Share News

India-Maldives Row: ఉద్రిక్తతల మధ్య.. ఆ విషయంలో భారత్‌కి మాల్దీవులు డెడ్‌లైన్

ABN , Publish Date - Jan 14 , 2024 | 05:39 PM

భారతదేశం, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య.. భారత్ ముందు మాల్దీవులు ఒక డెడ్‌లైన్ పెట్టింది. మార్చి 15వ తేదీలోగా భారత దళాలను ఉపసంహరించుకోవాలని న్యూఢిల్లీని కోరింది. మాలేలోని..

India-Maldives Row: ఉద్రిక్తతల మధ్య.. ఆ విషయంలో భారత్‌కి మాల్దీవులు డెడ్‌లైన్

India-Maldives Row: భారతదేశం, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య.. భారత్ ముందు మాల్దీవులు ఒక డెడ్‌లైన్ పెట్టింది. మార్చి 15వ తేదీలోగా భారత దళాలను ఉపసంహరించుకోవాలని న్యూఢిల్లీని కోరింది. మాలేలోని విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాల్దీవుల్లోని భారత హైకమిషన్ అధికారులు జరిపిన చర్చల్లో భాగంగా.. వాళ్లు ఈ అభ్యర్థన చేసినట్టు తెలిసింది. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిణామాలతో పాటు మాల్దీవుల్లోని భారత సైనిక సిబ్బంది ఉనికి గురించి ఇరువర్గాల మధ్య చర్చలు సాగాయి. ఈ క్రమంలోనే.. మార్చి 15లోపు తమ దళాల్ని వెనక్కి రప్పించుకోవాల్సిందిగా వాళ్లు భారత్‌ని కోరారు.


కాగా.. చైనా అనుకూల వ్యక్తిగా పేరుగాంచిన మహమ్మద్ ముయిజ్జూ.. తాను ఆ దేశాధ్యక్షుడు అవ్వడానికి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత సైనిక సిబ్బందిని తొలగించి, వాణిజ్యాన్ని సమతుల్యం చేస్తానని వాగ్దానం చేశారు. సెప్టెంబర్‌లో జరిగిన అక్కడి అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. భారత సైన్యాన్ని ఉపసంహించుకోవాలని మాల్దీవుల ప్రజలు తనను కోరారని, మాల్దీవుల ప్రజల ప్రజాస్వామ్య సంకల్పాన్ని భారతదేశం గౌరవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. భారత దళాల్ని తిరిగి పంపడమే తన ధ్యేయమని చాలాసర్లు పేర్కొన్నారు. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాక.. అక్కడి ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.

ఇదిలావుండగా.. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా.. మోదీని టార్గెట్ చేసుకొని వాళ్లు అవమానకర వ్యాఖ్యలు చేశారు. మోదీ ఒక జోకర్, కీలుబొమ్మ అంటూ కామెంట్స్ చేయడంతో.. ఈ వివాదం ముదిరింది. చివరికి మాల్దీవుల ప్రభుత్వం దిగివచ్చి.. అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలని, ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేదని చెప్తూ ఆ ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేసింది.

Updated Date - Jan 14 , 2024 | 05:39 PM