Share News

తామరాకు మీద నీటిబొట్టు

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:48 AM

జీవితంతో సహా ప్రతి భౌతిక వ్యవస్థా పలు అంశాలను స్వీకరించి, అనేక ఫలితాలను వెలువరిస్తుంది. మనం మన మాటలు, చేతల ఫలితాలను నిరంతరం అంచనా వేసుకుంటూ ఉంటాం.

తామరాకు మీద నీటిబొట్టు

జీవితంతో సహా ప్రతి భౌతిక వ్యవస్థా పలు అంశాలను స్వీకరించి, అనేక ఫలితాలను వెలువరిస్తుంది. మనం మన మాటలు, చేతల ఫలితాలను నిరంతరం అంచనా వేసుకుంటూ ఉంటాం. ‘ఇది మంచి, ఇది చెడు’ అని నిర్ధారిస్తూ ఉంటాం. ఇతరుల ప్రవర్తన గురించి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కూడా నిర్ధారణలు చేస్తూ ఉంటాం. జీవన పరిణామక్రమంలో పొంచి ఉన్న ప్రమాదాలను, ఆటంకాలను అంచనా వేయడానికి ఈ సమర్థత ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ అటువంటి నిర్థారణలకు ప్రమాణాలు ఉండవు. కాబట్టి వాటి కోసం అజ్ఞానంతో కూడిన ఊహలు, అభిప్రాయాలు, విశ్వాసాలు, నమ్మకాల మీద ఆధారపడతాం. మన నమ్మకానికి అనుగుణంగా ఏదైనా జరిగితే సంతోషిస్తాం.

‘‘మనస్సును వశంలో ఉంచుకున్నవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలిగినవాడు, సర్వప్రాణులలో ఆత్మ స్వరూపుడైన ఉన్న పరమాత్మను తన ఆత్మలో నిలుపుకొన్నవాడు అయిన కర్మయోగి... కర్మలను ఆచరిస్తున్పప్పటికీ ఆ కర్మలు, వాటి ఫలితాలు అతణ్ణి అంటవు’’ అని ‘యోగయుక్తో విశుద్ధాత్మా’ అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మన చేసే కర్మల తాలూకు కల్మషం మనకు అంటని స్థితి గురించి భగవంతుడు మనకు ఇచ్చిన హామీ ఇది.

‘‘ద్వేషం, కోరికలు లేని వ్యక్తి... తను అందరిలోనూ, అందరూ తనలోనూ ఉన్నట్టు గ్రహించినవాడు ఏ కర్మలు చేసినా అవి కలుషినమైనవి కావు’’ అని కూడా శ్రీకృష్ణుడు వివరించాడు. అందరిలోనూ తననే చూసుకున్నప్పుడు... కల్మషంతో కూడిన చర్యలను, నేరాలను చేయలేరన్నది దీని అంతరార్థం. దీనికి మరో అర్థం ఏమిటంటే... ఎవరైతే ‘నేను, వాళ్ళు’ అనే విభజన దృష్టితో చూస్తూ కర్మలను చేస్తారో... వారి అన్ని కర్మలు కలుషితం అవుతాయి. ‘‘కర్మలన్నిటినీ భగవదర్పణం చేసి, ఆసక్తిరహితంగా కర్మలను ఆచరించేవాడికి... తామరాకు మీద నీటి బిందువులా పాపాలు అంటవు’’ అని ‘బ్రహ్మణ్యాధాయ కర్మాణి’ అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఆ వ్యక్తి రకరకాల పరిస్థితుల మధ్య జీవిస్తూ కూడా... వాటి ప్రభావానికి లోనుకాకుండా ఉండగలుగుతాడు. మన కర్మలు, ఇతరుల కర్మలు భగవంతుడికి అంకితమైనప్పుడు... విభజనకు తావే లేదు. అప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు నాటకాల్లా, ఆటల్లా అనిపిస్తాయి. ఇందులో మనం కేవలం మన పాత్రను పోషిస్తాం. వాటి గుణ, దోషాలతో మనకు సంబంధం లేదు. ఈ స్థితిని శ్రీకృష్ణుడు ‘నీటిలో ఉంటూ... నీరు అంటని తామరాకు’తో పోల్చాడు.

Updated Date - Jan 05 , 2024 | 04:48 AM