Share News

అయోధ్య సయోధ్యకు దారితీయదా?

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:36 AM

సుప్రీంకోర్టు తీర్పుతో నాలుగేళ్ల క్రితం బాబ్రీ మసీదు చరిత్ర ముగిసింది. మసీదు కూలిన చోట రామమందిరం ఘనంగానూ ప్రారంభమైంది. సుదీర్ఘ వివాదాల చరిత్రలో ఒక ఘట్టానికి తెరపడింది. కానీ వివాదాల చరిత్ర...

అయోధ్య సయోధ్యకు దారితీయదా?

సుప్రీంకోర్టు తీర్పుతో నాలుగేళ్ల క్రితం బాబ్రీ మసీదు చరిత్ర ముగిసింది. మసీదు కూలిన చోట రామమందిరం ఘనంగానూ ప్రారంభమైంది. సుదీర్ఘ వివాదాల చరిత్రలో ఒక ఘట్టానికి తెరపడింది. కానీ వివాదాల చరిత్ర ప్రయాణం మాత్రం ఆగలేదు. మరో రెండు వివాదాలు తీవ్రస్థాయిలో ముసురుకుంటున్నాయి. జ్ఞానవాపి, షాహి ఈద్గా మసీదులను హిందువులకు అప్పగించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. అయోధ్య–బాబ్రీమసీదు వివాదం మూడు దశాబ్దాల పాటు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. సగటు మనిషి ఆలోచనల్లో సైతం తీవ్ర మార్పును తీసుకొచ్చింది. మత దృష్టితో చరిత్రను చూసే పద్ధతిని బాగా పెంచింది. మధ్యయుగాల చరిత్రను హిందు–ముస్లిం సమరంగా భావించే ధోరణి మధ్యతరగతి ప్రజల్లో సిర్థపడటం మొదలైంది. ఈ తరహా సంకుచిత దృష్టికి మూల కారణం ఇప్పటిది కాదు. బ్రిటిషు కాలంలోనే అది మొదలైంది. తమకు ముందున్న పాలకులను క్రూరులుగా, నిరంకుశులుగా, మతోన్మాదులుగా చిత్రీకరించే ధోరణిని బ్రిటిషు అధికారులు, చరిత్రకారులు ప్రారంభించారు. సముద్రాలను దాటి వచ్చి ఇక్కడ ప్రజలపై అంతులేని ఆధిపత్యాన్ని చలాయించాలంటే బలప్రయోగం ఒక్కటే సరిపోదు. తమకు ముందున్న పాలకులకంటే తాము అన్ని విధాలా ఉన్నతులమనీ, నాగరీకులమనీ చెప్పుకోవాలి. ప్రజలు దాన్ని నమ్మేలా చేయటానికి చరిత్ర రచనను మించిన సాధనం లేదు. దానిని చదువరుల బుర్రల్లో బలంగా నాటాలి. అలా జరగాలంటే ప్రభుత్వ నివేదికలు, పాఠ్యపుస్తకాలు, గజెట్లలో దానికి తగిన స్థానం కల్పించాలి. హిందూ జమిందార్లకు, సుల్తాన్లకు మధ్య పేచీలను ప్రజల మధ్య పేచీలుగా చూపాలి. స్వదేశీ–విదేశీ పీడకుల మధ్య పంపకాల జగడాలను ప్రజల మధ్య జగడాలుగా వ్యాఖ్యానించాలి. ఇలాంటి రాజకీయ అవసరాలతో రూపొందిన చరిత్ర.. గతాన్ని గురించి మనలో కొన్ని బలమైన భావనలు ఏర్పరిచింది. స్వాతంత్య్రం తర్వాత కూడా ఈ భావనలే ప్రధానంగా కొనసాగాయి. దీనికి తోడు 1947 నుంచి నిన్నమొన్నటి వరకూ జరిగిన మొత్తం చరిత్రను ముస్లింలను సంతృప్తిపరచే చర్యల సమాహారంగా భావించే ధోరణితో ఆ భావనలు మరింత బలాన్ని సంపాదించుకున్నాయి.

నిష్పాక్షిక దృక్పథంతో మన చరిత్రపై గొప్ప రచనలు రాలేదని చెప్పలేం. కానీ ప్రజలకు చేరింది తక్కువ. అధికారం కోసం వెంపర్లాడే రాజకీయాల్లో పైచేయి సాధించటానికి అవి పనికిరావు. కాబట్టే వాటికి తగినంత ప్రాధాన్యం రాలేదు. సుదీర్ఘమైన మన చరిత్రను హిందూ, ముస్లిం యుగాలుగా విభజించిందే బ్రిటిషు వారు. ఆ అసంబద్ధ విభజనను అట్లాగే ఉంచుతూ ప్రాచీన, మధ్యయుగాలుగా కేవలం పేర్లు మార్చి ఇప్పటికీ కొనసాగించే స్వదేశీ చరిత్రకారులు చాలా మంది ఉన్నారు. పాలకులు అనుసరించిన మతాన్ని బట్టి చరిత్రను యుగాలుగా విభజించటం ఎన్నో అనర్థాలకు దారితీసింది. హిందువులు, ముస్లింలు మధ్య ఘర్షణలు, పోరాటాలు, ఓటముల చుట్టూ చరిత్రను తిప్పారు. హిందూ రాజుల పాలనను స్వర్ణయుగంగానూ, ముస్లిం రాజుల పాలనను చీకటి యుగంగానూ చిత్రీకరించే ధోరణే ప్రధానమైంది. ఇలాంటి చరిత్ర రచనల నుంచి ప్రేరణ పొందిన వ్యక్తులే దేశంలో మతాధిక్య భావజాల సంస్థలను, పార్టీలను ఏర్పాటు చేశారు. ఆలయాల విధ్వంసాలకు అసలు కారణాలను వదిలేసి ఒక్క మత కోణం నుంచే వాటిని చూశారు. ప్రార్థనా స్థలాలను విధ్వంసం, అపవిత్రం చేయటం చాలా దేశాల్లోనూ జరిగింది. మతోన్మాదం, రాజకీయ ప్రయోజం, సంపద దోపిడి లాంటి కారణాలు ఎన్నో వీటి వెనుక ఉన్నాయి. రాజకీయ కారణాలతో ఆలయాలను కూల్చిన పాలకులే మరికొన్ని చోట్ల అదే రాజకీయాల కోసం ప్రార్థనాలయాలకు తోడ్పడిన సంఘటనలూ చరిత్రలో ఉన్నాయి.

హిందూ–ముస్లిం సంఘర్షణగా మన చరిత్రను చూడటంతోనే అయోధ్య వివాదం జటిలమైంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఈ ఆలోచనలోనే ఉండదు కాబట్టి సయోధ్యకు జరిగిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అయోధ్యలో హిందూ ఆలయాన్ని కూల్చి దాని స్థానంలో మసీదుని కట్టారనే వాదన నుంచి ఒక మెట్టు దిగటానికి హిందూ పక్షం అంగీకరించలేదు. ముస్లిం పక్షమూ వెనక్కి తగ్గలేదు. ఇరు వర్గాల ఆధారాలను పరిశీలించి చివరికి హిందూ పక్షానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలా ఇచ్చినప్పటికీ ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారనే వాదనకు సాక్ష్యాలు లేవనే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భారత పురావస్తు సంస్థ (ఏఎస్‌ఐ) నివేదిక కూడా దీన్ని నిర్ధారించలేకపోయిందనీ స్పష్టం చేసింది. నిజానికిది చాలా కీలకమైన విషయం. అప్రియ సత్యం కావటంతో చర్చల్లో దీనికి ప్రాధాన్యం దక్కలేదు. ప్రచార సాధనాలూ దీన్ని తగినంతగా పట్టించుకోలేదు. ఆలయానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది కాబట్టి కూల్చివేత వాదనకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిందనే ప్రచారం పైచేయి సాధించింది. వివాదస్పద స్థలం హిందువులకే చెందుతుందన్న అంశానికే ప్రాధాన్యమిచ్చి తీర్పులోని మిగతా విషయాలను విస్మరించటంతో ఇతర నిర్ధారణలు మరుగున పడిపోయాయి. ఏ ప్రాతిపదికన హిందువులకు స్థలాన్ని అప్పగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిందో తెలుసుకుంటే ముఖ్య విషయాల్లో స్పష్టత వస్తుంది. అయోధ్యలాగా.. జ్ఞానవాపి, షాహి ఈద్గా మసీదుల విషయంలో ఆ తరహా నిర్ణయాన్ని తీసుకోవటం అంత సులువు కాదనీ తెలుస్తుంది.

ఏఎస్‌ఐ నివేదికలో పేర్కొన్న కీలక విషయాలను సుప్రీంకోర్టు క్రోడీకరించింది. అందులో ప్రధానమైనవి: 1) మసీదు స్థలం కింది పొరల్లో 12వ శతాబ్దికి చెందిన నిర్మాణం ఉన్నట్లు తేలింది. 17 వరుసల్లో 85 స్తంభాల తాలూకు పునాదులు అక్కడున్నాయి 2) అది హిందూ మతానికి చెందిన నిర్మాణమే కావచ్చు. 3) అప్పటికే అక్కడున్న పునాదులను ఉపయోగించి మసీదును కట్టారు. 4) చిన్న వృత్తాకారపు మందిరం కూడా అక్కడ బయటపడింది. 8–10 శతాబ్దికి మధ్య అక్కడ పూజలు జరిగాయనటానికి దాన్ని చిహ్నంగా భావించొచ్చు. ఏఎస్‌ఐ నివేదికలోని ఈ అంశాలను ప్రస్తావించిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది. అవి: 12వ శతాబ్దికి చెందిన హిందూ నిర్మాణం ఎందుకు నాశనం అయిందన్న విషయంపై ఏఎస్‌ఐ ఏ కారణాన్ని చెప్పలేదు. అలాగే అక్కడున్న నిర్మాణాన్ని కూల్చివేసి మసీదుని కట్టారా? లేదా? అన్న విషయాన్ని కూడా ఏఎస్‌ఐ తేల్చలేదు. ఏఎస్‌ఐ పేర్కొన్న ప్రకారం హిందూ నిర్మాణం 12వ శతాబ్దం నాటిది. మసీదు 16వ శతాబ్దానికి చెందినది. రెండింటికి మధ్య 400 ఏళ్ల అంతరం ఉంది. ఆ 400 ఏళ్ల కాలంలో ఏ జరిగిందన్న దానిపై సాక్ష్యాధారాల్లేవు. పునాదులను మినహా మొత్తం మసీదు నిర్మాణానికి.. పురాతన కట్టడం తాలూకూ వస్తువులను ఉపయోగించారన్న నిర్ధారణకు ఏఎస్‌ఐ రాలేదు. మసీదులోని రాతి స్తంభాలు.. పూర్వ కట్టడ పునాదులకు సంబంధించిన స్తంభాలే అనటానికి కూడా ఏఎస్‌ఐ సాక్ష్యాలను చూపించలేదు.

ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారనటానికి ఏఎస్‌ఐ నివేదిక ప్రకారం ఆధారాల్లేవు. మరి దేని ఆధారంగా మసీదు స్థలాన్ని హిందువులకు అప్పగించారు? ఎవరికైనా వచ్చే సందేహమే అది. విశ్వాసాల ఆధారంగా ఒక స్థలంపై హక్కుని నిర్ణయించటం చట్ట ప్రకారం సాధ్యం కాదని తీర్పులో సుప్రీంకోర్టు పలుచోట్ల స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ధారణల ప్రకారం.. మసీదును 16వ శతాబ్దంలో కట్టినా 1856–57 వరకూ అక్కడ అవిచ్ఛిన్నంగా ప్రార్థనలు జరిగాయనటానికి ముస్లిం పక్షం ఆధారాలు సమర్పించలేకపోయింది. బాబర్‌ ఆదేశం మేరకు మసీదును కట్టారని చెబుతున్నా అందుకు సంబంధించి లిఖిత సాక్ష్యాల్లేవు. మసీదుపై యాజమాన్య హక్కును నిర్దేశించే సనద్‌లు, ఫర్మానాల్లాంటివి లేవు. హిందూ–ముస్లిం గొడవలతో 1857లోనే మసీదు ప్రాంగణాన్ని బ్రిటిషు పాలకులు రెండుగా విభజించి గోడకట్టారు. గుమ్మటాలున్న కట్టడాన్ని ముస్లింలు ఉపయోగిస్తే మిగతా స్థలాన్ని హిందువులు వాడుకునేవారు. 1857కు పూర్వం కూడా హిందువులు అక్కడ పూజలు చేసేవారనీ విదేశీ యాత్రికులు కూడా పేర్కొన్నారు. మసీదులో ఒకవంక ప్రార్థనలు జరుగుతున్నా ప్రధాన గుమ్మటం ఉన్న స్థలాన్ని రామజన్మభూమిగా విశ్వసించటాన్ని హిందువులు మానలేదు. అక్కడకు వెళ్లటానికి ప్రయత్నించటంతో జరిగిన ఘర్షణల వల్లే అడ్డుగోడను కట్టాల్సి వచ్చింది. అంటే రామజన్మభూమికి సంబంధించి హిందువుల కార్యకలాపాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1934లో కూడా హిందువులు మసీదులోకి ప్రవేశించి ప్రధాన గుమ్మటంతో పాటు మరికొన్ని చోట్ల భౌతికంగా నష్టం కలిగించారు. 1949లోనైతే ఏకంగా ప్రధాన గుమ్మటంలోకి చొరబడి విగ్రహాలనే అక్కడ పెట్టారు. దాంతో మసీదులో ప్రార్థనలు ఆగిపోయాయి. 1857 నుంచి 1949 వరకూ మసీదులో క్రమం తప్పకుండా నమాజు చేశారటానికి సాక్ష్యాలున్నాయి. మసీదు ప్రాంగణం నూటికినూరు శాతం ఎన్నడూ ముస్లింల కింద లేదనేది మాత్రం స్పష్టం.

ప్రధానంగా స్థల ఉపయోగం, దాని స్వాధీనత, సుదీర్ఘకాలం అక్కడ ప్రార్థనలు, పూజలు జరగటం లాంటి అంశాలను సాక్ష్యాలుగా పరిగణించి సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి, మథుర మసీదుల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. అక్కడ నిరంతరం ప్రార్థనలు జరుగుతున్నాయి. అవి ప్రస్తుతం పూర్తిగా ముస్లింల స్వాధీనంలో ఉన్నాయి. అయోధ్య తీర్పు ప్రకారం చూస్తే వాటిని అక్కడ తొలగించటం అసాధ్యం! అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో దేన్నీ అసాధ్యంగా చెప్పలేం. గడిచిన 1000 ఏళ్లలో హిందువులకు అంతా అన్యాయమే జరిగిందనే విపరీత ధోరణి ఎన్ని వైపరీత్యాలకైనా దారితీస్తుంది. రాజ్యాంగ నియమాలు, విలువల కంటే మత విశ్వాసం ఉన్నతమైందనే భావన దేన్నైనా సాధ్యం చేస్తుంది! మసీదును కూల్చటం కిరాతక చర్యగా సర్వోన్నత న్యాయస్థానం అభివర్ణించినా.. ప్రార్థనాలయాల పరిరక్షణ చట్టాన్ని సముచితమైందిగా పేర్కొన్నా.. జరుగుతున్న పరిణామాలను చూస్తే స్పష్టమయ్యేది అదే!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - Feb 02 , 2024 | 01:36 AM