శుభ మాసానికి ఆహ్వానం
ABN , Publish Date - Mar 08 , 2024 | 05:20 AM
రజబ్, షాబాన్ మాసాల్లో నెలవంకను చూస్తూ ‘‘ఓ అల్లాహ్! మమ్మల్ని రంజాన్ మాసం వరకూ చేర్చు’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్ ప్రార్థించేవారు. ఇస్లాం ధర్మశాస్త్రంలో రంజాన్‌కు...
సందేశం
సకల శుభాలను చేకూర్చే అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. దైవ విశ్వాసులైన వారికి శ్రేయస్సును అందించడానికి, కారుణ్యాన్ని వర్షించడానికి త్వరలోనే ఈ మాసం ఆరంభమవుతోంది.
రజబ్, షాబాన్ మాసాల్లో నెలవంకను చూస్తూ ‘‘ఓ అల్లాహ్! మమ్మల్ని రంజాన్ మాసం వరకూ చేర్చు’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్ ప్రార్థించేవారు. ఇస్లాం ధర్మశాస్త్రంలో రంజాన్‌కు... మరి ఏ నెలకూ లేని ప్రాధాన్యత ఉంది. ఈ మాసాన్ని ఘనంగా, హృదయపూర్వకంగా స్వాగతించడం కోసం... ముందు నెల అయిన షాబాన్ నుంచే సంసిద్ధులు కావాలని మహాప్రవక్త పిలుపునిచ్చేవారు. ‘‘ఒక శుభప్రదమైన మాసం రాబోతోంది. ఈ నెలలో ఉపవాసాలను అల్లాహ్ మీకు తప్పనిసరి విధిగా చేశాడు. ఈ మాసంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారాలు మూసుకుంటాయి. సైతాన్లు సంకెళ్ళతో బందీలవుతారు. వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైన రాత్రి... లైలతుల్ ఖద్ర్ (మహోన్నతమైన శుభరాత్రి) ఈ మాసంలోనే ఉంది. పూర్తి విశ్వాసంతో కూడిన ఉత్సాహంతో వరాల రంజాన్ మాసానికి స్వాగతం చెప్పేవారు గొప్ప అదృష్టవంతులు. ఆరాధనకు ఇది ఎంతో ముఖ్యమైన నెల. ఈ మాసంలో ఎవరైనా ఒక సత్కార్యాన్ని సంతోషంగా, అంతర్ ప్రేరణతో చేసినట్టయితే... ఆ సత్కార్యం ఇతర మాసాల్లో విధిగా చెయ్యవలసిన ఒక కార్యంతో సమానంగా పరిగణన పొందుతుంది. అలాగే ఎవరైనా విధిగా చెయ్యవలసిన కార్యాన్ని ఆచరిస్తే... అది ఇతర మాసాల్లో డెబ్భై విధులను ఆచరించడంతో సమానంగా పరిగణన పొందుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసంలో నెలవంకను చూడగానే ‘‘ఓ అల్లాహ్! ఈ చంద్రుణ్ణి మాకు శాంతిని, విశ్వాసాన్ని, శ్రేయస్సును కలిగించే నెలవంకగా ఉదయింపజెయ్యి. నీకు అభీష్టమైన, ప్రీతికరమైన పనులు చేసేలా మమ్మల్ని కటాక్షించు’’ అని ప్రార్థించాలని ఆయన చెప్పేవారు.
రంజాన్ మాసంలో అల్లాహ్ ప్రీతి కోసం అయిదు పనులను ముఖ్యంగా చెయ్యాలి. మొదటిది: కలిమా ఎ తయ్యిబహ్ (దేవుడొక్కడే. ఆయన ప్రవక్త మహమ్మద్ అని విశ్వసించడం). రెండోది: ఇస్తిర్‌ఫార్ (క్షమాపణ కోరడం), మూడోది: అల్లా్‌హను ప్రార్థించి... స్వర్గ ప్రవేశాన్ని కోరడం. నాలుగోది: నరకం నుంచి కాపాడాలని వేడుకోవడం. అయిదోది: అంతిమ దివ్య గ్రంథమైన ఎక్కువసార్లు చదవడం. దానిలోని ధర్మాలను అమలు పరచడం. ఇతరులకు ఆ సందేశాన్ని చేరవెయ్యడం.
అనంత కరుణామయుడు, అపార కృపాశీలి అయిన అల్లాహ్ మానవులకు అందించిన పవిత్ర మాసంగా, సమస్త శుభాలకు నిలయంగా, సర్వ కారుణ్యాలకు ఆలవాలంగా, సహనాన్ని, దాతృత్వాన్ని పెంచే పుణ్యమాసంగా, పేద, గొప్ప తారతమ్యాలను తొలగించే మాసంగా, సర్వమానవ సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, పరస్పర ప్రేమాభిమానాలను ద్విగుణీకృతం చేసే మాసంగా రంజాన్‌ను పవిత్ర గ్రంథాలు ప్రస్తుతించాయి. విశ్వాసులందరూ రంజాన్ మాసంలో రోజూ దివ్య ఖుర్‌ఆన్‌లో ఒక భాగం పారాయణ చెయ్యాలి. రాత్రివేళల్లో తరావీహ్, తహజ్జాద్ నమాజులు చెయ్యాలి. జకాత్, ఫిత్రా దానాలు, తాఖ్ రాత్రులు (బేసి రాత్రులు) ఏతేకాఫ్ (తపో నిష్ఠ), దుఆ (వేడికోలు) లాంటి ఆధ్యాత్మిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఫర్జ్, సున్నత్, నఫీల్ నమాజులు ఎక్కువగా చెయ్యాలి. సహరీ, ఇఫ్తార్‌లలో ఇతరులను భాగస్వాములుగా చేసుకోవాలి. ఇవన్నీ తప్పకుండా ఆచరించాలనే గట్టి సంకల్పంతో... పవిత్రమైన రంజాన్ మాసాన్ని హృదయపూర్వకంగా, సంతోషంగా స్వాగతించాలి.
మహమ్మద్ వహీదుద్దీన్