Share News

ఎల్లలు దాటిన పాట

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:06 AM

ఆ మధ్య ఓ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు వెళ్లినప్పుడు... ఆమెకు ప్రధాని ప్రత్యేక ఆహ్వానం పంపించి మరీ కలిశారు. తల్లితో కలిసి తమిళనాడులోని పల్లడం వచ్చిన ఆమె... మోదీ ముందు ‘అచ్యుతమ్‌ కేసవమ్‌’ పాడి వినిపించింది...

ఎల్లలు దాటిన పాట

‘రామ్‌ ఆయేంగే’... అయోధ్య రామ్‌ లల్లా ప్రాణప్రతిష్ఠ సమయంలో సామాజిక మాధ్యమాల్లో బాగా వినిపించిన పాట ఇది. అద్భుతమైన పాటలు ఎన్నో ఉన్నా... ఈ పాటే ఎందుకంత ప్రాచుర్యం పొందింది? ఎందుకంటే ఇది పాడింది ఒక జర్మనీ గాయని. పేరు... కసండ్రా మే స్పిట్‌మన్‌. 22 ఏళ్ల కసండ్రా బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు కూడా రాస్తుంది. ఆ పాటతోనే ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ అయింది.

ఆ మధ్య ఓ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు వెళ్లినప్పుడు... ఆమెకు ప్రధాని ప్రత్యేక ఆహ్వానం పంపించి మరీ కలిశారు. తల్లితో కలిసి తమిళనాడులోని పల్లడం వచ్చిన ఆమె... మోదీ ముందు ‘అచ్యుతమ్‌ కేసవమ్‌’ పాడి వినిపించింది. తరువాత మరో తమిళ పాట కూడా ఆలపించింది. ఆమె గాన మాధుర్యానికి మోదీ పరవశించిపోయారు. పాడుతున్నప్పుడు తాళం వేస్తూ... ఆస్వాదించారు.

‘ఎంత అద్భుతమైన గొంతు! భగవంతుడిపై ఆమెకు ఉన్న ప్రేమ ఆ గొంతులో ప్రతిధ్వనిస్తోంది. ఆ స్వరమాధుర్యం ఒక జర్మనీ బిడ్డదని తెలిస్తే మీరు మరింత సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆమె పేరు కసండ్రా మే స్పిట్‌మన్‌’ అంటూ మోదీ ‘ఎక్స్‌’లో కొనియాడారు. తన ముందు పాడిన పాటను షేర్‌ చేశారు. లక్షల మంది కసండ్రా గానామృతానికి ఫిదా అయ్యారు.

భారతీయ భాషల్లో...

జర్మనీకి చెందిన కసండ్రా పేరు భారత్‌లో గత ఏడాది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తమిళంతో పాటు పలు భారతీయ భాషల్లో ఆమె ఆలపించిన భక్తి గీతాలు నెటిజనులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన పురస్కరించుకుని... కసండ్రా ‘రామ్‌ అయేంగే’ అంటూ హిందీ గీతాన్ని ఆలపించింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తే... గంటల్లో వ్యూస్‌ లక్షలు దాటాయి. హిందీతో పాటు సంస్కృతం, హిందీ, మళయాళం, తమిళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ భాషల్లో కూడా ఆమె భక్తి పాటలు అద్భుతంగా పాడుతుంది. ఆమె గానం లయబద్ధంగా సాగుతుంది. పదాలు స్పష్టంగా పలుకుతుంది. భారతీయ సంగీతంపై ఆమెకు ఎనలేని మక్కువ.

ఎన్నో ఘనతలు...

కాస్‌మేగా తన అభిమానులకు బాగా పరిచయమైన కసండ్రా మే స్పిట్‌మన్‌ చిన్నప్పుడు డ్రమ్స్‌ వాయించేది. తరువాత పియానోలో పట్టు సాధించింది. ఆమెపై ప్రముఖ సంగీతకారుడు, పియానిస్ట్‌ చోపిన్‌ ప్రభావం ఎక్కువ. తొలుత రేడియోలో తన ప్రతిభను ప్రదర్శించిన కసండ్రా... తరువాత ‘డీన్‌ సాంగ్‌’ టీవీ షోతో బాగా పేరు తెచ్చుకుంది. బోస్టన్‌లోని ‘బర్క్‌లీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ నుంచి స్కాలర్‌షిప్‌ అందుకోవడం ఆమె కెరీర్‌లో పెద్ద మలుపు. వివిధ వేదికలపై నుంచి తన గాత్రాన్ని వినిపించి. పియానోతో అలరించింది. ఎందరో హృదయాలు గెలుచుకుంది. కసండ్రా పాడిన ‘ది వే ఐయామ్‌’ గీతం ప్రతిష్టాత్మక బర్క్‌లీ కాలేజీ నుంచి అవార్డు గెలుచుకుంది. 2015లో నిర్వహించిన సాంగ్‌ రైటింగ్‌ పోటీల్లో జాతీయ అవార్డు దక్కించుకుంది. అలాగే 2021లో జరిగిన ‘యూకే సాంగ్‌ రైటింగ్‌ పోటీ’లో ‘బుల్లీస్‌’ పాటకు గానూ ప్రథమ బహుమతి అందుకుంది.

భారతీయ సంగీతం, వాయిద్యాల మీద ఎంతో ఆసక్తి కనబరిచే కసండ్రా... అందులో కూడా ప్రావీణ్యం పొందేందుకు ప్రయత్నిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో లక్షలమందిని అలరిస్తూ... వారి ఆదరాభిమానాలు చూరగొన్న ఆమెకు దృష్టి లోపం. కానీ కసండ్రాలోని అసమాన కళాకారిణికి, కళ కోసం సరిహద్దులు దాటి ఆమె పడుతున్న తపనకు ఆ లోపం అడ్డు కాలేదు. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో... మన కళలు, సంస్కృతిపై ప్రేమతో కసండ్రా పంచుతున్న గానామృతానికి వెల కట్టలేం.

Updated Date - Mar 11 , 2024 | 04:06 AM