Share News

ఓ రాజకుమారి విషాద గాథ

ABN , Publish Date - Apr 14 , 2024 | 03:30 AM

కొన్ని అందమైన కథలు చివరికి విషాదాంతాలుగా మిగులుతాయి. అలాంటి ఒక అందమైన కథ... ప్రిన్సెస్‌ నిలోఫర్‌ది. ప్రిన్స్‌ మొజంజాని వివాహం చేసుకొని టర్కీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిలోఫర్‌ తన చివరి దశలో పారిస్‌లో స్థిరపడ్డారు...

ఓ రాజకుమారి విషాద గాథ

కొన్ని అందమైన కథలు చివరికి విషాదాంతాలుగా మిగులుతాయి. అలాంటి ఒక అందమైన కథ... ప్రిన్సెస్‌ నిలోఫర్‌ది. ప్రిన్స్‌ మొజంజాని వివాహం చేసుకొని టర్కీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిలోఫర్‌ తన చివరి దశలో పారిస్‌లో స్థిరపడ్డారు.

ఇప్పటి తరం వారిని ‘నిలోఫర్‌ ఆసుపత్రికి.. మొజంజాహీ మార్కెట్‌కు సంబంధం ఏమిటి?’ అని అడిగితే వెంటనే సమాధానం చెప్పలేకపోవచ్చు. నిలోఫర్‌ ఆసుపత్రిని కట్టించింది ప్రిన్సెస్‌ నిలోఫర్‌. మొజాంజాహీ మార్కెట్‌ ఉన్న ప్రాంతంలోనే ప్రిన్స్‌ మొజంజా బహదూర్‌ పేరిట వెలిసింది. ఒకప్పుడు వీరిద్దరూ హైదరాబాద్‌ హైసొసైటీలో ‘పవర్‌ కపుల్‌’ అని చెప్పవచ్చు. వీరితో నాకు మంచి అనుబంధం ఉంది.

ప్రిన్సెస్‌ నిలోఫర్‌ తండ్రి సుల్తాన్‌ దామాద్‌ మోర్లిజేడ్‌ షహలుద్దీన్‌ ఆలీ బే... టర్కీ ఆఖరి సుల్తాన్‌. ఆ సమయంలో నిజాం వంశీకులతో సంబంధాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆమెను మొజంజా బహుదూర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరూ హిల్‌ఫోర్ట్‌ ప్యాలె్‌సలో నివసించేవారు. ఆ సమయంలోనే ఆమె అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. వాటిలో నిలోఫర్‌ ఆసుపత్రి కూడా ఒకటి. ప్రిన్స్‌ మొజంజా బహుదూర్‌, ప్రిన్సెస్‌ నిలోఫర్‌ మా ఇంటికి తరచూ వస్తూ ఉండేవారు. వారికి నాన్న ధన్‌రాజ్‌గిర్‌ అతిథ్యం ఇస్తూ ఉండేవారు. ఇక్కడ మొజంజా బహుదూర్‌ గురించి కొంత చెప్పాలి. ఆయన సహజంగా కవి. తాను రాసిన కవితలను పాడించి వినటం ఆయనకు ఒక సరదా. అదే విధంగా ఆయన అనేక నాటకాలు కూడా రాశారు. ఆ నాటకాలను జ్ఞాన్‌బాగ్‌ పాలెస్‌లో ఉన్న జూనో, హెర్కూలిస్‌ విగ్రహాల వద్ద రాత్రిళ్లు ప్రదర్శించేవారు. ఆ సమయంలో ప్రత్యేక లైటింగ్స్‌ పెట్టేవారు. ప్యాలెస్‌ అంతా కళకళలాడుతూ ఉండేది. ఆయన నాతో చాలా ప్రేమగా ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఒకటి రెండు కాదు.. పదేసి ఫెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌ ఇచ్చేవారు. ఒకసారి నేపాల్‌ రాజవంశం వారు ఆయనకు బహూకరించిన బంగారు పూత పూసిన డిన్నర్‌ ప్లేట్‌ సెట్‌ కూడా బహుమతిగా ఇచ్చారు. సాధారణంగా మేమందరం మ్యూజిక్‌ రూమ్‌లో కలిసేవాళ్లం. ఒకసారి నాన్న ముంబయిలోని ధన్‌రాజ్‌ మహల్‌లో ఒక పార్టీ ఇచ్చారు. దీనికి నిలోఫర్‌తో కలిసి ఆయన బొంబాయి వచ్చారు. అప్పుడు మా ఇంట్లోనే వారు మా ప్యాలెస్‌ టాప్‌ ఫ్లోర్‌లో ఉండేవారు. నిలోఫర్‌ మా అందరితోనూ కలివిడిగా ఉండేది.

సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ బొంబాయి పార్టీ సీను గురించి కూడా చెప్పాలి. హైదరాబాద్‌ పార్టీలలో ఆల్కాహాల్‌ ఇచ్చేవారు కాదు. టీ, ఇతర తినుబండారాలతో సరిపెట్టుకొనేవారు. కానీ బొంబాయిలో పార్టీ అంటే షాంపైన్‌ ఇవ్వాల్సిందే. ఆ రోజు మా నాన్నగారు ఇచ్చిన పార్టీకి అనేక మంది రాజకుటుంబీకులు వచ్చిన జ్ఞాపకం. టాటాలు, మిస్త్రీలు, బరోడా మహారాజు, గ్వాలియర్‌ మహారాజులతో పాటుగా అనేక మంది రాజకుటుంబీకులు వచ్చేవారు. ఆ పార్టీలో నిలోఫర్‌ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిలోఫర్‌, మొజంజా బహుదూర్‌ రెడ్‌ కార్పెట్‌మీద నడిచి వస్తుంటే అందరూ చప్పట్లు కొట్టిన జ్ఞాపకం. ఇంకో విషయమేమిటంటే... హైదరాబాద్‌ పార్టీలలో లైవ్‌ బ్యాండ్‌ ఉండేది కాదు. కానీ బొంబాయిలో ఉండాల్సిందే. పార్టీకి వచ్చినవారందరూ డ్యాన్స్‌ చేయాల్సిందే. మా పార్టీలో నిలోఫర్‌ కూడా డ్యాన్స్‌ చేసిన జ్ఞాపకం ఉంది. పార్టీలకు వచ్చినప్పుడు నిలోఫర్‌ ఎంత ఉత్సాహంగా ఉండేవారో... సామాజిక సేవా కార్యక్రమాలు చేసే విషయంలోనూ అంతే ఉత్సాహంగా ఉండేవారు. ఒకసారి హైదరాబాద్‌లో ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. ఆ సభలో నిలోఫర్‌- ప్రాథమిక విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిదే ఎలా అవుతుందనే విషయంపై చేసిన ప్రసంగం ఇంకా నాకు గుర్తుంది. ఈ మధ్య పుస్తకాలు తిరగేస్తుంటే ఆమె ప్రసంగం దొరికింది. ‘‘మన జీవితాలకు వెలుగునిచ్చేవి పల్లెటూర్లు. దురదృష్టమేమిటంటే వాటిని మనం చిన్నచూపు చూస్తున్నాం. ఇలాంటి పల్లెటూర్లను అభివృద్ధి చేయాలంటే ధనం అవసరం. కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కానీ మంచి ఆలోచనలున్న మనుషులు ఉన్నారు. వారికి మంచి విలువలు నేర్పితే వారే పల్లెటూళ్లను అభివృద్ధి చేస్తారు. డబ్బు కన్నా ఆలోచన ముఖ్యం. మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలుసుకోవటమే అసలైన విద్య’’ అని ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యచకితులు చేసింది. సభ అయిన తర్వాత కూడా అనేకమంది ఆమె ప్రసంగం గురించే మాట్లాడుకున్నారు.

నిలోఫర్‌ కొద్ది కాలం హైదరాబాద్‌లో నివసించారు. ఆ తర్వాత ముంబయికి, అక్కడి నుంచి ప్యారి్‌సకు వెళ్లిపోయారు. చాలా కాలం ఆమె దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు. కొద్ది కాలం తర్వాత ఆమె ఫ్రెంచ్‌ దేశస్తుడిని పెళ్లి చేసుకున్నట్లు విన్నాను. ఒకసారి నేను ప్యారిస్‌ వెళ్లినప్పుడు- ఆమె నెంబర్‌ సంపాదించి ఫోన్‌ చేశా. ఇంటికి వచ్చి కలుస్తానన్నా. ఆమె నన్ను కలవటానికి ఇష్టపడలేదు. ‘‘నేను గతంలో ఎలా ఉండేదాన్నో.. అలాగే ఉన్నాననుకో.. అలాగే ఊహించుకో’’ అని ఫోను పెట్టేసింది. ఆ తర్వాత నాకు ఎవరో... ఆమెకు మొహం కండరాల క్యాన్సర్‌ వచ్చిందని.. చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. ఒకప్పటి అందాల యువరాణి నిలోఫర్‌కు.. ప్యారిస్‌లో క్యాన్సర్‌తో బాధ పడుతున్న నిలోఫర్‌కు సంబంధం లేదన్నారు. నా మనస్సు బాధతో నిండిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె అక్కడ దీనస్థితిలో మరణించారు. నిలోఫర్‌ను తలుచుకున్నప్పుడల్లా ముంబాయి ధన్‌రాజ్‌ మహల్‌లో పార్టీలోకి ప్రవేశిస్తున్న యువరాణే గుర్తుకొస్తుంది. చాలా మందికి నిలోఫర్‌ చివరి రోజుల గురించి తెలియదు. రాజకుటుంబీకుల జీవితాలు పూలపాన్పులే అనుకుంటున్నారు. కానీ చాలా మంది జీవితాల్లో విషాదం ఉంటుందనే విషయం గమనించరు.

Updated Date - Apr 14 , 2024 | 03:30 AM