Share News

ఎలాంటి కాలమిది?

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:00 AM

‘‘వెల్లివిరిసిన విజ్ఞానం బ్రహ్మజెముడులా అజ్ఞానం భక్తివిశ్వాసాల పరమ పరిధవం... అంధాంద తమసాల అవ్యక్తనిశీథం...

ఎలాంటి కాలమిది?

‘‘వెల్లివిరిసిన విజ్ఞానం

బ్రహ్మజెముడులా అజ్ఞానం

భక్తివిశ్వాసాల పరమ పరిధవం...

అంధాంద తమసాల అవ్యక్తనిశీథం...

నైరాశ్యపు చలిగుబుళ్లు ఈచుకున్న శశిరాస్యం’’*

మరి ఇది ఒక ‘వైభవోజ్వల మహాయుగమా?

‘వల్లకాటికి’ దారితీస్తున్న అధ్వానశకమా’?

అవినీతి పరుగుపందెంలో

ఒకరిని మించి ఒకరి ఎత్తుగడల పోటీ

గెలిచినా వోడినా విన్నర్స్‌ రన్నర్స్‌గా

చివరికి లబ్ధిపొందడం ఖాయం!

ఎన్నికల రేసులో

నియమ నిబంధనలన్నీ

పాటించేవాడికే పరిమితం,

కుల మత ధన చక్రవ్యూహంలో

చక్రం తిప్పేవాడే విజేత

ధర్మాధర్మాల వ్యాఖ్యానాల

పరిహాస పర్వంలో

అన్యాయపురేఖలు గీస్తున్నవాళ్లు

వక్రీకరణ చరిత్రతో అబద్ధాలతో

భ్రమయుగంలోకి ఈడ్చుకెడుతున్నవాళ్లు

ఇంతకు ఎలాంటి కాలమిది?

ఎవరికి మేలైన కాలమిది?

ఆశ్రితపక్షపాతం కుటుంబాల పాలనలో

వారసత్వ రాజ్యతంత్రంగా

పౌరస్వేచ్ఛను కాలరాస్తున్న కాలాన

ఎక్కడికక్కడ మూలాల్ని వెతుకుతూ

హక్కుల కోసం రక్తమోడుతున్న కాలమిది!!

నిఖిలేశ్వర్‌

*(తెన్నేటి సూరి అనువాద నవల ‘రెండు మహానగరాలు’ ప్రారంభ పంక్తులను గుర్తు చేస్తూ)

Updated Date - Apr 19 , 2024 | 05:00 AM