అతడు ఆకాశమంత
ABN , Publish Date - Mar 06 , 2024 | 05:04 AM
ప్రపంచ కుబేరులు... రిహానా పాప్ గీతాలు... సల్మాన్... షారూక్ నృత్యాలు... మహామహుల రాకతో జామ్ అయిపోయింది జామ్‌నగర్. వీరందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది... అనంత్ అంబానీ... రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్. ముఖేష్ అంబానీ

ప్రపంచ కుబేరులు... రిహానా పాప్ గీతాలు... సల్మాన్... షారూక్ నృత్యాలు...
మహామహుల రాకతో జామ్ అయిపోయింది జామ్‌నగర్.
వీరందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది... అనంత్ అంబానీ... రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్. ముఖేష్ అంబానీ చిన్న కొడుకుగా అనంత్ అందరికీ తెలిసినవాడే. మరి అతడిని పెళ్లాడనున్న ఈ రాధిక మర్చంట్ ఎవరు? వీరి మనసులు కలిసింది ఎప్పుడు?
రాధికా మర్చంట్... ముఖేష్ అంబానీకి కాబోయే కోడలుగానే కాకుండా ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రసిద్ధ ఫార్మాసుటికల్ కంపెనీ ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’ సీఈఓ వీరెన్ మర్చంట్, శైలా మర్చంట్ చిన్న కుమార్తె అయిన రాధిక... విద్యావంతురాలు. పారిశ్రామికవేత్త. భరతనాట్య కళాకారిణి. సామాజిక కార్యకర్త. ముంబయిలోని ‘కేథడ్రాల్ అండ్ జాన్ కానన్ స్కూల్’, ‘ఎకోల్ మాండియల్ వరల్డ్ స్కూల్’లలో ప్రాథమిక విద్య అభ్యసించిన 29 ఏళ్ల రాధిక... ‘బీడీ సోమని ఇంటర్నేషనల్ స్కూల్’లో బాకలారియెట్ డిప్లమో పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లిన ఆమె ‘న్యూయార్క్ యూనివర్సిటీ’లో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు. 2017లో పట్టభద్రులయ్యారు. అక్కడ చదివే సమయంలోనే పలు సంస్థల్లో బిజినెస్ స్ర్టేటజీ కన్సల్టెంట్‌గా ఇంటర్న్‌షిప్ చేశారు. ముంబయికి తిరిగి వచ్చాక లగ్జరీ రియల్‌ఎస్టేట్ కంపెనీ ‘ఇస్ర్పావా’లో జూనియర్ సేల్స్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తమ ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రాధిక... కాబోయే అత్తగారు నీతా అంబానీలా భరతనాట్య కళాకారిణి. ముంబయిలోని ‘శ్రీ నిభా ఆర్ట్స్ అకాడమీ’లో భావనా థాకర్ వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు. రెండేళ్ల కిందట అరంగేట్రం చేసిన రాధిక... ప్రముఖ వేదికలపై పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
సమాజం కోసం...
వ్యాపార కార్యకలాపాల్లో క్షణం తీరిక లేకపోయినా సామాజిక సేవకు కూడా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు రాధిక. ఆమె జంతు ప్రేమికురాలు. జంతు సంరక్షణతో పాటు అట్టడుగు వర్గాలవారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నారు. మానవహక్కుల పరిరక్షణ కోసం తన గళం వినిపిస్తున్నారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వావలంబన కోసం కృషి చేస్తున్నారు. రాధిక కుటుంబంలో అందరూ వ్యాపార రంగంలో రాణిస్తున్నవారే. రాధిక తండ్రి వీరెన్ బిలియనీర్. ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’తో పాటు ‘ఏపీఎల్ అపోలో ట్యూబ్స్’ స్టీల్ కంపెనీ బోర్డ్ మెంబర్‌గా కూడా ఉన్నారు. తల్లి శైల ‘ఎన్‌కోర్ హెల్త్‌కేర్’ డైరెక్టర్లలో ఒకరు. రాధిక అక్క అంజలి మర్చంట్ భర్త ఆకాష్ మెహతా వ్యాపారవేత్త. వీరెన్ కుటుంబ నికర ఆస్తుల విలువ ఏడొందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
చిన్ననాటి స్నేహం...
‘రిలయన్స్’ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ, రాధికలది చిన్ననాటి స్నేహం. అంబానీ కుటుంబంలో ఏ వేడుక జరిగినా ఆమె హాజరవుతూ వస్తున్నారు. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా, పెద్ద కుమారుడు ఆకాష్ వివాహ మహోత్సవాల్లో కూడా రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అనంత్, రాధికల బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చాలని ఇరువైపుల పెద్దలు నిశ్చయించారు. దీంతో గత ఏడాది జనవరిలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే మూడు రోజులపాటు వారి ప్రీవెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరిపారు ముఖేష్ అంబానీ. దీంతో రాధిక ఎవరనే ఉత్సుకత జనంలో మరింత పెరిగింది. ప్రపంచంలోని సంపన్నులు, రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన వేడుకకు క్యూ కట్టారు. స్వర్గం భూతలం మీదకు దిగివచ్చిందా అన్నంత ఆర్భాటంగా జరిగిన ఈ మెగా వేడుకలో అనంత్, రాధిక అతిథులందరినీ అప్యాయంగా పలుకరించారు. భోజనాలు వడ్డించారు.
‘మా హృదయం ఇక్కడే ఉంది’...
ప్రపంచ ప్రముఖులు హాజరైన వేడుకలో రాధిక తన మనసు విప్పి మాట్లాడారు. కాబోయే అత్తగారు నీతా అంబానీ తనకు స్ఫూర్తి అని, మామగారు ముఖేష్ అంబానీ తనకు తండ్రి సమానులని చెప్పుకొచ్చారు. అలాగే అనంత్‌తో తన అనుబంఽధం ఎక్కడ ఎలా మొదలైందో అందరితో పంచుకున్నారు. ‘మా ఇద్దరి హృదయం... జామ్‌నగర్. ఇక్కడే మేం పెరిగాం. ఇక్కడే స్నేహితులం అయ్యాం. ఇక్కడే ప్రేమలో పడ్డాం. ఇక్కడే మా అనుబంధాన్ని నిర్మించుకున్నాం. భవిష్యత్తులో కలిసి జీవించాలని నిర్ణయించుకున్న మా తొలి అడుగు కూడా ఇక్కడి నుంచే పడింది. ఈ ప్రదేశం మా మధుర జ్ఞాపకాలకు, మా లోతైన రహస్యాలకు, మా మధ్య విరబూసిన నవ్వులకు, మా సంతోషాలు నిండిన సంబరాలకు నిలయం. మేం కలిసి నడిచిన ప్రతి ఘట్టంలో భాగం. మేము ఎదుర్కొన్న ఎత్తుపల్లాలకు సాక్ష్యంగా నిలిచింది ఈ నగరం’ అంటూ ఎంతో భావోద్వేగంతో చెప్పుకొచ్చారు రాధిక.
అలా ‘లాక్’ అయ్యారు...
అనంత్, రాధిక ప్రేమకు బలమైన పునాది పడింది కరోనా లాక్‌డౌన్‌లోనట. ‘2020 మార్చి... కరోనా విజృంభిస్తున్న సమయం. అప్పుడు లాక్‌డౌన్‌తో నేను, అనంత్ జామ్‌నగర్‌లో లాక్ అయిపోయాం. ఎంత ప్రయత్నించినా కొన్ని నెలల పాటు మా ప్రాంతాలకు తిరిగి వెళ్లలేకపోయాం. ఒక్కసారిగా కుటుంబానికి దూరంగా ఉండటం ఎంత కష్టమో తెలుసు. కానీ మేమిద్దరం చిన్న చిన్న ఆనందాలను పంచుకొంటూ ఆస్వాదించాం. అవే ఇప్పుడు మాకు జీవితకాల జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మానవత్వం ఉన్న మనిషిగా అనంత్‌ను అప్పుడే చూశాను. తన కలల ప్రాజెక్ట్ అయిన ‘వంతారా’ను ఒక స్థాయికి తీసుకురావడానికి అతడు పడిన శ్రమను చూశాను. అతనితో ఈ ప్రయాణం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అతడి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. అనంత్‌ను చూసినప్పుడు నేను ఎంత గర్వంగా భావిస్తానో మాటల్లో చెప్పలేను. మంచిని, చెడును, అందాన్ని, ఆనందాన్ని, బాధను, లౌక్యాన్ని... అన్నిటినీ పంచుకొని, ప్రేమించే వ్యక్తి జీవిత భాగస్వామిగా కావాలనే ఎవరైనా కోరుకొనేది. ఆ అర్హతలన్నీ అతడిలో ఉన్నాయి’ అంటూ కాబోయే భర్తను ఆకాశమంత ఎత్తులో నిలిపారు రాధిక. జూలై 12న వీరి వివాహానికి పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు.