Share News

యువతను పొగాకు నుంచి కాపాడాలి

ABN , Publish Date - May 30 , 2024 | 01:14 AM

ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పొగాకు బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచంలో క్యాన్సర్ ద్వారా మరణిస్తున్న వారిలో 25 శాతం మందికి పొగాకు కారణం అవుతోంది...

యువతను పొగాకు నుంచి కాపాడాలి

ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది పొగాకు బారిన పడి మరణిస్తున్నారు. ప్రపంచంలో క్యాన్సర్ ద్వారా మరణిస్తున్న వారిలో 25 శాతం మందికి పొగాకు కారణం అవుతోంది. ప్రతి ఏటా 10 లక్షల మంది పరోక్షంగా సిగరెట్ పొగ పీల్చడం ద్వారా మరణిస్తున్నారు. అగ్ని ప్రమాదాలకు అనేకసార్లు సిగరెట్లు కారణమవుతున్నాయి. పొగాకు వాడకం వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. పొగాకు తాగే వారిలో సాధారణ పౌరుల కన్నా 22 రెట్లు ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, శరీరంలోని అన్ని రకాల అవయవాలు దెబ్బ తినే అవకాశం ఉంది. పొగాకు తాగే వారిలో చర్మం ముడతలు పడి, త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. ఇన్ని అనర్థాలకు దారి తీసే పొగాకు నుంచి ప్రపంచాన్ని విముక్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988లో మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా ప్రకటించింది.


పొగాకు వినియోగం తగ్గించడానికి నిరంతరం కృషి కొనసాగిస్తూనే, ప్రత్యేకించి ఈ రోజు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించడం, పొగాకు వినియోగం వల్ల జరిగే మరణాలను నివారించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య ఆరోగ్య రంగాలు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో అవగాహన పెంచడానికి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజలు కూడా తమ ఆరోగ్య హక్కు కాపాడుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవనం కోసం, భవిష్యత్తు తరాలను పొగాకు బారి నుంచి కాపాడే దిశలో ప్రయత్నాలు చేయాలి. 2024 సంవత్సరం పొగాకు వ్యతిరేక దినం యువతకు వేదిక కావాలి. పొగాకు వాణిజ్య సంస్థలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం యువతను ఆకట్టుకుని, వారిని పొగాకు వాడకానికి బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టాలి.


పొగాకు వినియోగం తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొంత సత్ఫలితాలు ఇస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల వినియోగం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. యువతను బానిసలుగా చేయడం కోసం నికోటిన్ తదితర హానికర పదార్థాలు కలిగి పీల్చడానికి అనుగుణంగా బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలను పొగాకు పరిశ్రమలు మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నాయి. ‘స్టాప్’ అనే సంస్థ ఇటీవల ‘రానున్న తరానికి గాలం’ నివేదిక ప్రకటించింది. ఈ నివేదికలో పొగాకు, నికోటిన్ పరిశ్రమలు యువతను పొగాకు వాడకానికి బానిసలుగా చేయడానికి రూపొందిస్తున్న వివిధ వినియోగ పరికరాల డిజైన్లు, అనుసరిస్తున్న మార్కెటింగ్ ప్రచారాలను ఎండగట్టింది. 13 నుంచి 15 సంవత్సరాలలోపు 37 మిలియన్ల పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు వినియోగిస్తున్నారని ఈ నివేదిక అంచనా వేసింది. ప్రపంచంలోనే పలు దేశాలలో పెద్దవారికన్నా అధిక సంఖ్యలో బాలలు, యువత ఈ ఎలక్ట్రానిక్స్ సిగరెట్లు ఉపయోగిస్తున్నారని అప్రమత్తం చేసింది. పొగాకు వినియోగం తగ్గించే ప్రయత్నాలు కొంతవరకు ఫలితాలు ఇస్తున్నప్పటికీ, ఎలక్ట్రానిక్ సిగరెట్స్, పొగాకు– నికోటిన్ కలిసిన క్యాండీ, ఫ్రూట్ ఫ్లేవర్స్‌లో ఆకర్షణీయమైన ఆట వస్తువు రూపంలో బాలలను అకట్టుకోవడానికి పొగాకు పరిశ్రమలు చేస్తున్న మార్కెటింగ్ కుతంత్రాలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. క్రెచ్ హెచ్చరించారు.


పొగాకు వినియోగం తగ్గించడానికి, యువతను పొగాకు బారి నుంచి కాపాడడానికి ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నికోటిన్ కలిగిన నూతన ఉత్పత్తులు నిరోధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు దేశాలకు సూచనలు చేసింది. పొగాకు ఉత్పత్తులపై పూర్తిస్థాయి నిషేధం లేదా కఠినతరమైన నిబంధనలు విధించడం; ఎలక్ట్రానిక్ సిగరెట్లపై పూర్తిస్థాయి నిషేధం; పొగాకు ఉత్పత్తుల ప్రచారం, వినియోగం పెంచే చర్యలపై నిషేధం; పొగాకు ఉత్పత్తులపై పన్నులు అధికం చేయడం; పొగాకు పరిశ్రమల వాణిజ్య ఎత్తుగడలపై ప్రజలలో అవగాహన పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి.

ప్రభుత్వ విధాన రూపకర్తలు సరైన సమయంలో స్పందించకపోతే, ప్రస్తుత, భవిష్యత్ తరాలలో అధిక శాతం పొగాకు వినియోగానికి బానిసలుగా మారే అవకాశం ఉంది. పొగాకు రహిత సమాజం కోసం విధాన రూపకర్తలు కృషి చేయాలని, లేకపోతే భవిష్యత్ తరాలు వారిని క్షమించబోవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు నియంత్రణ సదస్సు ఇటీవల హెచ్చరించింది.

డాక్టర్ గుర్రాల రవి కృష్ణ,

ఐఎంఏ రాష్ట్ర యాక్షన్ కమిటీ చైర్మన్

(మే 31: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)

Updated Date - May 30 , 2024 | 01:14 AM