ఏడో హామీ ఎందాకొచ్చింది?
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:46 AM
కాంగ్రెస్ అధికారికంగా ఇచ్చిన ఆరు హామీలతో పాటు ఏడో హామీగా ప్రజాస్వామిక పునరుద్ధరణ వాగ్దానం చేసిన ముఖ్య మంత్రి పాలన వందరోజుల్లో ఆ వాగ్దానం ఎలా అమలవుతున్నది?...

కాంగ్రెస్ అధికారికంగా ఇచ్చిన ఆరు హామీలతో పాటు ఏడో హామీగా ప్రజాస్వామిక పునరుద్ధరణ వాగ్దానం చేసిన ముఖ్య మంత్రి పాలన వందరోజుల్లో ఆ వాగ్దానం ఎలా అమలవుతున్నది?
తెలంగాణ ప్రజలు బీఆర్‍ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడానికి ఎవరు ఏ కారణం చెప్పుకున్నప్పటికీ, ఆ పదేళ్ళ పాలనలో అమలైన నిరంకుశత్వాన్ని ఓడించాలని ప్రజలు అనుకోవడమే ప్రధాన కారణం. కనీస పౌరహక్కులు అణచివేసిన, భిన్నాభిప్రాయాన్ని సహించని భయ వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు ఆ పదేళ్ళల్లో అనుభవించారు. అంతకు ముందరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా ఘోరమైన పోలీసు రాజ్యం అమలయింది. ఏలిక ఇచ్చిన బారాఖూన్ మాఫ్‌తో పోలీసులు ప్రజల హక్కులను ఇష్టారాజ్యంగా ఉక్కుపాదాల కింద అణచివేశారు. వందలాది మంది మీద డజన్ల కొద్దీ అబద్ధపు కేసులు బనాయించారు. అధికార పార్టీ బహిరంగ సభలు, ఒకటి రెండు ప్రతిపక్షాల బహిరంగ సభలు తప్ప ప్రజా సంఘాల, ప్రజల బహిరంగ సభ ఒక్కటి కూడా జరగనివ్వలేదు. రాష్ట్రంలో ఊరేగింపులను అనుమతించలేదు. హాలు లోపల, ప్రాంగణం లోపల జరిగే సభకు పోలీసు అనుమతులు అవసరం లేకపోయినప్పటికీ హాళ్ల యజమానులను బెదిరించి, హాళ్లకు తాళాలు వేసి, నిర్వాహకులను అరెస్టు చేసి, వందలాది మంది పోలీసులను మోహరించి, సభలు జరగకుండా చూశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పదేళ్ళల్లో తెలంగాణలో రాజ్యాంగ అధికరణం 19 స్ఫూర్తి అడుగడుగునా ఉల్లంఘనకు గురయింది.
ఆ నేపథ్యంలో, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ వాగ్దానానికి ప్రజల దృష్టిలో చాలా ప్రాధాన్యత వచ్చింది. ఆ మాటకు నిజమైన అర్థం పౌరహక్కులను గౌరవించే పాలన నెలకొల్పడమే. ఏర్పడి ఉన్న భయ వాతావరణాన్ని తొలగించి, భయరహిత వాతావరణాన్ని తీసుకురావడమే, ఆ పదేళ్ల అబద్ధపు కేసులను ఉపసంహరించడమే. ఊరేగింపులకూ, బహిరంగసభలకూ అనుమతించడమే. హాళ్లలో జరిగే సభలకు ఎటువంటి ఆటంకాలూ కల్పించకపోవడమే. వాక్‌సభా స్వాతంత్ర్యాలకు, భావప్రకటనా స్వేచ్ఛకు ఎటువంటి అవరోధాలు లేకుండా చూడడమే. కాని ఈ మూడు నెలల ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాలన నాటి పోలీసు రాజ్యంలో ఏమీ మార్పు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రాక ముందు, అధికారం స్వీకరించగానే పదే పదే వినబడిన ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అనే మాట ఈ మూడు నెలల్లో ఎక్కడా మళ్ళీ ప్రస్తావనకు కూడా రాలేదు. ధర్నా చౌక్ పునరుద్ధరణ ఒక్కదాన్ని చూపెట్టి అదే విశాలమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని నమ్మబలుకుతున్నారు. నిజానికి ధర్నాచౌక్ పునరుద్ధరణ కొత్త ప్రభుత్వం చేసినదేమీ కాదు. అది పాత ప్రభుత్వ పాలనలోనే, ఆ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ, హైకోర్టు ఉత్తర్వుల వల్ల జరిగింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నిజమైన ఉదాహరణలుగా చెప్పగలిగినవి ఈ మూడు నెలల్లో ఏమీ లేకపోగా, పాత పోలీసు రాజ్యం కొనసాగింపుకు ఉదాహరణలు మాత్రం ఎన్నో ఉన్నాయి.
పౌరహక్కుల సంఘం 50ఏళ్ళ మహాసభల సందర్భంగా మార్చి 10న ఊరేగింపు జరపడానికి అనుమతి అడిగితే ఆ ఊరేగింపులో ప్రొ. జి.హరగోపాల్ పాల్గొంటారని చూసి, ‘నక్సలైట్ల ఊరేగింపా’ అనే వ్యాఖ్యతో నిరాకరించారు. నిజానికి ప్రజల ఊరేగింపులకు పోలీసుల అనుమతి కోరవలసిన అవసరమే లేదు. ఆ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం, బందోబస్తు కోసం సమాచారం ఇవ్వాలనేది మాత్రమే ఉద్దేశం. కాని ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు రాజ్యంలో ‘సమాచారం’ అనే మాటను ‘అనుమతి’గా అమలులోకి తెచ్చారు. గత పదేళ్లల్లో ఒక్క ఊరేగింపుకు కూడా ‘అనుమతి’ ఇవ్వలేదు. ఇప్పుడు ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’లో కూడా అదే కొనసాగుతున్నది.
అలాగే, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జనవరి 13న అంతర్జాతీయ పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన రోజున, టాంక్ బాండ్ మీద మఖ్దూం విగ్రహం దగ్గర ప్రదర్శన జరపబోతే విపరీతంగా పోలీసులను మోహరించి విద్యార్థి యువజనులను అరెస్టు చేశారు. ముస్లిం సంస్థల అభ్యర్థన మేరకు అరగంట అనుమతి ఇచ్చి, అది కూడా మఖ్దూమ్ విగ్రహం దగ్గర జరపగూడదని ఆంక్షలు విధించారు.
భువనగిరిలో హైస్కూలు విద్యార్థినులు భవ్య, వైష్ణవిల అనుమానాస్పద మరణాలపై సరైన దర్యాప్తు కోరుతూ చైతన్య మహిళా సంఘం ధర్నా తలపెడితే పోలీసులు దాన్ని విచ్ఛిన్నం చేశారు. హైదరాబాద్ గాంధీనగర్‌లో గ్రూపు పరీక్షలకు తయారవుతున్న ఒక నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే, అక్కడ చేరిన నిరుద్యోగులు ఆందోళనకు దిగకుండా చెదరగొట్టారు. హైదరాబాద్ శివార్లలో ఒక చర్చ్‌ను మతోన్మాదులు ధ్వంసం చేసిన ఘటనలో సమస్యను పరిష్కరించకపోగా, తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన బాధితులనే అడ్డుకున్నారు. ఈ మూడు నెలల్లో ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టుల మీద దాడుల వార్తలు వస్తూనే ఉన్నాయి. శాసనసభలో మీడియా పాయింట్ దగ్గర ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసు స్టేషన్‌లో గిరిజన యువకుడి లాకప్ మరణం జరిగింది.
పోలీసులు ఇష్టారాజ్యంగా పౌరులను నిర్బంధించడం, చట్టబద్ధంగా ఇరవై నాలుగు గంటలలోపు న్యాయస్థానం ముందర హాజరుపరచకుండా చిత్రహింసలు పెట్టి తప్పుడు ఒప్పుదల ప్రకటనల మీద సంతకం పెట్టించుకోవడం యథావిధిగా జరిగిపోతున్నాయి. ఇటువంటి ఘటనలలో ప్రధానమైనది ఖమ్మం జిల్లా పూసపల్లి కుట్రకేసు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్, గోపన్నలను, షేక్ మదార్, కలకొండ సురేష్ అనే ఇద్దరితో కలిపి ఖమ్మం పరిసరాలలో ఫిబ్రవరి 14న అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత రోజు పుల్లన్న అనే మరొక వ్యక్తిని కలిపి, అయిదుగురినీ ఫిబ్రవరి 16న పూసపల్లి దగ్గర అరెస్టు చేసినట్టు, మరొక పందొమ్మిది పేర్లు కలిపి పూసపల్లి కుట్రకేసు బనాయించారు. సరిగ్గా ఈ కేసు, గత పదేళ్ళల్లో పోలీసులు అల్లిన డజన్ల అబద్ధపు కుట్రకేసుల లాగే ఉంది!
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ వాగ్దానాలు సాగుతుండగానే ఈ మూడు నెలల్లో ఎన్ఐఎ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, పొరుగు రాష్ట్రాల పోలీసులు సోదాలు, దాడులు, మనుషులను ఎత్తుకుపోవడం సాగిస్తున్నారు. ఒక పౌరహక్కుల సంఘం నాయకుడి పేరును ఒక అబద్ధపు కేసులో ఇరికించిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు జగిత్యాల సమీపంలోని ఆయన స్వగ్రామం రేచుపల్లికి రాబోయి, మరొక గ్రామానికి వెళ్లి అక్కడ గందరగోళం సృష్టించి, ప్రజలు నిలదీయగా తమ ఐడీ కార్డులు చూపి, తప్పించుకుని చివరికి రేచుపల్లి చేరి, కారణమేమిటో చెప్పకుండానే దొంగల్లా ఆయనను ఎత్తుకుపోయారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆందోళన జరపగా ఎత్తుకుపోయినవాళ్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులనీ, ఆయనను దంతెవాడ జైలులో నిర్బంధించారనీ తేలింది. గత ప్రభుత్వం పెట్టిన అబద్ధపు కేసులలో యుఎపిఎను చేర్చడం వల్ల ఆ కేసులు స్వాధీనం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం లేకుండానే రాష్ట్రంలో దాడులు చేసే అవకాశం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వస్తున్నది. గత పాలనలో పెట్టిన అక్రమ కేసులను తొలగించాలనీ, కనీసం యుఎపిఎను సమీక్షించాలనీ చేసిన అభ్యర్థనలు ప్రజాస్వామిక పునరుద్ధరణ ప్రభుత్వానికి ఇంకా వినబడినట్టు లేవు. ఆ కేసులు ఎంత అవకతవకగా, తప్పులతడకగా, కేవలం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారి మెడల మీద కత్తులుగా తయారయ్యాయో సమీక్షించి, ఉపసంహరించడం ఈ ప్రభుత్వ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కర్తవ్యం.
గత ప్రభుత్వ ఫోన్ టాపింగ్ వ్యవహారం ఇప్పుడిప్పుడు బైటపడుతున్నది. కాని నిజానికి రాష్ట్రంలో స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబి) అనేది అత్యంత భయానకమైన, విచారణాతీత, శిక్షాతీత, రాజ్యాంగేతర శక్తిగా పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐబికి మితిమీరిన అధికారం కట్టబెట్టారు. లెక్క చెప్పనక్కరలేని భారీ నిధులు, వాహనాలు, సౌకర్యాలు సమకూర్చారు. మనుషులను వేటాడి చంపితే నగదు పారితోషికాలు, ఆక్సిలరేటెడ్ ప్రమోషన్లు ఇచ్చారు. ఎస్ఐబి ఎన్నో రాష్ట్రాలలో చట్టవ్యతిరేకంగా రహస్య స్థావరాలు నెలకొల్పింది. ఇతర రాష్ట్రాలలో విప్లవకారులను పట్టుకుని వచ్చి కాల్చి చంపి ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఎన్‌కౌంటర్లు చూపింది. రెండు మూడు దశాబ్దాల పాటు ఇట్లా బారాఖూన్ మాఫ్ అధికారాలు సంపాదించిన ఎస్ఐబి పనులలో ఫోన్ల టాపింగ్ చాల చిన్న పని. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల కన్న రెండాకులు ఎక్కువ చదివి, ఎస్ఐబిని బంధువులతో నింపి, సొంత పనులకు వాడుకుని, టాపింగ్‌ను ప్రతిపక్ష నాయకుల మీదికి, వ్యాపారుల మీదికి, ఎవరి మీద తలచుకుంటే వారి మీదికి తిప్పే అవకాశం ఇచ్చింది. పోలీసు రాజ్యం వల్ల, భయ వాతావరణం వల్ల తెలంగాణ సమాజం ఎంత నష్టపోయిందో, ధ్వంసమయిందో ఈ ఫోన్ల టాపింగ్ కుంభకోణంలో బైటపడుతున్న వాస్తవాలైనా మన కళ్లు తెరిపించాలి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే పోలీసు రాజ్యాన్ని, ఎస్ఐబిని అదుపులో పెట్టడం అని తెలంగాణ ప్రభుత్వం తెలుసుకోవాలి.
ఎన్. వేణుగోపాల్