Share News

కాళేశ్వరంపై అకారణంగా విషం చిమ్ముతారెందుకు?

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:44 AM

మార్చి 1న ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలం చెల్లినట్టేనా?’ శీర్షికతో వ్యవసాయ ఆర్థికవేత్త ఆల్దాస్ జానయ్య గారు రాసిన వ్యాసానికి నా ప్రతిస్పందన మార్చి 13న అచ్చయింది. ఆయన మళ్ళీ నాకు కౌంటర్ రాసినారు...

కాళేశ్వరంపై అకారణంగా విషం చిమ్ముతారెందుకు?

మార్చి 1న ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలం చెల్లినట్టేనా?’ శీర్షికతో వ్యవసాయ ఆర్థికవేత్త ఆల్దాస్ జానయ్య గారు రాసిన వ్యాసానికి నా ప్రతిస్పందన మార్చి 13న అచ్చయింది. ఆయన మళ్ళీ నాకు కౌంటర్ రాసినారు. ఇక ఆయన రాతలకు స్పందించాల్సిన అవసరం లేదని అనిపించి ఊరుకున్నాను. ఏప్రిల్ 11న కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ ‘కాళేశ్వరానికి ఒక పాత రష్యన్ ప్రాజెక్టు గుణపాఠం’ శీర్షికన మరో వ్యాసం అచ్చయింది. ఒక వ్యవసాయ ఆర్థికవేత్తకు ఒక తెలంగాణ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఇంతటి వ్యతిరేకత ఎందుకు ఉన్నదో అర్థం కాలేదు. ఆయన నమ్ముతున్న ‘ఖర్చులు –ప్రయోజనాల నిష్పత్తి’ కోణంలో తెలంగాణ ఎత్తిపోతలు ఇమడవు.

గత వ్యాసంలో చెప్పిందే మళ్ళీ చెపుతున్నాను. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు తక్కువ ఎత్తులో (80మీ. – 150మీ.) ప్రవహిస్తాయి. సాగు యోగ్యమైన భూములు 200 మీ. నుంచి 650 మీ. వద్ద ఉంటాయి. ఈ భూములకు సాగునీరు అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదని అందరు అంగీకరిస్తున్నదే. పైన పేర్కొన్న ప్రాజెక్టులను ‘ఖర్చులు–ప్రయోజనాల నిష్పత్తి’ కోణంలో నుంచి చూస్తే ఇక తెలంగాణ రైతాంగానికి ఆత్మహత్యలే శరణ్యం.


జానయ్య తాజా వ్యాసంలో ప్రస్తావించిన పాత సోవియట్ యూనియన్ రద్దు చేసిన ఎత్తిపోతల పథకం సంగతి చూద్దాం. ఆ ప్రాజెక్టును ‘Soviet Union River Diversion Project’ అంటారు. ఆ ప్రాజెక్టుపై దశాబ్దాల పాటు సోవియట్ యూనియన్‌లో విస్తృతమైన చర్చ జరిగిన మాట వాస్తవమే. నిజానికి ప్రపంచంలో ఏ భారీ ప్రాజెక్టును చేపట్టినా ఇటువంటి చర్చలు, వ్యతిరేకతలు పెల్లుబికినాయి. చైనాలో యాంగ్షి నదిపై భారీ త్రీ గార్జెస్ డ్యాం నిర్మించాలని మావో కలగన్నాడు. కానీ ఆయన హయాంలో ఆ ప్రాజెక్టు సాకారం కాలేదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రాజెక్టుపై ఏకాభిప్రాయం రావడానికి 40 ఏళ్ళు పట్టింది. 1980వ దశకం చివరలో చైనా ప్రధానమంత్రి లీ పెంగ్ చొరవతో ఈ ప్రాజెక్టుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపినాయి. తొమ్మిదేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు చైనా ఆర్థిక పురోగతికి చేస్తున్న దోహదం ఇంతా అంతా కాదు. చైనా వెళ్ళి త్రీ గార్జెస్ డ్యాంను చూసి అధ్యయనం చేసిన తర్వాత నా స్వానుభవంలో నుంచి చెబుతున్న సత్యాలు ఇవి. అదే విధంగా ప్రపంచాన్ని తీవ్రమైన ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన 1930–40 కాలంలో కొలరాడో నదిపై భారీ హూవర్ డ్యాం నిర్మాణానికి కూడా అమెరికాలో తీవ్రమైన నిరసనలు వ్యక్తం అయినాయి. అయినా దేశ అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ లెక్క చేయకుండా డ్యాం నిర్మాణాన్ని కొనసాగించాడు. ఆయన తర్వాత రూస్వెల్ట్ ప్రభుత్వం కూడా పనులు కొనసాగించింది. ఆ డ్యాం నిర్మాణంతో నెవేడా, ఆరిజోనా, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో లాంటి ఎడారి ప్రాంతాలన్నీ సస్యశ్యామలం అయినాయి. అమెరికాలోనే సంపన్న రాష్ట్రాలుగా ఎదిగాయి. ఇంకో ఉదాహరణ 1960 దశకంలో ఈజిప్ట్‌లో నైలు నదిపై హైఆస్వాన్ డ్యాం నిర్మాణానికి కూడా పర్యావరణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ప్రపంచ బ్యాంక్ లాంటి ఆర్థిక సంస్థలు ఆర్థిక సహకారం ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆనాటి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ నాజర్ పట్టు సడలకుండా ముందుకు సాగాడు. సోవియట్ యూనియన్ సహకారంతో డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఈజిప్ట్ ఆఫ్రికా ఖండంలోనే సంపద్వంతమైన దేశంగా ఎదిగింది. ఆయా దేశాల పాలకులు వెనుకంజ వేసి ఉంటే ఇవ్వాళ అమెరికాలో ఎడారి ప్రాంతాల పరిస్థితి, ఈజిప్ట్ నైలునది పరీవాహక ప్రాంతాల పరిస్థితి, చైనాలో యాంగ్షి నది పరీవాహక ప్రాంతాల పరిస్థితి ఎట్లా ఉండేది?


1984లో చెర్నెంకో మరణం తర్వాత సోవియట్‌లో గోర్భచేవ్ అధికారంలోకి వచ్చేదాకా సోవియట్ పాలకులు ఈ ప్రాజెక్టుకు అనుకూలంగానే ఉన్నారు. జానయ్య ప్రస్తావించినట్టు ప్రాజెక్టు మొదటి భాగమైన ఉత్తర యూరోపియన్ నదుల నుంచి నీటి కరువున్న దక్షిణ యూరోపియన్ ప్రాంతాలకు, మధ్య ఆసియా ప్రాంతాలకు 674 టిఎంసిల నీటిని తరలించే ప్రాజెక్టుకు సర్వే, ఇతర అధ్యయనాలకు ఆమోదం తెలిపింది. నిధులు కూడా సమకూర్చింది. రెండో భాగం ఇంతకంటే భారీ ప్రాజెక్టు. 2200కి.మీ. దూరం నుంచి ఉత్తర సైబీరియా ప్రాంతంలో ఉన్న నదుల నుంచి మధ్య ఆసియా ప్రాంతాలకు 960టిఎంసిలు తరలించాలి. ఈ భాగాన్ని గోర్భచేవ్ కంటే ముందటి సోవియట్ పాలకులు పక్కన బెట్టారు. 1984లో అధికారంలోకి వచ్చిన గోర్భచేవ్ పెరిస్త్రోయికా, గ్లాన్స్ నోస్త్ సిద్ధాంతాలను ప్రవేశపెట్టడంతో సోవియట్ రిపబ్లిక్స్‌లో అప్పటికే గూడుకట్టుకొని ఉన్న స్వాంతంత్ర్య కాంక్ష పెల్లుబికింది. ఈయన 1986లో ప్రాజెక్టును రద్దు చేసేనాటికి సోవియట్ యూనియన్‌కు ఇక భవిష్యత్‌లో మనుగడ లేదని రూఢీ అయ్యింది. ఎందుకంటే యూనియన్‌కు వ్యతిరేకంగా రష్యా, బెలారస్, ఉక్రేన్ లాంటి పెద్ద రిపబ్లిక్స్‌లోనే ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చి ఉన్నాయి. సమీప భవిష్యత్‌లో విచ్ఛిన్నం కాబోతున్న సోవియట్ యూనియన్ ఇంతటి భారీ ఖర్చుతో, మహా ప్రాజెక్టులను చేపట్టి తమ నీటిని యూరప్ దేశాలకు, మధ్య ఆసియా దేశాలకు తరలించడం మూర్ఖత్వం అవుతుందని గోర్భచేవ్ ప్రభుత్వం భావించి ఉంటుంది. గోర్భచేవ్ ఊహించినట్టుగానే 1991 డిసెంబర్‌లో సోవియట్ యూనియన్ రద్దు అయ్యింది. రష్యా సహా 15 రిపబ్లిక్స్ స్వతంత్ర దేశాలుగా అవతరించినాయి. 1986లో గోర్భచేవ్ ప్రభుత్వం ‘Soviet Union River Diversion Project’ను రద్దు చేయడానికి వెనుక ఉన్న ఈ పూర్వ రంగాన్ని విశ్లేషిస్తే, పూర్తిగా రాజకీయ కారణాల వల్ల జరిగిందే తప్ప మరో కారణం లేదు. అయితే రద్దు చేయడానికి సకారణం చూపించాలి కాబట్టి ఖర్చులకు ప్రయోజనాలకు పొంతన లేదని, పర్యావరణ ఉద్యమాలను కారణాలుగా చూపించి ప్రాజెక్టు రద్దు చేసినారు.

అయితే పరిమాణంలో గాని, ఆర్థికంలో గాని సోవియట్ యూనియన్ రివర్ డైవర్షన్ ప్రాజెక్ట్‌తో పోలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అతి చిన్నది. ఇక్కడ గోదావరి నుంచి తరలించే నీరు 190 టిఎంసిలు మాత్రమే. అక్కడ మొదటి భాగంలో తరలించే నీరు 674 టిఎంసిలు, రెండవ భాగంలో 972 టిఎంసిలు. ఖర్చు చూస్తే అక్కడ రూ.5 లక్షల కోట్లు. ఇక్కడ రూ.1.27 లక్షల కోట్లు. అసలు సోవియట్ యూనియన్ ప్రతిపాదించిన ప్రాజెక్టుకు, మన కాళేశ్వరం ప్రాజెక్టుకు పోలిక చేసి విశ్లేషించడమే పొరపాటు. తెలంగాణలో ఎత్తిపోతలే శరణ్యం. కాబట్టి ‘ఖర్చులు–ప్రయోజనాలు’ అన్న దృష్టి కోణం గ్రావిటి ప్రాజెక్టులకు వర్తిస్తుంది కానీ తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతలకు, కొండ ప్రాంతాల్లో నిర్మించే ఇతర పథకాలకు వర్తించదు.


నిజానికి ఈ అంశంపై దేశంలో విస్తృతమైన చర్చ జరగాలి. గల్ఫ్ దేశాలు తాగునీటి కోసం సముద్రపు ఉప్పు నీటిని శుద్ధిపరచడానికి బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీ మీటర్లు. ఆ విలువైన నీటిని సమర్థవంతంగా వినియోగించడానికి ఇజ్రాయిల్ ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నది. అది వారి సామాజిక అవసరం. అవి తెల్ల ఏనుగులు అని తీసి పారేయడానికి వీలు లేదు. తెలంగాణ కూడా అంతే.

సోవియట్ ప్రాజెక్టు రద్దు అయిన తర్వాత ప్రపంచంలో ఏ దేశమూ ఇటువంటి ప్రాజెక్టును చేపట్టలేదని జానయ్య పేర్కొన్నారు. అది శుద్ధ అబద్ధం. ఎక్కడో ఎందుకు మన దేశంలోనే నదుల అనుసంధానం ప్రాజెక్టును (Inter Linking of River Project) నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకానికి తొలుత 1970 ప్రాంతంలో డా కె.ఎల్.రావు రూపకల్పన చేశారు. ఆ తర్వాత అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును ప్రోత్సహిస్తూ రాష్ట్రాలతో చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఇక మన పక్కనే ఉన్న చైనాలో కూడా నీటి లభ్యత అధికంగా ఉన్న దక్షిణ ప్రాంత నదుల నుంచి నీటి కొరత ఉన్న ఉత్తర, తూర్పు మధ్య చైనా ప్రాంతాలకు నీటిని తరలించే భారీ ప్రాజెక్టును చేపట్టింది. 2050 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అయ్యే ఖర్చు 62 బిలియన్ డాలర్లు, తరలించే మొత్తం నీటి పరిమాణం 44.8 బిలియన్ క్యూబిక్ మీటర్లు (1582 టిఎంసిలు).

వ్యవసాయ ఆర్థికవేత్త జానయ్య లాంటి మేధావుల వాదనలకు లొంగిపోయి తెలంగాణ ప్రభుత్వం ఖర్చులు–ప్రయోజనాలు అన్న దృష్టి కోణంలో కూరుకుపోతే ఇక తెలంగాణ వ్యవసాయ రంగమే కాదు తెలంగాణ ఆర్థిక రంగం కూడా ఆగమైపోవడం ఖాయం. కాళేశ్వరం పూర్తి అయిన ప్రాజెక్టు. అది తెలంగాణ ప్రజల ఆస్తి. దాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. రైతాంగం ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూస్తున్నది.

వీరమల్ల ప్రకాశ్

తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్

Updated Date - Apr 25 , 2024 | 02:45 AM