Share News

రాహువే లేనప్పుడు రాహుకాలం ఎక్కడిది?

ABN , Publish Date - Jan 28 , 2024 | 02:52 AM

నా బాల్యంలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలైన జాతీయ నాయకులు నా ఆలోచనలను, విలువలను రూపొందించారు. నేను అన్నింటినీ గంభీరంగా తీసుకుంటాను. అందువల్లే నేను ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో...

రాహువే లేనప్పుడు రాహుకాలం ఎక్కడిది?

కర్ణాటక రాష్ట్రానికి చెందిన విద్యావేత్త

డా. హెచ్‌.నరసింహయ్య మూఢనమ్మకాలు, దేవుడు పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతిఘటించి, ప్రజల్లో శాస్త్రీయస్పృహ పెంచడానికి విశేష కృషి చేసిన హేతువాది. సత్యసాయిబాబా మహిమలపై పోరాడిన వ్యక్తిగా ప్రసిద్ధుడు. ఆయన ఆత్మకథ ‘హోరాటద హాది’ని ‘పోరాటపథం’ పేరిట కోడీహళ్ళి మురళీమోహన్‌ కన్నడం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులోని కొన్ని భాగాలివి.

నా బాల్యంలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలైన జాతీయ నాయకులు నా ఆలోచనలను, విలువలను రూపొందించారు. నేను అన్నింటినీ గంభీరంగా తీసుకుంటాను. అందువల్లే నేను ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనింది. శ్రీరామకృష్ణాశ్రమంలో రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు స్వామీ వివేకానంద గారి ‘‘They alone live who live for others. The rest are more dead than alive. – పరుల కోసం ఎవరు బతుకుతారో వారిదే నిజమైన బతుకు. మిగిలినవారు జీవచ్ఛవాలు’’ అన్న సూక్తి నా మనసులో ముద్రపడింది. ఒకటి రెండు సంవత్సరాలు సావధానంగా ఆలోచించి అన్ని సాధక – బాధకాలను పరిగణనలోకి తీసుకుని పెళ్లి చేసుకోకూడదని అంతిమ నిర్ణయం తీసుకున్నాను. ఇది కూడా నేను తీసుకున్న అత్యంత ముఖ్య నిర్ణయాలలో ఒకటి.

పెళ్లి చేసుకోవాలి అనేది అత్యంత సహజమైన, బలమైన ఒత్తిడి. పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటే పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడికి సరితూగే అంతే బలమైన, మక్కువైన ప్రయోజనం, లక్ష్యం జీవితంలో ఉండాలి. ఆలోచనలు అడ్డదిడ్డంగా పోకుండా వాటికి కళ్లెం వేసే ఎల్లప్పుడూ చేతినిండా పని. క్రమశిక్షణతో కూడిన జీవితం. ఏదైనా సాధించాలనే హఠం ఉండాలి. అప్పుడు ఆలోచనలు పక్కదారి పట్టే సంభవం తక్కువ అవుతుంది.

నేను పుట్టింది ఆదివారం నాడు. అయితే నా జీవితంలో ఆదివారమే లేదు అని వెనుక ఎక్కడో చెప్పాను. ఇది అక్షరాలా నిజం. ఇంతవరకూ నాకు ఏ ఆదివారమూ, సెలవురోజూ లేదు. నేను చేసే పని ఎక్కువ శ్రమతో కూడినదైనా నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. అయినా అప్పుడప్పుడూ ఒంటరితనం గుర్తుకు వస్తుంది. అయితే ఆ ఆలోచన కాలవ్యవధి చాలా కొంచెమే.

నేను మొదటి నుండీ స్వతంత్రంగా ఆలోచించే స్వభావాన్ని అభ్యాసం చేసుకుంటూ వచ్చాను; దేనినీ ప్రశ్నించకుండా ఒప్పుకోను. నేను మూఢనమ్మకాలను, మాయామంత్రాలను, జ్యోతిష్యాన్నీ కటువుగా విమర్శిస్తూ వచ్చాను. మాయలు, మూఢనమ్మకాల గురించి నా ఖచ్చితమైన అభిప్రాయాలను వెనుక చాలా వివరంగా చెప్పాను. జ్యోతిష్యం గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలను చెప్పడం ఉచితం అనిపిస్తుంది.

మనిషిపై గ్రహాల ప్రభావం ఉంది అనే నమ్మకంపై నిర్మించిన సౌధమే జ్యోతిష్యశాస్త్రం. జ్యోతిష్యం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నాయి. ఆ తొమ్మిదిలో సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువులు ఉన్నాయి. సైన్స్‌ ప్రకారం సూర్యుడు గ్రహం కాదు, ఒక నక్షత్రం. చంద్రుడు ఉపగ్రహం. రాహు కేతు గ్రహాలు లేనేలేవు. ఈ విషయాలన్నీ ఒక హైస్కూలు విద్యార్థికి తెలుసు. జ్యోతిష్కుల తొమ్మిది గ్రహాలలో నాలుగు తప్పుడు లెక్కాచారంతో కూడి ఉన్నాయి. దీనితో జ్యోతిష్యం కథ ముగిసింది కదా! దానికి పునాదే గట్టిగా లేకపోయింది. అందువల్ల దానిమీద కట్టిన జ్యోతిష్యం అనే సౌధం కుప్పకూలిపోయింది.

రాహువే లేనప్పుడు రాహుకాలం ఎక్కడ నుంచి వస్తుంది? రాహుకాలం చెడ్డది అనే భావన చాలామందిలో ఉంది. అది నిజమయితే రాహుకాలంలో బయలుదేరే బస్సులకు, రైళ్లకు, విమానాలకు ప్రమాదాలు జరగాలి. ప్రమాదాలకు రాహుకాలానికీ ఏ సంబంధమూ లేదు. జాతకాలు కూడా జ్యోతిష్యం ఆధారంగానే రచింపబడతాయి. పిల్లవాడు పుట్టినప్పుడు గ్రహాల స్థానం ఆధారంపై జాతకం రాస్తారు. ఆ జాతకంలో పిల్లవాని జీవితంలోని అన్ని విజయాలు, ప్రముఖ ఘట్టాలు కలిగి ఉంటాయి అనే నమ్మకం ఉంది. ఇది శుద్ధ అబద్ధం. విమానప్రమాదంలో చనిపోయే వందలాది మంది జాతకాలలో వారంతా ఇలాగే మరణిస్తారని ఏ జ్యోతిష్కుడూ రాయడానికి సాధ్యం కాదు. 1962లో అష్టగ్రహకూటమి వల్ల అనాహుతం జరుగుతుందని బొబ్బలు పెట్టిన జ్యోతిష్కుల భవిష్యత్తు మట్టి కరిచింది. జ్యోతిష్కులు చెప్పేది అస్పష్టం. గోడమీద పెట్టిన దీపం లాంటిది. ఒక్కొక్కసారి జ్యోతిష్యం కాకతాళీయంగా నిజం కావచ్చు. చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరియైన సమయాన్ని చూపుతుంది!

చాలామందికి జ్యోతిష్యంపై నమ్మకం ఎలా ఉందో అలాగే పూజాపునస్కారాల వల్ల వ్యక్తుల, సమాజ కళ్యాణం జరుగుతుందన్న నమ్మకమూ ఎక్కువగా ఉంది. స్వతంత్రంగా ఆలోచిస్తే వీటికి అర్థం లేదు. మనయొక్క ఏ కీర్తిప్రతిష్టలకు పూజాదికాలకు సంబంధం లేదు. ప్రపంచంలో లక్షలాది మంది చింతనాపరులూ దార్శనికులూ రాజకీయ నాయకులూ పూజ, ప్రార్థనల సహాయం లేకుండానే గణనీయమైన స్థానాలను గెలుచుకున్నారు. విశ్వవిఖ్యాత ఐన్‌స్టైన్‌, రసెల్‌ వంటివారికి ఇలాంటి నమ్మకాలకూ సంబంధమే లేదు. అజ్ఞయవాది (Agnostic) జవహర్‌లాల్‌ నెహ్రూ 14 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. అలాగే నాస్తికులు జ్యోతిబసు సుదీర్ఘ కాలంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ ఎక్కువ సమయం అధికారంలో ఉండి రికార్డును సృష్టించారు. ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి.

ఇంకొక సహించరాని విషయం ఏమిటంటే దేవునికి వజ్రవైఢూర్యాలతోనూ, వెండి–బంగారు నగలతోనూ అలంకరించడం. దేవునికి ఇదంతా ఎందుకు? ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇలాంటి శ్రీమంతులైన దేవుళ్ల అమూల్యాభరణాలను మనం – మనుషులం కాపాడాలి. తనను తాను కాపాడుకోలేని దేవుడు మనలను ఎలా కాపాడుతాడు? మనల్ని మనమే కాపాడుకోవాలి.

విశ్వశాంతి కోసం యజ్ఞ యాగాదులను మన దేశంలో ఆచరిస్తారు. ప్రపంచంలోని అనేక దేశాలలో సుఖశాంతులున్నాయి. మన దేశంలోనే ఎప్పుడూ హింస, అశాంతి. అయినా విశ్వశాంతి పేరుతో వీలైనంత దోపిడీ, విలువైన వస్తువుల దహనం చెప్పలేనంతగా జరుగుతూనే ఉంది.

నదులలో, ‘పవిత్ర’మైన నదులలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది మరొక మూఢనమ్మకం. సంవత్సరంలో కొన్ని రోజులు ‘పవిత్ర’ నదులలో స్నానం చేసి పుణ్యం మూటకట్టుకోవడానికి తొక్కిసలాట. గంగానది అత్యంత పవిత్రమైన నది అనే నమ్మకం చాలామందికి ఉంది. అయితే గంగానది వంటి కలుషితమైన నది మరొకటి లేదని శాస్త్రీయంగా నిరూపించబడింది. గంగానదిని మనమే శుద్ధి చేయవలసిన పరిస్థితి వచ్చింది. చర్మాన్ని కడిగితే ఖర్మం పోతుందా?

మనలో నిదర్శనానికన్నా ప్రదర్శనానికే ఎక్కువ విలువ. బంట్రోతు మొదలుకొని రాష్ట్రపతి వరకూ చాలామంది తమ తలనీలాలను దేవునికి సమర్పిస్తారు. తలలు బోడులు కావడానికన్నా తలపులు బోడులవుతున్నాయి. ఇలాగే చాలా మూఢనమ్మకాల ప్రస్తావనను శాస్త్రీయంగా విశ్లేషించడం అవసరం. భయం, అహేతుకమైన భావనలే మూఢనమ్మకాల ఆస్తి.

నేనిలాగే మూఢనమ్మకాలను, మాయలను, అర్థరహితమైన సంప్రదాయాలని విమర్శిస్తే చాలామందికి అనుమానం వచ్చి నాకు దేవునిపై నమ్మకం ఉందా? అని అడుగుతారు. చాలామంది తమ స్వార్థానికి దేవుణ్ణి ఉపయోగించుకుంటారు. ఇలాంటి లావాదేవీ దేవునిపై నాకు నమ్మకం లేదు. అయితే ఒక చైతన్యశక్తి ఉండవచ్చన్నది నా నమ్మకం. దేవుడు ఉన్నాడా లేడా అనే సమస్య శతాబ్దాల నుండి బుద్ధిజీవులను పీడిస్తోంది. ఎంత ఆలోచించినా ఈ సమస్యకు సమాధానం లభించలేదు. దేవుడు ఉన్నాడు లేదా లేడు అనేది నమ్మకం అవుతుంది. దేవుడు ఉన్నాడని శాస్త్రీయంగా నిరూపించడం సాధ్యం కాదు. అలాగే లేడు అని ధ్రువీకరించడం కూడా సాధ్యపడదు. అందువల్లే ప్రపంచంలోని అనేకమంది చింతనాపరులు, తత్వవేత్తలు, అజ్ఞేయతావాదులు దేవుడు ఉన్నాడని చెప్పరు. లేడనీ చెప్పరు. ‘‘దేవుడు, ఆత్మ మొదలైన వాటి గురించి చర్చించడం వ్యర్థం. అందువల్ల మంచిపని చేయి, మంచివాడివి కా – Do good and be good’’ అని బుద్ధుడు పదేపదే తన శిష్యులకు బోధించేవాడు. ఇది అత్యంత వ్యవహారికమైన Practical ఉపదేశం. దేవుడు లేకపోతే పోనీ మనుష్యుడు ఉన్నాడు కదా. అందువల్ల మన ధర్మానికి మనుష్యుడు కేంద్రబిందువు కావాలి. దేవునిపై నిజంగా నమ్మకం ఉంటే వారు చెడ్డపనులు చేయరాదు; లంచం పుచ్చుకోరాదు; కర్తవ్య ప్రజ్ఞతో ప్రామాణికంగా పనిచేయాలి.

***

స్వర్గం, మోక్షం ఉందో లేదో నాకు తెలియదు. వాటి గురించి నేను పట్టించుకోను. అవి ఉన్నా, నాకు స్వర్గమూ వద్దు, మోక్షమూ అక్కరలేదు. కోట్లాదిమంది ఈ ప్రపంచంలో కష్టనష్టాలతో బతుకుతున్నప్పుడు వారినంతా వదిలి నేను స్వర్గానికి వెళ్ళాలన్న ఆశ నాకు లేదు. స్వర్గంలో చేయడానికి పనిలేదు. ఎదుర్కోవడానికి సమస్యలు లేవు. సవాళ్ళు లేవు. దివ్యపురుషులు లేరు అన్న తరువాత అక్కడ ఊరికే కూర్చుని ఏమి చేయాలి? పునర్జన్మ ఉంటే నాకు వచ్చే జన్మలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిరంతరంగా పనిచేసే అవకాశం లభిస్తే చాలు, నాకు ఇంకేమీ అక్కరలేదు.

డా. హెచ్‌.నరసింహయ్య

Updated Date - Jan 28 , 2024 | 02:52 AM