. అలాగే ఈ మందులతో కొంత మేరకు సామర్థ్యం పెరగడంతో, మందులు వాడకుండా ఉండలేని డిపెండెన్సీ సమస్య కూడా కొందర్లో తలెత్తే ప్రమాదం ఉంటుంది. టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ మొతాదు తగ్గడం మూలంగా సమస్య తలెత్తిన కొందర్లో ఈ ఉత్పత్తులను అదే పనిగా వాడుకోవడం వల్ల హార్మోన్‌ మోతాదు విపరీతంగా పెరిగి వీర్య ఉత్పత్తి తాత్కాలికంగా తగ్గిపోవచ్చు. స్పర్శను పోగొట్టి, మొద్దుబారేలా చేసే అనస్థీషియాను పోలిన లిడోకైన్‌ స్ర్పేలు కూడా ఈ ఉత్పత్తుల్లో ఉంటున్నాయి. ఈ స్ర్పేతో దుష్ప్రభావాలు లేకపోయినా పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు వీటిని వాడిన అరగంట తర్వాత, శుభ్రం చేసుకుని, పిల్లల కోసం ప్రయత్నించాలి. లేదంటే గర్భధారణ సమస్యలు తలెత్తవచ్చు.

ఎవరు - ఎంత కాలం?

ఈ ఉత్పత్తుల్లో ఔషథ మోతాదులు తక్కువ. పైగా ఈ కంపెనీల ఉత్పత్తులన్నీ పురుష హార్మోన్లను పెంచే వృక్షసంబంధ ఉత్పత్తులే అయి ఉంటాయి. ఇతరత్రా దుష్ప్రభావాలు తలెత్తి న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఉండడం కోసం కంపెనీలు తీసుకునే ముందు జాగ్రత్తలివి. కాబట్టి ఎటువంటి డయాగ్నొసిస్‌ అవసరం లేకుండా, స్వల్ప లైంగిక సమస్యలను ఎదుర్కొనే వాళ్లు మాత్రమే ఈ ఉత్పత్తులను వాడుకోడానికి అర్హులు. అలాగే డెపెండెన్సీకి గురి కాకుండా ఉండడం కోసం ఈ ఉత్పత్తులను అదే పనిగా వాడుకోకుండా రెండు నెలలకు పరిమితం చేయాలి. కొందర్లో ఈ మందులు వాడినా అంతగా ప్రభావం కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు మానసికంగా కుంగిపోకుండా ఆండ్రాలజిస్ట్‌లను కలిసి తగు మోతాదుతో కూడిన మందులను వాడుకోవాలి. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఉత్పత్తులు తాత్కాలిక ఫలితాన్ని మాత్రమే అందించగలుగుతాయి తప్ప, అంతర్లీన కారణాన్ని సరిదిద్ది సమస్యను శాశ్వతంగా నయం చేయలేవనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.

డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,

ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,

హైదరాబాద్‌.

Updated Date - Feb 15 , 2024 | 04:33 AM