Share News

ఆనందరవళి దీపావళి

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:04 AM

దసరా సరదాల ఆనంద హేలకు పరాకాష్ట. ఆ తరువార 20 రోజులకు వచ్చే దీపావళి... ఆనందరవళి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేడుక. ‘‘ఉపదేశ గ్రంథాలలో భగవద్గీతకు ఎంత ఖ్యాతి ఉందో పండుగలలో దీపావళికి అంతటి ఖ్యాతి ఉంది.

ఆనందరవళి దీపావళి

దీపం జ్యోతిః పరబ్రహ్మా

దీపం సర్వ తమోపహమ్‌

దీపేన సాధ్యతే సర్వం

సంధ్యా దీపం నమోస్తుతే

దసరా సరదాల ఆనంద హేలకు పరాకాష్ట. ఆ తరువార 20 రోజులకు వచ్చే దీపావళి... ఆనందరవళి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేడుక. ‘‘ఉపదేశ గ్రంథాలలో భగవద్గీతకు ఎంత ఖ్యాతి ఉందో పండుగలలో దీపావళికి అంతటి ఖ్యాతి ఉంది. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. కానీ దీపావళిని మాత్రం అన్ని ప్రాంతాలవారు సంతోషంగా జరుపుకొంటారు’’ అని శ్రీ కంచి పరమాచార్యులు పేర్కొన్నారు. భారతదేశంలోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల ప్రజలు ఈ పండుగను... భాద్రపద మాసంలోని చివరి మూడు రోజులు... ‘ధనత్రయోదశి’, ‘నరక చతుర్దశి’, ‘దీపావళి’గాను, ఆశ్వయుజ మాసంలోని తొలి రెండు రోజులు... ‘బలి పాడ్యమి’, ‘భాతృ విదియ’గాను జరుపుకొంటారు. వీటిలో ప్రతిదానికీ పౌరాణికమైన, సంప్రదాయికమైన కథలు ఉన్నాయి. నరక చతుర్దశికి తమిళనాడులో ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని ‘కాళీ పూజ’గా నిర్వహిస్తారు. ‘దీపానాం ఆవళి’ అనేది దీపావళికి వ్యుత్పత్తి. అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. దీనికే ‘కౌముదీ ఉత్సవం’, ‘దీపాలికా ఉత్సవం’, ‘దివ్వెల పండుగ’ అనే పేర్లు ఉన్నాయి. చీకట్లను తొలగించి, చైతన్య దీప్తులను విరజిమ్మే ఆనందోత్సవమైన దీపావళిని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేశారు ఋషులు.

‘దీపం జ్యోతిః పరబ్రహ్మా దీపం సర్వ తమోపహమ్‌

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే’ అన్నారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నది వేదం. బాహ్యమైన చీకట్లనే కాకుండా... అంతర్గతంగా ఉన్న తమోగుణాన్ని (అవిద్యను, అజ్ఞానాన్ని) తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించి, వెలుగుబాటలో ప్రసరించేదిగా దీపావళిని ప్రస్తుతించారు పూర్వులు. ఈ పండుగకు ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాస, సామాజిక ప్రాధాన్యత ఉంది. ఆది శంకరులు షణ్మతాలను ఏకతాటిపైకి తెచ్చి, పంచాయత పూజా విధానాన్ని ఏర్పరిచారు. అందులో కాలాగ్ని స్వరూపుడైన స్కందుడికి చోటు కల్పించలేదు. అందుకు ప్రతీకగా జ్యోతి ప్రజ్వలనం అనే విధిని ప్రవేశపెట్టారు. అదే దీపారాధన. ఏ పూజ చేసినా జ్యోతి ప్రజ్వలనంతోనే ఆరంభమవుతుంది. పంచభూతాలలో ముఖ్యమైన అగ్నికి సంకేతం దీపారాధన. సూర్యుడిలో ఉండేది అగ్ని. అది లేకపోతే జగత్తు లేదు. సూర్యారాధనలో అగ్ని ఆరాధన అంతర్భాగం. అలాగే పంచభూత లింగాలలో అరుణాచలేశ్వరుడి (అగ్ని లింగం) ప్రాధాన్యం జగద్విదితం. దీపాన్ని అత్యున్నత గుణాలకు ప్రతీకగా కూడా పూర్వకవులు ఉదహరించిన సందర్భాలు అనేకం. శ్రీరాముణ్ణి ‘రఘుకులాన్వయ రత్నదీపం’గా వర్ణించాడు వాల్మీకి. ‘లోకైక దీపాంకురాం’ అనేది ‘శ్రీసూక్తం’లో మహాలక్ష్మీ వర్ణన.


తెలుగు ప్రాంతాల్లో, కర్ణాటకలో రెండు రోజులపాటు... నరక చతుర్దశిని, దీపావళిని జరుపుకొంటారు. తొలి రోజు నరక చతుర్దశి. నరకాసురుణ్ణి సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు సంహరించిన కథ అందరికీ తెలిసినదే. ఆ రోజు ప్రతి ఇల్లు మంగళతోరణాలతో, రంగవల్లులతో కళకళలాతుడూ ఉంటుంది. అందరూ వేకువజామునే లేచి, అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు. ఇష్ట దైవాన్ని పూజిస్తారు. సంధ్యా సమయంలో వీధి గుమ్మానికి ఇరువైపులా ప్రమిదలతో దీపాలను పెడతారు. వాటిని ‘యమ దీపం’ అంటారు. రెండవరోజు దీపావళి. భారతీయులందరూ జరుపుకొనే ముఖ్యమైన పర్వదినం. తొలినాటి మాదిరిగానే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. నువ్వుల నూనెలో లక్ష్మి, జలంలో గంగ ఉంటారనేది అనాది విశ్వాసం. నూతన వస్త్రాలను ధరించి, పూజా మందిరంలో, తులసికోట దగ్గర దీపాలను వెలిగిస్తారు. ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. సమీపంలోని ఆలయాలను సందర్శిస్తారు. పితృ దేవతలకు తర్పణాలు వదిలే సంప్రదాయం కూడా ఉంది. అనంతరం విందు భోజనాలు చేస్తారు. ప్రదోష సమయంలో ఇల్లు, వాకిలి చిమ్మి, కల్లాపు జల్లి, ముగ్గులు పెడతారు. పూజా మందిరంలో లక్ష్మీ ప్రతిమను ఆరాధించి, వివిధ నైవేద్యాలు పెడతారు. ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల వరుసలను ప్రతి గుమ్మం ముందు అలంకరిస్తారు. పెద్దలు, పిల్లలు ఆనందోత్సాహాలతో బాణాసంచా వెలిగిస్తారు. ఈ దీపోత్సవం... మహాలయ పక్షంలో భూలోకానికి వచ్చిన పితృ దేవతలు తిరిగి స్వర్గానికి వెళ్ళడానికి వెలుగు చూపించడానికేననే అభిప్రాయం కూడా ఉంది. రాత్రి ఇంటిని శుభ్రపరిచి, పేరుకున్న చెత్తా చెదారాన్ని ఊడ్చి, వీధిలో పడేస్తారు. దీన్ని ఇంటిలో ఉన్న ‘అలక్ష్మి’ని ఇంటి నుంచి బయటకు పంపించే ప్రక్రియగా భావిస్తారు. ఆ మరునాటి నుంచి శివ కేశవులకు ప్రీతికరమైన కార్తిక మాసం మొదలవుతుంది.

ఆయపిళ్ళ రాజపాప

Updated Date - Oct 25 , 2024 | 01:04 AM