Share News

Mohamed Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు.. ఖాళీ కుర్చీల ముందు..

ABN , Publish Date - Feb 05 , 2024 | 05:16 PM

తన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మే 10వ తేదీ నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయని పేర్కొన్నారు. తమ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని కూడా అనుమతించబోమని వ్యాఖ్యానించారు.

Mohamed Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు.. ఖాళీ కుర్చీల ముందు..

తన భారత వ్యతిరేక వైఖరికి కట్టుబడి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. మే 10వ తేదీ నాటికి భారత దళాలు మాల్దీవులను విడిచిపెడతాయని పేర్కొన్నారు. తమ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి ఏ దేశాన్ని కూడా అనుమతించబోమని వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలను తిరిగి వెనక్కు పంపించేందుకే మాల్దీవుల ప్రజలు నాకు ఓటు వేశారు. మే 10వ తేదీ నాటికి భారత దళాలు పూర్తిగా వైదొలుతాయి. మాల్దీవుల్లోని మూడు ఏవియేషన్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకదాంట్లో ఉన్న భారతీయ దళాలు మార్చి 10వ తేదీ.. మిగిలిన రెండింటిలో ఉన్నవాళ్లు మే 10వ తేదీ నాటికి దేశాన్ని విడిచి వెళ్లిపోతాయి. ఈ విషయంపై భారత్, మాల్దీవుల మధ్య అంగీకారం కుదిరింది. దేశ అంతర్గత, అండర్‌వాటర్ చార్ట్స్‌లలో భారత్‌తో ఉన్న ఒప్పందాలను మాల్దీవులు పునరుద్ధరించదు. మన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి లేదా అణగదొక్కడానికి మరే ఇతర దేశాన్ని అనుమతించము’’ అని ముయిజ్జు తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.


ఇదిలావుండగా.. ముయిజ్జు ప్రసంగిస్తున్న సమయంలో పార్లమెంట్‌లో కుర్చీలు చాలావరకు ఖాళీగానే ఉన్నాయి. మొత్తం 87 స్థానాలున్న పార్లమెంట్‌లో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎండీపీ (43), డెమొక్రాట్ల (13)కు చెందిన 56 ఎంపీలు ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారు. ముయిజు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటర్ పదవుల కోసం ఏడుగురు ఎంపీలు రాజీనామా చేయడం జరిగింది. దీంతో.. కేవలం 24 మంది ఎంపీలు మాత్రమే ముయిజ్జు ప్రసంగానికి హాజరయ్యారు. మాల్దీవుల పార్లమెంట్ చరిత్రలో ఇదే అతిపెద్ద బహిష్కరణ అని స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. ఒకరకంగా ఇది ముయిజ్జుకి ఘోర అవమానమే! అటు.. ఎండీపీ, డెమొక్రాట్లు కలిసి అధ్యక్షుడు ముయిజ్జును అభిశంసించే ప్రతిపాదనపై కూడా కసరత్తులు చేస్తున్నారు.

మాల్దీవుల్లో భారత దళాలు

మాల్దీవులు ఒక చిన్న దేశం కావడంతో ఎంతో సహాయం అందించింది. మానవతా సహాయం, వైద్య తరలింపు కోసం ఆ ద్వీప దేశంలో 87 మంది భారత బలగాలను మోహరించింది. ఈ భద్రతా బలగాలు అక్కడ ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలని కూడా చూస్తుంటాయి. అయితే.. భారత్‌పై వ్యతిరేక వైఖరి కలిగి ఉన్న ముయిజ్జు మాత్రం భారత్ బలగాలను అక్కడి నుంచి తిరిగి పంపాలని కంకణం కట్టుకున్నాడు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్నే అస్త్రంగా వాడుకున్నాడు. ఇప్పుడు అధికారం దక్కడంతో.. ఆ అంశంపైనే ఫోకస్ పెట్టాడు. దీంతో.. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.

Updated Date - Feb 05 , 2024 | 05:16 PM