Share News

Navya : అనన్య సామర్థ్యం

ABN , Publish Date - May 14 , 2024 | 11:40 PM

భారత సైన్యంలో పని చేసే అధికారి కూతురు కావడంతో దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగారు అనన్యా త్రిపాఠి. తండ్రికి బదిలీ అయినప్పుడల్లా ఆమె స్కూలు కూడా మారిపోయేది.

Navya : అనన్య  సామర్థ్యం

ఒక సాధారణ అమ్మాయిలా కెరీర్‌ ప్రారంభించారు.

కానీ... అనతికాలంలోనే బడా కంపెనీల అత్యున్న స్థానాన్ని

అధిరోహించారు. ఉన్నత చదువు... వ్యాపారాన్ని పరుగులు

పెట్టించే అసాధారణ ప్రతిభా పాటవాలు... ఇవే ఆమె

విజయానికి సోపానాలు అయ్యాయి.

‘ఫోర్బ్స్‌ ఇండియా’ మ్యాగజైన్‌ ‘సెల్ఫ్‌మేడ్‌ ఉమెన్‌-2024’

జాబితాలో స్థానం దక్కించుకున్న ప్రముఖ

రియల్‌ఎస్టేట్‌ కంపెనీ ‘బ్రూక్‌ఫీల్డ్‌’ మేనేజింగ్‌ డైరెక్టర్‌

అనన్యా త్రిపాఠి జైత్ర యాత్ర ఇది.

భారత సైన్యంలో పని చేసే అధికారి కూతురు కావడంతో దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగారు అనన్యా త్రిపాఠి. తండ్రికి బదిలీ అయినప్పుడల్లా ఆమె స్కూలు కూడా మారిపోయేది. అయితే దాన్ని అసౌకర్యంగానో... తన చదువుకు ప్రతిబంధకంగానో అనన్య ఎప్పుడూ భావించలేదు.

పైగా ‘అలా పలు ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదవడంవల్లే... భిన్న పరిస్థితులను ఆకళింపు చేసుకోవడం, విభిన్న సంస్కృతులపై అవగాహన చిన్న వయసులోనే కలిగాయి. ఎదిగాక ఆ అంశాలే నా కెరీర్‌కు పునాదులయ్యాయి’ అంటారు ఆమె.

2005లో కేరళ కొజికోడ్‌ ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ (ఐఐఎం) నుంచి ఎంబీయే పట్టా అందుకున్న అనన్యా... అదే ఏడాది బెంగళూరు టీసీఎ్‌సలో చేరారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఏడాది పాటు అందులో పని చేశారు.

అదే సమయంలో కొంతమంది ఐఐఎం విద్యార్థులను ప్రతిష్టాత్మక ‘మెక్‌కిన్సే అండ్‌ కంపెనీ’ తమ ముంబయి కార్యాలయానికి ఆహ్వానించింది. ఆ ఏడాది కొజికోడ్‌ ఐఐఎం నుంచి ఒక్కరికే ఆ అవకాశం దక్కింది.

ఆ ఒక్కరూ... అనన్య త్రిపాఠి. జూనియర్‌ అసోసియేట్‌ మేనేజర్‌గా అందులో ఉద్యోగం మొదలుపెట్టిన ఆమె... అసోసియేట్‌ పార్ట్‌నర్‌గా పదోన్నతి పొందారు. ఆరున్నర ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేశారు.

కోడర్‌గానే ఉండాలనుకోలేదు...

‘జీవితమంతా కోడర్‌గానే ఉండలేననే విషయం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన కొద్ది రోజులకే అర్థమైంది. ఇక అప్పటి నుంచి నా మనసు కుదురుగా లేదు. వ్యాపార రంగంపై సమగ్ర అవగాహన అవసరం అనుకున్నాను.

ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో ‘మెక్‌కిన్సే’లో అవకాశం లభించింది’ అని నాటి రోజులు గుర్తు చేసుకున్నారు అనన్యా. అందులో కొలువు ఆమె ఎదుగుదలకు ఎంతో దోహదపడింది. అద్భుతమైన మార్గదర్శకులు అక్కడ లభించారు. వారి మార్గదర్శనంలో కంపెనీ నిర్వహణ, వ్యాపార అభివృద్ధికి సంబంధించి అనేక కీలక విషయాలు ఆకళింపు చేసుకున్నారు.

ఊహించని మలుపు...

‘‘చెప్పాలంటే ఒక విధంగా ఆ కంపెనీలో నేను దూసుకుపోతున్నా. ఉన్నత హోదాలో కొనసాగుతున్నా. ఆ సమయంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన కాల్‌ నా వృత్తిగత జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.

నాటికి ఇ-కామర్స్‌ రంగం భవిష్యత్తుపై ఎవరికీ సరైన అంచనాలు కానీ, భరోసా కానీ లేవు. అలాంటి పరిస్థితుల్లో మంచి ఉద్యోగం వదులుకోని అటువైపు వెళ్లడం అవసరమా అనిపించింది. అలాగని వెనకడుగు వేయదలుచుకోలేదు.

అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు. అందుకే ఓకే చెప్పాను. చీఫ్‌ స్ర్టేటజీ ఆఫీసర్‌గా ‘మింత్రా’లో విధులు ప్రారంభించాను. ఆ నిర్ణయమే నా భవిష్యత్తును నిర్ణయిస్తుందని కొన్నాళ్లకు అర్థమైంది’’ అంటారు అనన్యా. ఆమె బాధ్యతలు చేపట్టాక ఆ కంపెనీ స్థూల వాణిజ్య విలువ 250 డాలర్ల నుంచి 1.7 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది.


మరో అరుదైన అవకాశం...

నాలుగున్నరేళ్లు ‘కేకేఆర్‌’లో పని చేసిన అనన్యా త్రిపాఠి... ఆ తరువాత ‘బైజూ్‌స’కు చెందిన ‘వైట్‌హ్యాట్‌ జూనియర్‌’కు సీఈఓగా వెళ్లారు. గర్భవతిగా ఉన్న ఆమె తొమ్మిది నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి విధుల్లో చేరారు. ఆ సమయంలోనే ప్రముఖ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ బెంగళూరులోని ‘బ్రూక్‌ఫీల్డ్‌’ నుంచి పిలుపు వచ్చింది.

తాను మెటర్నటీ లీవ్‌లో ఉన్నాని ఆమె చెప్పారు. అయితే సెలవు ముగిసేవరకు వేచివుంటామని సంస్థ తెలిపింది. దాంతో ‘వైట్‌హ్యాట్‌’కు రాజీనామా చేసి ‘బ్రూక్‌ఫీల్డ్‌’కు ఓకే చెప్పారు అనన్యా. ఈ ఏడాది జనవరిలో ఆ కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంత మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

‘అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన తల్లిగా నా అవసరాలు, బాధ్యతలను కంపెనీ అర్థం చేసుకుంది. నా కోసం వేచివుండేందుకు సిద్ధపడింది. ఇది నన్ను ఆకట్టుకుంది. అందుకే వారి ఆఫర్‌ను కాదనలేకపోయాను’ అంటారు అనన్యా త్రిపాఠి.

బాధ్యత పెద్దది...

ఆఫీస్‌ స్పేస్‌కు సంబంధించి మెగా వెంచర్లు నడిపించే సదరు కంపెనీని ముందుకు నడిపించడం అంత సులువు కాదు. తనపై ఉన్నది ఎంతో పెద్ద బాధ్యత అంటారు అనన్య. దేశంలోని ఏడు నగరాల్లో సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి.

రియల్‌ఎస్టేట్‌ రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సాగుతున్న భారీ కంపెనీ బాధ్యతను అనన్య భారంగా భావించడంలేదు.

ఒత్తిడికి లోనుకావడంలేదు. సంస్థకు లాభాలు ఆర్జించిపెట్టడంతో పాటు, సంస్థను నమ్మి పెట్టుబడి పెట్టినవారికి కూడా అది ఒక మంచి ఆదాయ మార్గంగా నిలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

అదేవిధంగా సరికొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తున్నారు. ఇవే ఆమెను ‘ఫోర్బ్స్‌ ఇండియా’ మ్యాగజైన్‌ ‘సెల్ఫ్‌మేడ్‌ ఉమెన్‌-2024’ జాబితాలో ఏడో స్థానంలో నిలిపాయి. మరికొన్ని ప్రతిష్టాత్మక అవార్డులనూ తెచ్చిపెట్టాయి.

మరో మెట్టు పైకి...

ఆరేళ్ల కిందట ‘వాల్‌మార్ట్‌’ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్‌’ను సొంతం చేసుకున్న సమయంలో తమ కంపెనీ వదలవద్దని అనన్యాకు ‘మింత్రా’ భారీ ఆఫర్‌ ఇచ్చింది. కానీ ఆమె దాన్ని వదులుకుని... ముంబయి ‘కేకేఆర్‌ క్యాప్‌స్టోన్‌ ఇండియా’ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అందుకున్నారు. అందుకు కారణం... కెరీర్‌లో మరో మెట్టు ఎక్కే అరుదైన అవకాశం లభించడం.

‘కేకేఆర్‌’లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ‘మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, విని కాస్మోటిక్స్‌’ వంటి కంపెనీలతో కలిసి పని చేసే అవకాశం దక్కింది. అంతేకాదు, సదరు కంపెనీల మార్కెట్‌ను రెట్టింపు చేయడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు మరికొన్ని కంపెనీలకు బోర్డ్‌ మెంబర్‌గా వ్యవహరించారు.

Updated Date - May 14 , 2024 | 11:40 PM