Share News

M. Sripathy : సంకల్పమే బలం

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:10 PM

తిరువణ్ణామలై జిల్లా... పులియూర్‌ గ్రామం... తమిళనాడులోనే అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతం. కనీస వసతులు కూడా లేని ఆ గ్రామం నుంచి ఓ మహిళ సివిల్‌ జడ్జి అయ్యారు.

M. Sripathy : సంకల్పమే బలం

తిరువణ్ణామలై జిల్లా... పులియూర్‌ గ్రామం...

తమిళనాడులోనే అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతం.

కనీస వసతులు కూడా లేని ఆ గ్రామం నుంచి

ఓ మహిళ సివిల్‌ జడ్జి అయ్యారు.

ప్రసవం అయిన రెండు రోజులకే పోటీ పరీక్ష రాసి...

విజయం సాధించిన ఆమె... ఆ రాష్ట్రంలోనే ఈ ఘనత

సాధించిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు.

ఆవిడే 23 ఏళ్ల ఎం.శ్రీపతి.

బాగా చదువుకొని... ఉన్నత స్థానంలో నిలవాలన్నది శ్రీపతి చిన్ననాటి కల. కానీ ఎక్కడో విసిరేసినట్టుండే కొండ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె ఆకాంక్ష నెరవేరాలంటే... ఎన్నో సవాళ్లను అధిగమించాలి. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడాలి. నిరుపేద గిరిజన తెగకు చెందిన శ్రీపతి కుటుంబానికి ఆమెను చదివించడమంటే తలకు మించిన భారం. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. ‘ఊహ తెలిసినప్పటి నుంచి మేం పేదరికంలోనే మగ్గుతున్నాం. నా చుట్టూ బడికి పోవాల్సిన పిల్లలు పనులకు వెళుతున్నారు. ఇది నన్ను కలవరపెట్టింది. ఈ పరిస్థితి మారాలంటే దానికి ఏకైక మార్గం చదువు మాత్రమే. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బడి మానలేదు’ అంటున్న శ్రీపతికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు పెద్దలు.

పెళ్లి తరువాత కూడా ఆమె చదువుకు బ్రేక్‌ వేయలేదు. భర్త, అత్తమామలు, ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే కాలేజీకి వెళ్లారు. సమీప గ్రామంలో బీఏ పూర్తి చేసిన శ్రీపతి... ఆ తరువాత బ్యాచులర్‌ ఆఫ్‌ లాలో ఉత్తీర్ణులయ్యారు. సివిల్‌ జడ్జ్‌ కావాలనే లక్ష్యంతో ‘తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ (టీఎన్‌పీఎ్‌ససీ) పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నారు. దాని కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. టీఎన్‌పీఎ్‌ససీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే అప్పటికి ఆమె నిండు గర్భిణి.

‘ఇక్కడే నాకు ఊహించని పరిస్థితి ఎదురైంది. నాకు డాక్టర్‌ ఇచ్చిన డెలివరీ తేదీ, టీఎన్‌పీఎ్‌ససీ సివిల్‌ జడ్జి పరీక్ష తేదీ పక్కపక్కనే అయ్యాయి. దీంతో ఏంచేయాలో తోచలేదు. పరీక్ష రాయాలంటే చెన్నై వెళ్లాలి. మా ఊరికి రెండొందల కిలోమీటర్ల దూరం. నేనేమో నిండు గర్భిణిని. అంత దూరం ప్రయాణం చేయడం శ్రేయస్కరం కాదని అందరూ చెప్పారు. అలాగని వదిలేస్తే నేను ఎన్నో ఏళ్లుగా పడిన శ్రమకు, కన్న కలలకు అర్థం ఉండదు. ఏంచేయాలి? ఆలోచిస్తుంటే నా భర్త నాకు భరోసా ఇచ్చారు. దాంతో నాకు ధైర్యం వచ్చింది. ఎలాగైనా సరే... పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నా’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీపతి.

పరీక్ష తేదీ దగ్గరపడుతోంది. ఇప్పుడు తను ఒక్కతే కాదు... కడుపులో ఉన్న తన బిడ్డ కోసం కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు పరీక్షకు సన్నద్ధమవ్వాలి. కానీ దానికి ముందే మరో పెద్ద పరీక్ష ఎదురైంది ఆమెకు. సరిగ్గా పరీక్షకు రెండు రోజుల ముందు బిడ్డకు జన్మనిచ్చారు. నిండు చూలాలు. రెండొందల కిలోమీటర్లు ప్రయాణించడం శ్రేయస్కరం కాదని తెలుసు. ఎవరు వద్దన్నా ఆమె వినలేదు. ఓపిక కూడగట్టుకుని... గత సంవత్సరం నవంబర్‌లో చెన్నై వెళ్లి పరీక్ష రాశారు. ఇటీవలే వాటి ఫలితాలు విడుదలయ్యాయి. అందులో విజయం సాధించారు శ్రీపతి. తద్వారా తమిళనాడులోనే సివిల్‌ జడ్జ్‌ అయిన తొలి గిరిజన మహిళగా నవ చరితకు నాంది పలికారు. ‘ఎలాంటి సౌకర్యాలూ లేని కొండ ప్రాంతం నుంచి వచ్చిన శ్రీపతి సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమెకు మద్దతుగా నిలిచిన ఆమె భర్త, కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నా’ అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. టీఎన్‌పీఎ్‌ససీ కార్యాలయం ముంగిట చంటి బిడ్డతో నిలబడిన శ్రీపతి ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Updated Date - Feb 20 , 2024 | 11:10 PM