పత్తి రైతుకు ‘మద్దతు’ లభించేదెప్పుడు?
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:48 AM
మన దేశం పత్తి సాగులో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఆసియాలోనే డిమాండ్ ఉన్న తెలంగాణ పత్తి గురించి ...

మన దేశం పత్తి సాగులో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక దేశంలో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఆసియాలోనే డిమాండ్ ఉన్న తెలంగాణ పత్తి గురించి అందరూ చెప్పుకుంటున్నా, దాన్ని సాగు చేస్తున్న రైతుకు మాత్రం సాయం దక్కడం లేదు. పత్తి సాగు చేస్తున్న రైతులకు ఏటా మద్దతు ధర ప్రకటించడం వరకే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అది కూడా కంటితుడుపు చర్యగానే. ఏటా ఎరువులు, పురుగు మందుల ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. దీనికితోడు స్థానికంగా ఉన్న భూమి, వాతావరణ పరిస్థితులు పత్తి పంట సాగులో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయమేంటంటే 60శాతం మంది కౌలు రైతులే. దీంతో పత్తిపంట సాగు చేసేందుకు వీరు కౌలు రూపంలో అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు యాంత్రీకరణ వల్ల పనిముట్ల ధరలు, కూలీల రేట్లు అమాంతం పెరిగి రైతుకు పెట్టుబడి పెరుగుతోంది. దీనికితోడు బ్యాంకులు ఇచ్చే అప్పు సరిపోక, వడ్డీకి తెచ్చి పంట సాగు చేస్తే చివరకు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పంట నేలపాలవుతోంది. పత్తి ఏరేందుకు కూలీలను పిలిస్తే వారికి కిలోకు పది నుంచి పదిహేను రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. పంటను పొలంలో వదిలేయలేక ఇంటికి తెచ్చి అమ్ముకుందామంటే మార్కెట్లో తేమ, గూడు, రంగు మారిందని సీసీఐ కొనుగోలుకు ఆదిలోనే నిరాకరిస్తోంది.
దీంతో రైతుల కష్టం పరోక్షంగా దళారుల పాలవుతోంది. తేమ 8 నుంచి 12 శాతం లోపు ఉంటేనే కొంటామని చెప్పడం, మద్దతు ధర రూ.7,525గా నిర్ణయించడంతో రైతులు వర్షానికి తడిసిన పత్తిని సీసీఐకి అమ్మలేక, ఇంటికి తీసుకెళ్లలేక చివరకు వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది పత్తి రైతులకు మార్కెట్లో వ్యాపారులు ఇచ్చిన ధర అక్షరాలా.. 6700 నుంచి 6900 మాత్రమే. ఇక చివరలో సీసీఐ కొనుగోలు చేసినా, తేమ తక్కువైనా మద్దతు ధర మాత్రమే లభించింది.
ఈ ఏడాది రాష్ట్రంలో నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల్లో అధికంగా పత్తిపంట సాగు చేశారు. మిగతా జిల్లాల్లో కాస్త తక్కువగానే పత్తిపంట సాగైందని వ్యవసాయ శాఖ చెబుతున్నది. మరి రాష్ట్రంలో సాగవుతున్న పత్తి పంటకు ఎకరానికి అవుతున్న ఖర్చెంత.. లభిస్తున్న ధర ఎంత.. రైతుకు ఎంత దక్కుతున్నదో తెలిస్తే.. అసలు వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటుందా అనిపిస్తుంది.
పత్తి రైతుకు ఎకరానికి 65వేల నుంచి 75వేల వరకు ఖర్చవుతుంది. దళారుల వద్ద అప్పు తెస్తే నూటికి 25శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 20వేల వరకు వడ్డీ చెల్లించాల్సిందే. అంటే ఎకరానికి మొత్తం 95వేల వరకు ఖర్చవుతుంది. ఎకరానికి చెలక అయితే 8 క్వింటాళ్లు, నల్లరేగడి అయితే 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాలు పత్తిని మార్కెట్లో సీసీఐ ద్వారా విక్రయిస్తే ధర 7,525 రూపాయలు అనుకుంటే సుమారు 12 క్వింటాళ్ల పత్తి అమ్మితే 90,300 రూపాయలు వస్తాయి. మిగతాది రైతు జేబులో నుంచే అప్పు చెల్లించాలి. ఇక దిగుబడి తగ్గితే అప్పుల్లో కూరుకుపోవడమే. అదే తేమ అధికంగా ఉందని సీసీఐ నిరాకరించిన పత్తిని ప్రయివేటు వ్యాపారులకు అమ్మితే ధర 6,950గా నిర్ణయించినా, తేమ పేరుతో వారు 6,700 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 80,400 రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతోంది. ఇక ప్రకృతి సహకరించక పంట నష్టపోతే అది అదనమే.
ఇక ప్రభుత్వం కనీస మద్దతు ధర అంటూ ఆర్భాటం చేస్తున్నా.. అది కూడా రైతుకు దక్కడం లేదు. అందువల్ల కార్పొరేట్ వ్యాపారులు ఎలా అయితే తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించి అమ్ముకుంటున్నారో, అలాగే రైతులకు కూడా ధర నిర్ణయించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించాలి. రైతు వద్దకే వచ్చి పంట కొనుగోలు చేసే రోజులు రావాలి. బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితి పెంచాలి. ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ అంటూ ఆర్భాటపు ప్రచారాలు కాకుండా, రైతులకు ఏది అవసరమో.. పంట అమ్ముకునేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే వారికి లాభసాటిగా ఉంటుందో చూడాలి. నష్టమొస్తే దాన్ని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రైతుకు సాయం కాదు.. పెట్టుబడి ఖర్చులు పోగా అతడు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అయినా కాస్త మిగిలేలా చూడాలి. అప్పుడే పత్తి రైతు నిలదొక్కుకోగలడు.
వామన్ మామిళ్ల
జర్నలిస్ట్