Share News

ముందు ఇచ్చిన ఆ గ్యారంటీల మాటేమిటి?

ABN , Publish Date - Mar 12 , 2024 | 04:38 AM

మోదీ గ్యారంటీ అనే ప్రచారం రేడియో, టీవీలలో పెద్ద ఎత్తున నేడు జరుగుతోంది. ఎన్నికల ముందు ఈ రకమైన ప్రచారానికి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో పూనుకోవడం సబబేనా అన్నది...

ముందు ఇచ్చిన ఆ గ్యారంటీల మాటేమిటి?

మోదీ గ్యారంటీ అనే ప్రచారం రేడియో, టీవీలలో పెద్ద ఎత్తున నేడు జరుగుతోంది. ఎన్నికల ముందు ఈ రకమైన ప్రచారానికి కేంద్ర ప్రభుత్వ డబ్బులతో పూనుకోవడం సబబేనా అన్నది ఒక అంశమైతే, అసలు ఈ ప్రచారంలో పస ఎంత అన్నది ముఖ్యమైన అంశం. తాము మరలా అధికారంలోకి వస్తే 80కోట్ల మందికి పైగా ప్రజలకు 2028 వరకు ఉచితంగా ఐదు కేజీల బియ్యం ఇస్తామని, 55కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డులు, పది కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్‌, 14కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు గృహ వసతి కల్పిస్తామనే వాగ్దానాలతో ఈ మోదీ గ్యారంటీ సాగుతోంది. వికసిత భారత్‌, 2047 కల్లా మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంపై కూడా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే పదేళ్లలో ఆర్టికల్‌ 370 రద్దు, రామాలయం నిర్మాణం మినహా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా తామేం చేశామో చెప్పడం కాక, మరలా గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం విశేషం. అదే సందర్భంలో తామిస్తున్న ఉచిత బియ్యం వంటి హామీల ద్వారా దేశంలో పేదరికం ఎంత తీవ్రంగా ఉందో వీరు చెప్పకనే చెబుతున్నారు. ఈ గ్యారంటీల విశ్వతనీయత కూడా ఎంతో తెలియాలంటే ఒక విషయాన్ని తప్పకుండా పరిశీలించాలి. అదేమిటంటే గతంలో ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి అన్నది.

2014 ఎన్నికలకు ముందు దేశంలోని నల్లధనమంతా వెలికి తీసి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్ళ ప్రత్యేక హోదా ఇస్తామని, తెలుగు రాష్ట్రాలకు రాష్ట్ర విభజన చట్టం సంపూర్ణంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఈ పదేళ్ల కాలంలోనూ వీటిలో ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకపోగా దానికి భిన్నంగా పాలన ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీలు, బయ్యారం, కడప ఉక్కు, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలు, రామాయపట్నం పోర్టు, మెట్రో రైల్‌, రైల్వే జోన్‌, వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ వంటి అన్ని అంశాలలోనూ మోదీ ప్రభుత్వం ద్రోహమే చేసింది.

నల్లధనం ఏరివేత పేరుతో చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రహసనం కొండను తవ్వి ఎలకను కూడా పట్టని చందంగా మారింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల మాట అటుంచి, ఈ కాలంలో రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వ వివిధ డిపార్టుమెంట్లలో అధికారికంగా 10 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయని పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపింది. వాస్తవంలో ఇవి 30 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఆఖరుకు సైన్యంలో నియామకాలు కూడా కాంట్రాక్టు పద్ధతికి మార్చేశారు. ఉత్తరప్రదేశ్‌‍లో 60,244 పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు గాను 50 లక్షలకు పైగా పరీక్షకు హాజరయ్యారంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇంకా విశేషమేమంటే పేపర్‌ లీక్‌ పేరుతో పరీక్ష రద్దుచేసి, ఆ పోస్టులను కూడా నింపలేదు. రైతుల ఆదాయాలు రెట్టింపు మాట అటుంచి, అప్పులు మాత్రం రెట్టింపయ్యాయి. ఆత్మహత్యలు పెరిగాయి. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు మా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వండి మహాప్రభో అని దేశ రాజధాని చేరుకున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధానికి పూనుకుంది. రోడ్లపై మేకులు దిగ్గొట్టింది. ముళ్ళకంచెలు వేసింది. ఇవి చాలదన్నట్లు రోడ్లను తవ్వేసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై నీటి ఫిరంగులతో దాడి చేసింది. శత్రువులపై వాడే డ్రోన్లతో భాష్ప వాయువు కూడా ప్రయోగించింది. ఇన్ని ఘన కార్యాలు చేసి, ఈ పదేళ్ళ లోనూ దేశ ప్రజలకు ఏం చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇప్పుడు మోదీ గ్యారంటీ పేరుతో మరో కొత్త ప్రచారానికి తెరలేపింది.

వీరి పదేళ్ల పాలనలో జరిగిన వాస్తవం ఏమిటంటే పేదరికం, ఉపాధి కల్పన వంటి అనేక అంశాలలో ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం అధమ స్థాయికి, ఆకలి, ఆదాయ అసమానతలలో మాత్రం అగ్ర భాగానికి చేరుకుందని అనేక అంతర్జాతీయ సంస్థలు తెలిపాయి. పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. మానవ హక్కులు హరించి వేయబడుతున్నాయి. ప్రశ్నించిన వారిపై నిర్బంధం ప్రయోగించడం, హత్యలకు పాల్పడడం పరిపాటిగా మారింది. దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయి. బేటీ బచావో – బేటీ పఢావో వంటి ఆకర్షణీయ నినాదాలిచ్చినా ఆచరణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2019–21 మధ్య కాలంలో 13.13 లక్షలమంది అమ్మాయిలు కనపడకుండా పోయారని స్వయంగా హోం మంత్రిత్వ శాఖే పార్లమెంటులో ప్రకటించింది. అడవులు, సముద్రంతో సహా సహజ వనరులను తన కార్పొరేట్‌ మిత్రులకు దోచి పెడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వసం చేస్తోంది. ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించడం, అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టడం వంటి చర్యలతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తూ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చింది. ఎన్నికల బాండ్ల పేరున కార్పొరేట్ల నుండి భారీగా నిధులు పొందడాన్ని చట్టబద్ధం చేయడం చెల్లదని, తన తొత్తు ఎన్నికల అధికారి ద్వారా చండీఘర్‌ మేయర్‌ ఎన్నికను తారుమారు చేయడం చెల్లదని పేర్కొంటూ, వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులు మోదీ ప్రభుత్వ అప్రజ్వామిక విధానాలకు నిదర్శనం.

మోదీ ప్రభుత్వ పదేళ్ల పాలనను కొద్దిగా పరిశీలించినవారెవరికైనా సరే మరో ఐదేళ్లు అధికారం ఇస్తే ఏం జరుగుతుందన్నది ఇట్టే అర్థమవుతుంది. మరలా ఈ ప్రభుత్వం అధికారంలోనికి వస్తే వారి గ్యారంటీల మాటేమో గానీ, కొన్ని దుష్పరిణామాలు మాత్రం గ్యారంటీగా జరిగి తీరుతాయి.

దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేయడం ఖాయం. మసీదులు పడగొట్టి దేవాలయాలు నిర్మించడం ద్వారా మత ఘర్షణలు రెచ్చగొట్టడం ఖాయం. మణిపూర్‌‍లో లాగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి మారణహోమం సృష్టించడం ఖాయం. దేశంలో పేదరికం మరింత పెరగడం ఖాయం. ధరలు ఆకాశాన్నంటడం ఖాయం. అడవుల నుండి ఆదివాసులను, సముద్రం నుండి మత్స్యకారులను గెంటివేయడం ఖాయం. రైతుల అప్పులు, ఆత్మహత్యలు పెరగడం ఖాయం. నిరుద్యోగ యువత ఉద్యోగాలపై ఆశలు వదులుకోవడం ఖాయం. అంబానీ, అదానీల ఆస్తులు భారీగా పెరగటం ఖాయం. ప్రజాస్వామ్యం మటుమాయం కావడం ఖాయం. రాజ్యాంగం ధ్వంసం కావడం మరింత ఖాయం. ఇప్పుడు మోదీ గ్యారంటీ మాయ మాటలను నమ్ముతామా, మరలా అధికారంలోనికి వస్తే గ్యారంటీగా జరగబోయే వాటిని నమ్ముతామా అన్నది ఈ పదేళ్ల అనుభవంతో తేల్చుకోవాల్సిన సమయమిదే.

ఎ. అజ శర్మ

Updated Date - Mar 12 , 2024 | 04:38 AM