Share News

మరాఠీ రంగస్థలంపై యువతరం బావుటా

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:06 AM

ఇటీవల పూణేలో - మరాఠీ నాటక రంగంలో విశేషమైన విధులను నిర్వహిస్తూన్న రాజేంద్ర ఠాకుర్‌దేశాయ్‌ని కలుసుకొని చర్చించే అవకాశం ఈ వ్యాసకర్తకు లభించింది. రాజేంద్ర ఠాకుర్‌ దేశాయ్‌ ఒక బిజీ లాయర్‌...

మరాఠీ రంగస్థలంపై యువతరం బావుటా

ఇటీవల పూణేలో - మరాఠీ నాటక రంగంలో విశేషమైన విధులను నిర్వహిస్తూన్న రాజేంద్ర ఠాకుర్‌దేశాయ్‌ని కలుసుకొని చర్చించే అవకాశం ఈ వ్యాసకర్తకు లభించింది. రాజేంద్ర ఠాకుర్‌ దేశాయ్‌ ఒక బిజీ లాయర్‌. రంగస్థల నటుడిగా, దర్శకుడిగా అనుభవం ఉన్నవాడు. ప్రస్తుతం ‘మహారాష్ట్రీయ కళోపాసక్‌’ సంస్థకు కార్యదర్శిగా ఉన్నారు. ఈ సంస్థ గత అరవై ఏళ్లుగా ‘పురుషోత్తం కరండక్‌’ పేరుతో ప్రతీ ఏటా మహరాష్ట్ర లోని కాలేజీ విద్యార్థులకై ఏకాంకిక నాటికల పోటీని నిర్వహిస్తున్నది. ఆనాటి సంభాషణలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలుగులో మాదిరిగానే మరాఠీ నాటకరంగం కూడా జానపద, పౌరాణిక, సాంఘిక, అధునిక, ప్రయోగాత్మక దశల వెంబడే ప్రయాణించింది. అయితే మరాఠీ నాటకరంగానికి కొన్ని నిర్దిష్టతలు ఉన్నాయి.

మరాఠీ నాటకరంగపు మూల శక్తి గ్రామీణ, జానపద రీతుల్లోనూ, మరాఠీలంతా గర్వపడే చారిత్రక గాథల్లోనూ దాగి ఉన్నది. ఇందుకు మంచి ఉదాహరణలు - నేటికీ ఆబాలగోపాలాన్ని అలరించే శివాజీ సాహసగాథలు, పీష్వాల కాలంలో దేశంలోని అత్యధిక ప్రాంతాలకు విస్తరించిన మరాఠా సామ్రాజ్యం, మొఘల్‌ సామ్రాజ్యంపై విజయాలు, బ్రిటిష్‌వారితో ఓటమి మిగిల్చిన విషాదం - ఇవన్నీ తరతరాల మరాఠీ పండిత, పామర జనాల హృదిలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇవన్నీ కూడా కళాకారులకు ముడిసరుకుగా మారి, జానపద కళారూపాల్లోనూ, నాటకాల్లోనూ నేటికీ ప్రతిఫలిస్తూనే ఉన్నాయి.


జానపద, పౌరాణిక మూలాల నుండి ఆధునికత వైపు మళ్లుతూన్న దశలో గుజరాతీ, పార్శీ నాటకాల ప్రభావం మరాఠీ నాటకంపై పడింది. అంతకన్నా బలంగా, నిలకడగా, మరాఠీ నాటకాన్ని ప్రభావితం చేసినవి పాశ్చాత్య నాటకాలు. ముఖ్యంగా షేక్‌స్పియర్‌, మోలియర్‌, ఇబ్సెన్‌, ఛెఖోవ్‌ల నాటకాలు; ఆ మాటకొస్తే ఉత్తమ ప్రపంచ సాహిత్యం మరాఠీ నాటక రచయితలను ఉత్తేజపరచింది. బెంగాల్‌లో కూడా, కలకత్తా కేంద్రంగా ఇదే జరిగిందని కొంతమంది మిత్రులు చెప్పారు.

ప్రభావాలు, ప్రేరణలు ఎన్ని ఉన్నప్పటికీ మరాఠీ నాటకాలేవీ తమ స్థానికతను, విశిష్టతను పోగొట్టుకోలేదనే చెప్పాలి. అదే సమయంలో సాహసోపేతమైన ప్రయోగాలు చెయ్యడంలో, గతకాలపు గాథలకు ఆధునిక వ్యాఖ్యానాలను అందివ్వడంలో మరాఠీ నాటక రచయితలు ముందున్నారు.

ఒక వైపు జానపద కళారీతులు, మరోవైపు శాస్త్రీయ సంగీత గాయకులు, వాద్యకారులు మరాఠీ నాటకపు జీవధారలుగా కొనసాగుతున్నారు. సంగీతం వారి నాటకాలలో విడదీయలేని పాయగా పెనవేసుకుపోయింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సృష్టించే ఉద్వేగాల్ని వినియోగించుకుంటూ నాటకీయతను ఉన్నతీకరించడంలో మరాఠీ దర్శకులు సిద్ధహస్తులు. నాటకాన్ని ప్రదర్శించేటప్పుడల్లా మెరుగుపరచవచ్చు; స్థలకాలాలకు అనుగుణంగా తీర్చిదిద్దవచ్చు. ఈ ఎరుకతో మరాఠీ దర్శకులు ప్రతీ ప్రదర్శననీ నిత్యనూతనంగా ఆవిష్కరిస్తారు.


ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూన్న మరాఠీ నాటకరంగ కృషి, రసజ్ఞులూ విజ్ఞులూ అయిన ప్రేక్షక సమూహాలను పోగు చేసుకున్నది. అయితే అటువంటి ప్రేక్షకులు ఆశించే ప్రమాణాలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. ప్రేక్షకుల ఆకాంక్షలను చేరుకో వడమే కాకుండా ఎప్పటికప్పుడు వాటిని అధిగమించడం మరాఠీ నాటకరంగం నిరంతరంగా ఎదుర్కొనే సవాలు.

బాలీవుడ్‌, టీవీ సీరియళ్ల ఆకర్షణ మూలంగా మరాఠీ నాటకరంగం నష్టపోతూ వస్తూన్నదనే చెప్పాలి. అయితే బాలీవుడ్‌ మూలంగా కొంత మంచి కూడా జరిగింది. వాద్యకారులు, ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారు. నాటకరంగ నేపథ్యంతో ఎదిగిన సినీ ప్రముఖులు కొందరు నాటక ప్రదర్శనలు ఇస్తూ, తమ మూలాల ఋణాన్ని తీర్చుకుంటున్నారు.

‘మహారాష్ట్రీయ కళోపాసక్‌’ సంస్థ తరఫున అరవై ఏళ్లుగా కాలేజీ విద్యార్థులకై నిర్వహిస్తున్న ఏకాంకిక నాటికల పోటీ ‘పురుషోత్తం కరండక్‌’. ఈ పోటీల మొదటి రౌండ్లు రాష్ట్రంలోని ఐదు పట్టణాల్లో (రత్నగిరి, పూణె, కొల్‌హాపూర్‌, నాగ్‌పూర్‌/ అమరావతి, ఔరంగాబాద్‌/ జల్‌గావ్‌) నిర్వహించబడతాయి. అక్కడి విజేతలు పూణేలో జరిగే ఫైనల్స్‌లో పాల్గొంటారు. ప్రతి ఏటా ఒకే ఆడిటోరియంలో ఫైనల్స్‌ జరుగుతాయి (భరత్‌ నాట్య మందిర్‌, సదాశివ్‌ పేట్‌, పూణే). మహారాష్ట్రలోని నాలుగు పట్టణాలలో జరిగే పోటీలు, అలాగే పూణేలో జరిగే ఫైనల్స్‌ - వీటి తేదీలను ముందుగానే ప్రకటిస్తారు గనుక ఆయా విద్యార్థులు, కాలేజీలు ఏర్పాట్లు చేసుకుంటారు. ఫైనల్స్‌కి చేరుకోవడమే వారికొక ఘన విజయం. ప్రతీ ఏడూ జరిగే ఈ ఫైనల్స్‌ని చూడడానికి ప్రేక్షకులు ముందుగానే టిక్కెట్లు కొనుక్కొని సీట్లు రిజర్వ్‌ చేసుకుంటారు. మీడియాతో సహా అందరూ ఉత్సుకతతో ఈ ప్రదర్శనలకై ఎదురుచూస్తూంటారు. ఈ పోటీల్లో నగదు బహుమతి కేవలం ఐదువేల రూపాయిలు మాత్రమే. కానీ యువ కళాకారులకు లభించే గుర్తింపు అద్వితీయం. గతంలో పురుషోత్తం కరండక్‌ బహుమతులను గెల్చుకున్నవారు చాలామంది ఇప్పుడు ఉన్నతస్థాయికి చేరుకున్నారు. మహారాష్ట్రలోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన వాళ్లల్లో రోహిణీ హత్తంగడి, జబ్బార్‌ పటేల్‌, మోహన్‌ అగాషి వంటి వారు అనేకులు ఉన్నారు.


ప్రభుత్వ విభాగాల, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలనేది ఈ సంస్థ కఠిన నియమం. ముగ్గురు కార్యవర్గ సభ్యులు, న్యాయ నిర్ణేతలకు తప్ప వేరెవ్వరికీ ఉచిత ప్రవేశం ఉండదు. వారి కుటుంబ సభ్యులెవరైనా నాటకాలు (ఫైనల్స్‌) చూడాలనుకుంటే ముందుగా టిక్కెట్లు కొనుక్కోవాల్సిందే. ఎంత పెద్ద అధికారులకైనా రాజకీయ నాయకులకైనా పాస్‌లు ఇచ్చే ప్రసక్తి లేదు. ప్రభుత్వ, లేదా ప్రైవేటు సంస్థల నుండి విరాళాలు స్వీకరించే సంప్ర దాయం లేదు. స్పాన్సర్‌షిప్‌లకు, వాణిజ్య ప్రకటనలకు ఆమోదం లేదు. రెండు మూడు వారాల ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడు పోతాయి. మూడవ గంట మ్రోగాక ద్వారాలు మూసేస్తారు. ఏ ఒక్కరికీ ప్రవేశం ఉండబోదు.

కళ నిలద్రొక్కుకోవాలన్నా, వృద్ధిచెందాలన్నా విమర్శ అత్యవసరం. అదృష్టవశాత్తూ మరాఠీ నాటకాలను నిర్మొహమాటంగా విమర్శించే నిష్ణాతులున్నారు. వాళ్ల అభిప్రాయాలకై ఆసక్తిగా ఎదురుచూసే కళాకారులు, దర్శకులు, ప్రేక్షకులు ఉన్నారు. విమర్శలను సహృద యంతో స్వీకరించే సంప్రదాయం ఉంది. అరవై ఏళ్లపాటు అవిరామంగా ఈ పోటీలను ఉన్నత ప్రమాణాలతో, ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల మధ్య, భాషలమధ్య సాంస్కృతిక రంగంలో ఇచ్చిపుచ్చు కోవడాలూ, ఒకరినుండి ఒకరు నేర్చుకోవడం కొనసాగుతూనే ఉండాలి అని బలంగా అనిపించింది. ముఖ్యంగా మరాఠీ, తెలుగు నాటకరంగాల అన్యోన్యత ఈ నాటిది కాదు. ‘ధార్వాడు నాటక సమాజం’ వారి ప్రదర్శనలు ఆధునిక తెలుగు నాటకరంగానికి అందించిన ప్రేరణతో కందుకూరి వీరేశలింగం, 1880లో మొదటి తెలుగు నాటక ప్రదర్శన చేబట్టారు. మహారాష్ట్ర నుంచి వలస తోలు బొమ్మలాట కళాకారులు, కడప పట్టణానికి సమీపాన ఉన్న సురభి గ్రామానికి వలస వచ్చి, స్థానిక జమీందారు ఆదరణతో ‘కీచకవధ’ని నాటకరూపంలో తొలుత 1885లో ప్రదర్శించారట. ఊరూరా తిరుగుతూ, ‘ప్రేక్షకుల వద్దకే ప్రదర్శన’ను తీసికెళ్లే ధార్వాడు కంపెనీ సంప్రదాయాన్ని సురభి నాటక సంస్థ అనుసరించింది. ఆ విధంగా వారి ప్రాభవం తెలుగు రాష్ట్రాల నలుచెరగులనూ చేరుకుంది.


‘మహారాష్ట్రీయ కళోపాసక్‌’ వంటి స్వచ్ఛంద సంస్థలు మనకి లేకపోలేదు. అజో-విభో-కందాళం సంస్థను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే, యువతరానికై ప్రత్యేకించిన ‘పురుషోత్తం కరండక్‌’ స్థాయి పోటీలు లేవు. మనకి నాటకరంగం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులు అనేకులున్నారు. వాళ్లు పూనుకుంటే, మహారాష్ట్రలో సాధ్యమైన విజయాన్ని మనం కూడా ఒక రోజున కళ్లారా చూడగలం. ఏదైన మన దృష్టిని, వనరులను యువతరంపైనే కేంద్రీకరించాలి. వాళ్లే మన ఆశాజ్యోతులు.

(ఈ సంభాషణను 2024, మే 12న పూణేలో స్థానిక సాహిత్యాభిమాని మండపాక లింగమూర్తి నిర్వహించారు.)

ఉణుదుర్తి సుధాకర్‌

- 90006 01068

Updated Date - Jun 24 , 2024 | 06:06 AM