Share News

ఆసియాకు అందేనా ఈ శతాబ్దం?

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:58 AM

ఈ శతాబ్దం ఆసియాదే! ఏదో ఒక సందర్భంలో దీన్ని వినని వారే ఉండరు! 1750ల వరకూ జనాభాలోనే కాదు.. ప్రపంచ వస్తు, పంటల ఉత్పత్తిలో ఆసియాదే అగ్ర భాగం! ఒకనాడు ప్రపంచ ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువే వాటా కలిగిన ఆసియా ఖండం 1950ల వరకూ తీవ్ర దుస్థితిని ఎదుర్కొంది...

ఆసియాకు అందేనా ఈ శతాబ్దం?

ఈ శతాబ్దం ఆసియాదే! ఏదో ఒక సందర్భంలో దీన్ని వినని వారే ఉండరు! 1750ల వరకూ జనాభాలోనే కాదు.. ప్రపంచ వస్తు, పంటల ఉత్పత్తిలో ఆసియాదే అగ్ర భాగం! ఒకనాడు ప్రపంచ ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువే వాటా కలిగిన ఆసియా ఖండం 1950ల వరకూ తీవ్ర దుస్థితిని ఎదుర్కొంది. దాదాపు 200 ఏళ్లకు పైగా ఆసియా తన పూర్వ వైభవాన్ని ఎందుకు కోల్పోయింది? ఆ తర్వాతా ఆశించిన స్థాయిలో వేగంగా అడుగులు ఎందుకు వేయలేకపోయింది? ఇందుట్లో స్వయంకృతాపరాధాలెన్ని? బాహ్య ప్రమేయ అపరాధాలెన్ని? యాదృచ్ఛిక పరిణామాలెన్ని? అని ప్రశ్నించుకుంటే చాలా విషయాలను చెప్పుకోవచ్చు. గడచిన ముప్పయి ఏళ్లలో జరిగిన పరిశోధనలతో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి.

18వ శతాబ్దం విప్లవాలకు నిలయం. పారిశ్రామిక, అమెరికా, ఫ్రెంచ్‌ విప్లవాలతో పాటు అపూర్వ మేధో వికాసాలు ఆ శతాబ్దంలోనే జరిగాయి. దీన్ని దాటి వందల, వేల ఏళ్లు వెనక్కి వెళితే ఆసియా ఖండ ఘనచరిత్ర మనకు కనపడుతుంది. మానవ నాగరికతల అభివృద్ధిలో ఆసియాతో పోల్చదగినది ఏదీ లేదు. హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ఇస్లాం లాంటి కోట్ల మంది అనుసరించే మతాలన్నీ ఇక్కడే పుట్టాయి. నదీ తీరాల్లో వెలిసిన తొలి నాగరికతలకూ ఇక్కడి నేలలే మూలం. ప్రపంచమంతా ప్రస్తుతం తినే అనేక ఆహార పదార్థాల ఎంపికా, ఉత్పత్తీ ఆసియాలోనే మొదలయ్యాయి. జంతువుల మచ్చికా ఇక్కడే ప్రారంభమైంది. రాజ్య వ్యవస్థలు ఉనికిలోకి వచ్చిందీ ఇక్కడే. అనేక విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానాలు ఆసియాలోనే ఊపిరి పోసుకున్నాయి.


ఇదంతా గతం! మనమంతా గర్వించతగిన ఘనమైన గతం! మరి భవిష్యత్తు ఏమిటి? యూరపు వలస పాలనతో అన్నింటా అట్టడగుకు వెళ్లిన ఆసియాకు పూర్వ ప్రాభవం వచ్చేస్తోందా? ఆసియా దేశాలు చేస్తున్న ఉత్పత్తులు, సృష్టిస్తున్న సంపదలను డబ్బుగా లెక్కకట్టి చూస్తే అది సాధ్యమే అనిపించినా... దారి పొడవునా ఎన్నో సమస్యలు.. ఎన్నో ముళ్లదారులు.. సరిహద్దుల సంఘర్షణలు.. మత వైషమ్యాలు.. సైద్ధాంతిక స్పర్థలు.. జాత్యహంకార జాతీయవాదం విసురుతున్న సవాళ్లు.. వలసపాలన సృష్టించిన విపరీత కేంద్రీకృత పాలన.. ఇవన్నీ ఆసియా వాసుల మధ్య సంఘీభావానికీ సామరస్యానికీ ప్రతిబంధకాలు! క్రమేపీ అవి తొలగుతాయా? అసలు తామంతా ప్రగాఢ సంబంధాలతో కూడిన ఘనచరిత్ర కలిగిన ఆసియా ఖండ వారసులమన్న భావన ప్రజల్లో బలంగా ఎప్పుడైనా నాటుకుందా? అలా నాటుకునే పరిస్థితులు ఉన్నాయా? ఆసియా సమాజాల మధ్య సుదీర్ఘంగా కొనసాగిన ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యమవుతుందా? పాశ్చాత్య దేశాల ఆధిపత్యం సడలిపోతున్న నేపథ్యంలో ఆసియా దేశాల మధ్య ఒకనాటి వలసపాలనకు వ్యతిరేకంగా తలెత్తిన భావైక్యతా ధోరణులలో మిగిలింది ఎంత? ఉన్నదాంట్లో ఇప్పటికీ అభివృద్ధి చేయగలిగిన దెంత? మతం, భాష, జాతి ఆధారంగా యూరపులో ఏర్పడిన జాతి రాజ్య (నేషన్‌ స్టేట్‌) భావన రగిల్చిన దారుణాలను దాటి... భిన్న భాషలు, మతాలు, సంస్కృతులను అవలంబించే ప్రజలను సమాన పౌరులుగా చూసే దృష్టి ఆసియాలో మళ్లీ బలంగా వేళ్లూనుకుంటుందా? లేక మైనారిటీలను అణచివేసి ఏక జాతి ప్రాబల్య రాజ్యాలను స్థాపించిన యూరపు తరహా చరిత్ర ఆసియాలోనూ పునరావృతం అవుతోందా? ఈ ప్రశ్నలన్నీ ఎంతో కీలకమైనవి.


ఆసియాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీటికెలాంటి జవాబులు ఇవ్వగలమన్నదే గాక భవిష్యత్తు పరిణామాలను స్థూలంగా సూచిస్తూ... ప్రముఖ చరిత్రకారుడు సుగత బోస్‌ ‘ఏషియా ఆఫ్టర్‌ యూరోప్‌’ పేరుతో ఇటీవలే ఒక పుస్తకాన్ని వెలువరించారు. సుగత బోస్‌ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న చరిత్రకారుడే కాదు... ప్రత్యక్ష రాజకీయాల్లోనూ అనుభవాన్ని గడించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభకు (2014–2019) ఎన్నికయ్యారు. నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ పెద్దన్నకు మనవడైన సుగతది బెంగాల్‌లో పేరున్న రాజకీయ కుటుంబం. సుగత బోస్‌ తల్లి కృష్ణబోస్‌ కూడా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. క్రియాశీల రాజకీయాల్లో ఉండి తిరిగి చరిత్ర అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా అమెరికాలో కృషిచేయటం రాజకీయాల్లో అరుదనే చెప్పాలి.

ప్రపంచ వస్తుసేవల ఉత్పత్తిలో 1820ల నాటికి కూడా భారత్‌, చైనాల వాటా 50 శాతం ఉండేది. 1913 వచ్చే సరికి అది 18 శాతానికి పడిపోయింది. జపాన్‌ ఒక్కటే దీనికి కాస్త మినహాయింపు. ఆసియా అంతటా చవిచూసిన ఆ క్షీణత వ్యక్తుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అంతకంటే ఎక్కువగా ఆసియా వాసులు అందరిలోనూ తీవ్ర ఆత్మన్యూనతకు కారణమైంది. యూరపు వాసులకంటే ఎంతో ప్రాచీన చరిత్రనూ నాగరికతనూ కలిగిన తమకెందుకీ దుస్థితి.. అన్న భావన ఆలోచనాపరులను కలచివేసింది. ఈ నేపథ్యం నుంచి ఆసియా దేశాల మధ్య ఐక్యత నెలకొనాలనే భావమే గాక, చారిత్రకంగా పెనవేసుకున్న వాణిజ్య బంధాలు, సంస్కృతుల్లోని సారూప్యతలపై మేధోమథనం మొదలైంది. 1904–1905 యుద్ధంలో రష్యాపై జపాన్‌ గెలవటం ఆసియాలో సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు. బాలగంగాధర్‌ తిలక్‌ మొదలుకుని ఎంతో మంది దాన్ని ఘనంగా స్వాగతించారు. ప్రత్యక్ష, పరోక్ష వలస పాలనతో ఆసియా వాసులు పోగొట్టుకున్నవన్నీ క్రమేపీ సాధించగలరన్న భరోసాని ఆ యుద్ధం ఎంతో కొంత కలగచేసింది. 1917 నాటి రష్యను విప్లవం జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రకటించటం ఆసియా ప్రజలను బాగా ప్రభావితం చేసింది. వలసపాలనలో మగ్గుతున్న ప్రజలకు మార్కిసిస్టు ఆలోచన సామ్రాజ్యవాదంపై కొత్త చూపును కల్పించింది. 1890ల నుంచి 1950ల చివరి వరకూ ఆసియా–ఆఫ్రికాల మధ్య సంఘీభావం, స్నేహం, సహకారం కోరుకుంటూ... ఎన్నో చర్చలు, సమావేశాలు, పర్యటనలు ఎడతెరపి లేకుండా సాగాయి.


పరస్పరం ఇచ్చిపుచ్చుకునే సహకార దేశాల సమాహారంగా ఆసియా ఖండాన్ని ఊహించటం, భావించటం మొదలైంది. ఆ ఊహకూ, ఆ భావనకూ మూలాలను, వాటిని వినిపించిన నేతలు, మేధావులు, కళాకారుల కృషిని ప్రధానంగా సుగత బోస్‌ విశ్లేషించారు. ఈ మొత్తం పరిణామంలో.. ఆసియా ఆకాంక్షలకు భిన్నంగా జపాన్‌ సామ్రాజ్యవాద విధానంతో సమీప దేశాలను ఆక్రమించటం ఒక విపరీతంగానే మిగిలిపోయింది. రవీంద్రనాథ్‌ టాగోర్‌ అయితే .. యూరపు దేశాల గుడ్డి అనుకరణ ప్రభావానికి లోనై జపాన్‌ చేసిన దారుణంగా దాన్ని పరిగణించారు. జపాన్‌ నుంచి స్ఫూర్తి– విరక్తి రెండూ ఏకకాలంలో కలుగుతోందన్న భావాన్ని టాగోర్‌ వ్యక్తపరచారు.

1950ల నాటికి ఆసియాలోని చాలా దేశాలకు ప్రత్యక్ష వలసపాలన నుంచి విముక్తి కలిగింది. 1955లో ఇండొనేషియాలో బాండుంగ్‌ సమావేశంలో ఆసియా–ఆఫ్రికా దేశాలు పరస్పర సహకారం గురించి, పరోక్ష వలసపాలనను ఎదుర్కోవల్సిన అవసరాన్ని గురించి చాలా మాట్లాడాయి. ఆ తర్వాత కొద్దికాలానికే ఆసియా దేశాల మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయి. అమెరికా–రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం విభేదాలను బాగా పెంచింది. వలసపాలకులు తమ అవసరాల కోసం ఆసియా దేశాల సరిహద్దులను అసంబద్ధంగా నిర్ణయించటం శాపమై భారత్‌–చైనాల మధ్య యుద్ధానికి కారణమైంది. జాతి ప్రయోజనాల పేరుతో.. వలసపాలకులు గీసిన పటాల్లో (మ్యాప్స్‌) నిర్దేశించిన సరిహద్దుల కోసం పట్టువిడుపుల్లేకుండా వ్యవహరించటం.. వలస పాలన వారసత్వంగా వచ్చిన విపరీత కేంద్రీకృత పాలనను యథాతథంగా స్వీకరించి మైనారిటీల ఆకాంక్షలనూ వెనుకబడిన ప్రాంతాలనూ విస్మరించటంతో చాలా చోట్ల ఏదో ఒక స్థాయిలో అంత్యరుద్ధాలు, యుద్ధాలు ఆసియా ఖండాన్ని కుదిపివేశాయి.


ఇదంతా ఎందుకు జరిగింది? ఆసియా ఐక్యభావన ఏమైపోయింది? పరస్పర సహకార భూమిగా ఆసియా ఖండాన్ని ఊహించటం కాల్పనిక భావనేనా? వాస్తవికతకు దూరమైన భావుకతగానే దీన్ని పరిగణించాలా? సుగత బోస్‌ అభిప్రాయం ప్రకారం అంతగా నిరాశపడాల్సిన అవసరం లేదు. రెండు ప్రపంచ యుద్ధాలకూ అంతకు ముందు మరెన్నో వినాశనాలకూ కారణమైన యూరపు రాజ్యాలు.. పరస్పరం సహకారానికి యూరోపు యూనియన్‌గా సంఘటితమై ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆసియా దేశాల మధ్య అలాంటి ఏర్పాటు ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పేయలేం! ఉప్పునిప్పుగా ఉన్న భారత్‌–చైనా సంబంధాలకూ ఇదే వర్తిస్తుంది. అందుకు కావాల్సిన స్ఫూర్తిని.. ఆసియా మేధావులు, నాయకులు, సాహిత్యవేత్తలు, కళాకారులు చేసిన కృషి నుంచి ఎంతైనా పొందొచ్చు. దీనికి తోడు 1979 నుంచి ఆసియా దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బాగా బలపడుతున్నాయి. ఆసియా అంతర్జాతీయ వాణిజ్యంలో 50 శాతానికి పైగా ఖండంలోని దేశాల మధ్యనే జరుగుతోంది.. భవిషత్తులో ఇదింకా పెరగనుంది. దీనికి భిన్నమైన మరొక పరిణామం కూడా జరుగుతోంది. అమెరికా, యూరపులు తమ చుట్టూ రకరకాల గోడలను కట్టుకుంటూ ఆసియా తాకిడిని అడ్డుకోటానికి ప్రయత్నిస్తున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి నేతల వైఖరులే దీనికి నిదర్శనం.


ఆర్థిక శాస్త్రానికి ఆద్యుడైన ఆడంస్మిత్‌ 250 ఏళ్ల క్రితం భవిష్యత్తుకు సూచికగా ఒక వ్యాఖ్యానం చేశారు. విజేత యూరపు రాజ్యాలు, పరాజిత పాశ్చాత్యేతర రాజ్యాల మధ్య ఒకనాటికి రాజ్యాధికారపరంగా సమతూకం ఏర్పడుతుందనీ, అప్పుడు సమానత్వం ప్రాతిపదికగా ప్రపంచ మార్కెట్‌ పనిచేస్తుందని చెప్పటమే దాని పరమార్థం. ప్రత్యక్ష వలసపాలన సమసిపోయినా అదిప్పటికీ పూర్తిగా సాధ్యమైందని చెప్పలేం. బలహీన రాజ్యవవస్థలు ఉన్నచోట పేద దేశాల వనరులను కొల్లగొట్టటం ఆగలేదు. జాతీయ ప్రయోజనాల పేరుతో చైనా ప్రదర్శిస్తున్న సామ్రాజ్యవాద పోకడలు, భారత్‌లో బలపడుతున్న ఏక మతాధిపత్య ఉన్మత్తత, పలుచోట్ల పెచ్చరిల్లుతున్న అతివాద ఇస్లాం రాజకీయాలు ఆసియా ఐక్య భావనకు ప్రమాదంగా మారాయి. 1800లకు ముందు ఆసియాలో ఏక కేంద్ర ఆధిపత్య నాగరికత లేదు. భిన్న కేంద్రాల నాగరికతల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండేవి. ఒక రాజ్యం లోపల కూడా అధికారం భిన్నస్థాయిల్లో వికేంద్రీకరణగా ఉండేది. ఈ చారిత్రక వాస్తవాన్ని ఆసియా దేశాలు గ్రహించి అడుగులు వేస్తేనే 21వ శతాబ్దం సుహృద్భావ ఆసియా శతాబ్దంగా మారుతుంది. దానికి భిన్నంగా గుడ్డి అనుకరణ దృష్టితో యూరోపు మార్గం తొక్కితే రక్తసిక్త చరిత్ర పునరావృతం అవుతుంది!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - Sep 10 , 2024 | 01:58 AM