Share News

ఆంధ్రప్రదేశ్ మేలుకుంటుందా?

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:30 AM

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి పరాజిత అధికారపక్షం బీఆర్ఎస్ తటపటాయిస్తోంది కానీ, కొన్ని ఇతర రాష్ట్రాల అధికారపార్టీలు మాత్రం జాగ్రత్త పడుతున్నాయి...

ఆంధ్రప్రదేశ్ మేలుకుంటుందా?

తెలంగాణ అసెంబ్లీ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి పరాజిత అధికారపక్షం బీఆర్ఎస్ తటపటాయిస్తోంది కానీ, కొన్ని ఇతర రాష్ట్రాల అధికారపార్టీలు మాత్రం జాగ్రత్త పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నేసి అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను మార్చడం వెనుక తెలంగాణ ప్రభావం చాలా ఉన్నది. బీఆర్ఎస్ అపజయ కారణాలలో సిటింగ్‌లకు సీట్లు ఇవ్వడం అన్న ఒక్కదాన్నే జగన్ తీసుకున్నారు. ఏమి చేసినా ఏమీ ఉపయోగం ఉండని స్థితికి జగన్ పాలన చేరింది కనుక, ఆ మార్పుల వల్ల మరింత నష్టమే తప్ప లాభం లేదు. ఆశ్చర్యకరంగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తెలంగాణ ఫలితాలను నిశితంగా పరిశీలించి, అనేక స్థానాలలో అభ్యర్థుల మార్పు గురించి తన ఆంతరంగికుడు పాండియన్‌కు సూచనలిచ్చారట. పొరుగు రాష్ట్రాల ఫలితాలను చూస్తే తప్ప, సొంత రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి వ్యతిరేకతలు అర్థం కాని స్థితికి రాజకీయపార్టీలు చేరుకున్నాయన్న మాట.

అధికారపార్టీలు మాత్రమే కాదు, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన వివిధ ఒత్తిడి సమూహాలు కూడా ఇతర రాష్ట్రాల అనుభవాల నుంచి నేర్చుకుంటున్నాయి, రంగంలోకి దిగుతున్నాయి. కర్ణాటకలో ‘ఎద్దేళు కర్ణాటక’ పేరుతో వందలాది గాంధేయ, లౌకికవాద, సోషలిస్టు ప్రజాసంఘాలు అప్పటి అధికారపార్టీ బీజేపీని ఓడించడానికి పనిచేశాయి. భారతీయ జనతాపార్టీ మత తత్వ, విభజనవాద పాలనను ఓడించడం వారి నినాదం. కాంగ్రెస్‌కు ఓటు చేయమని వారు ఎక్కడా వాచ్యంగా చెప్పలేదు. కొన్ని చోట్ల జనతాదళ్ (సెక్యులర్)కు లబ్ధి చేకూరేటట్టు కూడా వారు పనిచేశారు. తెలంగాణలో కూడా జాగో తెలంగాణ, తదితర ఐక్యకార్యాచరణ సంస్థలు బీజేపీకి, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటువేయవలసిందిగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా వారు బాహాటంగా ప్రచారం చేయలేదు కానీ, వారి ‘వ్యతిరేక’ నినాదాలు, కాంగ్రెస్‌కే ప్రయోజనం కలిగించాయి. బీజేపీ వల్ల దేశ సామాజిక వ్యవస్థకు, ప్రజాస్వామిక విలువలకు పెద్ద అపకారం జరుగుతోందని నమ్మేవారు 2024 సాధారణ ఎన్నికలలో కూడా ఆ పార్టీని ఓడించడానికే తమ శాయశక్తులా పనిచేస్తారు. కర్ణాటక, తెలంగాణ అనుభవాలు జాతీయస్థాయిలో కూడా ఈ పౌరసమాజ కార్యకర్తలకు పాఠాలుగా పనికివస్తాయి.

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ప్రజాసంఘాల వారికి పెద్ద పజిల్‌గా మారింది. అక్కడ భారతీయ జనతాపార్టీ ప్రత్యక్ష బలం నామమాత్రమే. కానీ, రాష్ట్రంలోని రెండు ప్రధాన పక్షాలూ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. సాధారణ ఎన్నికల తరువాత, కేంద్రంలో బీజేపీ కూటమికి మద్దతుగా అవి నిలబడతాయి. మరి ఏపీలో, తాము ఎవరికి అనుకూలంగా, ఎవరికి ప్రతికూలంగా ప్రచారం చేయాలి? కొత్తగా ప్రాణం పోసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బలం కనీసంగా కూడా లేదు. ‘మేలుకో ఆంధ్రప్రదేశ్’ పేరుతో, రాష్ట్రంలోని లౌకికవాదులు, వామపక్ష ప్రజాతంత్రవాదులు, మైనారిటీ ప్రయోజనాల సంఘాలు కలసి పనిచేస్తున్న వేదికకు అందుకే అడుగు ముందుకు వేయలేని విచిత్ర పరిస్థితి నెలకొన్నది.

నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో వైసీపీ పాలన మీదనే కాదు, బీజేపీ మీద కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. జాతీయస్థాయి విధానాల వల్ల కాదు, రాష్ట్రం మీద ఆ పార్టీ వైఖరి కారణంగానే ఆ అసంతృప్తి ఏర్పడింది. విభజనానంతరం రాష్ట్రపరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందాన ఉండిపోవడానికి బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వమే కారణమన్న అభిప్రాయం అక్కడ బలంగా ఉన్నది. 2019 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ మీద తీవ్ర విమర్శలే సంధించింది. తరువాత వైఖరి మార్చుకోవలసి వచ్చింది. బీజేపీ తీవ్ర మత జాతీయవాద విధానాలు సహజంగానే ఆంధ్రప్రదేశ్‌లోని ఆధునిక అభ్యుదయ జీవన విధానానికి సరిపోయేవి కావు. అయినా, ప్రస్తుతం బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో మౌనాంగీకారాన్ని ఎట్లా పొందగలుగుతోంది? అధికార వైసీపీ బీజేపీతో చేస్తున్న అనధికార స్నేహం అందుకు ప్రధానకారణం. జాతీయస్థాయిలో బీజేపీకి కావలసిన అన్ని అవసరాలను వైసీపీ నెరవేరుస్తోంది. జగన్ మీద కేసులు ముంచుకురాకుండా, అప్పుల తిప్పలు లేకుండా బీజేపీ సాయపడుతోంది. ఈ పరస్పర సహకారం సజావుగా సాగుతోంది. అదనంగా రకరకాల రూపాల్లో కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీ కప్పం కూడా చెల్లిస్తోందని చెప్పుకుంటారు. వైసీపీ సరే, మరి టీడీపీ ఎందుకు బీజేపీని బోను నుంచి తప్పించింది? ఎంతకైనా తెగించగలిగిన బీజేపీని, జగన్‌ను రెంటినీ ఒకేసారి ఎదుర్కోవడం కష్టం కాబట్టి. కనీసం ఎన్నికల పోరాటమన్నా అధిక దౌర్జన్యం లేకుండా సాగడానికి బీజేపీ అండ పనికివస్తుందని!

అంతమాత్రమే కాదు, 2019 ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ తన గతవైఖరులపై ఆత్మరక్షణలో పడింది. బీజేపీని అంత తీవ్రంగా విమర్శించి పొరపాటు చేశానేమోనన్న భావనలో పడింది. జగన్ ప్రభుత్వం దూకుడు దానికి తోడయింది. తిరిగి తనను కూడగట్టుకునే ప్రయత్నంలో, ఆచితూచి వ్యవహరించడం మేలు అనుకున్నది. అయితే, బీజేపీతో బాహాటంగా చెలిమి చేయడానికి టీడీపీ ఇప్పడు కూడా సిద్ధంగా ఉన్నదనుకోలేము. బీజేపీకి సొంతంగా ఉన్న ఓటు బలం లాభించేది కాకపోగా, దాని స్పర్శ రాజకీయంగా నష్టం కలిగించేది. ఎన్నికల తరువాత, తమ లోక్‌సభ సభ్యుల బలాన్ని బీజేపీకి సమర్పించడమొక్కటే వైసీపీకి అయినా టీడీపీకి అయినా ముందస్తు అవగాహన అవుతుంది. ఈ లోగా బీజేపీతో బహిరంగ స్నేహం లేదన్నట్టుగానే ఈ పార్టీలు వ్యవహరించాలి. ఈ పరిస్థితిలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రజాశ్రేణుల అభిమతం ఏమి కావాలి? బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేయాలనుకునేవారు ఎవరికి వేయాలి? దళితులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు, ముస్లిములు, కమ్యూనిస్టులు బీజేపీకి కానీ, బీజేపీకి సహాయపడే పక్షానికి గానీ ఓటు వేయడానికి ఇష్టపడరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరి సంఖ్య ప్రభావవంతమైనది.

రహస్యస్నేహాలు చేస్తున్నామని ఆ పార్టీలు అనుకున్నా, ప్రజలకు కలిగే అభిప్రాయాలు వేరు. వైసీపీ వాస్తవంలో బీజేపీకి ఎంతో సన్నిహితమైనప్పటికీ, పైకి మాత్రం అంటీముట్టకుండా ఉన్నట్టు కనిపిస్తున్నది. జనసేన వల్లనో మరొకందుకో బీజేపీతో స్నేహానికి టీడీపీ ఆరాటపడుతున్నట్టు అభిప్రాయం కలుగుతున్నది. ఈ పరిస్థితిలో బీజేపీ వ్యతిరేక ఓటరు వైసీపీని ఎంచుకునే అవకాశం లేదా ప్రమాదం ఉన్నది. ప్రమాదం అనడం ఎందుకంటే, జాతీయస్థాయిలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పౌరసమాజం, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ దుష్పరిపాలనను కూడా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణలో రాష్ట్ర అధికార బీఆర్ఎస్‌ను, కేంద్ర అధికార బీజేపీని వ్యతిరేకించినట్టే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ వ్యతిరేక, వైసీపీ వ్యతిరేక ప్రచారం చేయాలనుకుంటోంది. మరి, ఆ వైఖరి తెలుగుదేశం పార్టీకి ఉపకరించేదే, అయితే, ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ, బీజేపీ వెంట ఉండేట్టు అయితే, పౌరసమాజం లక్ష్యానికి విఘాతం కదా? అందుకే ‘మేలుకో ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకోవాలని కోరుకుంటున్నారు. తమ వాదనను పార్టీ నాయకత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు.

పౌరసమాజానిదే కాదు, వైఎస్ షర్మిల కూడా దాదాపు అదే సందిగ్ధాన్ని ఎదుర్కొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయడానికి ఆమె ప్రయత్నం ప్రారంభించారు. అయితే, ఉన్నట్టుండి వెంటనే ఆ పార్టీ బలశాలిగా మారలేదు. ఎంతో కొంత బలం పుంజుకుని, కొద్దిపాటి ప్రభావాన్ని మాత్రమే వేయగలుగుతుంది. కాంగ్రెస్ సమీకరించగలిగే ఓట్లు, జగన్ బలాన్ని చీల్చితే తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది. లేదా, ఏదో పెనుమార్పు జరిగి పెద్ద సంఖ్యలో ఆమె పక్షాన మోహరింపు సాధ్యపడితే- అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి జగన్‌కే ప్రయోజనం చేకూరవచ్చు. టీడీపీకి అయినా, వైసీపీకి అయినా షర్మిల కృషి ఉపయోగపడడం కాంగ్రెస్ విధానాలకు అనుకూలం అవుతుందా? ఆ రెండు పార్టీలూ కేంద్రంలో బీజేపీకే మద్దతు ఇచ్చే పక్షంలో, కాంగ్రెస్ తన జాతీయ ప్రత్యర్థికి మేలు చేసినట్టు కదా? ఇప్పటివరకు అయితే, షర్మిల జగన్‌ను, బీజేపీని ఘాటుగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు జోలికి అంతగా పోవడం లేదు. చంద్రబాబు బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టమైన వైఖరి తీసుకోగలిగితే, వామపక్షాలు, ప్రజాసంఘాలతో పాటు, కాంగ్రెస్ బేషరతు మద్దతుకూడా లభిస్తుంది. కానీ, అంతటి సాహసం ఆయన చేస్తారా? రామమందిర ప్రాణప్రతిష్ఠకు వెళ్లి నరేంద్రమోదీ ప్రాభవాన్ని కళ్లారా చూసిన తరువాత, సాధారణ ఎన్నికలలో బీజేపీ మరింత బలం పెంచుకుంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బీజేపీకి దూరం అని స్పష్టంగా చెప్పడం అంత సులభమేమీ కాదు. కానీ, రిస్క్ తీసుకోగలిగితే, విజయానికి అదనపు మెట్లు సమకూరతాయి.

ప్రధాన పార్టీలతో, వాటి వైఖరులతో నిమిత్తం లేకుండా, ప్రజాస్వామిక సమాజం తన పని చేసుకుపోవాలి. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన, చేస్తున్న అన్యాయాలను చెప్పడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ దుష్పరిపాలనను ఎండగట్టాలి. దేశాన్ని ఆవరిస్తున్న మతతత్వ నియంతృత్వాన్ని వ్యతిరేకించేవారిని సమీకరించి, తమతో ఏకీభవించేవారికే వారు ఓటు వేస్తారన్న వాతావరణం కల్పించాలి. అటువంటి భావాలకు అనుకూలత పెరిగితే, ప్రధాన పార్టీలు కూడా తమ వైఖరిని సమీక్షించుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తనకు తిరుగులేని మద్దతుగా మారుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటే ధైర్యం చేయవచ్చు. ప్రజల అందడండలు ఉండగా, ఎవరి తెరవెనుక మద్దతో తనకెందుకు అనుకుంటే, స్వేచ్ఛాయుతమైన విజయాన్ని అందుకోవచ్చు. వచ్చే సాధారణ ఎన్నికల ఫలితాలు ఉత్తరదేశమంతా ఏకపక్షంగానే ఉండవచ్చు, తక్కిన దక్షిణాది వలెనే ఏపీ కూడా తన ప్రత్యేకతను ఎందుకు చూపగూడదు?

కె. శ్రీనివాస్

Updated Date - Feb 01 , 2024 | 03:30 AM