ధరణి మార్పులో ఎందుకీ తాత్సారం?
ABN , Publish Date - Apr 11 , 2024 | 03:57 AM
ధరణి పోర్టల్ వలన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివృత్తి చేసేందుకు కొత్త ప్రభుత్వం ముందుకెళుతోంది. ముఖ్యమంత్రి, వారి మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు...
ధరణి పోర్టల్ వలన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివృత్తి చేసేందుకు కొత్త ప్రభుత్వం ముందుకెళుతోంది. ముఖ్యమంత్రి, వారి మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, సిసిఎల్‌ఎ వంటి ఉన్నత స్థాయి అధికారులు అధికారికంగా క్యాబినెట్ నిర్ణయాలలో భాగంగా ధరణి పోర్టల్‌లో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాతి నుంచి అందులోని లోపాలను ప్రజలకు ఎత్తి చూపుతూ గత ప్రభుత్వ హయాం నుంచి కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారాను, వివిధ రకాల సభలు, సమావేశాలు, టీవీ డిబేట్ల ద్వారాను, సోషల్ మీడియాలోను తరచుగా మాట్లాడుతున్న వారిని, రెవెన్యూ శాఖలో పనిచేసిన వారిని ప్రజా ప్రతినిధులతో కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. వీరు కూడా పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నట్లు మీడియా ద్వారా తెలుస్తున్నది. కానీ వివిధ సందర్భాల్లో చేసిన చర్చలకు, రాసిన వ్యాసాలకు అనుగుణంగా కమిటీ పనులు ముందుకు సాగడం లేదనిపిస్తోంది. ఈ కమిటీకి ఎంతమేరకు పని చేసే అధికారాలు ఇచ్చారనేది తెలీదు. రాష్ట్రంలో భూమికి కొలతలు వేసి ప్రతి ఇంచు భూమికి బాధ్యత వహిస్తూ ఖచ్చితమైన లెక్క తీయాలని అనుకున్నారు. కానీ అది జరిగే సూచనలు కనపడటం లేదు.
కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి చాలా కారణాలలో ధరణి కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించిందని మరిచిపోరాదు. కాంగ్రెస్ కూడా అదే కొనసాగిస్తే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. ఒకటి నుండి 35 వరకు మాడ్యూల్స్ (టీఎమ్ 1 నుంచి టీఎమ్ 35 వరకు) తీసుకువచ్చారు. ఇన్ని ఎందుకు అవసరమో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొన్ని మాడ్యూల్స్ కేవలం కొన్ని సమస్యల గుర్తించడానికి పనికి వస్తున్నాయి. ఒక్కో సమస్యకు ఒక్కొక్క టీఎమ్ ద్వారా పరిష్కారం లభించాలి. కానీ చాలా మందికి ఏ మాడ్యుల్ వలన ఏ ప్రయోజనం జరుగుతుంది అనేది అవగాహన లేదు. ప్రతి పనికి రూ.1100 వసూలు చేశారు.
కొత్త ప్రభుత్వం ఇప్పుడు వాటి పని పద్ధతులను బ్రేక్ చేసి తహసీల్దారు గారికి, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డిఓ) గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కొన్ని పనులు కొన్ని బాధ్యతలు కేటాయించారు. ఆదేశాలు ఉన్నప్పటికీని ఇంతవరకు ఎవరికీ లాగిన్ పాయింట్ నిర్ణయాధికారాలు రాలేదు. దరఖాస్తులు అన్నీ పై స్థాయిలోనే ఉంటున్నాయి. కిందిస్థాయి సిబ్బంది లేరు, పంచాయతీ సెక్రటరీ, వ్యవసాయ విస్తరణ అధికారి పొలాన్ని చూడగలరు కానీ రెవెన్యూపరమైన విచారణ నివేదిక ఇవ్వలేరు. రెవిన్యూ శాఖ నుంచి డిప్యూటీ తహసీల్దారులు కూడా ఒక టీమ్‌గా తీసుకున్నారు.
ఇకపోతే మాడ్యూల్స్‌వారీగా అసైన్‌మెంట్ భూమి సహా అన్ని రకాల విరాసతులకు, స్పెషల్ జీపీఏ, జీపీఏ, భూ సంబంధిత ఖాతాలను మర్జ్ (సమన్వయం) చేయటం వంటివి తహసీల్దారుకు అప్పజెప్పారు. వ్యవసాయేతర భూములకు, చట్టబద్ధంగా భూసేకరణ చేసిన భూములకు, విదేశీయులు కొనుగోలు చేసిన భూముల లావాదేవీలకు, కొత్త పాస్ పుస్తకాలకు, కోర్టు వ్యాజ్యాలు, ముఖ్యంగా ధరణిలో నమోదు కాని పట్టా భూముల విస్తీర్ణం దిద్దుబాట్లు... ఇవన్నీ ఆర్‌డీఓ స్థాయి అధికారులు చూడాలి. మ్యుటేషన్సు, నిషేధిత భూముల జాబితా కలెక్టర్ ఆధీనంలో ఉంచారు. భూమి విలువ స్థానిక సబ్ రిజిస్టర్ ధర ఆధారంగా ఐదు లక్షల వరకు ఒక స్థాయి అధికారికి, అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే భూములకు కలెక్టర్ సమక్షంలో సమస్యను చూడమని సూచనలు వచ్చాయి.
విచారణ నివేదికలు వాటిపై నిర్ణయం తీసుకుని ధరణి పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేయాలంటే కంప్యూటర్ ముందు కూర్చుని తహసీల్దార్ లేదా రెవెన్యూ డివిజన్ అధికారి తన బయోమెట్రిక్ లాగిన్ ద్వారా సవరణలు చేయటానికి అధికారాలు బదిలీ కావలసి ఉంది. ఈ ప్రక్రియ మొదలు కాకముందే గడువు ముగిసిపోతుంది.
పట్టా భూములు, అసైన్‌మెంట్ భూములు, చెరువులు, కుంటలు, పోరంబోకు, గ్రామకంఠం అసైన్‌మెంట్, సీలింగ్, వక్ఫ్, భూదాన భూములు, దేవుడి భూములు అన్నీ బయటికి వస్తాయని అన్ని సందర్భాలలో అనుకున్నదే. అంతే కాదు, విలువైన ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తీసి పట్టాలుగా మార్చి లావాదేవీలు జరిగినట్లు పలు సందర్భాలలో అనుకున్నాం. అవి బయటికి రావాలి. ఇంతవరకు ధరణి సంబంధిత సాఫ్ట్‌వేర్ లేదా ప్రధాన సర్వర్ నడుపుతున్న సంస్థ ఇండియా నుండి ఆపరేట్ అవుతుందా అన్నది కూడా ప్రధాన ప్రశ్న, అది ఇక్కడే ఉందా ఉంటే హైదరాబాదులోని ఎన్.ఐ.సి (నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్) వద్ద ఉంచితే అది మన ఆధీనంలో ఉంటుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.
గ్రామీణ ప్రజలకు, వ్యవసాయం చేసుకునే వారికి, ధరణి పోర్టల్ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను బట్టే మంచి ఫలితాలు అందుతాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కమిటీలతో కాలయాపనలు చర్చలు ఫలితాలు ఇవ్వవు. ఎంత చెప్పినా వినని కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసాం, వినలేదని ప్రజలే వద్దనుకున్నారు. మీరు ఏదో చేస్తారని అనుకోకపోయినా కొంత చేస్తారని భరోసాతో అన్ని వర్గాల ప్రజలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకున్నారు. మీరూ గత ప్రభుత్వం లాగే చేస్తే ప్రజలకు మేలు జరగకపోగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మనుగడ కూడా కష్టమే అవుతుంది.
వి. బాలరాజు
తహశీల్దారు రిటైర్డు