Share News

ఖర్చుదారీ సేద్యం కష్టాలు తీరేదెన్నడు?

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:28 AM

‘పొలంలో హలంతో రైతు /నిలుస్తా డివాళా రేపు’– ఇది, అన్నదాత మనుగడపై ఒక మహాకవి వ్యక్తం చేసిన నిండు విశ్వాసం. అయితే రైతులు ఇప్పుడు ఎల్లెడలా పొలంలో హలంతో నిలబడలేకపోతున్నారు...

ఖర్చుదారీ సేద్యం కష్టాలు తీరేదెన్నడు?

‘పొలంలో హలంతో రైతు /నిలుస్తా డివాళా రేపు’– ఇది, అన్నదాత మనుగడపై ఒక మహాకవి వ్యక్తం చేసిన నిండు విశ్వాసం. అయితే రైతులు ఇప్పుడు ఎల్లెడలా పొలంలో హలంతో నిలబడలేకపోతున్నారు. అలా నిలబడేందుకే వారు పొలాలు, పల్లెలు వదిలి తమ ‘భాగ్య విధాతలు’ ఉండే నెలవులకు మూకుమ్మడిగా కదులుతున్నారు. జరుగుతున్న అన్యాయాలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే, సముద్రాల ఆవల ఐరోపాలోను, మన దేశంలోను ఇప్పుడు చోటు చేసుకొంటున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీ బాట పట్టిన అన్నదాతలు తమ ట్రాక్టర్లతో హైవేలను దిగ్బంధం చేస్తున్నారు. వ్యవసాయ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి.. వాటికి తోడు వాతావరణ వైపరీత్యాలు అను నిత్యం కల్లోల పరుస్తున్నాయి. పంటపండించిన రైతుకే తిండిలేకుండా పోతున్న దుస్థితి దాపురించింది. కనుక సాగు వ్యయాలు తిరిగి దక్కేలా తమ ఫలసాయానికి చట్టబద్ధమైన కనీస మద్దతు ధర ఇవ్వాలని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు.

వాతావరణ మార్పు వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలలో ప్రవేశపెట్టిన కొత్త చట్టాలు అక్కడ రైతులను ఆందోళనకు పురిగొల్పాయి. ఆ కొత్త చట్టాల ప్రకారం క్రిమిసంహారక మందుల వాడకాన్ని సగానికి, ఎరువుల వినియోగాన్ని 20 శాతం మేరకు తగ్గించాలి. సేంద్రియ సాగు ఉత్పత్తులను రెట్టింపు చేయాలి. వ్యవసాయేతర ఉపయోగాలకు, ముఖ్యంగా జీవ వైవిధ్య పరిరక్షణకు మరింత భూమిని వదిలివేయాలి. ఇందుకు అదనంగా నత్రజని కారక కాలుష్యాన్ని నివారించేందుకు పశుగణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని నెదర్లాండ్స్ సంకల్పించుకోగా శిలాజ ఇంధనమైన డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకోవాలని జర్మనీ నిర్ణయించింది. వాతావరణ మార్పుతో మనుగడ ముప్పు నెదుర్కొంటున్న ప్రపంచం ప్రస్తావిత చర్యలను తీసుకోవడం అనివార్యమయింది.

యూరోపియన్ దేశాలలో వ్యవసాయ రంగం, ప్రపంచ వ్యాప్తంగా ఇతర ఖండాలలో వలే, హరిత గృహ వాయువుల ఉద్గారాలకు పెద్ద ఎత్తున కారణమవుతోంది. ఐరోపాలో వార్షిక ఉద్గారాలలో పదో వంతు వ్యవసాయ రంగానివే కావడం గమనార్హం. ఈ ఉద్గారాలను తగ్గించేందుకు అయ్యే వ్యయాలు యూరోపియన్ సంపన్న రైతులకు భరించరానివే అయినప్పుడు కేవలం జీవనాధార వ్యవసాయం చేస్తున్న ఆసియా, ఆఫ్రికా దేశాల రైతులు ఆ వ్యయాలను ఎలా భరించగలుగుతారు? అధునాతన సేద్య తీరుతెన్నులన్నీ యూరోపియన్ వ్యవసాయ రంగంలో మనకు కన్పిస్తాయి. భారీ సబ్సిడీల ఆలంబనగా ఆ వ్యవసాయం వర్థిల్లుతోంది. 1962 నుంచి యూరోపియన్ యూనియన్ ఉమ్మడి వ్యవసాయ విధానం రైతులకు విశేషంగా ఆర్థిక తోడ్పాటును సమకూరుస్తోంది. అయితే దీనిపై పలు విమర్శలు రావడంతో ఆ ఆర్థిక మద్దతును గణనీయంగా తగ్గించడం అనివార్యమయింది.

నేడు యూరోపియన్ యూనియన్ దేశాలు వ్యవసాయ రంగానికి సమకూరుస్తున్న ఆర్థిక మద్దతు ఈయూ బడ్జెట్‌లో 40 శాతం మేరకు ఉంటోంది. ఈ సహాయాన్ని రైతులకు నేరుగా చెల్లిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ సమాచారం ప్రకారం ప్రతి రైతూ 2021లో 6700 యూరోలు (ఇంచుమించు రూ.50 వేలు) నేరుగా అందుకున్నాడు. ఈ సహాయంతో పాటు వ్యవసాయరంగ అభివృద్ధికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడ జరుగుతోంది.. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ ‘స్వరూప స్వభావాలు’ మారుతూ వస్తున్నాయి. వ్యవసాయ కమతాలు విస్తీర్ణంలో పెరుగుతున్నాయి. మరింతగా సమీకృతమవుతున్నాయి. ఉత్పాదకాల ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో చిన్న రైతుల మనుగడ కష్ట సాధ్యమవుతోంది.

సాగు వ్యయాలు పెరిగిపోవడంతో పెద్ద రైతుల సైతం రుణగ్రస్తులు అవుతున్నారు. పైరు సగటు దిగుబడి పెరుగుదల లక్ష్యంగా సేద్యం జరుగుతోంది. ఇందుకు రసాయన ఎరువులను మరింతగా వినియోగించడం అనివార్యమవుతోంది. దీనికి తోడు వాతావరణ అవ్యవస్థతో పంటల సాగు ఖర్చులు తడిపిమోపెడవుతున్నాయి. పెరిగిన సాగు వ్యయాలలతో పాటు మరో రెండు వాస్తవాలను తప్పక ప్రస్తావించి తీరాలి. అవి : ఒకటి– ఆహార వినియోగ ధరలను అదుపులో పెట్టవలసిన ఆవశ్యకత; రెండు– వాతావరణ వైపరీత్యాలతో పంట నష్టాలు పెరిగిపోవడం. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో సైతం ఆహార ధరలు అందరికీ అందుబాటులో ఉండడం లేదన్నది ఒక కఠోర వాస్తవం. అంతకంటే ముఖ్యమైన వాస్తవం ఆ దేశాలలో పర్యావరణ సమతౌల్యత తీవ్రంగా దెబ్బ తింటోంది.

దేశ రాజధాని ఢిల్లీ ముంగిట నిరసనలు తెలుపుతున్న రైతులు తమ పంట దిగుబడులకు అధిక కనీస మద్దత ధర (ఎమ్ఎస్‌పి)ను డిమాండ్ చేస్తున్నారు. సంపన్న యూరోప్‌లో రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లనే వీరూ ఎదుర్కొంటున్నారు. అయితే ఆహార ధాన్యాల సాగు విషయంలో యూరోపియన్ రైతులకు లభిస్తున్నట్టుగా భారతీయ రైతులకు ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఆర్థిక మద్దతు లభించడం లేదు. దేశ ప్రజానీకానికి ఆహారాన్ని సమకూర్చేందుకై రైతుల నుంచి ఆహారధాన్యాలను ప్రభుత్వం సేకరించివలసివున్నది. ధరలను నియంత్రించేందుకు ఇది తప్పనిసరి ; ఆహార ధరల పెరుగుదలను ఎవరు కోరుకుంటారు? వినియోగదారులు ఎవరూ కోరుకోరు కదా. ఖర్చులు భరించేందుకు రైతులు ఒక పక్క ఇబ్బంది పడుతుండగా మరో పక్క వాతావరణ వైపరీత్యాలు, చీడ, తెగుళ్ల మూలంగా ఆర్థిక నష్టాలు, ఇతర చిక్కులకు లోనవుతున్నారు.

ఆహార ధరల పెరుగుదలను అరికట్టేందుకు చౌక దిగుమతులపై ఆధారపడాలి. వీటి వల్ల ధరలు తగ్గుతాయి. నిజమే. అయితే తమ ఉత్పత్తులకు సరైన ధర లభించక పోతే రైతులు నష్ట పోతారు. ఈ పరిస్థితుల్లో భూసార పెంపుదల, నీటి సదుపాయాల మెరుగుదల, జీవ వైవిధ్య పరిరక్షణకు రైతులు ఏమీ ఖర్చు చేయలేరు ఈ సమస్యను అధిగమించడమెలా అంటే పర్యావరణ భద్రతలకు అయ్యే వ్యయాలను మినహాయించుకోవడమే..వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరమున్నదని రైతులకు చెబుతున్నారు. అయితే విత్తనాలు, ఎరువుల మొదలైన ఉత్పాదకాల వ్యయం తక్కువేమీ కాదు కదా. కనుక రైతులు అధిక ఖర్చులను భరించవలసిస్తోంది. ఖర్చులకు తగ్గ ఆదాయం వారికి లభించడం లేదు. జనాభాలో అత్యధికులకు ఆహారం చౌకగా అందుబాటులో ఉండాల్సిన దేశంలో అధిక వ్యయాలతో కూడిన వ్యవసాయం అర్థవంతమైన, లాభదాయకమైన కార్యకలాపం కాదు, కాబోదనేది కూడా విస్మరించకూడని సత్యం.

ఐరోపాలో ఇచ్చిన స్థాయిలో మన దేశంలో రైతులకు సబ్సిడీలు ఇవ్వడం సాధ్యంకాదు. పెద్ద మొత్తంలో రైతులకు ఆర్థిక మద్దతు సమకూర్చడం సాధ్యంకాదనేది స్పష్టమే. సాగు వ్యయాలను తగ్గిస్తూనే రైతులకు ఆర్థిక లబ్ధి సమకూర్చడమెలా అనే విషయమై మనం చర్చించవలసి ఉన్నది. ఇక్కడే పునరుత్పాదక లేదా సహజ సేద్యం ప్రాధాన్యాన్ని గుర్తించవలసివున్నది. అయితే ఇందుకు పటిష్ఠ, ప్రగతిశీల విధాన నిర్ణయాలు, చిత్త శుద్ధితో వాటిని అమలుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

అన్ని ప్రాంతాలలోను ఆహార సేకరణకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగు విధానాలను రూపొందించి, అమలుపరచడం కూడా ఎంతైనా అవసరం. తద్వారానే రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెట్ సదుపాయం లభిస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి ఒడిషా ప్రభుత్వం చిరుధాన్యాలను సేకరిస్తోంది. ఇది రైతులకు విశేషంగా మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవమేమిటంటే సమస్త ప్రజల అవసరాలను తీర్చగల ఆహారం ప్రపంచంలో సమృద్ధిగా ఉన్నది. సమస్యేమిటంటే ఆ ఆహారంలో అత్యధిక భాగం పశుగణాలకు వినియోగమవుతోంది లేదా వ్యర్థమవుతోంది. లభ్యమవుతున్న ఆహారం ప్రజల అవసరాలకు సద్వినియోగమయ్యేలా విధానాలు రూపొందించి, అమలుపరచడంపై ప్రభుత్వాలు తమ దృష్టిని కేంద్రీకరించవలసివున్నది.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Mar 01 , 2024 | 05:28 AM