Share News

Notes Votes : ఓట్ల కోసం నోట్ల వర్షం!

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:41 AM

దేశంలో 7 దశల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరెన్సీ పరుగులు పెట్టింది. ఓటర్లపై నోట్ల వర్షం కురిసింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. తాజా ఎన్నికల్లో దాదాపు రూ.1.35 లక్షల కోట్లు ఖర్చయినట్టు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ వెల్లడించింది. దీని ప్రకారం ఒక్కో ఓటుకు రూ.1,400 ఖర్చు చేసినట్టు ఈ సంస్థ

Notes Votes : ఓట్ల కోసం నోట్ల వర్షం!

ఒక్కో ఓటుకు రూ.1,400 వినియోగం

దాదాపు రూ.1.35 లక్షల కోట్ల ఖర్చు

భారీగా ఖర్చు చేసిన పార్టీలు, నాయకులు

సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌1: దేశంలో 7 దశల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరెన్సీ పరుగులు పెట్టింది. ఓటర్లపై నోట్ల వర్షం కురిసింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. తాజా ఎన్నికల్లో దాదాపు రూ.1.35 లక్షల కోట్లు ఖర్చయినట్టు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ వెల్లడించింది. దీని ప్రకారం ఒక్కో ఓటుకు రూ.1,400 ఖర్చు చేసినట్టు ఈ సంస్థ అంచనావేసింది. పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్థి రూ.95 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. తాజా ఎన్నికల్లో ఈ హద్దులు చెరిగిపోయినట్టు సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ తెలిపింది. రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చులకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ప్రధాన పార్టీలు విరివిగా ఖర్చు చేశాయని..ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సహా ప్రాంతీయ పార్టీలైన సమాజ్‌వాదీ, ఆర్జేడీ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు చేతికి ఎముకలేకుండా ఖర్చు చేశాయని ఈ అధ్యయనం తెలిపింది. ముందస్తు అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు పెడతారని అంతా భావించారు. కానీ, అంచనాలను మించి రూ.1.35 లక్షల కోట్ల వరకు నాయకులు, పార్టీలు ఖర్చు చేసినట్టు అధ్యయనం తెలిపింది. ఇది 2019 ఎన్నికలతో పోల్చితే రూ.55-60 వేల కోట్లు ఎక్కువని పేర్కొంది. అమెరికాలో 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు కాగా భారత్‌ దీన్ని అధిగమించింది.

ఇక సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ.95లక్షలే ఖర్చు చేయాలని పేర్కొంది. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రూ.28లక్షల నుంచి రూ.40లక్షల మధ్య ఖర్చు పెట్టాలని నిబంధనలు విధించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎంపీ అభ్యర్థి రూ.75లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.28 లక్షలే ఖర్చు చేయాలని పేర్కొంది. ఎవరూ ఈ పరిమితులను పట్టించుకోలేదని అధ్యయన సంస్థ వెల్లడించింది. రాజకీయ పార్టీల ఖర్చులపై నిబంధనలు విధించకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్‌సహా అన్ని ప్రాంతీయ పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేశాయని తెలిపింది. ఓటర్లను ప్రలోభపరిచే కానుకలు, నగదు పంపిణీ వంటివి గోప్యంగా సాగినట్టు పేర్కొంది.

ఇంతింతై.. అన్నట్టే!

దేశంలో 1951-52 మధ్య జరిగిన ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రూ.25 వేలే ఖర్చు చేయాలని నిబంధన విధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ ఖర్చు రూ.75-95 లక్షలకు పెంచారు. తొలి ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత ఖర్చు ఏకంగా 300 రెట్లు పెరిగినట్టయింది. 1998లో రూ.9,000 కోట్లున్న ఎన్నికల వ్యయం 2019నాటికి రూ.55 వేల కోట్లకు చేరింది. మొత్తంగా తాజా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు, నాయకులు కరెన్సీ కట్టలు కురిపించారు.

Updated Date - Jun 02 , 2024 | 06:41 AM