Share News

ఓటెవరికి వేయాలి?

ABN , Publish Date - May 03 , 2024 | 04:49 AM

మనది ప్రజాస్వామ్యం. ఓటెయ్యాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ ఒక్క రోజూ సకల అంగాల్నీ కూడదీసుకుని ఎడమచేతి చూపుడువేలి మీద చుక్కేయించుకోవాలి. ఎండ భరించైనా కదలాలి...

ఓటెవరికి వేయాలి?

మనది ప్రజాస్వామ్యం. ఓటెయ్యాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ ఒక్క రోజూ సకల అంగాల్నీ కూడదీసుకుని ఎడమచేతి చూపుడువేలి మీద చుక్కేయించుకోవాలి. ఎండ భరించైనా కదలాలి. ఇంతకీ ఓటెవరికేయాలి? ఒక లక్ష్యంతో పనిచేసేవారిని గుర్తించాలి. ప్రజలకు మేలు జరుగుతుందని భావించేవారిని తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారిని దూరంగా ఉంచాలి. గత ఐదేళ్ళుగా మనకు కొన్ని అనుభవాలున్నాయి.

రాజ్యాంగ పరిధి దాటి పనిచేయడం పాలకుడు తన గొప్పతనంగా భావిస్తున్నాడు. రక్షణ వ్యవస్థను గుప్పెట పెట్టుకుంటే చాలనుకుంటున్నాడు. ఆశ్రిత అధికార గణమే తనకు రక్ష అనుకుంటున్నాడు. ప్రత్యర్థి ఆర్థిక మూలాల్ని ధ్వంసం చేయడమే తన బలం అనుకుంటున్నాడు. అందినకాడికి దోచుకోవడం, దాచుకోవడం పరమావధి అనుకుంటున్నాడు. పైగా దురన్యాయమేమిటంటే తన అనుంగు మిత్రులకు అన్నిందాల స్వేచ్ఛా వాయువులు ప్రసాదించడం, వారి తప్పులు ఎన్నయినా ఉపేక్షించడం తన విధి అనుకుంటున్నాడు. ప్రజాభీష్టాన్ని గౌరవించక్కర్లేదనుకుంటున్నాడు. అంతేనా?


ప్రజాస్వామ్య ఉగ్రవాదిగా మారడానికి శాసనసభ సీట్లన్నీ తనకే కావాలంటున్నాడు. అసలు ఈ కోరికే విడ్డూరం కదా. అరె... ప్రజాస్వామ్యంలో ఉన్నాం. పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ ఉండాలి కదా. ఒంటెద్దు పోకడల్ని నియంత్రించాలి కదా. నిర్మాణాత్మకమైన సూచనలు అందుకుని ఆచరించే సహృదయత ఉండాలి కదా. లోటుపాట్లు సరిదిద్దుకునే వ్యవస్థ ఉండాలి కదా. ప్యూడల్‌ మనస్తత్వం నరనరాన జీర్ణించుకున్నవాడు మాత్రమే నియంతలా పాలించాలనుకుంటాడు. చరిత్ర పాఠాలు చెప్పినా చెవికెక్కించుకోడు. ఒత్తిడి చేసి, ప్రలోభపెట్టి, తాత్కాలిక ప్రయోజనాలు కల్పించి నెగ్గాలనుకుంటే చెల్లదు గాక చెల్లదు.

ప్రజలు చాలా తెలివైనవారు. కళ్ళ ముందున్న నిజాల్ని కాదని అబద్ధాల్ని నమ్మరు. రాజధాని ఏదంటే మూడు దిక్కులు చూపిస్తుంటే చిరాకు పడతారు. గతుకుల రవాణా వ్యవస్థ ప్రగతికి పట్టుకొమ్మలని భావించి అసలు పట్టించుకోకపోవడాన్ని ఈసడిస్తారు. చదువుకున్న యువత వలసెళ్లి పోతుంటే మౌనంగా ఉండలేరు. కొలతలేసి చూసుకుని సామాజిక న్యాయం కొరవడిందంటే తిరగబడతారు. అస్తవ్యస్త విధానాలతో దార్శనికత లోపించిన చదువులు చట్టుబండలు కావడాన్ని భావితరాలు క్షమించవు. ఇప్పుడు చెప్పండి ఎవరికి ఓటెయ్యాలి? అంతిమంగా ప్రజలే గెలుస్తారు.

దాట్ల దేవదానం రాజు

విశ్రాంత ఉపాధ్యాయుడు

Updated Date - May 03 , 2024 | 04:49 AM