Share News

Harmeet Kaur : భారతీయ అమెరికన్‌ మహిళకు అపూర్వ గౌరవం

ABN , Publish Date - Dec 12 , 2024 | 06:45 AM

అమెరికాలో భారత సంతతికి చెందిన సిక్కు మహిళ, హర్మీత్‌ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా, 54 ఏళ్ల హర్మీత్‌ను అమెరికా న్యాయశాఖ పౌరహక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా ప్రకటించారు.

Harmeet Kaur : భారతీయ అమెరికన్‌ మహిళకు అపూర్వ గౌరవం

అమెరికాలో భారత సంతతికి చెందిన సిక్కు మహిళ, హర్మీత్‌ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా, 54 ఏళ్ల హర్మీత్‌ను అమెరికా న్యాయశాఖ పౌరహక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా ప్రకటించారు. ఆ భారతీయ అమెరికన్‌ ఆసక్తికరమైన విశేషాలివి... 1969లో చంఢీఘడ్‌లో పుట్టిన హర్మీత్‌ కౌర్‌, రెండేళ్ల వయసులోనే తల్లితండ్రులతో కలిసి అమెరికా వలస వెళ్లిపోయింది.

న్యూయార్క్‌ నగరానికి తరలివెళ్లక ముందు ఆమె, ఉత్తర కారొలినాలో నివసించింది. డార్ట్‌మోర్త్‌ కాలేజీలో క్లాసికల్‌ స్టడీస్‌, ఇంగ్లీషులో డిగ్రీ పూర్తి చేసిన హర్మీత్‌... వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి లా డిగ్రీ అందుకుంది. ఆ తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌కు చెందిన జడ్డి, పాల్‌ విక్టర్‌కు క్లర్క్‌గా పని చేసింది. ఆ తర్వాత న్యూయార్క్‌, లండన్‌, సిలికాన్‌ వ్యాలీ, శాన్‌ఫ్రాన్సిస్కోలలో పని చేసిన తర్వాత, 2006లో థిల్లాన్‌ లా గ్రూప్‌ ఇంక్‌ను స్థాపించి, ప్రజాహక్కుల కోసం లాభాపేక్ష లేని కేంద్రాన్ని నెలకొల్పింది. తన సొంత లాగ్రూప్‌ ద్వారా, కొవిడ్‌ సమయంలో అమెరికా ప్రభుత్వం ప్రజలపై విధించిన నిబంధనలు, ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే ఆదేశాలను ధిక్కరిస్తూ, ఎన్నో దావాలు వేసింది. ఫేస్‌ మాస్కుల అవసరాన్ని విమర్శించడంతో పాటు, బ్రిటిష్‌ టివి ప్రముఖుడైన పియర్స్‌ మోర్గాన్‌ కార్యక్రమంలో పాల్గొని, కొవిడ్‌-19 పాండమిక్‌తో ట్రంప్‌ వ్యవహారశైలిని విమర్శించిన వ్యక్తి నోరు మూయించి ప్రధాన వార్తల్లోకి ఎక్కింది. 2020 ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌కు న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరించింది హర్మీత్‌.

వ్యాజ్యాలు, విమర్శలు

వాణిజ్య వ్యాజ్యాలు, ఉపాధి చట్టాలు, మొదటి సవరణ హక్కులు, ఎన్నికల చట్టాలు.. ఇలా హర్మీత్‌ చట్టాలకు సంబంఽధించిన పలు కీలక అంశాల్లో నైపుణ్యం సాధించింది. ప్రత్యేకించి భద్రతలు, వినోదాలు, ఉపాధి వివక్ష, మానవ హక్కులకు సంబంఽధించిన వ్యాజ్యాలను చేపడుతూ ఉంటుంది. హర్మీత్‌ వివాదాలకు కూడా ప్రసిద్ధి చెందింది. గత జులైలో, క్రైస్తవ మత ఛాందసవాదులు, సంప్రదాయవాదులు సమావేశమైన రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో, సిక్కు ప్రార్థనలోని ఆర్దా్‌సను పఠించి, విదేశీ దేవుళ్లను ప్రార్థిస్తోందనే విమర్శనలను సైతం ఎదుర్కొంది. అలాగే 2019లో ఓటర్ల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఓటర్ల పౌరసత్వాన్ని ధృవీకరించడంలో వైఫల్యాలను విమర్శిస్తూ, క్యాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మోటార్‌ వెహికల్స్‌ను మీద ఆరోపణలు చేసింది.

వ్యక్తిగత జీవితం

హర్మీత్‌ తండ్రి డాక్టర్‌ తేజ్‌పాల్‌ థిల్లాన్‌, ఆర్థొపెడిక్‌ సర్జన్‌. వృత్తిరీత్యా ఆయన కుటుంబంతో కలిసి ప్రపంచ దేశాలు తిరిగాడు. హర్మీత్‌ కుటుంబం మొదట ఇంగ్లండ్‌కూ, 1971లో అమెరికాకు వలస వెళ్లింది. హర్మీత్‌ 12 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వాన్ని పొందింది. హర్మీత్‌ తల్లి హర్మీందర్‌ కౌర్‌ థిల్లాన్‌. ఒకానొక సందర్భంలో ఆమె కూతురు హర్మీత్‌ గురించి ప్రస్థావిస్తూ, హర్మీత్‌ది ఇతరుల అభిప్రాయాలకు తలొగ్గని స్వభావమనీ, ఎదురు ప్రశ్నించే తత్వమనీ పేర్కొనడం గమనార్హం. హర్మీత్‌ పెంపకమంతా సిక్కు సంప్రదాయాలు, విలువలతోనే కొనసాగింది. ప్రతి వేసవిలో రెండు నెలల పాటు హర్మీత్‌ తన తల్లి పర్మీందర్‌, అన్న మన్‌దీ్‌పతో కలిసి భారతదేశానికి వస్తూ ఉండేది. వచ్చిన ప్రతిసారీ తన అమ్మమ్మతాతయ్యల మార్గదర్శకత్వంలో సిక్కు సంస్కృతి గురించి లోతైన పరిజ్ఞానాన్ని ఏర్పరుచుకుంటూ ఉండేది. హర్మీత్‌ గ్రాడ్యుయేషన్‌ చదువు పూర్తి చేసిన తర్వాత, సిక్కు వైద్యుడు, కన్వర్జీత్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. కానీ వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2003లో అతన్నుంచి విడాకులు తీసుకున్న హర్మీత్‌, ఎనిమిదేళ్ల తర్వాత 2011లో, సర్వజీత్‌ సింగ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. సర్వజీత్‌, పార్కిన్సన్‌, కేన్సర్‌ వ్యాధులతో పోరాడుతూ ఈ ఏడాది కన్నుమూశారు.

Updated Date - Dec 12 , 2024 | 06:45 AM