Share News

Congress Party: మోదీని ప్రజలు తిరస్కరించారు

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:41 AM

రాజ్యాంగంపై మోదీ, అమిత్‌ షా దాడిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మోదీ, అమిత్‌ షాను వద్దని దేశం స్పష్టం చేసిందని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతల తీరుపై సంతృప్తిగా లేమని ప్రజలు తెల్చేశారని పేర్కొన్నారు. అలాగే, మోదీ, అదానీ ఒకటే అని ప్రజలకు అర్థమైపోయిందని..

Congress Party: మోదీని ప్రజలు తిరస్కరించారు

  • బీజేపీ పాలనపై ప్రజల్లో అసంతృప్తి.. అదానీతో మోదీకి అవినీతి సంబంధాలు

  • రాజ్యాంగాన్ని కాపాడేందుకే పోరాడాం

  • టీడీపీ,జేడీయూ మా పాత మిత్రులు: రాహుల్‌

  • నేడు ఇండియా కూటమి పక్షాల భేటీ

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగంపై మోదీ, అమిత్‌ షా దాడిని ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. మోదీ, అమిత్‌ షాను వద్దని దేశం స్పష్టం చేసిందని, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేతల తీరుపై సంతృప్తిగా లేమని ప్రజలు తెల్చేశారని పేర్కొన్నారు. అలాగే, మోదీ, అదానీ ఒకటే అని ప్రజలకు అర్థమైపోయిందని, మోదీ ప్రధానిగా లేకపోతే అదానీ కూడా ఉండలేరని స్టాక్‌మార్కెట్‌ సూచీలు చెబుతున్నాయన్నారు. అదానీ, మోదీకి అవినీతి సంబంధాలున్నాయని ఆరోపించారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, జైరాం రమేశ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికల్లో పోరాడాం. మోదీ ప్రభుత్వం మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినప్పుడు, ముఖ్యమంత్రులను జైల్లో పెట్టినప్పుడు, పార్టీలను విచ్ఛిన్నం చేసినప్పుడు దేశ ప్రజలు ఐక్యంగా పోరాడతారని నేను భావించాను.

ఇది నిజమని లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో రుజువైంది. ఈ పోరాటంలో దేశంలోని నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు ఇండియా కూటమికి అండగా నిలబడ్డాయి’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ పాత మిత్రులైన జేడీయూ, టీడీపీలను సంప్రదించే అంశంపై ఇండియా కూటమి నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అందుకోసం బుధవారం సాయంత్రం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.


భవిష్యత్‌ కార్యాచరణపై ఇందులో చర్చించనున్నట్లు తెలిపారు. మిత్రపక్షాల అభిప్రాయం అడగకుండా ఏమీ మాట్లాడబోమని స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 ఎంపీ సీట్లకు దూరంగా ఉన్న బీజేపీ కేవలం అతిపెద్ద పార్టీగానే అవతరించనుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి, కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయలేదని పేర్కొన్నారు. బీజేపీతో పాటు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాడామని చెప్పారు. ప్రజలకు రాహుల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

  • మా పోరాటం ఇంకా ముగియలేదు: ఖర్గే

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తీరును ప్రజలు, ప్రజాస్వామ్య విజయంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అభివర్ణించారు. ప్రజాతీర్పును అంగీకరిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఒక వ్యక్తి, ఒకే ముఖంపై ఓట్లు అడుగగా, ప్రజలు తీర్పు మోదీకి వ్యతిరేకంగా ఇచ్చారని తెలిపారు. మోదీ నైతికంగా ఓడిపోయారన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై మోదీ ప్రచారం చేసిన అబద్ధాలను ప్రజలు తిప్పికోట్టారని పేర్కొన్నారు. తమ పోరాటం ఇంకా ముగియలేదని, రాబోయే రోజుల్లో ప్రజల హక్కులు, దేశ భద్రత, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం పోరాడాలని ఖర్గే పిలుపునిచ్చారు. కాగా, ఇండియా కూటమిలోకి రావాలంటూ బిహార్‌ సీఎం నితీశ్‌, టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నట్లు శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్‌ ఠాక్రే ముంబైలో తెలిపారు.

Updated Date - Jun 05 , 2024 | 04:42 AM