నిజాం నుంచి ప్రశంస
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:34 AM
ఒకప్పుడు జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ సిరిసంపదలతో తులతూగుతూ ఉండేది. 300 ఎకరాల్లో ఈ ప్యాలె్‌సను మా పూర్వీకుడు రాజా జ్ఞాన్‌గిర్ నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో అణువణువు నాకు తెలుసు. వాటితో నాకు అనేక జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.
అలనాటి కథ
ఒకప్పుడు జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్ సిరిసంపదలతో తులతూగుతూ ఉండేది. 300 ఎకరాల్లో ఈ ప్యాలె్‌సను మా పూర్వీకుడు రాజా జ్ఞాన్‌గిర్ నిర్మించారు. ఈ ప్యాలెస్‌లో అణువణువు నాకు తెలుసు. వాటితో నాకు అనేక జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. వాటిలో నిజాంను కలవటం ఒక అపురూపమైన జ్ఞాపకం. మా కుటుంబానికి ఆస్‌ఫజాహీ వంశ రాజులకు మధ్య మంచి స్నేహసంబంధాలు ఉండేవి. నిజాం సైన్యంలోని ఐదు వేల మంది మా అధీనంలో ఉండేవారు. అందువల్ల వారి వద్ద మాకు ప్రాధాన్యత ఉండేది. ఆ రోజుల్లో మహారాజులకు కూడా నిజాం దర్శనం అరుదుగా లభించేది. చాలా మంది నిజాంను చూడటమే గొప్పగా భావించేవారు. అలాంటి కాలంలో- నిజాంను కలవటం- ఆ తర్వాత మా నాన్నకు రాసిన లేఖలో నన్ను ఆయన- ‘‘మోస్ట్ హ్యాండ్సమ్ డాటర్’’ అని సంబోధించటం ఇంకా గుర్తున్నాయి.
నా చిన్నతనం ఒక అద్భుతమైన రంగుల కల. ఇంటి చుట్టూ గుర్రాల మీద.. ఒంటెల మీద.. ఏనుగుల మీద సవారీ చేయటం.. ఉదయాన్నే లేచి నాన్నతో పాటు కాస్‌కంట్రీ రైడ్స్ వెళ్లటం.. ఇవన్నీ అందమైన అనుభవాలు. ఆ సమయంలో నా అంగరక్షకుడి పేరు ఇబ్రహీంఖాన్. ఆరడుగుల మనిషి. నేను ఎక్కడికి వెళ్లినా నా వెంటే ఉండేవాడు. నా చిన్నప్పటి ఫోటోలలో కూడా నా వెనకే అతను కనిపిస్తాడు. మహబూబియా కాలేజీలో చదివే రోజుల్లో కూడా- నాతో పాటే వచ్చేవాడు. ఇక మా ప్యాలె్‌సలో సంక్రాంతి వచ్చిందంటే సందడి మొదలయ్యేది. పిల్లలందరం పతంగులు ఎగరవేసేవాళ్లం. నాకు 13 ఏళ్ల వయస్సులో అనుకుంటా- సంక్రాంతి పండుగ రోజు నేను మా తమ్ముడు పతంగులు ఎగరవేస్తున్నాం. ఇంతలో మా యూరోపియన్ ఆయా వచ్చి- ‘‘రాజావారు మిమల్ని 11 గంటలకు బిలియర్డ్స్ రూమ్‌కు రమ్మన్నారు’’ అని చెప్పింది. మాకు ఒకటే టెన్షన్. ఏదైనా తప్పు చేస్తే తప్ప నాన్న దగ్గర నుంచి పిలుపురాదు. నాన్న ఎక్కడున్నారని దొంగతనంగా తొంగిచూశాం. నవాబ్ ఖూస్రూజంగ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అంటే సీరియస్ విషయం కాదని తేలిపోయింది. కానీ మనసులో ఇంకా ఏదో సంశయం. సమయం గడిచింది. ఠంచనుగా 11 గంటలకు పిల్లలం ముగ్గురం- బిలియర్డ్స్ రూమ్‌కు వెళ్లాం. నాన్న- నవాబ్ అహ్మద్‌బేగ్‌తో కలిసి రూంలోకి వచ్చారు. ఆయన పర్సనల్ సెక్రటరీ డీవేటియా బంగారు పాన్దాన్ డబ్బా ఆయన ముందు పెట్టారు. నాన్న ఒక పాన్ తీసుకుంటూ- ‘‘రేపు దారుపిషా (కింగ్‌కోఠి ప్యాలె్‌స)లో మనం నిజాంను కలవబోతున్నాం’’ అని చెప్పారు. మాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. బయటకు వచ్చేసిన తర్వాత డీవేటియా మాకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు చెప్పారు. వాటిలో మొదటిది- నిజాంను నేరుగా కళ్లెత్తి చూడకూడదు. రెండోది- ఆయన అడిగితే కానీ సమాధానం చెప్పకూడదు. వీటితో పాటుగా నిజాంకు ఫర్సీ ఆదాబ్ ఎలా చెప్పాలో కూడా నేర్పించారు. (నడుం సగం దాకా వంచి ఏడు సార్లు ఆదాబ్ చేయటాన్ని ఫర్సీ ఆదాబ్ అంటారు). ఆ రోజంతా నాకు అనేక ఆలోచనలు. నేను అప్పటి దాకా నిజాంను చూడలేదు. కానీ ఆయన పెయింటింగ్ మా డ్రాయింగ్‌రూమ్‌లో ఉండేది. దాన్ని చూస్తూ పెరిగాను. టైం మ్యాగిజైన్‌పై నిజాం కవర్‌ఫోటో వచ్చింది. అది కూడా నాకు గుర్తుంది. ‘నిజాం అలాగే ఉంటారా? నాతో మాట్లాడతారా?’- ఇలా ఎన్నో ఆలోచనలు. అమ్మ ఆ రోజు రాత్రి మా చేత రిహార్సల్స్ చేయించింది.
మా మర్నాడు అమ్మ షిఫాన్ చీర, నాన్నమ్మకు చెందిన పది క్యారెట్ల కేటియర్ డైమండ్ రింగ్స్.. చేతికి డైమండ్ గాజులు, ఉంగరాలు పెట్టుకున్నా. తమ్ముళ్లు కూడా నాన్నలాగానే వజ్రాల నగలు పెట్టుకున్నారు. రోల్స్ రాయిల్స్‌లో నాన్న, మేము ముగ్గురం.. రెండో కారులో నాన్న సెక్రటరీ డీవేటియా, ఇతర సేవలకులు బయలు దేరాం. కారు పర్దా గేటు దాకా మాత్రమే వెళ్తుంది. అక్కడ నుంచి అందరూ నడిచే వెళ్లాలి. కారు గేటు దగ్గరకు చేరుకున్న తర్వాత నాన్న- ‘‘మీరు కూడా నిజాంకు నజర్ ఇవ్వాలి’’ అని గుర్తు చేశారు. మేము గేటు లోపలికి ప్రవేశించాం. లోపల పెద్ద మైదానంలా ఉంది. ఒక వైపు వరుసగా కార్లు ఉన్నారు. వాటికి పసుపు నెంబర్ పేట్లు మెరుస్తున్నాయి. మరో వైపు ఆసీఫ్ జాహీల జెండా ఠీవీగా ఎగురుతోంది. నా కళ్లు నిజాం కోసం వెతుకుతున్నాయి. కొద్దిగా ముందుకు వెళ్లాం. అక్కడ టెంట్ వేసి ఉన్న ఎత్తైన ప్లాట్‌ఫాం కనిపించింది. దాని మీద ఒక సన్నని వ్యక్తి రూమీ టోపీ పెట్టుకొని నిలబడి మా వైపే చూస్తున్నాడు. ఆయన మొహంలో గర్వం తొణికిసలాడుతోంది. కంఠంలో రాజసం ఉంది. నాన్న ఆయన దగ్గరకు వెళ్లి- ఫర్సీ ఆదాబ్ చేశారు. మేమందరం కూడా ఆయనను అనుకరించాం. నాన్న- ఒక తెల్ల రుమాలులో పదకొండు అఫ్రఫీలు(బంగారు నాణేలు).. ఒక హాలీ రూపాయి (వెండి నాణెం) ఉంచిన నజర్‌ను నిజాం ముందు ఉంచి స్వీకరించమని కోరారు. మేము ఒక అఫ్రషీ.. ఐదు హాలీ రూపాయలులు ఉన్న రుమాలును నిజాంకు సమర్పించాం. ఆయన వాటిని తీసుకొని- ఒక సంచిలో బంగారు నాణేలు, మరో సంచిలో వెండి నాణేలు వేశారు. మేమందరం తల వంచుకొని నేల కేసే చూస్తున్నాం. నాకు తలెత్తి నిజాం వైపు చూడాలని కోరిక పెరిగిపోతోంది. పిల్లలమందరం దొంగ చూపులు చూడటానికి ప్రయత్నిస్తున్నాం. నిజాం మా నాన్నతో- ‘‘వీరు నీ సంతానమా?’’ అని అడిగారు. ‘‘జీ సర్కార్. ఈ ఇద్దరూ నా కుమారులు. ఆమె నా పెద్ద కుమార్తె ఇందిర. చిన్న కుమార్తె రేణుక చిన్న పిల్ల. అందుకని తీసుకురాలేదు’’ అని నాన్న సమాధానమిచ్చారు. నిజాం నా వైపు తిరిగి - ‘‘స్కూలుకు వెళ్తున్నామా?’’ అని అడిగారు. నా గొంతు తడిఆరిపోయింది. ‘‘జీ యువర్ హైనెస్’’ అని సమాధానమిచ్చా. ‘‘బొంబాయిలోనా.. ఇక్కడా?’’ అని సంభాషణ పొడిగించారు. ‘‘బొంబాయిలో ఉండేవాళ్లం.. ఇప్పుడు మహబూబియా కాలేజీలో చేరాను’’ అని సమాధానమిచ్చా. ‘‘నీకు హైదరాబాద్ ఇష్టమేనా? చదువులో బొంబాయికి... ఇక్కడికి ఏదైనా తేడా ఉందా?’’ అని వేరే ప్రశ్న సంధించారు. అప్పటికి నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. కొద్దిగా తలెత్తి- ‘‘నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. కొత్తగా వచ్చాను కదా.. మహబూబియాలో చదువుకోవటం వేరేగా ఉంది’’ అని సమాధానమిచ్చా. ‘‘ఏ క్లాసు చదువుతున్నావు’’ అని నిజాం అడిగారు. ‘‘జూనియర్ క్రేంబ్రిడ్జి చదువుతున్నా’’ అన్నా. ‘‘మంచిది.. మంచిది.. అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యం’’ అన్నారు. నాకు ఆయన అలా అనటం చాలా ఆశ్చర్యమేసింది. నిజాం నాన్న వైపు తిరిగి- ‘‘బొంబాయి నుంచి మీరంతా ఎప్పుడు వచ్చారు?’’ అని అడిగారు. ‘‘సర్కార్.. రెండు నెలల క్రితం మేము హైదరాబాద్ వచ్చాం’’ అని నాన్న సమాధానమిచ్చారు. నాన్న ఇక సంభాషణ పూర్తయిందని తెలుసుకొని- సెక్రటరీ దివేటియాకు - నిజాం కోసం తెచ్చిన బహుమతిని తెమ్మని సంకేతమిచ్చారు. దివేటియా మరకత మణులతో పొదిగిన పాన్దాన్‌ను నాన్నకు తెచ్చి ఇచ్చారు. దానిని నాన్న నిజాం ముందు ఉంచి- ‘‘సర్కార్.. దీనిని ప్రత్యేకంగా మీ కోసం చేయించాను.. స్వీకరించండి’’ అన్నారు. నిజాం ముఖంలో చిరునవ్వు వచ్చింది. పాన్దాన్‌ను తెరిచి- దానిలోని బంగారు సుపారీ, ఎలకులు, లవంగాలు, దస్తార్‌లను ముట్టుకొని చూశారు. ‘‘దీన్ని ఎక్కడ చేయించావు?’’ అని అడిగారు. ‘‘బెంగుళూరులో..సర్కార్..’’ అని నాన్న సమాధానమిచ్చారు. ‘‘ఇది నాకు నచ్చింది. జూబ్లీ హాల్లో పెడతాను’’ అని నిజాం అన్నారు. ఆ మాటలు వినగానే నిజాం వెనక నిలబడి ఉన్న ఏడీసీ ముందుకు వచ్చి పాన్దాన్‌ను తీసుకున్నాడు. ఆ లోపులో నిజాం దృష్టి నాన్న వేలికి ఉన్న మరకత ఉంగరంపై పడింది. దానివైపే రెండు, మూడుసార్లు చూశారు. ఆ తర్వాత చప్పట్లు కొట్టగానే- దూరంగా ఉన్న నిజాం కుమార్తె రాణీ షెహజాదీ- ఒక సాధారణ చైనా కప్పును తీసుకువచ్చారు. నిజాంకు చార్‌మినార్ సిగరెట్లు తాగే అలవాటు ఉంది. సిగరెట్టు బూడిదను వేయటానికేమో అనుకున్నా. రాణీ ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే- మేము మరోసారి ఫార్సీ ఆదాబ్ చేసి వెనక్కి నడుస్తూ వచ్చేసాం. (నిజాంకు సందర్శకులు తమ వీపును చూపించకూడదు. వెనక్కి నడుచుకుంటూ వెళ్లాలి).
ఆ మర్నాడు మాకు కింగ్‌కోఠి నుంచి ఒక లేఖ వచ్చింది. దానిలో తనను కలిసినందుకు.. యువర్ హ్యాండ్సమ్ డాటర్ ను తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు అని ఉంది. సాధారణంగా మగవారిని ఉద్దేశించినప్పుడు మాత్రమే హ్యాండ్సమ్ అంటారు. నిజాం నన్ను అలా ఎందుకు ప్రస్తావించారో ఇప్పటికీ నాకు తెలియదు. అంతే కాదు.. నాకు ఇతరుల నుంచి దక్కిన తొలి ప్రశంస అది. అది కూడా నిజాం నుంచి.. అందుకే ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి.
ప్రిన్సెస్ ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్