Actress Dr. Kamakshi Bhaskarla : మనం మనలా జీవించడమే అందం
ABN , Publish Date - Feb 25 , 2024 | 05:05 AM
మంచి పాత్రలతో పేరు పొందే నటులు కొందరైతే, తమ అభినయ కౌశలంతో ఎలాంటి పాత్రకైనా వన్నెతేగల వాళ్లు ఇంకొందరు. రెండో కోవకు చెందిన ఈ తరం నటి డాక్టర్ కామాక్షి భాస్కర్ల. కథానాయికగా ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా పాత్ర
మంచి పాత్రలతో పేరు పొందే నటులు కొందరైతే, తమ అభినయ కౌశలంతో ఎలాంటి పాత్రకైనా వన్నెతేగల వాళ్లు ఇంకొందరు. రెండో కోవకు చెందిన ఈ తరం నటి డాక్టర్ కామాక్షి భాస్కర్ల. కథానాయికగా ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా పాత్రను రక్తి కట్టించగల కొద్దిమంది నవతరం హీరోయిన్లలో మేటి అనిపించుకున్నారు. సగటు హీరోయిన్ పాత్రలకు భిన్నంగా వెళ్తూ టాలీవుడ్‌లో ప్రతిభావంతురాలైన కథానాయికగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అవకాశాల అన్వేషణలో అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి... విమర్శకుల ప్రశంసలు అందుకొనేదాకా సాగిన ఆమె సినీ ప్రస్థానాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.
మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?
మచిలీపట్నం మా సొంతూరు. నేను చెన్నైలో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. ఇంటర్ వరకూ ఇక్కడే చదివాను. పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా ఆ సమయంలో విదేశాలకు వెళ్లాలనుకున్నాను. అలా చైనాలో వైద్యవిద్య పూర్తి చేశాను.
కెరీర్ ఆరంభంలో డీ గ్లామర్ పాత్రల్లో కనిపిస్తే గ్లామర్ తారగా ఎదగలేరు కదా?
ఆ రెండు రకాల పాత్రలు చేయగలిగే సత్తా నాలో ఉందని నమ్ముతున్నాను. నన్ను ఎలాంటి పాత్రల్లో చూపించాలనేది దర్శకుల నిర్ణయం. ఇకపై రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కూడా చేస్తాను. హీరో అడుగులకు మడుగులొత్తే తరహావి అయినా నటిస్తాను. అయితే అలాంటి పాత్రలు నేను కూడా చేయగలను అని నిరూపించుకోవడానికి మాత్రమే.
మీకు ఎలాంటి పాత్ర ల్లో నటించాలనుంది?
తెరపైకి రాని ఎందరో బడుగు బలహీనవర్గాలకు చెందిన మహిళల పాత్రలను పోషించాలని ఉంది. అట్టడుగు వర్గాల కథలు ఇప్పటిదాకా మనం జనాలకు చూపించలేదు. ‘పొలిమేర 2’లో లక్ష్మి పాత్రనే తీసుకుంటే తనో నిరక్షరాస్యురాలు. కుటుంబమే సర్వస్వం అనుకుంటుంది. కానీ అసహనానికి గురై జీవితంలో తెగించి నిర్ణయాలు తీసుకుంటుంది. డీగ్లామర్ రోల్స్‌లో ఈ తరహా పాత్ర ఇప్పటిదాకా రాలేదు. నేను చేయగలిగాను. ఇలాంటివే సవాల్ విసిరేలా పాత్రలు మరిన్ని చేయాలనుంది.
టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు ప్రోత్సాహం లభిస్తోందా?
మన దర్శకులు, నిర్మాతలు లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించడం లేదు అనడం తప్పు. సమస్య క్యాస్టింగ్ డైరెక్టర్ల దగ్గరే వస్తుంది. దర్శకులకు వారి కథపైనే ఫోకస్ ఉంటుంది. వారు నటీనటుల ఎంపికకు క్యాస్టింగ్ డైరెక్టర్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్ల కొరత ఉంది. ముంబై, బెంగళూరు లాంటి చోట్ల క్యాస్టింగ్ ఏజెన్సీలు ఉంటాయి. అక్కడ నుంచి క్యాస్టింగ్ డైరెక్టర్లను మన దర్శకులు తీసుకుంటారు. వాళ్ల దగ్గర తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ ఉండవు. ముంబై, బెంగళూరు హీరోయిన్ల ప్రొఫైల్స్ ఉంటాయి. అందులో నుంచి ఒకరిని దర్శకులు ఎంపిక చేసుకుంటారు. ముందు మనం మన క్యాస్టింగ్ డైరెక్టర్లకు పెద్దపీట వేయాలి. అప్పుడే మనవాళ్లకు అవకాశాలు వస్తాయి.
బాగా చదువుకొని సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకొన్నారా?
‘సినిమా అనేది వ్యాపారం. నువ్వు ఎమోషనల్‌గా, సెన్సిటివ్‌గా ఉంటావు. నెగ్గుకురాలేవు. డాక్టర్‌గా మంచి జీవితం ఉంటుంద’ని అన్నారు. నేను ఇప్పుడున్న స్థాయికి చేరతానని ఆరోజే ఊహించాను. అందుకే వెనక్కు తగ్గలేదు. నేను ఎదిగే క్రమం చూసి, ఇంట్లో వాళ్లు క్రమంగా సపోర్ట్ చేశారు.
హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలనే అభిప్రాయం పరిశ్రమలో ఉంది కదా?
మనదగ్గర హీరోయిన్ అంటే తెల్లగా ఉండాలని చాలా బలంగా నమ్ముతారు. నాది చామనచాయ కావడంతో వివక్ష ఎదుర్కొన్నాను. ఆరంభంలో రెండు చిన్న సినిమాల్లో అవకాశమిచ్చి మధ్యలో తప్పించారు. ‘లీడ్ రోల్ కోసం నన్ను కూడా ఆడిషన్ చేస్తారా’ అని అడిగితే ‘మీరు తెల్లగా లేర’ని చెప్పడానికి ఇబ్బందిపడేవారు. అయితే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, విక్రమ్ కె కుమార్ నా నటనను మెచ్చుకున్నారు. ‘నీకు మంచి భవిష్యత్ ఉంద’ని ప్రోత్సహించారు.
అడ్డంకులు ఎదురైనప్పుడు ఈ రంగాన్ని వదిలేద్దాం అనిపించలేదా?
నటన అనేది నాకు పూర్తిగా కొత్త రంగం. డాక్టర్‌గా నేను గొప్ప కావొచ్చేమే కానీ ఇక్కడ కాదు. నటిగా నా ప్రయాణం సున్నా నుంచి మొదలుపెట్టాను. అయితే కొన్నిసార్లు అవకాశాలు దక్కకుండా చేసినప్పుడు కొంచెం నిరుత్సాహం కలిగింది. కానీ ఈ రంగాన్ని వదిలేద్దామని అనిపించలేదు.
మీ టాలెంట్ అందరికీ తెలిసింది. ఇకపై పెద్ద హీరోలు, దర్శకులు అవకాశం ఇస్తారంటారా?
అవకాశం వస్తే మంచిదే. రాకపోతే మరింత కష్టపడతాను. జీవితం అంత సులువైనదని నేను అనుకోవడం లేదు. స్టార్ హీరోల సరసన అవకాశం వస్తే మంచిదే, చేస్తాను. కానీ వాళ్లతో నటించాలనే కోరికతో అయితే నేను పరిశ్రమకు రాలేదు. రచయితగా, దర్శకురాలిగా, నిర్మాతగా... ఇలా విభాగంతో సంబంధం లేకుండా పరిశ్రమలో ఉండడం, ప్రేక్షకులకు ఓ మంచి కథ చెప్పడమే నాకు ముఖ్యం.
చిరంజీవి ‘వశిష్ఠ’లో మీనాక్షిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది?
నాక్కూడా తెలియదు. అందరూ అంటున్నారు. నిజమైతే బాగుంటుంది.
మీ అభిమాన రచయిత, మీపై ప్రభావం చూపిన పుస్తకం?
చలంగారి ప్రభావం నాపైన చాలా ఉంది. ఆయన రచనల్లో ‘స్త్రీ’, ‘బిడ్డల శిక్షణ’, ‘మైదానం’ ఇష్టం. గొల్లపూడి మారుతీరావు పుస్తకాలు బాగా చదువుతాను. ఆంగ్లంలో యువల్ హరారీ, ఎడిత్ ఎవా ఎగెర్ రచనలు చదువుతాను.
‘మిస్ తెలంగాణ’ టైటిల్ గెలుచుకున్నప్పుడు, ‘మిస్ ఇండియా’ తుదిపోరులో వెనుదిరిగినప్పుడు.. మీ మానసిక స్థితి ఎలా ఉంది?
2018 ఫిబ్రవరిలో మిస్ తెలంగాణ గెలిచాను. జూన్‌లో మిస్ ఇండియా పోటీలకు వెళ్లాను. టాప్ 15 వరకూ పోటీ ఇచ్చాను. అంతవరకే అందరికీ తెలుసు కానీ ఈ పోటీల కోసం 2016 నుంచి సన్నద్ధమయ్యాను. అప్పుడు చైనాలో ఉన్నాను. ఆర్థికంగా ఇంట్లో భారం అవ్వకూడదని ఉదయం డాక్టర్‌గా జాబ్ చేస్తూ, సాయంత్రం చైనాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో క్లాసికల్ డాన్స్‌లో ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. రోజుకు నాలుగు గంటలే నిద్రపోయేదాన్ని. ఈ కష్టమంతా ప్రేక్షకులకు తెలియదు. వందమంది అమ్మాయిల్లో ఒక్కరు గెలిచారంటే మిగిలినవాళ్లంతా పరాజితులు అని కాదు. నా దృష్టిలో మనం అనుకున్న లక్ష్యం వైపు శక్తివంచన లేకుండా ప్రయత్నించడమే సక్సెస్. తుదికంటా పోరాడితే అది నా సక్సెస్. మధ్యలోనే వదిలేస్తే అది నా ఫెయిల్యూర్.
‘పొలిమేర 2’కు డైలాగ్స్, స్ర్కీన్‌ప్లే రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నటిగా పలు శాఖల్లో పనిచేశారు. సినిమాపై అంత మమకారం ఏమిటి?
సినిమా అనేకాదు, స్వచ్ఛందసంస్థలో పని చేసినా, నాటకరంగంలో ఉన్నా, మెడిసిన్ చేసినా నేను ఇలానే కష్టపడ్డాను. 24 విభాగాల్లో యాక్టింగ్ అనేది ఒకటి మాత్రమే. యాక్టర్‌గా నా వల్లే సినిమా ఆడుతోంది అనుకోవడం సరికాదు.
కొత్తగా వచ్చేవాళ్లకు మీరిచ్చే సలహా?
వారసత్వంగా పరిశ్రమకు వచ్చేవాళ్లకు ఓ సౌలభ్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్లు సినిమా మేకింగ్‌ను దగ్గర్నుంచి చూస్తారు. ఇంట్లోనే యాక్టర్‌లు ఉంటారు. సెట్స్‌కు వెళ్లి చూస్తూ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ బయటవాళ్లకు ఆ అవకాశం ఉండదు. అందుకే నాటకరంగంలో పనిచేయాలి. అక్కడ టెక్నిక్ పట్టుబడుతుంది. అప్పుడు మాత్రమే ప్రకాశ్‌రాజ్‌లా కొన్ని వందల సినిమాలు చేసినా జనాలకు మొనాటినీ రాదు. లేదంటే రెండు మూడు సినిమాలకే వెనక్కివెళ్లిపోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఫెయిలైనా ఇబ్బందిపడకుండా మరో ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంచుకోవాలి. చాలామంది ప్యాషన్ అని చెప్పి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వస్తారు. మొదట్లో బాగున్నా తర్వాత అవకాశాలు తగ్గితే మళ్లీ వెనక్కు వెళ్లి ఆర్థికంగా స్థిరపడడం కష్టం. అందుకే ముందు బాగా చదువుకోవాలి.
చైనాలో ఆరేళ్లున్నారు. అక్కడ ప్రభుత్వం ప్రజలను అణచివేస్తుందనేది నిజమా?
మనం బయటివాళ్లుగా అక్కడి పరిస్థితుల గురించి కామెంట్ చేయకూడదు. చైనా ప్రజలు చాలా కష్టపడతారు. క్రమశిక్షణతో ఉంటారు. సమయపాలనను కచ్చితంగా పాటిస్తారు. వాళ్లను చూసి నేనూ అలా మారాను. వాళ్లు అక్కడి సిస్టమ్‌కు అలవాటుపడిపోయారనుకుంటా. ‘మా జీవితం బాగాలేద’ని ప్రజలు ఫిర్యాదు చేయడం నేను ఎక్కడా చూడలేదు. వినలేదు. చేసే పనితో వాళ్లు సంతోషంగా ఉన్నారు. వైద్య సదుపాయాలు మనకన్నా అక్కడ మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు. అందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మారుమూల గ్రామాలకు కూడా వైద్యం అందుతుంది.
మహిళల కోసం పోరాడే క్రమంలో భౌతిక దాడులు కూడా ఎదుర్కొన్నారు?
మధ్యతరగతి నేపథ్యమే దానికి కారణం. బాల్యం నుంచి నేను ఎదుర్కొన్న సంఘటనలు నన్ను ప్రభావితం చేశాయి. అందుకే ఒక స్థాయికి వచ్చాక ఇతరులకు నాకు చేతనైన సాయం చేయాలనుకున్నాను. పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి పని చేస్తున్నాను.
‘కష్టాన్ని నమ్ముకోవాలి, విలువలతో బతకాలి. మేలు చేయకపోయినా ఫరవాలేదు, ఎవరికీ కీడు చేయకూడదు’ అని చిన్నప్పటి నుంచి ఇంట్లో నేర్పారు. వాటిని పాటించటం వల్లే ఈ రోజు నేను ఒక స్థాయిలో ఉన్నాననుకుంటున్నాను.
సమాజంలో అందమైనవాళ్లకు మాత్రమే కథలు ఉంటాయా? ప్రతి ఒక్కరికీ కథ ఉంటుంది. రాళ్లెత్తే కూలీలు, ఇంట్లో పనిమనిషికి కూడా ఒక కథ ఉంటుంది. వాళ్ల జీవితాల్లోనూ మంచీ చెడూ, సంఘర్షణ ఉంటాయి. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరిందంటున్నారు. ఇంకా మనం ఒక అందమైన అమ్మాయి, ఆమెను కాపాడే హీరో అనే ఆలోచన దగ్గరే ఆగిపోదామా?
అందానికి మీరిచ్చే నిర్వచనం?
భౌతిక సౌందర్యం అనేది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. మనం మనలా నిర్మొహమాటంగా జీవించగలగటమే అందం.
దండేల కృష్ణ