Share News

Navya : ఎ2జెడ్‌... ఏదైనా ఓకే!

ABN , Publish Date - May 26 , 2024 | 11:59 PM

‘‘డ్రైవింగ్‌ అంటే అప్పట్లో చాలా భయం. డ్రైవర్‌ సీట్లో కూర్చోగానే కాళ్ళు వణికేవి. ఇప్పుడు ఇతరుల్లో భయాన్ని పోగొడుతున్నానంటే... నాకే ఆశ్చర్యం అనిపిస్తోంది’’ అంటారు రాధామణి లాలన్‌. స్కూటర్‌ నుంచి క్రేన్లు, బుల్డోజర్ల వరకూ.... ఏ వాహనాన్నైనా సులువుగా డ్రైవ్‌ చేసే ఈ డెబ్భై మూడేళ్ళ కేరళ మహిళకు పదకొండు డ్రైవింగ్‌ లెసెన్స్‌లు ఉన్నాయి.

Navya : ఎ2జెడ్‌...   ఏదైనా ఓకే!

‘‘డ్రైవింగ్‌ అంటే అప్పట్లో చాలా భయం. డ్రైవర్‌ సీట్లో కూర్చోగానే కాళ్ళు వణికేవి.

ఇప్పుడు ఇతరుల్లో భయాన్ని పోగొడుతున్నానంటే... నాకే ఆశ్చర్యం అనిపిస్తోంది’’ అంటారు రాధామణి లాలన్‌. స్కూటర్‌ నుంచి క్రేన్లు, బుల్డోజర్ల వరకూ.... ఏ వాహనాన్నైనా సులువుగా డ్రైవ్‌ చేసే ఈ డెబ్భై మూడేళ్ళ కేరళ మహిళకు పదకొండు డ్రైవింగ్‌ లెసెన్స్‌లు ఉన్నాయి.

పదిహేను డ్రైవింగ్‌ స్కూల్స్‌కు యజమాని అయిన రాధామణి గురించి ఆమె మాటల్లోనే...

‘‘కేరళలోని అళప్పుజా నా స్వస్థలం. నాది కూడా అందరు పిల్లల్లా ఆడుతూ పాడుతూ తిరిగే బాల్యమే. కానీ మా అమ్మా నాన్నా చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. సైకిల్‌ తొక్కుతానన్నా... దెబ్బలు తగులుతాయని వద్దనేవారు. నాకు సరదా ఉన్నా ఏదీ నేర్చుకోలేకపోయాను. పెద్దగా చదువుకోనూ లేదు. నాకు పదిహేడేళ్ళ వయసులో... లాలన్‌తో పెళ్ళయింది. ఎర్నాకుళంలో మా కాపురం.

ఆయన కొన్నేళ్ళు ఉద్యోగం చేశాక... ఏదైనా సొంత వ్యాపారం పెడితే బాగుంటుందనుకున్నారు. 1978లో డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించారు. ‘‘నువ్వు కూడా డ్రైవింగ్‌ నేర్చుకుంటే బాగుంటుంది’’ అంటూ ప్రోత్సహించారు. అలా మొదట కారు నడపడం నేర్చుకున్నాను. 1981లో లైసెన్స్‌ వచ్చింది. ఆ ఉత్సాహంతోనే హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ మీద కూడా పట్టు సాధించాను. కానీ ఆ సమయంలో హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చే సంస్థలు కేరళలో లేవు. దాంతో లైసెన్స్‌ కోసం మంగుళూరు వెళ్ళాల్సి వచ్చింది. చాలా ఖర్చయింది.

మా రాష్ట్ట్రంలో ఆ లైసెన్స్‌ పొందిన తొలి మహిళను నేనే. ఈ అనుభవంలో... ఒక కొత్త వ్యాపార మార్గం కూడా కనిపించింది. మా సంస్థ పేరును ‘ఎ2జెడ్‌ డ్రైవింగ్‌ ఇనిస్టిట్యూట్‌’’గా మార్చాం. అప్పట్లో హెవీ వెహికిల్‌ లైసెన్సుల్ని... అంటే ఒక వ్యక్తి ఆ వాహనాన్ని సమర్థవంతంగా నడపగలడనే ధ్రువీకరణ పత్రాన్ని... ప్రైవేటు సంస్థలు ఇచ్చేవి. దానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి.Untitled-3 copy.jpg


ఆ అనుమతి కోసం మేము ఎంతో పోరాటం చెయ్యాల్సి వచ్చింది. ఎన్ని దరఖాస్తులు చేసినా... అధికారులు వాటిని పక్కన పడేసేవారు. చివరకు న్యాయ పోరాటం ద్వారా అనుమతి సాధించుకోగలిగాం. నేనూ ట్రైనింగ్‌ ఇచ్చేదాన్ని. శిక్షకురాలిని నేనేనని అనగానే చాలామంది వెనక్కు పోయేవారు. ఎందుకంటే... ఆ రోజుల్లో మహిళలు డ్రైవింగ్‌ చేస్తూ కనిపించడం చాలా అరుదు. కారు నడుపుతూ ఒక మహిళ కనిపిస్తే... జనం ఆట పట్టించేవారు, చులకనగా మాట్లాడేవారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు హారన్లు కొడుతూ వేధించేవారు. ఇదేమిటని అడిగితే ‘‘ఇంట్లో పనేం లేదా?’’ అనే వారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాను. క్రమంగా నాకు జనం, జనానికి నేను అలవాటు పడిపోయాం.

అది గొప్ప గౌరవం...

జీవితం సజావుగా సాగుతోందనుకున్న దశలో... 2004లో నా భర్త హఠాత్తుగా మరణించారు. ఆ సంఘటనతో మానసికంగా కుంగిపోయాను. ఆరోగ్యం కూడా దెబ్బతింది. దాదాపు ఏడాది పాటు డ్రైవింగ్‌ స్కూల్‌ మూసేయాల్సి వచ్చింది. ఏదో ఒక వ్యాపకం లేకపోతే... నా ఆరోగ్యం మరింత క్షీణిస్తుందేమోనని మా పిల్లలు భయపడ్డారు. వారి బలవంతం మీద స్కూల్‌ మళ్ళీ తెరిచాను.

ఉత్సాహం ఉన్నవాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం... స్కూటర్‌, ఆటో, కారు లాంటి తేలికపాటి వాహనాలతో పాటు ట్రైలర్‌, బుల్డోజర్‌, ఎక్సవేటర్‌, ట్రాక్టర్‌, క్రేన్‌, బస్సు, ఫోర్క్‌లిఫ్ట్‌, లారీ లాంటి భారీ వాహనాలు నడపడం నేర్చుకున్నాను. నాకు పదకొండు లైసెన్స్‌లు ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు లాంటివి రవాణా చెయ్యాలంటే ఎంతో అప్రమత్తత, ధైర్యం ఉండాలి.

దాన్ని పరీక్షించి... ‘హజార్డస్‌ లైసెన్స్‌ ఇస్తారు. నా దగ్గిర అదీ ఉంది. ఈ వయసులో ఇన్ని లైసెన్సులు ఉన్న మహిళను నేనే. ఇప్పుడు మా డ్రైవింగ్‌ స్కూల్‌కు అళప్పుజా, కొట్టాయం, ఎర్నాకుళాల్లో 15 బ్రాంచీలున్నాయి. కిందటి ఏడాది భారత దేశంలో మొదటిసారిగా జెసిబి ఎలక్ట్రిక్‌ ఎక్సవేటర్‌ ప్రవేశపెట్టినప్పుడు... దాన్ని మొదటిసారి టెస్ట్‌ డ్రైవ్‌ చేసే అవకాశం నాకు దక్కడం గొప్ప గౌరవం.


అలాగే కేరళ ప్రభుత్వంతో పాటు దేశ, విదేశాల్లోని ఎన్నో సంస్థల నుంచి పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళతో పాటు నా కోడళ్లు, మనుమలు ఇప్పుడు మా స్కూళ్ళ వ్యవహారాలు చూసుకుంటున్నారు. మా అమ్మాయి మినీ వైకేత్‌ మా రాష్ట్రంలో ఆటోమొబైల్‌ డిప్లమా పొందిన తొలి మహిళ.

ఇప్పుడు డ్రైవింగ్‌ స్కూళ్ళకు వస్తున్న వారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటున్నారు. నేను ఏదైనా వాహనం నడుపుతూ వెళ్తూంటే... ‘ఈ వయసులో ఈమే నడుపుతున్నప్పుడు మనం ఎందుకు నడపలేం?’ అనే ఆలోచన తమలో కలిగిందని ఎవరైనా చెప్పినప్పుడు... నాకు ఎంతో సంతోషం కలుగుతుంది.. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చి, ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కలిగించడం కన్నా గొప్ప సంతృప్తి మరేముంటుంది?’’

Updated Date - May 27 , 2024 | 12:00 AM