Share News

Singer Sunitha Interview : చేతిలో ఫోన్‌ ఉన్నవారందరూ హీరోలే..

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:50 PM

గాయని సునీత గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, టెలివిజన్‌ షో హోస్ట్‌గా ఆమె బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక లైవ్‌షో చేస్తున్నారు.

 Singer Sunitha Interview : చేతిలో ఫోన్‌ ఉన్నవారందరూ హీరోలే..

గాయని సునీత గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, టెలివిజన్‌ షో హోస్ట్‌గా ఆమె బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక లైవ్‌షో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘నవ్య’కు ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ విశేషాలోకి వెళ్తే...

చాలా కాలం తర్వాత కచేరీ చేస్తున్నట్లున్నారు..!

అవునండి. 2019లో శిల్పకళావేదికలో నా కచేరీ జరిగింది. బాలుగారు మధ్యలో హఠాత్తుగా స్టేజీ మీదకు రావటం, అందరూ షోను ఆస్వాదించడం... ఇలా ఆ జ్ఞాపకాలన్నీ ఇంకా పదిలంగా ఉన్నాయి. మళ్లీ చాలాకాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. ఈ నెల 22న అదే శిల్పకళావేదికలో షో చేస్తున్నా. దీని కోసం బాగా ప్రాక్టీసు చేస్తున్నా. టెన్షన్‌గా కూడా ఉంది.

అప్పటికీ, ఇప్పటికీ మార్పులేమైనా వచ్చాయా?

అప్పుడు పూర్తిగా పాట పాడేవాళ్లం. ఇప్పుడు షోలలో మిడ్లి రోజులు వచ్చేశాయి. షోల దాకా ఎందుకూ... సినిమాల్లో కూడా ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే ఉండే రోజులు వచ్చేశాయి.

ఇప్పుడు అందరి జీవితాల్లోనూ సోషల్‌ మీడియా ఒక ప్రధానమైన పాత్ర వహిస్తోంది. దీనివల్ల మన జీవితాల్లో ఏవైనా మార్పులు వచ్చాయా?

నాకు అవసరమా? అనవసరమా? అనే విషయాన్ని ఆలోచించకుండా ఒకప్పుడు నేను సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టా. నా అకౌంట్‌కు ఉన్న లైక్‌ల కౌంట్‌ నామీద ఎలాంటి ప్రభావం చూపించదు. అయితే ఏదైనా ఒక విషయానికి సంబంధించి నిజాలు చెప్పాల్సి వచ్చినా, ఏదైనా అబద్ధం ప్రచారంలోకి వస్తున్నప్పుడు అది నిజం కాదని చెప్పాల్సి వచ్చినా సోషల్‌ మీడియా ఒక వేదికగా మారింది.ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్‌ మీడియా తప్పనిసరి.

యంగ్‌ టాలెంట్‌కు ఇదొక వేదిక అంటున్నారు..?

తమ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించాలనుకొనేవారికి ఇది వేదిక అనటంలో సందేహంలేదు. ఫ్యాన్‌ బేస్‌ కూడా పెరుగుతుంది. అయితే అక్కడ ఎవరి టార్గెట్‌ వాళ్లది. ఉదాహరణకు నేను ఒక పాట పాడి పెట్టాననుకోండి... నేను అవకాశాల కోసం ఆ పాటను పెట్టడంలేదు. అందరూ చూసి ఆనందించాలనేది నా టార్గెట్‌. ఇంకొకరి టార్గెట్‌ వేరేగా ఉండవచ్చు.

సోషల్‌ మీడియాలో మంచి ఎక్కువా? చెడు ఎక్కువా?

సోషల్‌ మీడియా ఇంత చొచ్చుకు రాని సమయంలో- టాలెంట్‌ మీదే ఎక్కువగా ఫోకస్‌ ఉండేది. ఇప్పుడు వ్యక్తుల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోయింది. నేను 2011 నుంచి సోషల్‌ మీడియాలో ఉన్నా. అప్పటి నుంచి వస్తున్న మార్పులన్నింటినీ గమనిస్తూనే ఉన్నా. ఈ మధ్యకాలంలో అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు వచ్చేసాయి. ఫ్రీ వైఫై చాలా చోట్ల అందుబాటులోకి వచ్చేసింది. దాంతో చేతిలో ఫోన్‌ ఉన్నవారందరూ హీరోలే కదా! నా ఉద్దేశంలో సోషల్‌ మీడియాలో మంచి ఉంది, చెడూ ఉంది. మనకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు దీనిని ఉపయోగించుకుంటే కోట్ల మందికి ఒకేసారి వెళ్లిపోతుంది. మీకో సంఘటన చెబుతాను. నేను ‘‘మా తోటలో మామిడి కాయ కాసింది’’ అని పెడితే- ‘‘సునీత తల్లి కాబోతోంది’’ అని రాసేశారు. నేను మళ్లీ అదే వేదిక మీదకు వెళ్లి ‘‘నాయనలారా.. నన్ను అర్థం చేసుకోండి’’ అని అడిగా.

అయితే మీరూ సోషల్‌ విక్టిమే అనుకుంటా...

అవును.. కానీ ఎవరినైనా బోనులో వేసి కొడుతున్నప్పుడు- కొద్దికాలానికి ఆ దెబ్బల బాధ తెలియదు. ‘నన్ను ట్రోల్‌ చేసేవాళ్లు, విమర్శించే వారు నా జీవితాన్ని డిసైడ్‌ చేసేవాళ్లు కాదు’ అనే విషయాన్ని నమ్మటం మొదలుపెట్టాక ప్రశాంతత వచ్చింది. నా సొంత మనుషులకు నేను ఏం చేస్తున్నానో తెలుసు. అలాంటప్పుడు ఎవరికో నేనెందుకు సమాధానాలు ఇవ్వాలి? ఈ ఆలోచనల వల్ల చాలా మార్పు వచ్చింది. ఆ తర్వాత నా గురించి మంచిగా రాయటం మొదలుపెట్టారు.

కొందరు గాయకులు కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు హఠాత్తుగా మాయమవుతారు. కారణం?

మార్పు సహజంగానే వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఫిమేల్‌ సింగర్స్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మహిళల శరీరంలో ఈస్ట్రోజిన్‌ అనే హార్మోన్‌ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. 40ల తర్వాత గాయనీమణుల శరీరంలో మార్పులు వస్తాయి. ఆ ప్రభావం గొంతుపై కూడా పడుతుంది. గొంతు డ్రై అయిపోతుంది. చిన్నప్పటి నుంచి సాధన ఉండి, ఆత్మవిశ్వాసం ఉన్న సింగర్స్‌ మరో పదేళ్లపాటు పాడగలుగుతారు. ఈ విషయాన్ని అంగీకరించి, ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వకపోతే సమస్యలు ఎదురుకావు. పాడటం అనేది దేవుడు కొందరికి మాత్రమే ఇచ్చిన వరం. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే శక్తి పాటకు ఉంటుంది. అందువల్ల దానిని సమాజహితానికి వాడుకుంటే మంచిది.

మీరు అలాంటి కార్యక్రమాలేవైనా చేస్తూ ఉంటారా?

నేను చేసే కార్యక్రమాల గురించి చెప్పటం నాకు ఇష్టం ఉండదు. అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా.. చివరి దశలో ఉన్న క్యాన్సర్‌ పేషెంట్లకు మందులు పనిచేయవు. అలాంటి వారి దగ్గరకు వెళ్లి పాటలు పాడుతుంటా. దానివల్ల వారికి స్వాంతన లభిస్తుంది. నాకు మానసికంగా తృప్తిగా అనిపిస్తుంది.

ఇప్పటి తరం గాయనీ గాయకులపై మీ అభిప్రాయమేమిటి?

కొందరిలో తపన, టాలెంట్‌ ఉన్నాయి. కానీ ఓపిక లేదు. సరైన మార్గదర్శకత్వం అందించే వారు లేదు. ఇక్కడ ఎవరి జర్నీ వారిది. నాకు పాడటం వెనకున్న టెక్నిక్స్‌ తెలుసుకోవటానికి పదేళ్లు పట్టింది. 28 ఏళ్ల తర్వాత కూడా నేర్చుకుంటూనే ఉన్నా. అందువల్ల ఓపికగా ఉంటే అవకాశాలు లభిస్తాయి.

small-01-(5).jpg

అందరూ పాడవచ్చు. కానీ ఎక్కడ పాడుతున్నారనేది ముఖ్యం. రికార్డింగ్‌ స్టూడియోలో అందరూ పాడలేరు. అందుకే కొద్ది మంది మాత్రమే ప్లేబ్యాక్‌ సింగర్స్‌ అవుతారు.

సోషల్‌ మీడియాకు సంబంధించి నేను కొన్ని పరిధులు ఏర్పరుచుకున్నాను. నేను హోం టూర్లు చేయను. నా ఫ్రిజ్‌లో ఏముందో, బ్యాగ్‌లో ఏముందో చూపించను. నాకు లక్షలమంది ఫాలోవర్స్‌ ఉండకపోవచ్చు. కానీ నన్ను అభిమానించేవారు మాత్రం నా గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. వారితో కమ్యూనికేట్‌ చేస్తూనే ఉంటా.

నా పిల్లలు నేను పాడితే తప్ప పడుకొనేవారు కాదు. అంత అదృష్టం ఎంత మంది అమ్మలకు లభిస్తుంది? ఇప్పటికీ మా అమ్మ ‘నగుమోము... ఒక్క సారిపాడవే’ అంటుంది. ఆ విధంగా చూస్తే నేను ఎంతో అదృష్టవంతురాలిని.

రామారావుగారి చివరి రోజుల్లో లక్ష్మీపార్వతిగారు రాసిన కొన్ని పాటలను రికార్డింగ్‌ చేయించాలనుకున్నారు. అప్పుడు నేను ప్రాక్టీస్‌ కోసం వాళ్లింటికి వెళ్లేదాన్ని. ఒక రోజు ఆయన నేను పాడుతుంటే విన్నారు. నన్ను పిలిచి ‘‘నీ గొంతు సుశీలగారి గొంతులా తియ్యగా, సన్నగా ఉంది. వారు మాకు అత్యంత ముఖ్యులు’’ అన్నారు. అదొక మరిచిపోలేని ప్రశంస. 'శ్రీరామదాసు లో ‘చాలు.. చాలు...’ పాట విని ఒక రోజు ఏఎన్నార్‌ గారు ఫోన్‌ చేశారు. ‘ఎంత బాగా పాడవమ్మా. స్నేహ ఆ పాటకు తగ్గట్టుగా యాక్ట్‌ చేస్తే చాలు. పాట విని పిక్చరైజేషన్‌ ఊహించుకోగలిగామంటే దాన్ని పాడిన వారు గొప్ప ప్లేబ్యాక్‌ సింగర్‌ అని అర్థం’ అన్నారు. ఆ మాటలకు ఆ రోజు బాగా ఎమోషనల్‌ అయిపోయా!

పెళ్లి తర్వాత మీలో మార్పు ఏదైనా వచ్చిందా?’’ అని అడుగుతూ ఉంటారు. నాలో ఎలాంటి మార్పు రాలేదు. నా ఐడెంటిటీని ఎప్పటికీ మార్చుకోను. ఇప్పటికీ నేను ఇంట్లో భోజనమే తింటా. బయటకు వెళ్లి కూరగాయలు కొనుక్కుంటా. పాటలు పాడుకుంటా. ఇవన్నీ నాకు నచ్చే పనులు. వీటినెందుకు మార్చుకోవాలి?

నా జీవితానికి ఒక పరమార్ధం ఉంది. దాని కోసమే నేను అన్వేషిస్తున్నా. నాకు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు. కానీ ఇప్పటికైతే నేను ఒక వ్యక్తిగా సంపూర్ణత్వాన్ని సాధించానని అనుకోవటం లేదు.

నేను ప్రస్తుత తరంతో పోటీ పడటం లేదు. ఎందుకంటే నా విలువ నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా నేను ఏ ఒక్కరి దగ్గరకు వెళ్లి అవకాశం ఇవ్వమని అడగలేదు. అందరూ నన్ను పిలిపించి పాడించుకున్నవారే!

మాటలో, ఉచ్చారణలో స్పష్టత తప్పనిసరిగా ఉండాలి. అలా పాడటం గాయకుల బాధ్యత. కొన్నిసార్లు తప్పు జరిగే అవకాశం ఉంటుంది. నా ఉద్దేశంలో పాటను వింటూ కాగితంపై రాసుకోగలగాలి. అంతే తప్ప గూగుల్‌కు వెళ్లి లిరిక్స్‌ కోసం వెతికే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయంలో మనకన్నా తమిళం, కన్నడం వాళ్లు చాలా కచ్చితంగా ఉంటారు. నేను కన్నడంలో చాలా పాటలు పాడాను. అక్కడ రికార్డింగ్‌ సమయంలో పక్కనే కూర్చుని ఉచ్చారణ స్పష్టంగా ఉండేలా పాడించుకుంటారు.

నా ఉద్దేశంలో ఒక గాయనికి మృదుత్వం ఉండాలి. లాలన, పాలన ఆమె వ్యక్తిత్వమై ఉండాలి. భావాన్ని అనుభవించి పాడితేనే మృదుత్వం వస్తుంది. ఒక వ్యక్తి తాలూకు వ్యక్తిత్వ ప్రభావం పాట మీద కూడా ఉంటుంది.

రమ్య బెహరా చాలా మంచి సింగర్‌. చాలా బాగా పాడుతుంది. మంచి టాలెంటెడ్‌. సాహితీ చాగంటి, హరిణి కూడా బాగా పాడతారు. అనురాగ్‌ కులకర్ణి చాలా బాగా పాడుతున్నాడు.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Mar 10 , 2024 | 12:17 PM