Share News

‘జయజయహే’ ఎందుకు?

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:29 AM

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’’ ...ఈ పల్లవిలో, తరువాత వచ్చే అనేక చరణాలలో, ప్రతిచరణం చివరా పునరావృత్తమయ్యే జై తెలంగాణ నినాదోచ్ఛాటనలో ఏ విశేషాలున్నాయని ఉద్యమగీతంగా...

‘జయజయహే’ ఎందుకు?

‘‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలూ ఒక్కటైన చేతనం

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం’’ ...ఈ పల్లవిలో, తరువాత వచ్చే అనేక చరణాలలో, ప్రతిచరణం చివరా పునరావృత్తమయ్యే జై తెలంగాణ నినాదోచ్ఛాటనలో ఏ విశేషాలున్నాయని ఉద్యమగీతంగా, సంకల్పగీతంగా, ప్రార్థనాగీతంగా తెలంగాణ సమాజం స్వీకరించింది? రాష్ట్ర అవతరణ తరువాత తొమ్మిదిన్నరేండ్ల పాటు పాలించిన ప్రభుత్వం, ఈ పాటకు అధికార ప్రతిపత్తి ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, పాఠశాలల్లో సభల్లో స్వచ్ఛంద ఆలాపనలు ఎందుకు జరుగుతూ వచ్చాయి?

విశేషాలు అనేకం. ఆ గీతం కలిగించే ఉద్వేగం, ప్రేరణ, ఉత్సాహం, దీక్షాభావం సామాన్యమైనవి కావు. వందల వేలాది మందిని ఒకే గొంతుగా మార్చగలిగే మహిమ ఏదో దానికి ఉన్నది. అట్లాగని అద్భుతమైన కవిత్వమేదో అందులో ఉన్నదని చెప్పలేము. చెప్పకూడదు కూడా. దీని కంటె గొప్ప కవిత్వం ఉన్న పాటలు అందెశ్రీ అనేకం రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గొప్ప భావుకతను, వ్యక్తీకరణను కలిగిన పాటలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. కానీ, ‘గీతం’ (anthem)గా ఈ ఒక్క పాటనే జనం ఎంచుకున్నారు.

ఈ పాటలో కవిత్వం ముఖ్యం కాదు అంటే, దానికి మరేదో ఘనత ఉన్నదని, తనకు మాత్రమే చెందిన ఒక ప్రత్యేకత ఉన్నదని అర్థం. ఈ పాట జాతీయ గీతాల కోవలోనిది. ప్రజల సమూహ సంస్కృతిలో భాగంగా, ఉద్యమాలలో భాగంగా వెలువడే పాటల్లో కొన్ని జాతీయగీతాల రూపు తీసుకుంటాయి. వాటిలో కొన్ని ప్రభుత్వాల గుర్తింపు కూడా పొందుతాయి, అనేకం ప్రజల నాలుకల మీద మాత్రమే మిగులుతాయి. అనధికార జాతీయగీతాలు ప్రపంచమంతా ఉనికిలో ఉన్నాయి.

జాతీయ, ప్రాంతీయ, సామాజిక అస్తిత్వాలకు కొన్ని చిహ్నాలు ఉంటాయి. ఒక జెండా, ఒక ముద్ర, ఒక గీతం. సామూహిక సాంస్కృతిక స్ఫురణలతో ఆ చిహ్నాలు రూపొందుతాయి. ఆయా సమూహాలను ఏకం చేసే గుణం వాటికి ఉంటుంది. ఒకరికొకరు అపరిచితులైనవారు కూడా, ఒకే పాటకు గొంతు కలుపుతారు. సహోదరులుగా మారిపోతారు. ఉద్యమ సందర్భంలో సభల్లో ఊరేగింపుల్లో ఆందోళనల్లో ఇటువంటి గీతాలు ఇంధనంలాగా పనిచేస్తాయి.

ఈ గీతాలకు ఉండవలసిన ప్రధాన లక్షణం, ఎవరైనా పాడగలిగేట్టు ఉండడం. అందుకోసం పాట నడక ఒక మోస్తరు వేగంతో, బాణీ మాధుర్యం అనుభూతమయ్యేట్టుగా ఉండాలి. సులువుగా గుర్తుంచుకునేట్టుగా, పదేపదే ఆలపించాలనిపించేట్టు ఉండాలి. చిన్నచిన్న మాత్రల సంపుటులతో పాదాలు ఉండాలి. మార్చింగ్‌ బాణీ కానీ, ఆరాధనాత్మక భావం కలిగే బాణీ కానీ అయితే మంచిది. బృందాలుగా పాడడానికి, పాటలో కొన్ని చరణాలు లేదా పునరావృత్త భాగాలు శ్రోతలు గొంతు కలపడానికి అనువుగా ఉండాలి. ఎంత నెమ్మది నడక ఉన్నా, మధ్యలో బాణీ ఎంతో కొంత ఉచ్ఛస్థాయికి వెళ్లి, దిగాలి. ‘జనగణమన’లో ఆ నడక చూడవచ్చు. ప్రపంచంలో ఉన్న జాతీయగీతాలను పరిశీలించి, విమర్శకులు ఇటువంటి కొన్ని సాధారణ సూత్రాలను గుర్తించారు.

మద్రాసు నుంచి విడిపోవడానికి బ్రిటిష్‌ ఆంధ్రులు చేసిన ఉద్యమంలో అనేక తెలుగు జాతీయగీతాలు వెలువడ్డాయి. తొలిరోజుల్లో వచ్చిన ‘ఆంధ్రదేశపు మట్టి అది మాకు కనకము’ దగ్గర నుంచి వేములపల్లి శ్రీకృష్ణ ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’ దాకా ఉద్యమ సందర్భాలలో ఆలపించిన గీతాలు అనేకం. వాటిలో కూడా ఘనచరిత్రను గర్వభావాన్ని కలిగించే అంశాలు, సమష్టి తత్వాన్ని ప్రేరేపించే అంశాలు ఉన్నప్పటికీ, ఆరాధనా భావంతో చేయవలసిన సామూహిక ఆలాపనకు పూర్తిగా అనువుగా లేకపోయాయి. చివరకు శంకరంబాడి సుందరాచారి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ తెలుగు అభిమానుల ప్రార్థనాగీతంగా స్థిరపడింది. ‘వందేమాతరం’ గీతం లాగే, ‘సారే జహాసే అచ్ఛా’ లాగే, ‘మా తెలుగు తల్లికి’ కూడా అల్లనల్లన నడకతో, మధురమైన బాణీలో సాగుతుంది. బృంద ఆలాపనకు అనువుగా ఉంటుంది.

అందెశ్రీ ‘జయజయహే’ పాటకు గుర్తింపు ఇవ్వడానికి కె.చంద్రశేఖరరావు విముఖులని, ఆయనకు అభ్యుదయకవి రావెళ్ల వెంకట రామారావు 1950లలో రాసిన సుప్రసిద్ధ గీతం ‘నా తల్లి తెలగాణ’ వైపు మొగ్గు ఉండిందని చెప్పుకుంటారు.

‘‘కదనాన క్రతువుల కుత్తుకల నవలీల

నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి

ధీరులకు మొగసాలరా!

తెలగాణ వీరులకు కాణాచిరా!’’

- అంటూ మొదలయ్యే రావెళ్ల గీతం తెలంగాణపై చారిత్రక గర్వ భావాన్ని, ఉద్వేగాన్ని కలిగించేదే. అయితే, ఆ పాట బాణీ, గాయకుడు పాడితే, శ్రోతలు ఆనందించేట్టు ఉంటుంది తప్ప, సామూహిక గానానికి అనువుగా ఉండదు, ప్రతి చరణమూ ఒకే నడక కలిగిన భిన్నమైన పాదాలతో ఉంటుంది తప్ప, పునరావృత్తమయ్యే పాదాలు లేవు. భాష కూడా కొంత పాతదనంతో ఉంటుంది. అన్నిటికీ మించి, తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం రాజకీయ ఉద్యమానికి సంబంధించిన వ్యక్తీకరణ ఆ పాటలో లేదు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పాటను కూడా విరివిగా పాడుకున్నారు. కానీ, అందెశ్రీ పాటకు లభించిన స్వీకరణ వేరు.

పాట మౌలికంగా మౌఖిక కళారూపం కాబట్టి, దానికి లిఖిత రచనకు ఉన్న స్థిరత్వం సహజంగా సంక్రమించదు. పాట రూపొందడమే క్రమానుగతంగా రూపొందుతుంది. పాడిన ప్రతిసారీ కవిగాయకుడైనా, కేవల గాయకుడైనా ఎంతో కొంత భిన్నంగా పాడతారు. ‘జయజయహే’ గీతం కూడా కొంత కాలవ్యవధిలో క్రమంగా అవతరిస్తూ వచ్చింది. అందెశ్రీ స్వయంగా మెరుగుపరుస్తూ పోయారు. ఉద్యమకాలపు సహచరులు అనేకమందితో సంప్రదిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే క్రమంలో కేసీఆర్‌ కూడా ఈ పాట రూపొందుతున్న ప్రక్రియలో అందెశ్రీతో రెండడుగులు నడిచారు. ఆ నాడు, ఈ పాటను మెచ్చిన నాయకుడు, తరువాత ఎందుకు భిన్నవైఖరి తీసుకున్నారో తెలియదు.

‘జనగణమన’ గీతంలో భారతదేశ నైసర్గిక విశేషాలను, వివిధ ప్రాంతాలను ప్రస్తావిస్తే, ‘వందేమాతరం’లో భారతమాత చక్కటి మాటను, తియ్యటి పలుకును, స్వచ్ఛరూపాన్ని కీర్తించారు. అందెశ్రీ గీతంలో తెలంగాణ చరిత్రను, ముఖ్యంగా చారిత్రక చిహ్నాలుగా ఉండిన వ్యక్తులను, కవులను, వీరులను పేర్కొంటూ, ప్రాకృతిక వనరులను, అవి ప్రజలకు చెందాలనే ఆకాంక్షను కీర్తిస్తారు. ప్రతి చరణం ముగిసిన వెంటనే -

‘జై తెలంగాణ జైజై తెలంగాణ

జై తెలంగాణ జైజై తెలంగాణ’ అన్న ఉచ్చాటన మొత్తం పాటను, శ్రోతల భావోద్వేగాలను విద్యుదీకరిస్తుంది. పంపన, బద్దెన, హాలుడు, పాలకుర్కి, పోతన, రామదాసు, మల్లినాథ సూరి, ద్నిగుడు మొదలైన తెలుగు, సంస్కృత కవి పండితుల ప్రస్తావనలతో కొన్ని చరణాల పాటు తెలంగాణ ఘనతను వర్ణించిన కవి, తరువాత రాణులు, రాజులు, వీరులు, తిరుగుబాటుదారులు, శిల్ప వాస్తు ప్రతీకలను పూసగుచ్చుతారు. తెలంగాణ కళాజీవనాన్ని చెబుతూ, ‘అనునిత్యం నీ గానం అమ్మ నీవె మా ప్రాణం’ అన్నప్పుడు, ఒక్కసారిగా శ్రోతల మనసుల్లో ‘తెలంగాణ తల్లి’ ఆవిష్కృతమవుతుంది. ఆ తరువాత, తెలంగాణకు ఏ శ్రేయస్సు కావాలో, భవితవ్యం ఎట్లా ఉండాలో కవి చెప్పుకునే సంకల్పం, రాష్ట్ర అవతరణ అనంతర పునర్నిర్మాణ ఆశయాలను సూచిస్తుంది. ‘బడుల గుడులతో’ జనవిజ్ఞానం విరియాలని ఆకాంక్షిస్తూ ‘‘తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగ నీ సంతతి ఓ యమ్మా వెలగాలి’’ అన్న ఆశ్వాసనను ఈ గీతం పలుకుతుంది. సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలల కలలు పండాలని కవి ఇచ్చిన ముక్తాయింపు, ఉద్యమ ఆశయాలను ఆర్ద్రంగా చెబుతుంది.

ఉర్రూతలూగుతున్న ఉద్యమసమాజంలోకి పాట వెళ్లినప్పుడు, అది ఇక ప్రజల సొత్తు మాత్రమే. మెరుగులు దిద్దుతూ, సవరిస్తూ కవి నుంచి అనేక వెర్షన్లు వచ్చినా, జనం ఏదో ఒకదాన్ని స్థిరపరుస్తారు. సుదీర్ఘం అనుకుంటే క్లుప్తం చేసుకుంటారు. ‘వందేమాతరం’ వంటి అనేక జాతీయగీతాలు పాడడానికి వీలుగా క్లుప్తరూపాన్ని, సరళరూపాన్ని తీసుకున్నాయి. తన పాట మీద తనకు అధికారం ఉందా లేదా అన్న చర్చ కంటె, ఆ పాట గమనం మీద కవికి ఇక నియంత్రణ ఉండదన్న గ్రహింపు ముఖ్యం.

గీతాలాపన జరుగుతున్నప్పుడు, అది భాగస్వామ్య శ్రోతలలో కలిగించిన, కలిగిస్తున్న సామూహిక స్పందనే ‘జయజయహే’ను తెలంగాణ రాష్ట్రగీతంగా అవతరింపజేసింది. ఒకప్పుడు ఉద్యమవాతావరణం, గీతంనుంచి ఒక స్వప్నావేశాన్ని, పట్టుదలను గ్రహిస్తే, ఇప్పుడు, ప్రత్యేక రాష్ట్రం అనే వాస్తవం, అదే గీతం నుంచి అస్తిత్వ గర్వాన్ని సంతృప్తి పరుచుకుంటుంది. ఆశించినవి నెరవేరాయా, నిరాశలోనూ జాతిగీతం ఉద్దీపన ఇస్తుందా అన్న సందేహాలు మిగిలే ఉంటాయి. కానీ, ఆకాశాలను అందుకునే ప్రయత్నాలు ఎప్పుడూ ఆగిపోవు. తపనలున్న పాటలెపుడూ చల్లారిపోవు.

కె. శ్రీనివాస్‌

Updated Date - Feb 12 , 2024 | 01:29 AM