Share News

Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్.. ఆ ప్రక్రియ పూర్తయ్యిందన్న మంత్రి

ABN , Publish Date - Jan 08 , 2024 | 08:22 PM

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబయి - అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. గుజరాత్‌, మహారాష్ట్ర, దాద్రా నగర్‌ హవేలీలలో 100% భూసేకరణ పూర్తయినట్లు..

Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్.. ఆ ప్రక్రియ పూర్తయ్యిందన్న మంత్రి

Bullet Train: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబయి - అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. గుజరాత్‌, మహారాష్ట్ర, దాద్రా నగర్‌ హవేలీలలో 100% భూసేకరణ పూర్తయినట్లు నేషనల్‌ హైస్పీడ్‌ రైలు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL) సోమవారం ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ప్రాజెక్ట్ కోసం అవసరమైన మొత్తం 1389.49 హెక్టార్ల భూమిని సేకరించినట్లు ఆయన చెప్పారు. గుజరాత్‌లో 951.14 హెక్టార్లు, దాద్రానగర్‌ హవేలీలో 7.90 హెక్టార్లు, మహారాష్ట్రలో 430.45 హెక్టార్లు చొప్పున సేకరించినట్లు ఆయన వివరించారు. ఇదే సమయంలో.. మొత్తం గణాంకాలతో ఉన్న ఒక చార్ట్‌ని సైతం అశ్విని వైష్ణవ్ పంచుకున్నారు.


ఇదే సమయంలో.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సివిల్ కాంట్రాక్టులను గుజరాత్, మహారాష్ట్రలకు అప్పగించామని NHSRCL ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే.. 120.4 కి.మీ గర్డర్‌లను ప్రారంభించామని, 271 కి.మీ పైర్ కాస్టింగ్ పూర్తయిందని ఆ సంస్థ వెల్లడించింది. జపనీస్ షింకన్‌సెన్‌లో ఉపయోగించిన విధంగా.. ఈ మహారాష్ట్ర-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ ట్రాక్ సిస్టమ్ కోసం మొదటి రీన్‌ఫోర్డ్స్ కాంక్రీట్ ట్రాక్ బెడ్‌ని వేయడం జరుగుతోందని.. ఈ పనులు సూరత్, ఆనంద్‌లో ప్రారంభమయ్యాయని పేర్కొంది. భారత్‌లో J-స్లాబ్ బలాస్ట్‌లెస్ట్ ట్రాక్ సిస్టమ్‌ని ఉపయోగించడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది. సూరత్‌, బిలిమోరా స్టేషన్ల మధ్య ఈ బుల్లెట్‌ రైలు తొలి దశను 2026 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నిజానికి.. ఈ ప్రాజెక్టును 2022 నాటికే పూర్తి చేయాలని అనుకున్నారు కానీ, భూసేకరణలో ఆటంకాలు నెలకొనడంతో జాప్యం అయ్యింది.

ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కి.మీలు. మహారాష్ట్రలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, శిల్‌ఫాటా మధ్య 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో భాగంగా.. 7 కిలోమీటర్ల సముద్రగర్భ రైలు సొరంగం కోసం పనులు ప్రారంభమయ్యాయి. అటు.. ముంబయి హెచ్‌ఎస్‌ఆర్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు సైతం మొదలయ్యాయి. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా జరోలి గ్రామ సమీపంలో ఉన్న 350 మీటర్ల పొడవు, 12.6 మీటర్ల వ్యాసం కలిగిన మొదటి కొండ సొరంగంను కేవలం 10 నెలల్లో పూర్తి చేశారు. సూరత్‌లోని ఎన్‌హెచ్ 53పై 70 మీటర్ల పొడవు, 673 మెట్రిక్ టన్నుల బరువుతో మొదటి స్టీల్ బ్రిడ్జిని నిర్మించామని.. అలాంటి 28 వంతెనల్లో 16 నిర్మాణ దశల్లో ఉన్నాయని పేర్కొంది. ఈ రైలు సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు.

Updated Date - Jan 08 , 2024 | 08:22 PM